Menu Close
Adarshamoorthulu
-- డా. మధు బుడమగుంట
డా. లూయీ పాశ్చర్
Louis Pasteur

నిజజీవిత సమస్యల సుడిగుండాలలో చిక్కుకున్నప్పుడు మానవ మేధస్సులో ఆ సమస్యలకు తగిన పరిష్కారం కనుగొనేందుకు వీలైన ఆలోచనలు, ఆవిష్కరణలు ఉద్భవిస్తుంటాయి. ఆ ఆవిష్కరణలు కొంతమంది మహామహుల విశేష కృషి వల్ల వెలుగులోకి వచ్చి అదే సమస్యలతో బాధపడుతున్న ఎంతోమంది జీవితాలలో ఆ గ్రహణం వీడి వెలుగులు నింపడానికి దోహదపడుతుంది. అటువంటి సమస్యల పరిష్కారానికి సరికొత్త నిర్దేశాలను నిర్వచించడానికి తమ జీవితాలను అంకితం చేసే వారినే ‘మార్గదర్శకులు’, ‘ఆదర్శమూర్తులు’ అంటారు. ఆంత్రాక్స్, రబీస్ తదితర వ్యాధులకు మందులను కనిపెట్టడంలో మూలపురుషుడై అవిరళ కృషి సల్పిన సూక్ష్మజీవ శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ (Louis Pasteur) నేటి మన ఆదర్శమూర్తి.

1822, డిసెంబర్ 27న ఫ్రాన్స్ దేశంలోని డోల్ ప్రాంతంలో జన్మించిన లూయీ పాశ్చర్ తన చిన్నతనంలో డ్రాయింగ్ మరియు పెయింటింగ్ మీద ఎక్కువ ఆసక్తి కనపరిచేవారు. కానీ శాస్త్రీయ సంబంధిత అంశాల గురించి, వాటి విశ్లేషణల గురించిన సందేహాలను నివృతి చేసుకునేందుకు ఎంతో కుతూహలం చూపేవారు. అసలు అందరూ తాగే వైన్ ద్రాక్ష పళ్ళనుండి ఎట్లా తయారుచేస్తారు? పాలు తోడుకొని పెరుగు ఎట్లవుతుంది? ఇటువంటి ఆలోచనలు తనను ఎప్పుడూ వేధిస్తూనే ఉండేవి. స్వతహాగా గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ విద్యార్ధి అయినను ఎప్పుడూ అతి తక్కువ మార్కులతో పాస్ అవడం జరిగేది. అందుకు కారణం ఆయన ఆలోచనా ప్రవాహ విధానం. అదే ఆ తరువాత Pasteurization (క్రిమిదూరీకరణం, శుద్ధి) అనే గొప్ప ప్రక్రియను కనుగొనడానికి దోహదపడింది. తద్వారా నేడు ప్రపంచంలో అతి పెద్ద పరిశ్రమ అయిన వైన్ ఇండస్ట్రీ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయి.

(Pasteurization is the process of heating a liquid to below the boiling point to destroy microorganisms. It was developed by Louis Pasteur in 1864 to improve the keeping qualities of wine. Commercial pasteurization of milk began in the late 1800s in Europe and in the early 1900s in the United States.)

Louis Pasteur1847 సంవత్సరంలో École Normale, Paris నుండి పి.హెచ్.డి పట్టాను పొందిన పిదప  డా. లూయీ పాశ్చర్, University of Strasbourg లో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా జాయిన్ అయ్యి బోధనతో పాటు పరిశోధనలు కూడా చేయడం మొదలుపెట్టాడు. నాడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న కలరా, మశూచి వ్యాధులు, తన నిజజీవితంలో సొంత కుంటుంబంలో జరిగిన ఒక విషాద సంఘటన, పాశ్చర్ తన పరిశోధనలను ఆ వ్యాధులకు మూలమైన వ్యాధి కారకాలను కనుగొనే దిశలో కొనసాగేట్లు చేశాయి. ఒకవైపు ఆరోగ్య సమస్యలు, మరోవైపు సమాజాన్ని పీడిస్తున్న విషతుల్య సూక్ష్మ క్రిముల నిర్మూలనకు మార్గం కనుగొనాలనే కృతనిశ్చయం. చివరకు పట్టుదలతో ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తన పరిశోధనలు సాగించారు.

ఆ స్థిరత్వమే ఆద్భుత ఆవిష్కరణలకు దారితీసింది. సూక్ష్మ జీవశాస్త్రంలో మంచి, చెడు జీవులను గుర్తించి వేరు చేసే ప్రక్రియకు దిశానిర్దేశం జరిగింది. విషక్రిములకు (virus), సూక్ష్మ క్రిములకు (bacteria) మధ్య తేడాను స్పష్టంగా వివరించడం జరిగింది. అది నిజంగా అద్భుతమైన ఆవిష్కరణ. నేడు మనం చిన్న పిల్లలకు కలరా, మశూచి, పోలియో రాకుండా ముందుగానే వేయిస్తున్న ‘టీకాలు’ ఆ మహానుభావుని ఆలోచనే. వ్యాధి వచ్చినప్పటికంటే రాకుండా తీసుకోనే జాగ్రత్తలే మేలని ముందుగా "vaccination" ద్వారా వ్యాధులను రాకుండా ముందుగానే కట్టడి చేయవచ్చని సూచించాడు. అంతేకాదు వ్యాధి సోకినా దానిని నియంత్రించి, రూపుమాపే మందులను కూడా కనుగొనేందుకు మార్గం చూపించాడు.

నేడు లక్షలాది అంటు రోగాలను తగ్గించేందుకు మన ఆధునిక వైద్యశాస్త్ర రంగంలో మందులున్నాయి. దానికి ఎంతో కృషి సల్పిన, నేటికీ నిత్యం శ్రమిస్తున్న ఎంతో మంది సూక్ష్మ జీవశాస్త్రవేత్తలకు లూయీ పాశ్చర్ వంటి వారు ఏర్పరిచిన శాస్త్రీయ విధానమే పెద్ద రహదారి. చివరగా ఈ మధ్య కాలంలో మొత్తం ప్రపంచాన్ని గడగడలాడిస్తూ మనందరినీ ఇంటికే పరిమితం చేసిన ఆ మహమ్మారి అంటువ్యాధికి కూడా త్వరలోనే విరుగుడు మందు లభిస్తుందని ఆశిద్దాం. ఎందుకంటే మనిషి మేధస్సును మించిన మరో గొప్ప ఆయుధం లేదు. ఆ మేధస్సుతోనే లూయీ పాశ్చర్ వంటి వారు మాహానుభావులయ్యారు మనందరికీ ఆదర్సమూర్తులుగా నిలిచారు.

Posted in April 2020, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *