Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు
బంధించింది చాలక...

“మనసా!
ఎవరు నిను బంధించింది?
ఎవరు నిన్నిలా బాధించింది”
అని గట్టిగా అడిగాను.

“నీవే! ఆ.. నీవే” అంది.
“నేనా?” అన్నాను.

“అవును ముమ్మాటికీ...నీవే
ధనం కోసం, ఘనం కోసం
అహం కోసం, అధికారం కోసం,
కీర్తి కోసం...కోరిక కోసం”

------

“తృప్తి లేక... సుషిప్తి రాక
దృష్టి లేక.. తృష్టి రాక
నీవే నన్ను నీ స్వార్థపు సంకెళ్ళతో
బందించావు” అన్నది మనసు.

మమతను మసి చేసి
మంచిని నుసి జేసి
శాంతిని నలిపేసి
ధర్మాన్ని పిసికేసి

రాత్రనక-పగలనక
నీ కోసం – నీవాళ్ళ కోసం
సమాజం మాట లేక
దేశం మాట రాక

క్షణం క్షణం
నేను-నా కుటుంబం అంటూ
జీవిత పరమార్థాన్ని మరచి
భౌతిక పదార్థాలను వలచి
క్రూరంగా – క్షుద్రంగా
నను నీ అత్యాశలలో బంధించావు
నా గొంతును నొక్కేశావు"
అన్నది నా మనసు

ఆపై...

ఈ గాలిబుడగ జీవితంతో
ఎప్పుడు గుండె ఆగుతుందో
తెలియని నీవు
తెలుసుకోలేని నీవు
ఏం! సాధిద్దామని
ఏం! సుఖిద్దామని
నేను లేక – నేను కాక...

అంటూ మనసు ప్రశ్నల వర్షం
కురిపిస్తూనే ఉంది
బయట ఆధ్యాత్మిక వర్షం
కరువయింది.

Posted in April 2020, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!