Menu Close
Sri Sivarchana
శ్రీశివార్చన
(బిల్వములతో శివునకు అర్చన)
కం.
చూచినఁ దాఁకిన గాలియె
వీచిన నరజన్మ కడుఁ బవిత్రమ్మగుఁగా
కాచు; నొసంగు నిరంతర
ప్రాచుర్యము శ్రీమహీజవరమె(1) వరముగా
............(1) శ్రీష్ఠమైన బిల్వవృక్షమె
కం.
తప మొనరించిన నీడను(1)
ఉపమానములేని శక్తి యుద్భవ మొందున్;
అపురూపదర్శనమ్మును
కృపతోఁ గలిగించు హరుడు (2) ప్రీతుం డగుచున్
............(1) బిల్వవృక్షచ్ఛాయలో
............(2) ఇది దత్తరాజస్తవములో చెప్పఁబడింది
మ.
ఒకపత్రంబిడి పూజ సేయ శివుఁడే యుప్పొంగి యిచ్చున్ శతా
ధికయజ్ఞాచరణంబుఁ గోటికరిరాడ్ధీదామణీ(1)దానమున్
సకలారాధనసత్ఫలంబులు త్రిజన్మప్రాప్తపాపౌఘనా
శక(2) మీ బిల్వదళంబు; దీనిఁ గొన హస్తం బెంతొ ధన్యం బగున్
............(1) ధీదామణి=కన్యామణి
............(2) మూడుజన్మలలో ప్రాప్తించిన పాపచయమును నశింపఁ
...................జేయునది
కం.
ఈరేడు (1)భువనములలో
మారేడుకు సాటి లేదు మాన్యతలోనన్
మా ఱేఁడు (2) నచ్చినదియె యు
మారామాస్వేదజనితమహిమాన్వితమౌ
............(1) పదునాలుగు
............(2) మా ప్రభువు (శివుఁడు)
............     మారేడు శివునకేకాదు లక్ష్మీనారాయణులకుకూడ ప్రీతిపాత్రమే
..................“బిల్వవృక్షనిలయాయైనమః” అని లక్ష్మీదేవికి,
..................“బిల్వపత్రార్చ్గనప్రియాయనమః” అని వేంకటేశ్వరునికి నామాలున్నాయి.
కం.
తుమ్మియు, రుద్రాక్షలు, భ
స్మమ్మును ధరియింపజేసి చక్కగ శివలిం
గమ్ము(1) నుమా(2)సహితముగా
నెమ్మది సేవింపఁ గలుగు నిత్యశుభమ్ముల్
............(1) శివుఁడు లింగస్వరూపుఁడు
............(2) పార్వతియే పానవట్టము
Posted in February 2020, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *