Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

“అతీంద్రియ” బ్లవట్స్కీ -- విశ్వర్షి వాసిలి

బ్లవట్స్కీ రచనలు

చదివారా?

చదువుతున్నారా?

చదవాలనుకుంటున్నారా?

నిజానికి, బ్లవట్స్కీ విషయంలో

ఈ త్రికర్మలు కూడదు.

మతాలకు అతీతమైతేనే

బ్లవట్స్కీ సమ్మతమవుతుంది.

  • ••

బ్లవట్స్కీ ఆలోచనలు

అక్షరాల అలలు కావు ...

మన తెలివితేటల వలలకు

అవకాశ మివ్వవు !

మాటల కెరటాలు కావు ...

మన మానససరోవరంలో

హంసలై విహరించవు !

వాక్యాల వింజామరలు కావు ...

మన జీవనయానంలో

విహంగవీక్షణం చేయవు !

నిజానికి,

బ్లవట్స్కీ ఆలోచనలు

ఆత్మయాన అక్షరాలు.

మంత్రరహస్య మాటలు.

విశ్వదర్శన వాక్యాలు.

  • ••

బ్లవట్స్కీ సాహిత్యం అంటే

బ్లవట్స్కీ సాన్నిహిత్యం.

బ్లవట్స్కీ పుస్తకం అంటే

బ్లవట్స్కీ మస్తిష్కం.

బ్లవట్స్కీ రచన అంటే

బ్లవట్స్కీ సృజన.

  • ••

అన్నట్టు, బ్లవట్స్కీ అంటే

గ్రంథాలయ పొత్తం కాదు

తలకెక్కించుకున్న జ్ఞానం కాదు

జీవితాన్ని వడగట్టిన విజ్ఞానం కాదు.

బ్లవట్స్కీ అంటే

అక్షరాల మధ్య దాగిన ఆత్మవివేచన

వాక్యాల మధ్య దొరలిన ఆత్మవిన్యాసం

పుస్తకాల మధ్య మెరిసిన ఆత్మరహస్యం.

బ్లవట్స్కీ అంటే

దివ్యజ్ఞాన పత్రిక కాదు

దివ్యజ్ఞాన ప్రాతిపదిక.

దివ్యజ్ఞాన పుత్రిక కాదు

దివ్యజ్ఞాన మాతృక.

  • ••

హెచ్.పి.బ్లవట్స్కీ అంటే

ది మాస్టర్ స్పిరిట్

ది లైట్ బ్రింగర్.

ఒకవిధంగా థియోలజిస్ట్

మరొకవిధంగా స్పిరిట్యుయలిస్ట్.

బ్లవట్స్కీ

ఆత్మల సవ్వడిని

అనువదించుకోగలదు

మహాత్మల సందేశాలను

అందుకోగలదు

సిద్ధాంత రహస్యాలను

ఆవిష్కరించుకోగలదు

ఆకాశిక రికార్డ్లను

అక్షరీకరించుకోగలదు.

అందుకే,

బ్లవట్స్కీ అంటే విశ్వమిత్ర !

  • ••

బ్లవట్స్కీ

వ్యక్తిత్వం శాస్త్రీయ లోగిలి

వ్యక్తిమత్వం తాత్విక వాకిలి

వెరసి, ఒక అతీంద్రియ రహస్యం

ఒక ఆకాశిక్ రికార్డ్

ఒక కీ టు థియోసఫీ

ఒక వాయిస్ ఆఫ్ సైలెన్స్

ఒక ధ్యాన్ చొహాన్

ఒక ఐసీస్ అన్వీల్డ్

ఒక సీక్రెట్ డాక్ట్రిన్.

******

వంకాయతో వంద వంటలు -- ఆచార్య రాణి సదాశివ మూర్తి

(సీసమాలిక)
*నూరవ కూర తరువాత ఎత్తు గీతి*
(అంతవరకు వేచి యుందురు గాక)
గమనిక - *ఈ కూరలన్నీ వంకాయతో కలిపి చేసెడివే*

అల్లంబు గుప్పించ నలరించు నొకకూర (1)
ఆలుదుంపలజేర నదియు నొకటి (2)
అరటికాయ కలిపి యందింప నొక కూర (3)
ఉల్లికారముతోడ నొక్కకూర (4)
ఉల్లిపాయలతోడ నుడికించి ఒక కూర (5)
శనగల జోడింప చవులు బుట్టు(6)
శనగపిండి కలుప చక్కనౌ నొకకూర (7)
పచ్చిబఠానీల పరగు కూర (8)
పచ్చిమిరపజేర్చి(9) పలుదినుసులఁజేర్చి (10)
ముద్దకూరనుజేయ ముచ్చటౌను (11)
కూరి కారము సుంత గుత్తిగా నుడికించ (12)
మెంతికారమిడగ మెచ్చు కొనగ(13)
కోరి కొబ్బరి కల్పి(14) కొత్తిమిరను దంచి (15)
జీడిపప్పు ను జేర్చి(16) జీరకమున (17)
ఎండుకొబ్బరిపొడిన్ (18), ఏలాలవంగాల (19)
ఇగురు కూర నొకటి (20) యింపుగాను
చింతపండు పులుసు నందంతనుడికించ (21)
చిక్కుడుగింజల మిక్కుటముగ (22)
వంగకాయను కాల్చి పచ్చడి గనుజేయ(23)
గుగ్గిళ్ళ జతజేసి కూర వండ(24)
నూపప్పు పొడి కూర (25) నూనె వేపుడు కూర(26)
అలసంద లుడికించి(27) ఆవ పెట్టి (28)
ధని యాల కారాన (29) దంచి వెల్లుల్లితో (30)
మెంతి పెట్టిన కూర (31) మేలు చాటు (32)
పుదినాకు వేయింపు (33)పుల్లాకు తాళింపు(34)
కందికూటునకూర (35) కంది కట్టు (36)
తేటమజ్జిగ చారు (37) తీపిగుమ్మడి జోడు(38)
వాంగి బాతొక్కటి (38) వంగ బజ్జి (39)
ఆవకాయయునొప్పు(40) అనపగింజలనొప్పు(41)
ఆనపకాయతో(42) అలరునదియు
అవిశెపొడినిజల్లి(43) అవిశాకుతో కూర (44)
రామములగతోడ (45) రంజుగాను
వంగబగారాన (46) పప్పు కందులగల్పి(47)
పెసరపప్పున గూర్చ (48) పెసలలోన (49)
పెసరట్టు లోజేర్చి(50) పెసరపులుసులోన(51)
పెసరపచ్చడిలోన (52) పెరుగు నందు (53)
బీన్సు నందు న(54) సోయ బీన్సు నందు (55)
సోయపిండిని జేర్చి (56) సుండలందుకలిపి (57)
కొరివి కారమునందు (58) కోరినట్లు
పనస పొట్టునకూర (59) వరిపిండితోకూర (60)
దోసపచ్చడిలోన (61) దొండ తోడ (62)
బీరకాయలతోను (63) బెండకాయలజేర్చి (64)
తోటకూర కలిపి (65) దోరఁ వేచి (66)
దొండవేపుడులోన (67) బెండవేపుడులోన (68)
కరివేపపొడిలోన (69) కారమద్ది (70)
పన్నీరు తో కూర (71) పల్లీలతోకూర (72)
తెలగపిండిని కూర (73) తిలలకూర (74)
నవకాయ*శాకంబు (75) నవకాయ పులుసును (76)
అయిదుకాయలకూర (77) అటుల పులుసు (78)
వాముపొడినిజల్లి (79) వార్చిన గంజితో (80)
వంగతో పులిహోర (81) పొంగలియును (82)
వంకాయ మాజిక్కు(83) వంగబజ్జీకూర (84)
వరకదంబమమర (85) వంగ చట్ని (86)
నిమ్మ రసపుపప్పు (87) నిమ్మకారములోన (88)
మామిడల్లముతోడ (89) మక్కువగను
కలిపి గోసుపువుల(90) కలిపి గోబీపూల (91)
పూని ఉప్మాకూర (92) పులుసుకూర (93)
ఎండు మామిడి తోళ్ళ (94) ఎర్రదుంపలఁ జేర్చి (95)
పచ్చిమామిడి జతన్ పప్పు (96) కూర (97)
కలిపి కారెట్టుతో (98) కనగముల్లంగితో (99)
నూలుకోల్ దుంపలన్ (100) నూరు జేర

*ఆటవెలది*
వంగతోడనిట్లు వండగా తగునండి
వంగ చుట్టమరయనంగనలకు
శాకరాజమిదియె శాకభుక్కులకెల్ల
చేసి చూడ రండి చెలిమి మీర
(*నవకాయ ... తొమ్మిది కాయలవంటగా వ్రతాలలో వాడుక కలదు. అందుకని వాడటమైనది)

ఆచార్య రాణి సదాశివ మూర్తి

నువ్వో కాంతి ద్వీపానివి -- గంగిశెట్టి ల.నా.

అవును,నువ్వెప్పుడూ ఒక ద్వీపానివే
అన్ని వైపుల్నుంచి సముద్రం నీ అడుగుదమ్ముల మీద అలల తల మోదుకొంటూనే ఉంటుంది
ఆప గుండా తన గుండె ఘోష వినిపిస్తూనే ఉంటుంది
అయినా నీలో చలనం రాదు
ఎన్ని తుఫానులు చూసిన అనుభవమో నీది
ఎన్ని ప్రవాస శిక్షలకు విడిదినిచ్చిన తీరమో నీది
ఎన్ని సుడిగాలుల్ని స్వరపరచిన ఏకాంత సంగీతమో నీది
ఎంత పంట పండినా నేలపాల్జేసుకొన్న ఔదార్యమో నీది
అయినా నీలో దుఃఖం ఉప్పొంగదు
అన్నిటికీ అతీతంగా ఇసుకతీరంలా
తడితడిగా మెరిసిపోతుంటావు
ఎద అడుగు వేడిమి నువ్వే దాచుకొంటావు
తగిలిన కాలిగుర్తుల్ని నాజూగ్గా తుడిచేసుకొంటావు
అపార విస్తృతికి అనాది సంకేతంగా మిగిలిపోతుంటావు
నీకు నువ్వే ఓ భరోసా
నీ శ్వాసే మాకు ఆశ్వాస

Posted in April 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *