ధర్మరాజు మాయాజూదంలో ఓడిపోయాక అరణ్యవాసం చేస్తున్నప్పుడు కృష్ణుడు వస్తాడు చూడ్డానికి. రాజ్యం పోయిన వాళ్లని ఊరడిస్తూన్నప్పుడు మార్కండేయ మహర్షి వస్తాడు అటుకేసి. కృష్ణుడు ఆయనని పిలిచి ధర్మరాజుతో కొన్ని విషయాలు మాట్లాడి స్వాంతన కలిగించమంటే, ఆయన సృష్టి క్రమం, యుగాలు, కల్పాలు ఎలా కలుగుతాయో చెప్తున్నప్పుడు భగవంతుడి గుణగణాలు వివరిస్తూ తనకేం జరిగిందో చెప్తాడు. ఆ క్రమంలోనే కల్పాంతకాలంలో తనకి జరిగిన విషయం చెప్తున్నప్పుడు నారాయణుడు ఆయనకి చెప్పిన విషయమే ఈ నెల పద్యం.
ఉ.
యెప్పుడు దైత్యు లుబ్బుదురు హీనతబొందు రెప్డు వేల్పు లే
నప్పుడు సత్కులీనుల గృహంబుల నుద్భవ మొంది లీనమై
నెప్పటియట్ల నిల్పుదు సురేంద్రుల నంచితధర్మపద్ధతిన్ (అరణ్యపర్వం చతుర్ధాశ్వాసం. 276)
కల్పాంతకాలంలో అంతా నీరు ఆవిరించి ఉన్నప్పుడు మార్కండేయ మహర్షి – తాను చిరంజీవి కనక - దారి తెలియక తిరుగాడుతుంటే అంతటా నిండి ఉన్న నీళ్ళలో ఒక మర్రిచెట్టు, ఆ చెట్టుకో ఆకు, ఆ ఆకు మీద నిద్రిస్తున్న ఓ బాలుడు కనిపించారుట. మహర్షి వెళ్ళి ఆ పిల్లవాణ్ణి అడుగుతాడు, ఇదేం వింతో. ఆ బాలుడు చెప్పేదేమంటే, ‘మీరు బాగా అలిసిపోయి ఉన్నారు, విశ్రాంతి తీసుకుందామనుకుంటున్నారా?’ ఈ మహర్షి సమాధానం చెప్పేలోపులే ఆ బాలుడి నోట్లోకి బలవంతంగా వెళ్ళిపోయి అక్కడ పధ్నాలుగు లోకాలనీ విశ్వాన్నీ చూసాక చాలా కాలం అటూ ఇటూ తిరిగాక ఏమీ దిక్కుతోచదు. మళ్ళీ ఆ బాలుడి గురించే తలపోస్తుంటే బయటకి వస్తాడు ఆ కుర్రాడి కడుపులోంచి.
‘అయ్యా మీరెవరు, ఈ ఆకు ఏమిటి, ఇంత చిన్న ఆకుమీద పడుకుని ఉన్న మీ ఉదరంలో విశ్వం అంతా ఉండడం, ఏమిటి ఈ వింత?’ అని అడుగుతాడు. అప్పుడు కుర్రాడు చెప్పినదే ఈ నెల పద్యంలో యర్రాప్రగడ చెప్పినది. నారము అంటే నీరు, నీటికి ఆధారమైనవాడు కనక నారాయణుడు భగవంతుడు. నారాయణుడు సర్వ ప్రపంచానికీ, సమస్త విశ్వానికీ ఆధారభూతమైనవాడు కనక వాటిని తన కడుపులో ఇముడ్చుకోగలడు. అయితే మరి మనకి ఎలా కనిపిస్తాడు? ఆయన్ని తెలుసుకోవడం అతి కష్టం కనక మనమీద ప్రేమతో ఓ అవతారంగా అవతరించినపుడు ‘ఓహో భగవంతుడు ఇలా ఉంటాడన్నమాట’ అని మనకి తెలుస్తుంది. మరి భగవంతుడు అంటే మనకి కనిపించిన ఆ అవతారమేనా అంటే కాదు. ఆ అవతారంలో భగవంతుడి ఒక అంశ మనకి కనిపిస్తుంది. మరి భగవంతుడు అవతారం ఎప్పుడొస్తుందో మనకి తెలిసేది ఎలా? దానికి సమాధానం చెప్తున్నాడు.
ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం ప్రబలుతున్నప్పుడూ, దైత్యులు (దితి సంతతివారు, రాక్షసులు) పెరుగుతున్నప్పుడు, ఎప్పుడు వేల్పులు హీనస్థితికి చేరతారో అప్పుడు తాను అవతారం ధరిస్తాడు. ఎక్కడ? సత్కులీనుల గృహంలో. అలా పుట్టి ధర్మం స్థాపించడానికి సాయపడతాడు. అలా సాయపడినపుడు ఇంద్రుడితో సహా అందరికీ అన్నీ అందేలా చేసి ధర్మమార్గంలో నిలబెడతాడు. ఇది దాదాపుగా భగవద్గీతలో చెప్పే ‘యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత ..’ అనే శ్లోకానికి సరిగ్గా సరిపోతుంది. భగవంతుడు ఎప్పుడు సత్కులీనుల ఇళ్ళలో పుట్టడం అనేది మనకి మరో భగవద్గీత శ్లోకంలో (శుచీనాం శ్రీమతాం గేహే…) తెలుస్తుంది. ఎందుకయ్యా ఈ ధర్మం అనేదాన్ని ఉద్ధరించడం అంటే భగవంతుడే ఈ ధర్మానికి మూలవిరాట్టు కనకా, ఏ ధర్మం వల్లైతే మనం సరైన మార్గంలో బతకగలమో, అసలు అలాగే ఎందుకు బతకాలో, అలా బతికినపుడు “మా-త్ర-మే” లోకాలన్నీ సంతోషంగా ఉంటాయి కనక అని అర్ధం చేసుకోవచ్చు. దీన్నే గౌతమ బుధ్ధుడు కూడా, మొత్తం రాజ్యం, అన్నీ వదులుకుని ధర్మం తెలుసుకోవాలనుకోవడం, పట్టుబట్టి దాన్ని సాధించడంలో చూడవచ్చు.
బుధ్ధుడి శిష్యుడు అశ్వజిత్ అనే ఆయన మొదటిసారి శారిపుత్రుడికి కనిపించినపుడు ఆయన అడుగుతాడు, ‘మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు, మీ గురువు ఎవరు’ అని. దీనికి అశ్వజిత్ శ్లోక రూపంలో ఇచ్చిన సమాధానం మొత్తం బౌధ్ధ సాహిత్యానికి తలమానికమైనటువంటిది అంటారు. ఆ శ్లోకం ఇలా ఉంటుంది.
హే ధర్మా హేతుప్రభవా హేతుం తేషాం తథాగతోహ్యవదత్
తేషాం చ యో నిరోధో ఏవం వాదీ మహాశ్రమణః
ఏ కారణంలో నుంచి ధర్మాలన్నీ ఉద్భవిస్తున్నాయో ఆ కారణాలకి మూలం, వాటినన్నింటినీ చేరుకోవడానికి, ఈ జన్మమరణాల ని అంతమొందించడానికీ దారి కనిపెట్టిన మహాశ్రమణుడే నా గురువైన ఈ తథాగతుడు. ఇదే సరిగ్గా పైన చెప్పిన యర్రాప్రగడ పద్యం కూడా చెప్పేది – ధర్మమే భగవంతుడు. అందుకే ఆ ధర్మం – దేని వల్ల అయితే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలమో ఆ ధర్మం కలకాలం బతికి ఉండడం కోసం – అది నాలుగు పాదాలమీద అయినా, చివరకి ఒకపాదం మీద అయినా సరే – భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. అసలీ ధర్మం అనేదే లేకపోతే ఏమిటి గొడవ అంటే అప్పుడు అసలు మనుష్యులలో కనికరం, మానవత్వం అనేవి నశించిపోయి మనం మానవులం అని చెప్పుకోవడానికి పనికిరాము కనక. అందుకే సత్యం ధర్మం అనేవి – కంచెర్ల గోపన్న అనే ‘కరుణాపయోనిధి’ అనే పదం కూడా – భగవంతుడికి ఆపాదించబడ్డాయి. దీనినే మరోవిధంగా చెప్పాలంటే, “సత్యం పరం ధీమహి” (పరమాత్మ సత్య స్వరూపుడు). సంస్కృతంలో మహాభాగవతంలో మొదటిశ్లోకంలోనే ఈ సత్యం పరం ధీమహి అనేది చెప్పబడింది. పరమాత్మ సత్య, ధర్మ స్వరూపుడు. అందువల్లనే ‘యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత’ అనేది చెప్పడం.