Menu Close
మన ఆరోగ్యం మన చేతిలో...
Our health in our hands...
- మధు బుడమగుంట

‘మన ఆరోగ్యం మన చేతిలో ...’ అనే నా ఈ శీర్షికను ఆదరిస్తున్న అందరికీ మనఃపూర్వక కృతజ్ఞతలు మరియు మరిన్ని సలహాలు, లోటుపాట్లను ఎత్తి చూపుతూ ప్రోత్సహించ మనవి. ఈ శీర్షికలో పొందుపరుస్తున్న నా ఆలోచనా తరంగాల సారాంశాలను మీరు అందుకొంటున్న విధానంలో ఏవైనా సందేహాలు కలిగితే దానికి వివరణ ఇచ్చేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఆ విధంగా నా భావావేశ వాస్తవ దృక్పథ విషయాలను విస్తృత పరిచి మరింతమందికి పంచుకునే అవకాశం కలుగుతుంది. భవిష్యత్తులో నా ఈ భావతరంగానికి శబ్దరూపం కలిగించే ప్రయత్నంలో ఉన్నాను. ఎంతవరకు కృతకృత్యుఁడనవుతానో ప్రయోగం చేస్తే గాని తెలియదు. ఎప్పటిలాగే మీ ఆశీస్సులను అందించ మనవి.

****

సృష్టిలో ఏ విధమైన శక్తినీ మనం సృష్టించలేమూ, నిర్మూలించలేము. అలాగే, అత్యంత ఉత్కృష్టమైన ఈ మానవ జన్మతో జన్మించడమూ, గతించడము మన చేతిలో లేదు. మధ్యలో ఉన్న జీవన విధాన ప్రక్రియకు సంబంధించిన సిద్ధాంతాలను మనమే రూపొందించుకొని వాటిని ఆచరిస్తూ ఆ ఆలోచనలతోనే అంతా మనచేతిలో ఉందనే భ్రమలో ఉన్నాము. మన జీవనశైలి నిర్మాణంలో అత్యంత కీలకపాత్ర పోషించిన అత్యంత చిన్న అవయం, మన తలలో ఉండే మెదడు. అన్ని ఆవిష్కరణలకూ, వినాశాలకూ ప్రధాన కారణం మన మెదడులో జనించే ఆలోచనలను పుట్టించే అతి పెద్ద కర్మాగారం.

శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పడు మనిషి అని నిర్వచిస్తాము. బయటకు వచ్చినప్పుడు తన శరీర ఆకృతి, అవయవాల అమరిక, పొందిక ఆధారంగా పేర్లను నిర్ణయించి పిలవడం మొదలుపెడతాము. ఆ శిశువు జన్మించిన కుటుంబ సభ్యులను ఆధారంగా చేసుకొని వారి కుల, మత, వర్ణ, వర్గ పరిధులను నిర్ణయించి తదనుగుణంగా వారిలో కూడా ఆ ఆలోచనల పరంపరను కొనసాగే విధంగా సమాజ స్థితిగతులను వివరించి వారికి ఒక అవగాహన ఏర్పడేటట్లు చేయడం జరుగుతుంది. ఇందుకు భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల ప్రభావం వలన ఏర్పడే శరీర రంగును కూడా పరిగణలోకి తీసుకొనడం జరుగుతుంది.

అయితే, మనిషిలోని ఆలోచనల ప్రవాహ వేగం వయసుతో పాటు మారుతూ వస్తుంది. శాస్త్రీయంగా వివరించాలంటే మెదడు ఎదుగుదల ఆధారంగా మన ఆలోచనలు, పరిజ్ఞానము, స్పందన వేగము తదితర అంశాలు ఉంటాయి. అది ఎలా అంటే మెదడు అంతా compartments లాగా ఉండి ఒక్కో భాగం ఒక్కో ప్రక్రియకు కేంద్ర స్థావరంగా ఉండి అన్ని compartments ఒకదానికొకటి neurons అనుసంధానంతో కలిసికట్టుగా పనిచేస్తుంటాయి. ఆరేళ్ళు వచ్చేటప్పటికి  - cells form అవుతాయి ఆ తరువాత neurons యొక్క bridging మొదలుతుంది. ఇరవై తొమ్మిది ఏళ్లకు అంతా ఏర్పడి మనిషి పరిపక్వం చెందడం జరుగుతుంది. ఆ తరువాత ఆ bridging, tuning మొదలై మనిషి సామాజిక ఎదుగుదలకు తోడ్పడతాయి. అరవై ఏళ్ల ఏళ్ల తరువాత అది నిదానగా తగ్గడం మొదలవుతుంది. అందుకనే retirement అనే పదాన్ని ఆపాదించి మనిషి మెదడు కు కొంచెం సేద తీరేందుకు అవకాశం కల్పిస్తాము. దాదాపు లక్ష మంది మనుషుల మెదళ్ల పై ప్రయోగాల విషయాల సేకరించి నిర్మించిన సిద్ధాంతం ఇది.

జీవితంలో ఎదుగుదలకు మన ముందు నానా విధములైన అవకాశములు ఉంటాయి. అందులోనుండి అత్యంత శ్రేష్టమైన అవకాశాన్ని అందుకోవాలనే తపన మనందరిలోనూ ఉంటుంది. అయితే ముందుగా అందుకు మనం సంసిద్ధంగా ఉన్నామా లేమా అనేది బేరీజు వేసుకోవాలి. మన సామార్ధ్యం, స్థితిగతులు, మేధాసంపత్తి...ఇలా ఎన్నో అంశాలను సమీకరించుకొని రంగంలోకి దిగాలి. అప్పుడే ఆ జీవన దారిలో మనకు ఎదుగుదలతో పాటు ఆనందకర ఆత్మసంతృప్తి కూడా సమకూరుతుంది. లేదంటే గాలికి కొట్టుకుపోయే ధూళి కణంగా మారి అనేక వత్తిడులకు లోనయ్యే పరిస్థితి మెండుగా ఉంటుంది. మనకు తగిన జీవనశైలిని ఎంచుకోవడంలోనే మన యొక్క సామర్ధ్యం కనపడుతుంది. ఆ సామర్ధ్యం ఆరేళ్ళు దాటిన ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. అయితే జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని నిలబడ్డ పెద్దవాళ్ళ అనుభవం, పరిజ్ఞానం ఇందుకు ఎంతగానో సహకరిస్తుంది. అందులో సందేహం లేదు. తల్లిదండ్రులు ఎందుకు తమ పిల్లల విషయంలో కొన్ని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని వారి పిల్లల భవిష్యత్తును మంచి దారిలో ఊహించుకుని తదనుగుణంగా వారిని ఎదిగేటట్లు చేస్తారు. ప్రతి ఒక్కరికీ ఇటువంటి దిశానిర్దేశం చేసే పెద్దవారు ఉండాలి వారి సూత్రాలను పాటించినపుడు మంచి జీవన మార్గాన్ని పొందగలము. కాకుంటే మారుతున్న సామాజిక, భౌగోళిక, వైజ్ఞానిక అంశాలను పెద్దవారు మరియు పిల్లలు కూడా పరిగణలోకి తీసుకుని అందుకు తగిన సామాజిక స్పృహ పొందగలగాలి. అప్పుడే పైన చెప్పిన ఆనందకర ఆత్మస్థైర్యం తద్వారా ఆత్మసంతృప్తి కలిగి మనిషి జన్మకు ఒక సార్థకత చేకూరుతుంది.

కాల గమనంతో పాటు మనుషులందరూ కరిగిపోవలసిందే, మట్టిలో కలిసిపోవాల్సిందే. మన ఉనికిని చూపిస్తున్న అతికొద్ది కాలవ్యవధిని ఎంత సవ్యంగా ఉపయోగించామనేది మాత్రమే మన చేతిలో ఉంటుంది. మన ఆలోచనల ప్రవాహం ఎంత పవిత్రంగా పారదర్శకంగా ఉంటే వాటిని ఉపయోగించి కలిగే ఫలితాల మీద మన ప్రభావం చూపించవచ్చు.

‘సర్వే జనః సుఖినోభవంతు’

Posted in May 2022, ఆరోగ్యం

1 Comment

  1. నరేంద్ర బాబు సింగూరు

    మీరు చెప్పింది అక్షర సత్యం ” మన ఆలోచనల తీరు మన మీద ప్రభావం చూపిస్తుంది”

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!