Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 116 వ సమావేశం
-- వరూధిని --
vikshanam-116

ఏప్రిల్ 10, 2022 న వీక్షణం-116వ సమావేశం ఆన్ లైన్ సమావేశంగా అత్యంత ఆసక్తిదాయకంగా జరిగింది. ఈ సమావేశంలో ముందుగా "ముత్తుస్వామి దీక్షితార్ రచనల్లో సాహిత్యం- రహస్యాలు" అనే అంశం మీద శ్రీ మధు ప్రఖ్యా గారు ప్రసంగించారు.

"ముత్తుస్వామి దీక్షితార్ 1775-1835 మధ్య జీవించిన కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన గొప్ప వాగ్గేయకారుడు, వీణ విద్వాంసుడు. ఈయన కృతులు తెలుగు కంటే ఎక్కువగా సంస్కృతంలో రాయబడ్డాయి. కొన్ని కృతులు తమిళము, సంస్కృతాల సమ్మేళనాలుగా కూడా రాయబడ్డాయి. వీరి అన్ని రచనల్లోనూ "గురు గుహ" అనే మకుటం కనిపిస్తుంది.  వీరు సంగీత, వ్యాకరణ, జ్యోతిష, వాస్తు, మాంత్రిక, వైద్య విద్యలలో ఆరితేరిన వ్యక్తి. అయిదువందలకు పైగా రచనలు చేసారు. అందువల్లనో  ఏమో వీరి కృతుల్లో అక్షర వరుసలు ప్రత్యేకమైన జ్యోతిష శాస్త్ర పద్ధతుల్లో అమర్చబడి ఉన్నాయి." అంటూ ముందుగా మధుగారు వారి గురువైన మాండలీన్ రాజేష్ గారు మాండలీన్ పైన వినిపించిన "పంచముఖ మాతంగ ముఖ గణపతినా" అనే ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనని అందరికీ పరిచయం చేసారు.

"ముత్తుస్వామి దీక్షితార్ విభిన్నమైన దేవతలపై కీర్తనలను రాసిన విశిష్టమైన వ్యక్తి. జ్యోతిశ్శాస్త్రాన్ని సంగీతంతో మిళితం చేసి రాగాలకు సరిగ్గా సరిపడే స్వరాల్ని కూర్చడం ఈయన ప్రత్యేకత" అని వివరించారు. ఆయన కీర్తనల్లో పదాలకు, భావాలకు, రాశులకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని సోదాహరణంగా తెలియజేస్తూ ముగించారు.

ఇందుకు కొనసాగింపుగా ప్రేక్షకుల కోరిక మేరకు శ్రీమతి అపర్ణ గునుపూడి గారు ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనల్లోని మకుటాయమాయమైన "హిరణ్మయీం లక్ష్మీం" అనే కృతిని పరిచయం చేసారు.

ఆ తరువాత జరిగిన విన్నకోట రవిశంకర్ గారి కవితాసంపుటి "మంచుకరిగాక" ఆవిష్కరణ డా.కె.గీత గారి చేతుల మీదుగా జరిగింది. ముందుగా డా.కె.గీత మాట్లాడుతూ ఇందులో ఒక్కొక్క కవితా ఒకొక్క ఆణిముత్యమని కొనియాడారు. ఈ సంపుటిలో అనుకోకుండా ఏ పేజీ తిరగేసినా వెంటాడే వాక్యాలే అంటూ అక్కడక్కడా కొన్ని పాదాల్ని సభకు చదివి వినిపించారు.

తరువాత శ్రీమతి ఇంద్రాణి పాలపర్తి పుస్తక పరిచయం చేస్తూ రవిశంకర్ గారి కవిత్వంలో సరళత, తేలికపదాల్లో లోతైన భావాల్ని చెప్పడం, క్లుప్తత, తాత్త్వికత ముఖ్య లక్షణాలని అన్నారు. ఇందులో ఏ కవిత లోనైనా కవి నిజాయితీ కనిపించేలా ఉంటుందని ఈ పుస్తకంలో తమ్మినేని యదుకులభూషణ్ గారు రాసిన మాటల్ని సభకు పరిచయం చేసారు. రవిశంకర్ గారు ఇప్పటివరకు దాదాపు 130 కవితలు మాత్రమే రాసినా రాశి కన్నా వాసికి విలువనిచ్చే కవి అని కొనియాడుతూ ఈ సంపుటి నించి కొన్ని కవితల్ని పరిచయం చేసారు.

ఆ తరువాత కవి రవిశంకర్ గారు తమ ప్రతిస్పందనగా మాట్లాడుతూ కవిత్వం 'సర్వ కాలికంగా ఉండే ఒక అన్వేషణ' అన్నారు. ముఖ్యంగా తన కవిత్వంలో మనిషి జీవితంలో కాలానుగుణంగా వచ్చే మార్పుల్ని ఒడిసిపట్టుకోవడమే కాకుండా కాలాతీతంగా కలిగే సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించడం ప్రధానమని అన్నారు.

ఆ తర్వాత  జరిగిన  కవిసమ్మేళనంలో  శ్రీ విన్నకోట రవిశంకర్ "పాతపద్యం" కవితని, శ్రీమతి ఇంద్రాణి పాలపర్తి  'కాళీపదములు' కవితల్ని, డా||కె.గీత "నెమలీక జ్ఞాపకం" కవితని, శ్రీ శ్రీధర్ రెడ్డి "మధ్యలోనే" కవితని వినిపించగా, శ్రీ మారుతి తన్నీరు "నీలకంఠ రక్షకునకు" పాటని,  శ్రీమతి గునుపూడి అపర్ణ "శ్రీరామ జయరామ" అనే త్యాగరాజ కీర్తనని, డా||కె.గీత  కృష్ణశాస్త్రి గారి "పదములె చాలు" పాడి వినిపించి అందరినీ అలరించారు. స్థానిక సాహిత్యాభిలాషులు ఆసక్తిగా పాల్గొన్న ఈ సభ జయప్రదంగా ముగిసింది.

విజయవంతంగా జరిగిన వీక్షణం-116వ సమావేశాన్ని "వీక్షణం" యూట్యూబు ఛానలులో చూడవచ్చు.

Posted in May 2022, వీక్షణం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!