శ్రీరామకృష్ణుల ముఖ్య శిష్యులైన మహేంద్రనాథ్ గుప్తా (’మ’) గారిని ఎవరో అడిగారుట “శ్రీరామకృష్ణుల గురించి మీకు తెల్సినది చెప్పండి” అని. దానికాయన ఇచ్చిన సమాధానం ఏమిటంటే, “భగవంతుడైన శ్రీరామకృష్ణులు ఒక మహాసముద్రం వంటివారు. నేను ఆయన దగ్గిరకెళ్ళి నాకు చేతనైనంతలో ఒక చిన్న చెంబుతో నీళ్ళు తెచ్చుకోగలిగాను అంతే.” అలాగే పోతన మహాభాగవతం అంటే ఒక అమోఘమైన మహాసముద్రం. ఏ పద్యం బాగుంటుంది అంటే, దేనికదే. ఎందుకంటే భగవద్విభూతి అటువంటిది – అది అనంతం, అమోఘం, ఎవరూ మాటల్లో ఇమడ్చలేనిదీ కనక. ఆ విభూతి మనసులో అనుభవించవల్సినదే కానీ ఒకరు చెప్తే మరొకరికి సులభంగా అర్థం అయేది కాదు. ఈ నెల పద్యం మత్తేభం వృత్తంలో దూర్వాసుడి వెంటపడే సుదర్శన చక్రం గురించి అంబరీషోపాఖ్యానంలో పోతన రాసినది.
మ.
దివిఁ బ్రాకన్ దివిఁ బ్రాకు; దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవుఁ; జి
క్కి వెసం గ్రుంగినఁ గ్రుంగు; నిల్వ నిలుచుం; గ్రేడింపఁ గ్రేడించు; నొ
క్కవడిన్ దాపసు వెంటనంటి హరిచక్రం బన్యదుర్వక్రమై.
పద్యం అర్థం చెప్పుకునేముందు అసలు కొంచెం కథ చూద్దాం. అంబరీషుడు విష్ణుభక్తుడు. ప్రతీ ద్వాదశి నాడు ఉపవాసం తో విష్ణుపూజ చేసి అందరికీ భోజనం పెట్టాక తాను భోజనం చేసి ఉపవాసం పూర్తి చేసేవాడు. అలా ఉపవాసం వ్రతం సాగుతున్న రోజుల్లో విష్ణువుకి నచ్చి “నా సుదర్శన చక్రం నీకు అండగా ఉంటుంది” అని వరం ఇచ్చాడు అడగకుండానే. అడిగితే ఇచ్చేవరాలకీ అడగకుండా ఇచ్చే వరాలకీ తేడా ముందు నెల వ్యాసాల్లో చదువుకున్నాం కదా?
అలా తనకి రక్షగా వచ్చిన చక్రాన్ని ఏనాడూ అంబరీషుడు వాడుకునే అవసరంరాలేదు. అంటే ఆయన విష్ణుభక్తి తత్పరుడు కనక ఎవరూ శత్రువులే లేరు. నిరంతరం భగవంతుణ్ణి గుర్తుంచుకున్నవారికి “హరిమయము విశ్వమంతయు, హరివిశ్వమయుండు, సంశయము పనిలేదా…” అనేటట్టు ప్రపంచమంతా హరిమయంగా కనిపిస్తుంది కనక వారికెప్పుడూ ప్రశాంతత మనసులో ఉంటుంది. అటువంటి రోజుల్లో ఓ ద్వాదశినాడు ఉపవాసం ముగించడానికి కూర్చోబోతూంటే దూర్వాసుడు వచ్చాడు. అంబరీషుడికి సంతోషమైంది ఆయన్ని చూసి. “రండి, సరైన సమయానికి వచ్చారు, భోజనం చేద్దాం” అని ఆహ్వానించాడు. అయితే ముని “నేను స్నానం చేసి వస్తా; నేనొచ్చేదాకా ఉండు,” అని నది దగ్గిరకి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎంతకీ రాడు. ఈ లోపుల ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతున్నాయి. భోజనం చేయకపోతే ద్వాదశి వ్రతం చెడుతుంది. చేస్తే దూర్వాసుడికి కోపం రావొచ్చు. ఆయన కోపం ఎటువంటిదో జగద్వితం. తన సభలో ఉన్న పండితులని అడిగాడు ఏం చేయాలో. “మంచినీరు తాగండి, దానితో ఉపవాసం పూర్తి అయినట్టే, భోజనం ముని వచ్చాక చేయవచ్చు,” అని వాళ్లన్నాక మంచినీరు తీర్థం పుచ్చుకున్నాడు. ఇలా తీర్థం తీసుకుంటూండగానే దూర్వాసుడు వచ్చి చూసాడు. కోపంతో అరికాలిమంట నెత్తికెక్కింది. “ఇలా నన్ను తినడానికి రమ్మని నేను రాకుండా ఉపవాసం పూర్తి చేసావు కనక చూసుకో ఏం చేస్తానో” అంటూ జడ ఒకటి తీసి నేలమీద కొట్టాడు. అందులోంచి వచ్చిన కృత్య అనే రాక్షసుడికి ఈ అంబరీషుణ్ణి చంపమని చెప్తే అది రాజుమీదకి వచ్చింది.
భగవంతుడెటువంటివాడు? శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు, ప్రపంచంలో గడ్డిపరకకూడా కదలదుట ఆయన ఆజ్ఞ లేకుండా. ఈ జరిగే కథా, మన కోపం అదీ చూస్తే ఆయనకి నవ్వురాదూ? వెంఠనే తన సుదర్శనాన్ని పురమాయించాడు ఈ దూర్వాసుడి సంగతి చూడమని. ఇటువైపు అంబరీషుడికేం చేయాలో పాలుపోక కళ్ళు మూసుకుని శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు. ఈ స్థితిలో కూడా అంబరీషుడు తనకి రక్షగా ఉన్న సుదర్శన చక్రాన్ని తల్చుకోలేదు. తల్చుకున్నది విష్ణువునే. ఈ కృత్య రాజుమీదకి వచ్చే లోపుల చక్రం వచ్చి ఆ కృత్యని మట్టుపెట్టాక దూర్వాసుణ్ణి తరమడం మొదలుపెట్టింది. ఎలా ఎక్కడికి తరిమిందనేదే ఈ నెల పద్యంలో పోతన ఉదహరించేది.
భూమిలో దూరితే (భువిదూరన్ భువిదూరు) భూమిలోకి వస్తోంది. సముద్రంలోకి వెళ్తే (అబ్దిజొర నబ్ధుల్ జొచ్చు), సముద్రంలోకీ, కలవరపడి ఆకాశంలోకి పోతే (ఉద్వేగియై దివిబాకన్) కూడా ఆకాశంలోకి వస్తోంది. దశదిశల్లోకీ పరుగెడితే అక్కడకీ తనకూడా వస్తోంది (దిక్కులకుఁ బో దిగ్వీథులం బోవు). దానికి చిక్కి విసిగిపోయి (చిక్కివెసన్) కుంగిపోతే అదీ కుంగుతుంది; నిలిస్తే తన దగ్గిరే నిలుస్తుంది (నిల్వ నిలుచున్). దానికి దారి ఇచ్చేసి పక్కకి పోతే పక్కకి వస్తోంది (క్రేడింప క్రేడించు). అలా ఎటు వస్తోంది ఈ హరి చక్రం? ఒక్కవడిన్ – ఒకే వేగంతో తనవెంటే (తాపసువెంటనంటి), ఇతరులెవరూ ఆపలేకుండా (అన్య దుర్వక్రమై).
ఓ కర్మ చేసామనుకోండి. అది తప్పా ఒప్పా అనేది అనేది వదిలేసి చూస్తే మనకి తెలిసేది ఏమిటంటే ఆ కర్మ ఫలం మనం అనుభవించి తీరాలి. ఈ కర్మ ఎటువంటిదంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో సహా ఎవరూ కూడా దీన్ని తప్పించుకోలేరు. దూర్వాసుడు ముందూ వెనకా చూసుకోకుండా, అసలేం జరిగిందనేది ఆలోచించకుండా కృత్యని సృష్టించినందుకు ఈ కర్మ తగులుకుంది. దాన్ని అనుభవించవల్సిందే. అది ఎలా వదుల్చుకోవడం? ఒకటే మార్గం – చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం, భగవంతుణ్ణి శరణువేడడం. ఒకటి గమనించారా? చక్రం వచ్చి దూర్వాసుణ్ణి చంపేయవచ్చు. ఎందుకు చంపలేదని చూస్తే మనకి తెలిసేదేమంటే, దూర్వాసుడి చావు కాదు ఇక్కడ కావాల్సింది. ఆయన కోపం వల్ల వచ్చిన అనర్థం ఆ కోపం తగ్గించుకోవడంతోనే పోగొట్టుకోవాలి. అందుకే “నిల్వ నిలుచున్” అనే చెప్పారు పద్యంలో. మరి ఆ కోపం ఎలా పోతుంది? చేసిన తప్పు ఒప్పుకోవడం వల్లా, శరణాగతి వల్లాను. ఇలా చక్రం తనని తరమడం మొదలుపెట్టాక దూర్వాసుడు బ్రహ్మ దగ్గిరకీ, శివుడి దగ్గరకీ వెళ్తాడు. తప్పు చేసింది ఎవరికో వాళ్ళదగ్గిరకి వెళ్ళాలి కానీ వీళ్ళేం చేస్తారు? “చక్రం విష్ణువుది కనక మేమేం చేయలేము” అని వాళ్ళు చెప్పాక విష్ణువు దగ్గిరకి వెళ్తే ఆయనేమంటాడో వచ్చేనెల పోతన రాసిన మరో అద్భుతమైన పద్యంలో చూద్దాం.