తెలుగులో రామాయణం ఎవరు రాసారు అంటే చెప్పగలరా? నిజం చెప్పాలంటే తులసీ రామాయణం, వాల్మీకి రామాయణం రాసినట్టు మనకి ‘ఇదీ అసలైన తెలుగు రామాయణం’ అని చెప్పగల కావ్యం లేదు. కవిత్రయం మహాభారతాన్ని తెనిగించారు. పోతన భాగవతం రాసాడు. మరీ రామాయణమో? అనేకానేక మంది రాసారు కానీ ఇదీ సరైనది అనేది లేదు. కనీసం మొల్ల అనే కవయిత్రి రాసేవరకూ. ఈవిడ కూడా మన పోతన లాగే మహా భక్తురాలు. తనకి ఏమీ రాదనీ ఏమీ చదువుకోలేదనీ చెప్తూ శ్రీకంఠ మల్లేశుని దయ వల్లే రామాయణం రాయడం పూనుకున్నానని చెప్పిందంటారు. ఈ శ్రీకంఠ మల్లేశుడు అంటే శ్రీశైలం శివుడు కాదు. బద్వేలుకి చెందిన గోపవరం అనే గ్రామంలో ఉన్న మల్లేశుడు. ఈ నెల పద్యం మొల్ల రామాయణంలోని సుందర కాండలోనిది.
ఉ.
దేవవిరోధి చేఁబడిన దేవిని జూచెదఁ, గానకుండినన్
లావున గడ్డతోఁ బెఱికి లంకయ తెచ్చెద, నట్లు గానిచో
రావణుఁ బట్టి తెచ్చెదను, రాముని సన్నిధి కెన్ని రీతులన్. (మొల్ల రా. సుం. కాం. 17)
హనుమంతుడికి ఋషులు శాపం ఇచ్చారు. చిన్నప్పుడు అకతాయి పనులు చేస్తూంటే – నీ బలం ఇతరులు చెప్తే తప్ప నీకు తెలియకూడదు అని. అందువల్ల అలా సముద్రం కేసి చూస్తూ కూర్చుంటాడు మిగతా వారందరూ నేనింత దూరం దూకుతా, అంత దూరం దూకుతా అని చెప్తూ ఉంటే. ఒకసారి నువ్వింతవాడివి ఇలా కూర్చున్నావేమిటయ్యా, లే, లే అని జాంబవంతుడు చెప్పేసరికి శరీరం పెంచాడు. ఆ తర్వాత – మొల్ల రాసిన చాలా సులభంగా అర్ధమయ్యే ఈ పద్యంలో - హనుమంతుడు చెప్తున్నాడు మిగతా వానరవీరులకి. క్రితం ఒకసారి చెప్పుకున్నట్టే హనుమంతుడి తనగురించి చెప్పేటప్పుడు నేనంత గొప్పవాణ్ణి కాదు కానీ రాముడి వల్లే సుమా అనడం మరోసారి కనిపిస్తుంది పద్యం మొదట్లోనే. రాముడు పావనమూర్తి కదా, అటువంటి నరపాలకుడు పంపుతున్న నేను సముద్రాన్ని (అబ్ధి) దాటుతాను. సీతతో కలిపి రావణుడు అనే పదం ఉఛ్ఛరించడానికి మనసొప్పదు కదా రాముడి గురించి కావ్యం రాసేటపుడు? అందువల్ల వాణ్ణి దేవవిరోధి అంటోంది రెండో పాదంలో. అలా దేవవిరోధి చే పట్టుకెళ్లబడిన దేవిని (సీతా దేవిని) చూసి వస్తాను. ఆవిడ అక్కడ లేకపోతే (కానకుండినన్) మొత్తం లంక అంతా ఊడబెరికి తీసుకొచ్చేస్తాను (లావున గడ్డతోఁ బెఱికి లంకయ తెచ్చెద), అదీ కుదరక పోతే - ఇప్పుడు రావణుడి పదం ఒక్కటీ వాడుతోంది కవయిత్రి – ఎందుకంటే వాణ్ణి పట్టుకుని తీసుకురావడానికి – అలా ఎన్ని రీతులగా కుదిరితే అన్ని రీతులగా చేసి వస్తాను అని చెపుతున్నాడు. ఈ పద్యంలో రాసిన దేవి అనే సంగతి వాల్మీకి, రామాయణం లో అనేకసార్లు వాడినదే. హనుమంతుడు కూడా లంక నుంచి వెనక్కి వచ్చాక రాముణ్ణి చూసినప్పుడు మొదటగా చెప్తాడు “దృష్టా దేవీ” అంటూ. అంతే గానీ సీతా దృష్టా అని గానీ మరో పదం గానీ వాడడు.
చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అని హనుమంతుడి గురించి చెప్పడం కూడా మనం వింటాం. చెప్పిన పని మామూలుగా కాదు కానీ అడిగినదానికంటే మరీ ఎక్కువగా చేసి వచ్చాడని చెప్పడానికన్నమాట. భారతంలో భీముడు ద్రౌపది అడిగితే సౌగంధిక పుష్పాలు తేవడానికి బయల్దేరతాడు. దారిలో కోతి అడ్డంగా పడి ఉంటే దాన్ని తప్పుకోమంటాడు. నేను లేవలేను నా తోక అలా పక్కకి జరిపి వెళ్ళిపో అంటాడు ఆ కోతిగా ఉన్న హనుమంతుడు. తన మొత్తం బలం వాడినా తోక అంగుళం పక్కకి జరగదు. తర్వాత తానెవరో చెప్తే భీముడు అంటాడు – నువ్వు వాయుపుత్రుడివి కదా, నా అన్నవి. ఆ రోజు సాగర లంఘనం చేసిన రూపు చూపించకపోతే ఇక్కడనుంచి కదలను అని. కొంత పైకి పెరిగి చూపించాక చెప్తాడు – ఎప్పుడో త్రేతా యుగంలో జరిగినది ఇప్పుడు చూపించడం సమంజసం కాదు కానీ ఇప్పుడు నువ్వు చూసిన రూపు కి అనేక రెట్లు ఉంటుంది ఆ త్రేతాయుగం రూపు అని. మరో విషయం చెప్తాడు – శతృవులు తనని చుట్టు ముట్టినప్పుడు అప్పటికే అంతగా పెరిగిన శరీరం మరో రెండు రెట్లు పెరుతుతుందిట. ఇటువంటి వాడు రావణుణ్ణి పట్టి తేవడం, లంకని పెగిలుంచుకుని తేవడం కష్టం కాదు కదా?
యుద్ధాంతరం అయోధ్య చేరిన రాముణ్ణి చూడడానికి అనేకమంది ఋషులు వస్తారు. రాముడు వాళ్లతో మాట్లాడుతూ రావణుడు ఎవరో, ఎలా పుట్టాడో, బ్రహ్మ ఇచ్చిన వరాలు అన్నీ తెలుసుకుంటాడు. వాలి రావణుణ్ణి ముప్పు తిప్పలు పెట్టడం అన్నీ చెప్పాక అప్పుడు అగస్త్యుడు అంటాడు, “రామా నీ చేతిలో ఒక్క బాణం తో చచ్చిన వాలి అంతటి బలవంతుడు,” అని. కానీ రాముడు అడుగుతాడు, “నిజమే, కానీ హనుమంతుడు వీళ్లందరికంటే బలమైనవాడుగా కనిపిస్తాడు. కానీ సుగ్రీవుడు అన్ని కష్టాలు పడుతూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు?” అని. అగస్త్యుడు అప్పుడు చెప్పిన విషయాలు విస్మయం కలిగిస్తాయి – హనుమంతుడు కాబోయే బ్రహ్మ, చిరంజీవి. ఒక పాదం ఉదయాద్రిమీదా, ఒకపాదం అస్తాద్రి మీదా వేసి సూర్యుడి దగ్గిర సకల శాస్త్రాలు నేర్చుకున్నవాడు. కానీ ఇలా ఋషుల శాపం వల్ల తన బలం ఏమిటో తనకి తెలియక ఊరుకున్నాడు.
రామావతారం పరిసమాప్తి అయ్యాక లవకుశులు తండ్రి వెళ్ళిపోయినందుకు ఏడుస్తూ ఉంటే హనుమంతుడు తన గుండె చీల్చి చూపిస్తాడు – చూడండి రాముడు ఇక్కడే ఉన్నాడు, అంటూ. అందుకే హనుమంతుడు గుండెలు తీసిన బంటు. ఇంత చేసినా ‘నేను, నాది, ఇదంతా నా పనే’ అని చెప్పుకోవడం ఉండదు రామాయణంలో ఎక్కడా. అంతా రాముడి వల్లే అనే వినయం, అహంకారం లేకపోవడం మొత్తం రామాయణంలో అంతా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందుకే అంటారు భగవంతుడు కనిపించాలంటే అహంకారం పూర్తిగా నాశనం కావాలి. దీనికి హనుమంతుడే మంచి ఉదాహరణ.