Menu Close
balyam_main

పంచతంత్రం కథలు

- దినవహి సత్యవతి

పిల్లి చేసిన (అ) న్యాయం

4-20_panchatantram

అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు తొర్రలో ఒక పక్షి నివసిస్తుండేది. ఒకనాడది ఆహారం కోసం వెళ్ళి వచ్చేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది. పక్షి బయటకు వెళ్ళిన సమయంలో ఒక కుందేలు వచ్చి పక్షి నివసించే తొర్రలో దూరి పడుకుంది.

పక్షి సాయంత్రం వచ్చి తానుండే తొర్రలో కుందేలు ఉండడం చూసి ‘ఓరీ ఎవరు నువ్వు? ఇది నా నివాసం. నేను లేని సమయం చూసి ఆక్రమించుకున్నావా? వెంటనే వెళ్ళిపో’ అంది కోపంగా.

అప్పుడా కుందేలు ‘ఓరీ నీకసలు ప్రపంచ జ్ఞానం శూన్యంలా ఉన్నదే? చెరువులు, గుహలు, చెట్లు, తొర్రలూ ఇవన్నీ ఏ ఒక్కరి సొత్తూ కాదు. అందరికీ చెందుతాయి ముఖ్యంగా ఎవరు నివాసముంటే వారివి అవుతాయి. ఇప్పుడు నేనున్నాను కనుక ఇది నాదే. నీవే ఇంకో చోటు వెతుక్కో. ఫో ఇక్కడినుంచి’ అని కసిరింది.

కుందేలు మాటలకి ‘నా ఇంటిని ఆక్రమించి పైగా నన్నే పొమ్మంటున్నావా? ఇది అన్యాయం. నువ్వే వెళ్ళిపో లేదా ఎవరైనా పెద్దలను న్యాయమడుగుదాము. వారు చెప్పినట్లు నడుచుకుందాము. కాదన్నావా నీకూ నాకూ పోట్లాట తప్పదు. ఆలోచించుకో’ మరింత కోపంగా అన్నది పక్షి.

అప్పుడు కుందేలు ‘సరే అలాగే చేద్దాము. పద ఇక్కడికి దగ్గరలో గొప్ప పండితుడూ న్యాయమూర్తీ అయిన ఒక పిల్లి ఉన్నది. అక్కడికి వెళ్ళి మన తగవు చెప్పి న్యాయమడుగుదాము’ అన్నది.

అంతే పక్షి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ‘ఓరీ ఏమంటున్నావు? పిల్లిని నమ్మి తగవు తీర్చుకుందామా? పిల్లి పండితుడైనా పరమ దుర్మార్గుడైనా మనము సమీపించకూడని వాడని నీవెరుగవా? పైగా నీవు చెప్పిన పిల్లి విద్యావంతుడై ఉండవచ్చునేమో గానీ గుణవంతుడు మాత్రం కాబోడు కనుక అతడి వద్దకు పోవద్దు.

అతివినయము, క్రూరత్వము, దొంగతనము పిల్లి జాతి లక్షణాలు. ఎవ్వరైనా ఎంతటి విద్యావంతులైనప్పటికీ జాతి లక్షణాలు మార్చుకోవడం అసంభవం. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కనుక మరలా ఒకసారి ఆలోచించు’ అన్నది కుందేలుతో.

‘ఓరీ! ఆ పిల్లి మంచి చెడ్డలు తెలియక నువ్విలా అంటున్నావు. అతడెంత బుధ్ధిశాలియో నీకు తెలియదు. ఈ ప్రాంతంలో ఎవరికి తగాదా వచ్చినా అతడే తీరుస్తాడు. అనవసరపు అనుమానాలు మాని నాతో రా’ అని కుందేలు పలికేటప్పటికి చేసేదిలేక సరేనంది పక్షి.

పక్షి కుందేలూ కలిసి పిల్లి వద్దకు వెళ్ళి కొంత దూరంగా నిలబడి తమ తగదా గురించి చెప్పి న్యాయం చేయమని కోరాయి.

పిల్లి వాటిని చూసి ‘అయ్యా మీరెవరో నావద్దకు ఎందుకు వచ్చారో నాకు తెలియదు. నాకేమైనా చెప్పదలుచుకున్నారా? నేను మునుపటి పిల్లిని కాదు. ఇప్పుడు బాగా ముసలివాడిని అయిపోయాను నాకు కళ్ళూ కనపడవు చెవులూ వినపడవు. కనుక మీరేమి చెప్పదలుచుకున్నా నా దగ్గరగా వచ్చి చెప్పండి’ అన్నది.

పిల్లి మోసకారి మాటలు నమ్మి పక్షి కుందేలూ దాని దగ్గరగా వెళ్ళి చెరో ప్రక్కనా నిలుచుని మరొకసారి తమ తగవు సంగతి చెప్పి చెట్టు తొర్రలో ఎవరు నివాసముండాలో ఎవరు వేరే చోటికి పోవాలో చెప్పమన్నాయి.

అప్పుడు పిల్లి వాటికి న్యాయం చెప్తున్నట్లు నటిస్తూ ‘నాయనలారా ఎన్నాళ్ళు జీవించినా ఎవ్వరికైనా ఏదో ఒకనాడు మరణం తప్పదు. ఎప్పటికైనా మనకు తోడుగా వచ్చేది ధర్మమొక్కటే. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ ధర్మమార్గం తప్పరాదు...’ అంటూ పలు నీతి మాటలు చెబ్తూ నెమ్మదిగా పక్షికీ కుందేలుకీ అతి సమీపానికి వచ్చి ఒక్కసారి రెండింటినీ బలంగా ఒడిసి పట్టుకుని ఆహారంగా ఆరగించింది.

నీతి: నీచులకు, దుర్మార్గులకు ఎటువంటి పరిస్థితులలోనూ పెత్తనం, అధికారం ఇవ్వకూడదు.

Posted in April 2020, బాల్యం

1 Comment

  1. hymavathy

    పంచతంత్రక పిల్లి చేసినన్యాయం నేటి సమాజానికి అద్దంపడుతున్నది. యదార్ధాన్ని ముచ్చటగా చెప్పిన రచయిత్రికి కృతజ్ఞతలు.
    ముచ్చటైన బొమ్మ ముద్దుగా వుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *