Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

మనిషి జీవితమంతా ఆశల మయమే. ఏదో తెలియని అసంతృప్తి సదా వెంటాడుతూనే ఉంటుంది. అన్ని సౌఖ్యాలు అమరిన తరువాత కూడా ఏదో తెలియని ఆరాటం. మరిన్ని హంగులు, సమాజంలో ఒక గుర్తింపు రావాలనే ఆశ మొదలౌతుంది. బహుశా దానినే కీర్తి కండూతి అని అంటారేమో. నిజంగా పది మందికి మంచి జరగాలనే తపనతో సామాజిక సేవ చేసే వారికి గుర్తింపు దానంతట అదే వస్తుంది. కానీ, ఏమీ కష్టపడకుండా వేరే వారి కృషిని తన పెట్టుబడిగా పెట్టి గుర్తింపు కోసం పాకులాడితే అది మంచికి దారి తీయదు. ఒకవేళ గుర్తింపు లభించినను అది తాత్కాలిక ఉపశమనం కలిగించే ఔషధం వంటిదే. అందరి మనసులలో సదా నిలిచిపోయే విధంగా మంచిని పెంచినవారికి లభించే ఆత్మసంతృప్తి, గౌరవం చిరకాలం ఉంటుంది.

ప్రస్తుత కాలంలో మనం ఎటువంటి ఒడిదుడుకులనైనా తట్టుకునే మానసికస్థైర్యాన్ని కోల్పోతున్నాం. కనుకనే ఒక విధమైన అభత్రతా భావం, మానసిక ఆందోళన, స్వార్థచింతనతో మన గురించి మాత్రమే ఆలోచిస్తూ బతుకుతున్నాం. ముఖ్యంగా ప్రస్తుత కరోనా వైరస్ విషయంలో అంతుచిక్కని భయంతో అల్లాడుతున్నాం. అందుకే హడావిడిగా వెళ్లి అన్ని సరుకులు కొనుక్కొని ఇంట్లో భద్రపరుస్తూ అయినా కూడా ఏదో తెలియని ఆందోళనతో అశాంతితో ఉంటున్నాం. మూడేళ్ళ క్రితం వచ్చిన ఎబోలా వైరస్ కన్నా ఈ కరోనా అత్యంత ప్రమాదకరం కాదు. అయినా ఇంత హడావుడి ఎందుకు. ఎందుకంటే ఇది సంపన్నుల ఇంట పుట్టింది అందుకే అంత గుర్తింపు లభించింది. మరి దీనికి విరుగుడు అంటే వెరీ సింపుల్. పారిశుధ్యం, రోగనిరోధక సాంద్రత ఈ రెండు పనిముట్లతో మనలను మనం రక్షించుకోవడమే కాక సర్వ మానవాళినీ కాపాడవచ్చు. స్వచ్ఛ భారత్, క్లీన్ అండ్ గ్రీన్ అనే మాటలకు మనం నిజమైన నిర్వచనాన్ని ఇచ్చుకొన్న రోజు అంతా మంచే జరుగుతుంది. ముఖ్యంగా అది నిరంతర ప్రక్రియగా మన జీవన విధానంలో ఒదిగిపోవాలి. అప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చు.

ఈ భూమిపై ఎన్నో కోట్ల జీవరాసులు బతుకుతున్నాయి. వాటిలో మనిషి అనే మనం ఒక వర్గం మాత్రమే. ప్రకృతిని శాసించే శక్తి మానవులకు లేదు. అయితే సూక్ష్మ క్రిములు, అంటువ్యాధులు, విషపూరిత వాయువుల నుండి మనం సాధించిన ఆధునిక వైద్య పద్దతులు, మందుల ద్వారా రక్షించుకోవచ్చు. కానీ వాటిని రాకుండా మాత్రము ఆపలేము. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసినది మన ఆహారపు అలవాట్లు. ఏదైనా తినేయవచ్చు అంటే తినవచ్చు కానీ అందులోని విషపూరిత వ్యర్ధాల వలన మన శరీరానికి కలిగే హాని ఎంతో ఉంది. ఆ విషయాన్ని గమనిస్తే అందరం ఆరోగ్యంగానే ఉంటాము.

‘జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని’ అని మహాకవి ఆత్రేయ గారు అన్నట్లు, ఏదో అయిపోతున్నదని ఆందోళన పడుతూ కూర్చోడంకంటే, ఎవరి దారి వారిది అనే ప్రస్తుత జీవన శైలి నుండి కొంచెం ఆటవిడుపుగా ప్రస్తుతం కుటుంబ సభ్యులందరూ ఒకే చోట సమయాన్ని గడిపే అవకాశం వచ్చింది అనుకుంటే అంతా హాపీస్ కదా. ఏమంటారు?  ఆ విధంగా భగవంతుడు పాప ప్రక్షాళన పద్ధతిని పాటించి ఫామిలీ విలువలను పెంచుతున్నాడు. అది నేను చూసిన మంచి ఇక్కడ. ఇటువంటి విపత్కర పరిస్థితులలో ప్రతిఒక్కరూ సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. అంతేగాని అనవసరమైన చెడు వార్తలను చేరవేస్తూ అందరినీ గాభరా పెట్టకూడదు.

**000**

Posted in April 2020, ఆరోగ్యం

1 Comment

  1. hymavathy

    అద్భుతమైన సందేశం. అంతా ఒకచోట వుందటం అనే భావనతో పాజిటివ్ ఆలోచనలతో జీవించడం నేర్చుకుంటే గొప్పరీలీఫ్.ఇహ పారిశుధ్యం నిరంతరాయంగా పాటించడం, సాధుభోజనం, శాకాహారం అనేవి కవచాలవుతాయి.ఈ రోగాన్ని ప్రపంచానికి వ్యాపించేలాచేసిన వారి పాపం తప్పక వారినే హరిస్తుందనే మాట సత్య మవుతుంది. మనఆరోగ్యం మనచేతుల్లోనే అంటూ మంచి ధైర్యవచనాలు అందించిన ఈవ్యాసకర్తకు మనఃపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *