Menu Close
Nirnayam_title

ఇంక రెండు నెలల్లో జనరల్ మేనేజర్ సెలెక్షన్స్ ఉన్నాయి. అందుకు తగిన అభ్యర్థిగా తన పేరు ఇప్పటికే ఇండస్ట్రీలో మారు మోగుతోంది. ఆలోచిస్తున్నాడు కిషోర్. తను జనరల్ మేనేజర్ గా మీటింగుల్లో మాట్లాడుతున్నట్లు, పై అధికారులు తనను మెచ్చుకుంటున్నట్లు ప్రతిరోజూ కలలు కనేవాడు. తను కలలుకని వూరుకునే వ్యక్తి కాదు. కలల్ని నిజం చేయాలంటే ఏం చేయాలో, తగిన ప్రణాలికలు తయారుచేస్తున్నాడు. పకడ్బందీగా ప్రణాళికలు తయారుచేసే సామర్ధ్యం కిశోర్ దగ్గర వుంది.  శారద గ్రూప్ అఫ్ ఇండస్ట్రీస్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు కిషోర్. కంపెనీకి మార్కెట్లో మంచిపేరు వుంది. శారద గ్రూప్, అనేక రకాల వ్యాపారాలు చేస్తుంది. టెక్స్టైల్స్, బొమ్మలు, ఫాన్సీ వస్తువులు తయారీ, అమ్మకం, మార్కెటింగ్ నిర్వహిస్తుంటుంది. టర్నోవర్ సంవత్సరానికి సుమారు ఐదు వందల కోట్లు ఉంటుంది. కిశోర్ ఉత్పత్తి శాఖలో పనిచేస్తున్నాడు. దానికి పంకజ్ జనరల్ మేనేజర్ గా ఉంటున్నాడు. పంకజ్ ఉత్తరాది వాడే అయినా, చాలా సంవత్సరాలుగా హైద్రాబాద్ లో ఉండటం వల్ల, తెలుగు బాగా మాట్లాడగలడు. పంకజ్ కు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. అందువల్ల జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళి అయింది. కిషోర్ కు, పంకజ్ కు, కంపెనీకి సంబంధించిన అనేక విషయాలలో, లోపాయికారీ అవగాహన వుంది. కంపెనీలో సీఈవోకి తెలియకుండా, వీళ్ళు ఉత్పత్తైన వస్తువుల విషయంలో అవకతవకలకు పాల్పడుతుంటారు. కానీ వచ్చిన ఇబ్బందల్లా విజయ్ తోనే. విజయ్ అదే శాఖలో ఇంకో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ఉంటున్నాడు. చాలా నికార్సయిన మనిషి. ముక్కు సూటిగా వెళ్లే మనస్తత్వం. ఎవరితోనూ గొడవలు పడడు. కానీ విషయాన్ని నిర్భయంగా చెపుతాడు. తను తినడు. ఇతరులను తిననీయడు. కంపెనీలోని కొంతమంది పై అధికారులకి ఇది నచ్చదు. అదే పంకజ్ కు కూడా కొరుకుడు పడటం లేదు.

"ఈసారి జనరల్ మేనేజర్ పదవి మీదే సర్." కిశోరుతో అన్నాడు గుర్నాధం లంచ్ టైములో మాట్లాడుతూ. "అవుననుకో. కానీ చేతికి వచ్చేదాకా నమ్మలేము." మెల్లగా మనసులో మాట బయట పెట్టాడు కిషోర్. "మీకు కాకపొతే ఇంకెవరికి వస్తుందండి. మీరు, పంకజ్ మంచి స్నేహితులు కదా. ఆయన ఇప్పుడు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయ్యాడు. కాబట్టి మీకు ఖచ్చింతంగా ప్రమోషన్ వస్తుంది." కుండ బద్దలుకొట్టినట్లు అన్నాడు గుర్నాధం.

ఉత్పత్తి శాఖలో కిషోర్ కు గుర్నాధం కుడిభుజం లాంటి వాడు. వీళ్ళు జరిగే ఉత్పత్తిలో, కంపెనీ లెక్కల్లోకి రానీయకుండా, తయారయిన వస్తువుల్ని మార్కెట్ లో అమ్మేస్తారు. దాంట్లో వచ్చిన సొమ్ము అందరూ పంచుకొంటారు. ఆడిటర్లు కూడా ఇలాంటి మోసాలు కనిపెట్టలేరు. ఎవరైనా కనిపెట్టినా వాళ్ళని డబ్బుతో కొనేస్తారు. ఈ విషయాలు కంపెనీ సీఈవోకి తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు.

ప్రతీ కంపెనీలో ఇలాంటివి జరుగుతుంటాయి. దానివల్ల కంపెనీలకి రావాల్సిన లాభాలు రావు. పైగా వ్యాపారుల దృష్టిలో కంపెనీకి చెడ్డపేరు వస్తుంది. చిన్న కంపెనీలయితే నష్టాలు వచ్చి కంపెనీ మూసేస్తారు.

"గుర్నాధం! కిందటి నెల తయారయిన రెడీమేడ్ దుస్తులు, మహారాష్ట్రలోని విఠల్ ట్రేడర్స్ కు పంపించాం కదా. మన వాటా వచ్చిందా." అడిగాడు కిషోర్. ఇలాంటి వ్యవహారాల్లో, తన చేతులు కాలకుండా కిందవాళ్ళ చేత పనిచేయించడం కిషోర్ గొప్పతనం.

"లేదు సర్. వాళ్ళు ఇంకా పంపించలేదు. నేను ఒకసారి వాళ్లకు గుర్తు చేస్తాను." చెప్పాడు గుర్నాధం. నిజానికి వాళ్ళు డబ్బు పంపించేశారు. ఈ తడవ తమ వాటా పది లక్షలు ఎక్కువ రావడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు గుర్నాధం. ఇలాంటి విషయాలు పై వాళ్లదాకా వెళ్లవు. కింది వాళ్ళ చేతులు మారుతుంటాయి. ఎక్కువ వచ్చిన డబ్బు విషయం చెపితే అందరూ వాటా అడుగుతారు తప్ప, తనకు ఎక్కువగా మిగలదు. ఈ విషయం ఎవరికీ తెలియదు కాబట్టి ఆ డబ్బు తనే తీసుకోవటానికే నిర్ణయించుకున్నాడు గుర్నాధం. ఒకవేళ బయట పడితే వుద్యోగం పోవడం ఖాయం. రిస్క్ చెయ్యాలా వద్దా. తన తెలివి తేటలవల్లే ఆ ఎక్కువ డబ్బు వచ్చింది. అలాంటిది, అందరికీ పంచితే ఎలా! పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు గుర్నాధం. రెండు రోజులు నిద్రకూడా పోలేదు. తనకు బోలెడు ఖర్చులున్నాయి. పై వాళ్లకు ఇదేకాకుండా జీతాలు కూడా ఎక్కువ. రకరకాల కమీషన్లు వస్తాయి. తనకు అలాంటివేమీ లేవు. ఇలా వ్యాపారస్తుల దగ్గర దండుకోవడం తప్ప. చివరికి ఎవరికీ చెప్పకూడదనే ఓ నిర్ణయానికి వచ్చాడు. విషయం సద్దుమణిగింది. ఆర్ధిక సంవత్సరం ముగిసింది. కంపెనీ ఆడిట్ కూడా అయిపోయింది. అందరూ వూపిరి పీల్చుకొన్నారు. ఈ తడవ కూడా కంపెనీకి లాభాలు వచ్చాయి. అందరూ ఆనందంగా వున్నారు. సీఈవో గారు ఉద్యోగులందరికీ ఐదు శాతం బోనస్ ప్రకటించారు. ఇక కంపెనీలో ప్రమోషన్ల వంతు. ఈ నెలలోనే అవికూడా పూర్తిచేస్తామని సీఈవో ప్రకటించారు. కిషోర్ లో ప్రమోషన్ వేడి మెల్లగా రగిలింది.

ఎలా చేస్తే తనకు తప్పనిసరిగా ప్రమోషన్ వస్తుంది. తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఒకరోజు పంకజ్ కి, ఇంకా కొద్దీ మంది తన పై అధికారులకి, ఒక ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ఏర్పాటు చేసాడు. పార్టీ హుషారుగా సాగుతోంది. ఎవరికి కావలసినవి వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు. తను పంకజ్ ఒక టేబుల్ దగ్గర కూర్చొని కావలసినవి ఆర్డర్ చేశారు. మిగతా ఉద్యోగులు దూరంగా వున్నారు. కిషోర్ కి, ఇదే మంచి అవకాశం అనిపించింది. మెల్లగా తన ప్రమోషన్ గురించి పంకజ్ తో కదిపాడు.

"సర్ ఈ తడవ మీరు ఎలాగైనా నాకు సహాయం చేయాలి." ప్రాధేయపడుతున్నట్లుగా అడిగాడు కిషోర్. "అలాగే చూద్దాం. మనం సిఫారసు చేసినా, పై వాళ్ళు ఎలా స్పందిస్తారో తెలియదుగా." మర్మగర్భంగా అన్నాడు పంకజ్.

కిషోర్ కి పంకజ్ ఏదో ఆశిస్తున్నట్లుగా అనిపించింది. పంకజ్ ను తృప్తి పరుస్తే తనకు ప్రమోషన్ గ్యారంటీ.

"ఎంతయినా మీ కింద పనిచేసేవాళ్ళం. మీకు ఎంతో  విధేయుడిగా ఉంటున్నాను. మాకు మీరు తప్ప ఎవరున్నారు. మీరీ సాయం చేస్తే మీ ఋణం ఉంచుకోను." అంతే మర్మంగా అన్నాడు కిషోర్. అర్ధమైనట్లు  పంకజ్ నవ్వాడు.

"ఓకే డన్. రేపు ఆఫీసులో మాట్లాడుతాను." అంటూ పార్టీ ఆస్వాదించే పనిలో పడ్డాడు పంకజ్.

ఆరోజు రాత్రి కిషోర్ కి నిద్ర పట్టలేదు. ఆలోచిస్తూనే వున్నాడు. ఏ రకమైన బహుమతి ఇస్తే, పంకజ్ ఖచ్చితంగా నా పేరే సిఫారసు చేస్తాడు. ఇంతవరకూ కంపెనీలో వచ్చిన సొమ్ము పంపకంలో తప్ప, తను పంకజ్ కు ఏ విధమైన బహుమతి ఇవ్వలేదు. పోనీ, ఒక మంచి కారు ఇస్తే బాగుంటుందేమో. అయినా ఒకసారి కదిపి చూద్దాము. అప్పుడు తను బయటపడే అవకాశం ఉంటుంది అనుకున్నాడు. మరుసటిరోజు కొంచెం తొందరగానే ఆఫీసుకి వచ్చాడు కిషోర్. సూటుకేసు సీటుదగ్గర పెట్టి, పంకజ్ కేబిన్ దగ్గరకు వెళ్ళాడు. పంకజ్ అప్పటికే వచ్చి, ఏవో ఫైల్స్ చూసుకొంటున్నాడు.

"గుడ్ మార్నింగ్ సర్" పలకరించాడు కిశోర్.

"గుడ్ మార్నింగ్ కిషోర్. రండి. మీకో శుభ వార్త. ఇప్పుడే సీఈవో గారు ఫోన్ చేశారు. ఈ నెల ఇరవై తారీఖున ఇంటర్వ్యూలట" కిషోర్ ని పరీక్షగా చూస్తూ చెప్పాడు పంకజ్.

కిషోర్ గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ఒక వైపు ఆనందం, ఇంకోవైపు భయం పట్టుకున్నాయి. ప్రమోషన్ మాట వినగానే ఒళ్ళంతా పులకరించింది. ఇంక తను  ఆలస్యం చేయకూడదు. మొదట పంకజ్ కి ఏం కావాలో అడిగేయాలి మనసులో అనుకున్నాడు కిషోర్. కానీ ముందుగా తను చెప్పటం కన్నా పంకజ్ కావాల్సింది చెప్పేవరకు వేచి చూద్దాం అనుకున్నాడు కిషోర్.

"సర్ మీరు చెపుతానన్నారు." నసిగాడు కిషోర్.

"ఏం లేదు కిషోర్. చాలారోజులనుంచి నా భార్య ఒక ఫ్లాట్ తీసుకోమంటున్నది. రెండురోజుల క్రితమే "ఆదిత్య బిర్లా" వాళ్ళ ఫ్లాట్ చూసి ఫైనలైజ్ చేశాము. కాకపొతే ఆ ఫ్లాట్ డెబ్బైఐదు లక్షలవుతుంది. నా దగ్గర అన్ని కలిపి యాభై లక్షలున్నాయి." అంటూ కాసేపు ఆగాడు పంకజ్. కిశోరుకి  ఒక్కక్షణంలో విషయం అర్ధమైంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేసినా అవకాశం చెయ్యి జారిపోతుంది. కానీ, ప్రమోషన్ విలువ పాతిక లక్షలు. చాలా ఎక్కువనిపించింది. ఏం చెయ్యాలి. ఇప్పుడిచ్చే డబ్బు తరువాత వసూలు చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు చేయడంలా. ఒక్క నిముషం ఆలోచించాడు.

"అలాగే సర్. మిగతాది నేను సర్దుబాటు చేస్తాను. నా ప్రమోషన్ మాత్రం ఇప్పించండి సర్" ప్రాధేయపడుతూ అడిగాడు కిషోర్.

డీల్ సెటిలయింది. ఇక ఇంటర్వ్యూ డేట్ గురించి ఎదురుచూస్తున్నాడు కిషోర్. ఆ డేటు రానే వచ్చింది. ఇంటర్వ్యూలో మేనేజింగ్ డైరెక్టర్ తో సహా పెద్దవాళ్లంతా వున్నారు. ఇంటర్వ్యూ సుమారు అరగంట సాగింది. తను బాగానే చేసాడనిపించింది. విజయ్ తో బాటు మిగతా డిపార్ట్మెంట్స్ నుండి కూడా అభ్యర్థులు వచ్చారు. ఇంటర్వ్యూలు ఐపోయాయి. రిజల్ట్స్ రావడానికి ఇంకా వారం రోజులు గడువుంది. కిషోర్ ఆఫీసుకి వస్తున్నాడన్న మాటేగాని పని మీద ద్రుష్టి నిలవడంలేదు.

పంకజ్ తో సిఫారసు చేయించానన్న ధైర్యం వుంది. జనరల్ మేనేజర్ అయ్యాక, విజయ్ పని పట్టాలి. ప్రతి విషయంలో అడ్డొస్తుంటాడు. సీఈవో కూడా ఇంతలా పరిశీలించడు. ఆలోచనలు గిర్రున తిరుగుతుండటంతో గుర్నాధంతో కలిసి, కాఫీ తాగటానికి బయటకు వచ్చాడు కిషోర్.

"మరీ ఎక్కువగా ఆలోచించకండి సర్. ప్రమోషన్ మీదే. ఈ తడవ ప్రమోషన్ వస్తే మంచి పార్టీ ఇవ్వాలి సర్." అడిగాడు గుర్నాధం.

"రావాలేగాని పార్టీకేముంది." ఆనందంగా చెప్పాడు కిషోర్.

వారం రోజులు గిర్రున తిరిగి పోయాయి. ఆరోజు సోమవారం. మంచి సూట్ వేసుకొని ఆఫీసుకి వచ్చాడు కిషోర్. పదిగంటలకల్లా సర్కులర్. సాయంత్రం సీఈవో గారితో మీటింగ్. బహుశా ప్రమోషన్ రిజల్ట్స్ చెప్తారేమో అనుకొన్నాడు కిషోర్. సాయంత్రం మీటింగ్ లో కిందటి ఏడాది కంపెనీ చేసిన వ్యాపారాల గురించి, లాభాల గురించి చెప్పి ప్రమోషన్ రిజల్ట్స్ డిక్లేర్ చేశారు సీఈవో. ఆశ్చర్యం. కిశోర్ కు ప్రమోషన్ రాలేదు సరికదా. నిజామాబాద్ శాఖకు బదిలీ చేశారు.

అంతకంటే ఆశ్చర్యంగా విజయ్ కి జనరల్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది. జీర్ణించుకోలేకపోయాడు. ఎలా జరిగింది. పంకజ్ సరిగా సిఫారసు చేశాడా లేక సిఫారసు చేసినా సీఈవో పట్టించుకోలేదా. కిషోర్ కి అర్ధం కాలేదు. ఆ రోజు సాయంత్రం పంకజ్ ఇంటికి వెళ్ళాడు కిషోర్.

"సర్ ఇదేమిటి. మీరు చెప్పినా ప్రమోషన్ రాలేదంటే ఏమయివుంటుంది." అర్ధంకాక అడిగాడు కిషోర్. "ఎందుకిలా జరిగిందో నాకూ తెలియడంలేదు." ఆశ్చర్యం ప్రకటించాడు పంకజ్. ఈలోపల పంకజ్ పర్సనల్ సెక్రటరీ వినయ్ రావడంతో ఈ విషయం మాట్లాడటం బాగుండదని, తరువాత కలుస్తానని వెళ్ళిపోయాడు కిషోర్.

"సర్ కిషోర్ గారి పరిస్థితి మరీ దీనంగా వుంది. ప్రమోషన్ లిస్టులో వున్నారనుకొన్నాను సర్" ఆశ్చర్యంగా అడిగాడు వినయ్. పంకజ్ కి కుడిభుజం వినయ్. పర్సనల్ సెక్రటరీ అన్న పేరేగానీ ఇంట్లో విషయాల దగ్గరనుంచి అన్నీ చూసుకొంటాడు. అందుకే తన మనసులోని విషయాన్ని వినయ్ తో పంచుకోవాలనుకున్నాడు పంకజ్.

"చూడు వినయ్. కిషోర్ గురించి నీకు పూర్తిగా తెలియదు. అందుకే నువ్వు ఆశ్చర్య పోతున్నావు. చాలామంది ఒక స్థాయికి వచ్చిన తరువాత, ట్రాన్స్పెరంట్ గా ఉండాలి. తన పై వాళ్ళతో ఎలా మెలగాలి, కింద వాళ్ళని ఎలా కంట్రోల్ చెయ్యాలి అన్న విషయాలలో నిర్దుష్టంగా ఉండాలి. లేకపోతె చులకనైపోతారు. కిషోర్ తనే తెలివైన వాడిననుకొంటాడు. దానివల్ల ఎదుటివాడు మనల్ని పరిశీలిస్తున్నాడా లేదా అని కూడా ఆలోచించడు. మనందరమూ, కంపెనీలో చేస్తున్న అవకతవకలు నీకు తెలుసుగా. కానీ నాకే తెలియకుండా ఆ మహారాష్ట్ర విఠల్ ట్రేడర్స్ నుంచి పది లక్షలు ఎక్కువ తీసుకొని ఎవరికీ చెప్పలేదు. తరువాతైనా తెలుస్తుందన్న ఆలోచనకూడా లేదు.

నాకీ విషయం విఠల్ ట్రేడర్స్ మేనేజర్ ద్వారా తెలిసింది. ఆనాడు నేను వూరుకున్నాను. కానీ ఆలోచించినకొద్దీ, ఇలాంటివి ఇంకెన్ని చేసాడో నన్న అనుమానం వచ్చింది. నాకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. నా బాధ్యతలు ఇంకా పెరిగాయి. నాకూ ఇంకా ఎన్నో ప్రమోషన్లు కావాలి. అయితే కంపెనీలో ఒక పరిమితి మించి మోసాలుచేస్తే, బంగారు బాతు కధ  రిపీట్ అవుతుంది. మన విషయం అందరికీ తెలిసిపోతుంది. అంతేగాక కంపెనీకి నిరంతరం నష్టాలు రావచ్చు. దాంతో కంపెనీ మనుగడే  కష్టం అవుతుంది. అందరికీ ఉద్యోగాలు పోవచ్చు. ఆ స్థితిని నేను తెచ్చుకోవడానికి నేను తయారుగా లేను. అందుకనే కిషోర్ ను నేను సిఫారసు చేయలేదు." ఒక్క క్షణం ఆగాడు పంకజ్.

"మరి అందరికి పడనీ విజయ్ కి ఎలా ప్రమోషన్ వచ్చింది సర్?" కుతూహలంగా అడిగాడు వినయ్. "ప్రొమోషన్ల విషయంలో మేనేజిమెంట్ ఎప్పుడూ సరైన నిర్ణయమే తీసుకుంటుంది. విజయ్ ఖచ్చితమైన మనిషి అంతేకాకుండా అతని పనితనం గొప్పది. సీఈవో గారు నాముందే విజయ్ ని చాలా సార్లు మెచ్చుకొన్నారు. విజయ్ ప్రతి యేడూ తన టార్గెట్స్ సాధిస్తాడు. మేనేజిమెంట్ తన నుంచి ఆశించినదానికన్నా ఎక్కువే చేస్తాడు. కిషోర్ అలాకాదు. కిషోర్ ని ఎన్నోసార్లు నేను కాపాడాల్సి వచ్చింది. నాకు కూడా డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. ఇంకా మరిన్ని ప్రమోషన్లు రావాలంటే నాకింద వాళ్ళు సరిగా పనిచేయాలికదా. అందుకే నేను విజయ్ పేరు సిఫారసు చేసాను. అతనుకూడా మేనేజిమెంట్  దృష్టిలో వున్నాడు కాబట్టి ప్రమోషన్ వచ్చింది. వినయ్! ఇదంతా ఒక గేమ్. చివరికి గెలిచినవాడే గొప్పవాడు." తన మనసులో మాట బయట పెట్టాడు పంకజ్.

ఆశ్చర్యపోవటం వినయ్ వంతయింది. మేనేజిమెంట్ నిర్ణయాలు ఎంత సూక్ష్మంగా వుంటాయో తెలిసింది.

******* ******* *******

Posted in April 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!