Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

ఇంటింటికీ ఒకపువ్వు, ఈశ్వరునికి ఒకమాల!

వేసవి వచ్చిందంటే వాసుదేవయ్య ఇంట పండుగే. అమెరికా నుంచి పెద్ద కొడుకు ప్రవీణ్ బిడ్డలిద్దరూ, జపాన్ నుంచి చిన్నకొడుకు బిడ్డ వేణు, బెంగుళూర్ నుంచి కూతురి బిడ్డలిద్దరూ దిగిపోతారు. ఆ ఏడాది కూడా ఎప్పట్లానే వాసుదేవయ్య, వసంతమ్మ దంపతులు కళ్ళలో వత్తులు వేసుకుని చూస్తున్న వేసవి రానేవచ్చింది. అంతా దిగి పోయారు ఆ పల్లెలోని తాత ఇంటికి. చకోరపక్షుల వంటి ఆ ముదుసలుల కళ్ళు మిలమిలా మెరిసి పోసాగాయి. ఉదయాన్నే లేచి బామ్మ గారు పిల్లలందరికీ ఇష్టమైన పెరుగు వడలూ, మామిడికాయ పులిహోర, పాయసం చేసి వారెప్పుడెప్పుడు లేస్తారా అని ఎదురుచూస్తున్నది. వాసుదేవయ్య మాత్రం స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకుని దేవుని గదిలో స్తోత్రాలన్నీ కమ్మని పెద్ద కంచు కంఠంతో చదవసాగాడు. ఆయన కంఠం విని పిల్లలంతా బిలబిలా లేచి వచ్చి తాత చుట్టూ మూగారు.

"ఉండడర్రా! తాతగారిని పూజ పూర్తి చేయనీయండి. మీరెళ్ళి పళ్ళుతోముకుని రండి. మీకు ఫలహారం సిధ్ధం." అంటూ వసంతమ్మ చెప్పగానే పిలల్లంతా "వావ్! బామ్మ ఫలహారం, అమ్మమ్మ ఫలహారం" అంటూ గెంతుతూ పెరట్లోకెళ్ళి వాళ్ళ అలవాటుకు విరుధ్ధంగా వేప పుల్లతో ముందు రోజు రాత్రి తాత గారు చూపినట్లు పళ్ళు తోముకుని వచ్చారు.

"ఒరే పిల్లలూ! స్నానం కూడా కానిచ్చిరండి, మీ తాతగారు మిమ్మల్నెక్కడికో తీసుకెళాతారుట." అని వసంతమ్మ చెప్పగానే, మళ్ళా "హో హో ఒకచోటికి, ఒకచోటికి" అని అరుస్తూ అంతా తువ్వాళ్ళు తీసుకుని బావి వద్ద పెద్ద మట్టి తోట్టెల్లో నిండుగా నింపి ఉంచిన నీళ్ళను ఇత్తడి చెంబులతో ముంచుకుని వసంతమ్మ చెప్పినట్లుగా పొదుపుగా మీద పోసుకుని, సున్నిపిండి, సీకాయతో వళ్ళు తోముకుని స్నానం కానిచ్చి గబగబా బట్టలేసుకుని తయారైపోయి వచ్చారు. వసంతమ్మ పెట్టిన ఫలహారం పొట్టల నిండా, లొట్టలేసుకుంటూ తినేసి తాతగారి చుట్టూచేరారు.

"ఒరే పిలల్లూ! మనం ఒక చోటి కెళుతున్నాం. మీరు జాగ్రత్తగా అన్నీ చూసి మీకు చేతనైన సేవ అక్కడ చేయాలి సరా! అల్లరి అస్సలుచేయకూడదు."అని చెప్పి ఐదు మంది చిన్నారులతో బయల్దేరారు.

ఆ ఊరులోంచే చుట్టూ ఉన్నపది గ్రామాలనుంచీ జనాలు పక్కనున్న పట్నానికి రాకపోకలు సాగించాల్సి ఉంది. ఆ ఊరి నడిబొడ్డునున్న రచ్చబండ వద్ద చాలామంది జనం పోగై ఉన్నారు. వాసుదేవయ్యను చూడగానే అంతా గౌరవ పూర్వకంగా నమస్కరిస్తూ లేచి నిల్చున్నారు. ఆయన ఆ చుట్టుపక్కల గ్రామాల్లో పెద్ద పంతులుగా 35 ఏళ్ళు పనిచేసి, దేశస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి అవార్డ్ అందుకున్నవారు. ఆ చుట్టుపక్కల ఊర్లలోని వారందరికీ ఆయన ఒక దైవంతో సమానం. ఆయన విద్యార్ధులంతా గొప్పచదువులు చదివి పెద్ద ఉద్యోగాల్లో ప్రపంచస్థాయిలో ఉన్నారు. అందుకే అందరికీ ఆయనంటే అంత గౌరవం. ఆ ఊర్లో ఏకొత్త పనైనా ఆయన చేతే ప్రారంభోత్సవం చేయిస్తారు.

ఆయన అందరికీ నమస్కరించి "అందరికీ సంస్కారం. నేను ఏమీ ఆలస్యంగా రాలేదు కదా! వీళ్ళాంతా మా పిల్లల పిల్లలు నిన్ననే వచ్చారు." అనగానే పిల్లలంతా అక్కడున్నపెద్దలకందరికీ నమస్కరించారు. వారంతా పిల్లల మర్యాదకు సంతోషంగా చేయెత్తి అందరినీ దీవించారు.

"అయ్యా! వాసుదేవయ్యగారూ! మీ గ్రాండ్ చిల్డ్రనంతా చాలా గ్రాండ్ గా ఉన్నారండయ్యా!" అంటున్న పంచాయితీ ప్రెసిడెంట్ ను చూసి "సంతోషం మీ సహృదయానికి. ఇహ కార్యక్రమం మొదలెడదామా?" అన్నారాయన.

అక్కడున్న అరుగు పక్కనే ఒక తాటాకుల పాకాలో పది పెద్ద మట్టి బానలున్నాయి. వాటినిండా చల్ల నింపి ఉంది. కరివేపాకు వాసన దూరానికే వస్తున్నది.

"తాతా! ఇదేంటీ?" అని ఆశ్చర్యంగా అడిగిన గ్రాండ్ చిల్డ్రన్ తో దీన్ని 'చలివేంద్రం' అంటారురా! దీన్ని మీరెప్పుడూ చూళ్ళేదుకదూ, మనం ఇప్పుడు దీన్ని ప్రారంభిస్తాం" అన్నారు వాసుదేవయ్య.

ఆ పాకలో ఉన్న సూర్య దేవుని, కృష్ణుని పటాలకు పూలమాలలు వేసి, వాసుదేవయ్య దీపం వెలిగించి హారతిచ్చారు. ఆ తర్వాత ఆ పాక ముందున్న బోర్డుమీద సుద్ద ముక్కతో  ‘పార్వతీ పురం  వేసవి చలివేంద్రం‘ అని వ్రాశాడు. అంతా చప్పట్లు కొట్టారు.

చలివేంద్రం ముందు మహిళలు, పురుషులు, పిల్లలు వేరువేరు వరుసగా నిల్చున్నారు. ముందుగా వాసుదేవయ్య మట్టి గ్లాసులలో నింపిన మజ్జిగ అందరికీ అందించగా వారు తీసుకుని త్రాగేసి, ఆమట్టి గ్లాసులను అక్కడున్న మట్టి తొట్టెలోని నీటిలో పెట్టి వెళ్ళసాగారు. వాటిని వేరే నీళ్ళ తొట్టె లో ముంచి తిరిగి చలివేంద్రంలోకి పది మంది పిల్లలు అందుకుని తెచ్చి పెట్టసాగారు. వాసుదేవయ్య గ్రాండ్ చిల్డ్రన్ ఆయన అనుమతిని కళ్ళతోనే తీసుకుని వెళ్ళి మిగతావారితో పాటుగా సేవ చేయసాగారు. మధ్యాహ్నం పన్నెండు వరకూ మజ్జిగ పోశాక, కొందరు మహిళలు పెద్ద బిందెలతో తెచ్చిన గంజి వచ్చిన వారికి గ్లాసుల్లో పోసి అందించడం చూసిన ఆ పిల్లలు “అదేంటి తాతయ్యా!” అని అడిగారు.

“మన ఊర్లోంచే నగరానికీ, తిరిగి వారి పల్లెలకూ జనాలంతా వెళ్ళాలికదా! ఈ మధ్యాహ్న సమయంలో గంజి తయారు చేసి దాన్లో మజ్జిగ ఉప్పు కలిపి పోస్తే వారు వారి గ్రామాలకు వెళ్ళే వరకూ ఆకలేయకుండా వడదెబ్బ తగలకుండా ఉంటుంది. అందుకే ఈ సమయంలో రెండు గంటల పాటు గంజి పోస్తాం” అని చెప్పాడాయన.

ఇంతలో ఒకాయన వచ్చి “అయ్యా! రేపు చల్ల, గంజీ పోసే అవకాశం మాకివ్వండి, మా మనవడి పుట్టినరోజు” అనగానే వాసుదేవయ్య “సంతోషం సాంబయ్యా!" అని చెప్పి ఒక పుస్తకంలో ఆయన పేరు వ్రాసుకున్నాడు. “ ‘ఇంటికొక పుష్పం ఈశ్వరుడి కొక్కమాల’ అని “అంతా పూనుకుంటే చలివేంద్రాన్ని మూడు నెల్లైనా సాగించవచ్చయ్యా!” అని ఆయన  అంటుండగానే, మరికొందరు వచ్చి తేదీల వారీగా వారి పేర్లు వ్రాయించు కున్నారు. వాసుదేవయ్య గ్రాండ్ చిల్డ్రన్ ఆయన చెవిలో ఏదో చెప్పారు.

దాని కాయన తలఊపి “అయ్యలారా! మా మనవలు తమ కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న సొమ్ముతో ఆదివారం నాడు చలివేంద్రం నడుపుతారుట. అంతా వారికి ఆ అవకాశం ఇవ్వకోరుతున్నాను.” అని చెప్పగానే అంతా సమ్మతించారు.

అలా చలివేంద్రం గురించి తెల్సుకున్నఆ పిల్లలు అక్కడున్న నెల రోజులూ ఉదయాన్నే చలివేంద్ర సేవ, సాయంకాలం ఆలయం లో పురాణ శ్రవణ సమయంలో గ్రామంలోని పిల్లలందరితో కలిసి అందరికీ దాహానికి నీరు అందించే సేవా చేస్తూ, పురాణ గాధలు విని ఎంతో ఙ్ఞానం సంపాదించుకుని, భారతీయ సంస్కృతిని వంటబట్టించుకుని, ఆ గ్రామంలో ఎంతోమంది మంచి స్నేహితులను సంపాదించుకుని తమ వేసవి సెలవులను తాత గారింట్లో సార్ధకం చేసుకుని, తాము దాచుకున్న సొమ్మును సద్వినియోగపరచుకుని, తమ ఊర్లకు కదిలారు.

Posted in April 2020, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!