Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

జర్బెరా పువ్వు

Gerbera Flower

జర్బెరా పువ్వు పేరే కొత్తగా ఉంది కదూ! పూలు ఎంత ఆకర్షణీయంగా, అందంగా ఉంటాయో చెప్పలేము. అందం, రంగూ, ఆకారం అన్నీ చాలా బాగా ఉంటాయి.

ఇది ఆస్టరేసియ కుటుంబానికి చెందిన మొక్కల ప్రజాతి పేరు. ఇవి దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని ఉష్ణ మండల ప్రాంతాలకు చెందిన పూల మొక్కలు. ఈ మొక్కలు చక్కని అలంకరణ మొక్కలు. ఒక మారు నాటి పోషించు కుంటూ వెళితే చాలాకాలం ఉంటాయి. తెలుపు, పసుపు, నారింజ, ఎరుపు, పింక్, ఊదా మొదలైన ఎన్నో ఆకర్షణీయమైన రంగుల్లో పూసే ఈ పూలకు మొదటి స్థానం స్థిరం. గులాబీ, కార్నేషన్, చేమంతి, తులిప్ పువ్వుల తరువాత ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్న విడి పూలు జర్బెరా పూలు. చాలా ఖరీదు కూడా. పూలవ్యాపారులకు బంగారం అమ్ముకున్నట్లే!

Gerbera Flowerజర్మన్ వృక్ష శాస్త్రజ్ఞుడు, వైద్యుడు ఐన ట్రగుట్ జర్బెరా గౌరవార్దం ఈ పూల మొక్కల ప్రజాతికి "జర్బెరా" పేరు పెట్టబడింది. లిన్నేయస్ మిత్రుడైన జర్బెరా రష్యా అంతా పర్యటించి అక్కడి స్థానిక జాతులకు చెందిన వృక్షాలను అధ్యయనం చేసాడు. 1880 లో రాబర్ట్ జేమ్ సన్ దక్షిణ ఆఫ్రికా లోని బార్బెర్టన్ వద్ద ఈ జర్బెరా డైసీ మొక్కలను చూశాడు. 1899 లో జె.డి. హూకర్ అనే బ్రిటిష్ వృక్ష శాస్త్రజ్ఞుడు ఆఫ్రికన్ డైసీ గా వ్యవహరించబడే జర్బెరా జేమ్సోని అనే మొక్కను కుర్టీస్ బొటానికల్ మేగజైన్ లో వర్ణించడం ద్వారా, జర్బెరా ప్రజాతి మొక్కలను తొలిసారిగా శాస్త్రీయంగా కనుగొని ప్రకటితం చేసినవాడయ్యాడు. ఈ మొక్కలు తొలిసారిగా 19 వ శతాబ్దంలో యూరప్ ఖండంలో ప్రవేశించాయి. అమెరికాలో 1970 లో కాలిఫోర్నియా యూనివర్సిటీ వారు వీటిని బ్రీడింగ్ చేయడం మొదలెట్టారు. తరువాతనే జర్బెరా మొక్కలు అమెరికాలో బాగా పాపులర్ అయ్యాయి.

Gerbera Flowerజర్బెరా మొక్కలు సంవత్సరాల తరబడి అన్ని ఋతువులలోను పుష్పిస్తూనే ఉంటాయి. ఈ మొక్కలకు ప్రత్యేకంగా ఒక కాండం అంటూ ఉండదు. గుబురుగా వున్న ఆకుల పొద నుంచి బయటికి వచ్చిన ఒక పొడుగాటి కాడ, దాని చివరి భాగంలో పువ్వు పూస్తుంది. ఈ పువ్వు మధ్యలో తమ్మె వుండి, దాని చుట్టూ సూర్య కిరణాల లాంటి సన్నని పొడుగాటి రేకులు వికసించి ఉంటాయి. తెలుపు, పసుపు, ఎరుపు, ఆరెంజ్, పింక్, ఊదా లాంటి ఆకర్షణీయమైన రంగులలో ఈ పూలు పూస్తాయి. తరుచుగా ఒకే పువ్వుకు వివిధ రంగుల రేకులు కూడా ఉంటాయి. ఇది మరీ అందంగాఉంటుంది. ఈ పువ్వు చూడడానికి పొద్దుతిరుగుడు పూవు, చామంతి పూవు లాగా ఉంటుంది. విడిపూలు చూడడానికి ఎంతో మనోహరంగా కనిపిస్తాయి. ఈ పూలలో ఒంటి రేకు పూలూ, ముద్దరేకు పూలు కూడా వున్నాయి. జర్బెరా పూలు ఏడాది పొడుగునా పూస్తూనే ఉన్నా, శీతాకాలంలో ఎక్కువగా పూస్తాయి.

ఇవి నీడన చక్కగా పెరిగే మొక్కలు. ఎక్కువ ఎండ వేడిని తట్టుకోలేవు కనుక మధ్యాహ్నపు ఎండ కాక, ఉదయం, సాయంత్రం పూట తగిలే ఎండ వేడి వీటికి చాలు.

Gerbera Flower

జర్బెరా ప్రజాతి పూల మొక్కలు చక్కని అలంకరణ మొక్కలుగా పేరు గాంచాయి. వీటిని ఎక్కువగా అలంకరణ ఉద్యాన మొక్కలుగా ఉపయోగిస్తారు. వాణిజ్యపరంగా ఇది ఒక ముఖ్యమైన పంట. భారత దేశంలో జర్బెరా పూలను కేవలం వ్యాపారం కోసం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, హిమాచల ప్రదేశ్ లలో ఎక్కువగా పెంచుతున్నారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని కబ్బన్ పార్క్ వద్ద జూన్ జులైలో పుష్ప ప్రదర్శన చూడను రెండుకళ్ళూ చాలవు.

Posted in April 2020, వ్యాసాలు

1 Comment

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!