Menu Close
Page Title

6. ఆనాటి సుందర లంకాద్వీపం, దాదాపు పదివేల సంవత్సరాల తరువాత నేడు …

ఆదికవి వాల్మీకి రామాయణం సుందరకాండలో వీర హనుమాన్ సీతాన్వేషణ లో లంక వైపు సముద్రాన్ని లంఘించి అనేక విపరీతాలని, ప్రమాదాల్ని ఎదుర్కొంటూ లంకని చేరి అక్కడ కాంచిన మనోహర దృశ్యాన్ని ఈ విధంగా వర్ణించాడు:

సరళాన్ కర్ణికారాంశ్చ ఖార్జురాంశ్చ సుపుష్పితాం|Sri Lanka Image

ప్రియలాంముచులిందాశ్చ కుటజాన్ కేతకానపి |

ప్రియంగాన్ గంధపూర్ణాంశ్చ నీపాన్ సప్తచ్ఛదాంస్తథా|

ఆసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్|

పుష్పభార నిబద్ధామ్శ్చ తధాముకులి తానపి|

పాదపాన్ విహగా కీర్ణాం పవనాధూత మస్తకాన్|

హంసకారణ్డ వాకీరణాః వాపి పద్మౌత్పలాయుతః |

అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్|

అంటే సూక్ష్మంగా :

“అక్కడ కపీంద్రుడు వివిధ రకాల (సరళ, కర్ణికర; కరవీర, ఖర్జుర, ప్రియాళ, ముకుళింద, మల్లె, కేతక, మరియు సువాసనల వెదజల్లు ప్రియంగు, నేప, సప్తపర్ణ, ఆసన, కోవిదార) మొగ్గలు పూలతో నిండి బరువెక్కిన కొమ్మలపై వ్రాలిన మధుకరాల గుంపులతో పెరిగిన బరువు వల్ల మరీ వంగి ఉన్న కొమ్మలు మంద తెమ్మెరలతో తలలూపుతున్న చెట్లని వీక్షించాడు. పద్మాలు, కలువల తో నిండి ఉన్న సరస్సులని వాటిలో తిరుగాడుతున్న హంసలు, కారండవలతో (ఇతర నీటి పక్షులతోటి), వివిధ క్రీడా విహార స్థలాలని, ఎన్నడూ వాడని పూలతో నిండిన చెట్లతో మనోహరంగా ఉన్న ఉద్యాన వనాలని అమిత ఆనందం తో చూచాడు.”

ఎంత సుందర దృశ్యం!

Sri Lanka Image

మొదట హనుమాన్ లంకలో దిగినట్టు చెప్పబడుతున్న కొండ సముద్రతీరానికి మరీ దగ్గరలో లేదు, రాంబోడా కొండల మధ్య ఉన్న చిన్న కొండమీద దిగాడట. అక్కడే 'చిన్మయ మిషన్' వారు భక్త హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు. అందులో ప్రతిష్టించిన 36 అడుగుల ఎత్తైన ఆంజనేయుని విగ్రహాన్ని దానికోసం నిర్మించిన ఆలయాన్ని పైన చూడొచ్చు. Sri Lanka Imageలంకనేలిన రాక్షస రాజు రావణుడు, చెల్లెలు శూర్పణఖ ప్రోద్బలంతోనో, సీతా దేవి సౌందర్యానికి కామోద్రక్తుడయ్యో, జరగవలిసిన రావణ సంహారానికి నాంది భూతమయ్యో, రాముని సతి సీతని అపహరించి "నువర ఏలీయా" వద్ద ఉన్న 'సీత ఏలీయా" అని పిలువబడుతున్న 'అశోక వాటిక' లో ఉంచాడట. అక్కడే హనుమాన్ రాముని వేలి ఉంగరం ఆనవాలుగా చూపించి తన పరిచయాన్ని తెలియచేసాడట. దాని ఆనవాలుగా ఉంచిన శిల్పాన్ని, హనుమాన్ పాదాల గుర్తులని ప్రక్కనే ఉన్న చిత్రంలో చూడవచ్చు. ప్రక్కనే తరువాతి కాలంలో మందిరాన్ని నిర్మిచారు. రామ రావణ యుద్ధానంతరాన సీతాసమేతుడై అయోధ్యకు తిరిగి వెళుతూ, పుష్పకవిమానాన్ని శాంకరి శక్తి పీఠం దగ్గర ఆపి, అక్కడ ఆదిదేవునికి కృతజ్ఞతతో శివలింగాన్ని ప్రతిష్టించాడట. దాన్ని సీతాదేవి మందిరం పక్కనే చూడొచ్చు.

కొలంబోలో దిగగానే ఆ ప్రాంతం భారతావనికి సాదృశంగానే అనిపించి వెంటనే గుర్తుకొచ్చింది - ఒకప్పుడు శ్రీలంక కూడా భారతావనిలో భాగమేనని, ఈ దేశంకూడా బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి 1912 లోనే (అంటే భారతదేశానికి దాదాపు 35 సంవత్సరాలకు స్వతంత్రం వస్తుందనగా) విడిపోయిందని, శ్రీరాముడు సీతాన్వేషణలో కోతి మూకల సాయంతో కట్టిన వారధి పై మర్కట సైన్యం తో సహా ఈ ప్రాంతానికి చేరుకుని, రావణుణ్ణి భీకర సంగ్రామంలో హతమార్చి సీతాదేవికి విముక్తిని కలిగించాడని.

Sri Lanka ImageSri Lanka Imageపదివేల సంవత్సరాలు పైగా పురాణ కాలం నుంచి చరిత్ర కలిగిన గొప్ప దేశమిది. 25,330 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగిన దాదాపు అమెరికాలోని పశ్చిమ వర్జీనియా రాష్ట్రమంత పెద్ద ద్వీపమని చెప్పొచ్చు. అంటే సుమారు 135  మైళ్ళ వెడల్పు, 220  మైళ్ళ పొడవు గల ద్వీప ఖండమది. రెండున్నర కోట్ల జనాభా గల ఆ దేశం లో (అనగా చదరపు మైలుకి ఎనభైమంది గల భూభాగంలో) నేడు 76 శాతం సింహళం భాష మాట్లాడితే 16 శాతం తమిళం మాట్లాడుతారు. దేశ జనాభాలో డెబ్బై శాతం బౌద్ధ మతస్థులైతే, 13 శాతం హిందూ మతస్థులు, 9.5 శాతం మహమ్మదీయులు, 7.5 శాతం క్రైస్తవులు. ఒకప్పుడు కోలాంబ తోట (గుబురు మామిడి తోట) గా ప్రసిద్ధి గాంచిన ఈ రేవు పట్టణం పోర్చుగీసు వారినోట కొలంబో గా మారి కాలాంతరమున బ్రిటిషువారి పాలనలో ఆ పేరుతోనే స్థిరపడింది. అనురాధపుర రావణ కాలంనుంచి లంకాద్వీపానికి రాజధానిగా ఉన్నా, మధ్యలో కొంతకాలం (4-11 శతాబ్దాల మధ్య) కొలంబో రాజధానిగా మారి, తిరిగి అక్కడికే మార్చ  బడింది. ఆ రాజధాని చుట్టూ 40 చదరపు కిలోమీటర్లలో అనేక బౌద్ధ మఠాలు విరాజిల్లుతుండడం వల్ల అది మహాయాన, హీనయాన, తెరవాద, వజ్రయాన, నిచరణ, బౌద్ధ పరంపరలలో  ‘తెరవాద బౌద్ధా’ నికి కీలక స్థానంగా ఉంది.

Sri Lanka ImageSri Lanka Imageఅశోక సామ్రాట్  కుమార్తె సంఘమిత్ర మూడవ శతాబ్దంలో బుద్ధగయ నుండి బోధిమొక్కని తెచ్చి ఈనాడు 'దంబుల్లా' దగ్గరలోని  సిగిరియాలో ఉన్న 'స్వర్ణ దేవాలయం' గా పిలువబడే బౌద్ధ మఠ ప్రాంగణంలో నాటినదట. ఇందులోనే బుద్ధదేవుని దంతావశేషం ఏడుపొరల స్వర్ణపేటిక లో భద్రపరచబడి ఉంది. ఇది బుద్ధదేవుని పవిత్ర దేవాలయంగా పరిగణింప బడుతొంది. ఆ బుద్ధదేవుని దంతావశేషం లంకా ద్వీప యువరాణి హేమామాలి (తన కొప్పు లో దాచి), ఆమె భర్త రాకుమారుడు దంతుడు భారత దేశంనుంచి అక్రమ రవాణా చేసి తెచ్చారు. ప్రక్కనే చూపిన రాజదంపతుల శిల్పంకూడా అదే ప్రాంగణంలో ఒకచోట కనబడుతుంది.

Sri Lanka Imageఅష్టాదశ శక్తి పీఠాలలో 'లంకాయాం శాంకరీదేవి' అంటూ ఆదిశక్తి గా స్తుతించ బడే త్రికోమలి కొండపై ఉన్న శాంకరీదేవిని, ప్రక్కనే పాము పడగ నీడలో ఉన్న శివ లింగాన్ని రావణబ్రహ్మ ఎక్కువగా భక్తి శ్రద్ధలతో ఆరాధించేవాడట. అక్కడినుంచి దిగువున మంద్ర స్థాయిలో వినిపించే సముద్రపుహోరు ఎంత కలవరంతో కుమిలిపోతున్న మనసుకైనా ప్రశాంతతని యిస్తుంది.

Sri Lanka Imageమహాపరినిర్వాణం తరువాత బుద్ధదేవుని శరీరావశేషాలలో సగభాగాన్ని భద్రపరిచిన 'అనురాధపుర' లోని 'రువాంవెలిసాయ' అని పిలువబడే 338 అడుగుల ఎత్తు గలిగి అర్ధగోళాకారంలో ఉన్న ఈ స్తూపాన్ని బౌద్ధమతస్తులు ప్రపంచంలోనే అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇది క్రీస్తుపూర్వం 140 వ సంవత్సరం లో నిర్మింపబడిందట. దీనిలో సందర్శకులకు మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా చాలా అద్భుతాలు కూడా జరిగినట్లు వినికిడి.

Sri Lanka Imageశ్రీలంక పురోభివృద్ధికి దోహద కారకాలు- అక్కడే పండే తేయాకు, రబ్బరు, కొబ్బరి, సుగంధ ద్రవ్యాలు, పొగాకు; వాటి వాడకానికి అనుకూలంగా తయారు చేసే సంస్థలు, వస్త్ర, పర్యాటక వ్యాపార సంస్థలు. ఇవి కాకుండా, విదేశాల్లో ఆర్జిస్తున్న శ్రీలంక దేశస్థులు కూడా ఆ దేశ ఆర్ధిక పోరోభివృధికి తోడ్పడుతూ, ప్రపంచంలో శ్రీలంక సాంస్కృతిక వ్యాప్తికి కూడా కారణం అవుతున్నారు. అక్కడి లలిత కళలు అతి సుందరమైనవై ప్రపంచ జనాభాని ఆకట్టుకుని ముదాన్ని కూరుస్తున్నాయి. స్వచ్ఛమైన గ్రాఫైట్, వజ్ర, వైడ్డుర్యాలు, ఇతర విలువైన రంగు రాళ్ళూ, అక్కడ విరివిగా లభించడం వల్ల, వాటి సంబంధిత వ్యాపారాలు కూడా లాభసాటిగా ఉండి దేశ ఆర్ధిక వృద్ధికి తోడ్పడుతున్నాయి.

-o0o-

Posted in April 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *