Menu Close

Science Page title

బుద్ధ నగరాలు

భారత దేశంలో 100 “బుద్ధ నగరాలు” (smart cities) నిర్మించాలనే పథకాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా. ఇంతకీ “బుద్ధ నగరాలు” అంటే ఏమిటి? వీటిని నిర్మించవలసిన అవసరం ఏమిటి? ఈ నిర్మాణానికి వెయ్యవలసిన పునాదులు ఏమిటి? ఈ రకం అంశాలని ఇక్కడ ప్రస్తావిస్తాను.

తెలుగులో “బుద్ధి” అనే మాటకి mind, intellect అనే అర్థాలతోపాటు intelligence, judgment, wisdom, discrimination వగైరా అర్థాలు కూడ ఉన్నాయి. “బుద్ధిశాలి” అంటే clever or smart person అనే అర్థం కూడ ఉంది. ఈ మాట నామవాచక రూపంలో “బుద్ధి” కనుక విశేషణం రూపంలో “బుద్ధ” అని ప్రయోగించవచ్చు. కనుక “బుద్ధ నగరం” అంటే “స్మార్ట్ సిటీ.”

బుద్ధ నగరం అంటే ఏమిటి? అంక సాంకేతికాలు (digital technologies) ఉపయోగించి పురజనులు పురపాలక విధులలో పాల్గొనడానికి వెసులుబాటు కల్పించడం. అంటే పురజనుల మంచిచెడ్డలు, క్షేమం, కుశలత దృష్టిలో పెట్టుకుని, డబ్బు, వనరులు పొదుపు చేస్తూ పాలన చెయ్యడానికి వెసులుబాటు కల్పించడం. ఈ సందర్భంలో సాంకేతిక పరిజ్ఞానం అవసరం కనుక ఇదే విషయాన్ని ఉదాహరణల రూపంలో ఇంకా వివరంగా చెబుతాను.

ఒక్క నగరాల నిర్మాణం లోనే కాదు, ఈ “బుద్ధి కుశలత” ని చాల చోట్ల ప్రవేశ పెట్టవచ్చు. ఉదాహరణకి: బుద్ధ భవనాలు, బుద్ధ కార్లు, బుద్ధ ఫోన్లు, బుద్ధ మీటర్లు. ఈ సందర్భంలో “బుద్ధ” అంటే “ఇంటెలిజెంట్, స్మార్ట్,” మాత్రమే కాకుండా ఆ “బుద్ధత్వం” ఆపాదించడానికి వాడే సాంకేతిక పరిజ్ఞానం అని కూడ అన్వయం చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యేక సందర్భంలో “బుద్ధ” అంటే “డిజిటల్, ఇంటర్‌నెట్” సాంకేతికాలు అనే విస్తృతార్థం ఇవ్వవచ్చు.

ఈ రోజుల్లో సాంకేతిక రంగంలో వెల్లివిరుస్తూన్న అంతర్జాల (Internet) సౌకర్యాలు, వార్తాప్రసార సాంకేతికాలు (communications technologies), మొదలైన వాటిని ఆసరాగా తీసుకుని “పట్టణాలని నడిపే” వ్యవస్థలో మౌలికమైన మార్పులని తీసుకురావాలనే కోరికే “బుద్ధ నగరాలు” అనే భావనకి పునాది అయింది. కంప్యూటర్ రంగంలో వ్యాపారం చేసే కంపెనీలకి ఇది మహదవకాశం. ఈ మహదవకాశాన్ని భారతీయ కంపెనీలే చొరవ తీసుకుని వినియోగపరచుకుంటే అవి ప్రపంచ స్థాయి కంపెనీలుగా ఎదిగే అవకాశం ఉంది.

పట్టణాలని “నడపడం” అంటే పురపాలక సంస్థలని నడపడం. పట్టణాలలో నివసించే పౌరుల సౌకర్యం కొరకు ప్రభుత్వం రంగం కాని, ఖానిగీ (private) రంగం కాని పౌరులకి అందించే సేవాకార్యక్రమాలే “నడపడం” అంటే. ఏమిటీ సేవలు? ఉదాహరణకి పురపాలక సంఘాలు పౌరులకి అందించే సపర్యలలో ముఖ్యమైనవి విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, ప్రయాణ, రవాణా సౌకర్యాలు, మురుగు పారుదల, చెత్తని తుడిచి వీధులని శుభ్రంగా ఉంచడం, ఆరోగ్య, వైద్య సౌకర్యాలు అమర్చడం, వగైరాలు. ఇవి కాకుండా పన్నులు వసూలు చెయ్యడం, ఇళ్లు కట్టుకుందుకి అనుమతి పత్రాలు ఇవ్వడం, వ్యాపారస్తులకి కావలసిన వెసులుబాట్లు కల్పించడం, మొదలైన పనులు ఎన్నో ఉంటాయి కదా. వీటన్నిటినీ సజావుగా నడిపే యంత్రాంగం ఉంటుంది కదా. ఈ యంత్రాంగాన్ని పౌరులందరినీ సమ దృష్టితో చూస్తూ, లంచాలు, తినుబడులు లేకుండా, నడపడం.

ఈ పనులన్నీ – లంచాలు తింటూ – ఇప్పుడూ చేస్తున్నాము కదా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వానికి, పురజనులకి మధ్య ఉన్న బంధం “ఇచ్చిపుచ్చుకోలు” (transactional) బంధం. ప్రజలు ఉత్తరాలు, దక్షిణలు ఇస్తున్నారు, ఉద్యోగులు పుచ్చుకుంటున్నారు, పనులు జరుగుతున్నాయి. ఈ ఉత్తర-దక్షిణ బంధం “వాటాదారు” (partnership) బంధంగా మారాలి. అటువంటి సందర్భంలో “హుద్‌హుద్” లాంటి తుపాను వస్తే – లేదా మరొక ప్రాణాపాయమైన సంకటం సంభవిస్తే – ప్రజలు, ప్రభుత్వం కలసి ఆ సమస్యని ఎదుర్కోడానికి కావలసిన హంగులు, వసతులు నగరంలో ఎల్లప్పుడు సర్వసిద్ధంగా ఉండాలి. అదీ బుద్ధ నగరం అంటే!

ఈ బృహత్ ప్రణాళిక అందరికీ అర్థం అయే రీతిలో చెప్పడానికి, ముందస్తుగా కొన్ని చిన్న ఉదాహరణలు ఇస్తాను. “సిటీ బస్సు” ఎప్పుడొస్తుందో, ఎంత ఆలస్యంగా నడుస్తోందో, అది వచ్చే వేళ తెలియక బస్సు ఆగే స్థలాలలో పడిగాపులు పడడం, వంటి అనుభవాల కోసం ఎంతమంది ఎదురు చూస్తారు? బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉందో, ఫలానా ప్రదేశానికి ఎంతసేపట్లో వస్తుందో, ఆ బస్సులో ఖాళీ ఉందో, లేదో అన్న విషయాలు వీధి పక్కన ఉన్న ప్రతి “బస్సు స్టేండు” దగ్గర ప్రకటన చెయ్యగలిగే సాంకేతిక స్థోమత ఉంటే ఎంత సదుపాయంగా ఉంటుందో ఆలోచించండి. అదే విధంగా బస్సులో కూర్చున్న వారికి ఎదట “ఆగే స్థలం” (bus stop) పేరు ఏమిటో బస్సులోనే ప్రకటించగలిగే సదుపాయం ఉంటే కొత్తవారికి ఎంత సదుపాయంగా ఉంటుంది? ఈ రకం సదుపాయం పాశ్చాత్య నగరాలలోని బస్సులలోను, రైళ్లల్లోనూ ఉంది. కలన యంత్రాలు, వార్తాప్రసారక మాధ్యమాలు ముమ్మరంగా ఉన్న ఈ రోజుల్లో ఈ రకం సదుపాయాలు కల్పించడం కష్టం కాదు.

మరొక ఉదాహరణ. గత వేసంగిలో (జూన్ 2014) భువనేశ్వర్ నుండి విశాఖపట్టణం వెళుతూన్న సందర్భంలో మావాడు అరచేతిలో పట్టే కలనయంత్రాన్ని చూసి రైలు ఎప్పుడు, ఎక్కడ ఉందో, స్టేషన్ కి ఎప్పుడు వస్తుందో నాకు నిమిషనిమిషం చెబుతూనే ఉన్నాడు. అంటే, ఈ రకం అవస్థాపన సౌకర్యాలు (infrastructure facilities) మన దేశంలో కూడ వస్తున్నాయి. మరొక ఉదాహరణ. ఒక బంగీని ఒక ఊరు నుండి మరొక ఊరికి పంపినప్పుడు ఆ బంగీ ఎప్పుడు, ఎక్కడ ఉందో, అది ఎప్పుడు మన ఇంటి గుమ్మం ముందు వాలుతుందో చెప్పగలిగే స్థోమత కూడ మనకి మన దేశంలో ఉంది. అందరికీ అందుబాటులో లేకపోవచ్చు కాని, ఉండడం ఉంది.

ఇంకొక ఉదాహరణ. “బుద్ధ దూరవాణి” (“స్మార్ట్ ఫోన్”) సంగతే చూద్దాం. మామూలు (అంటే, బుద్ధి లేని) “సెల్ ఫోనులు” వాడుకలోకి వచ్చేక వాటిని వాడని వారు అరుదు. చాకలి, మంగలి, పాల మనిషి, పని మనిషి, ఇలా సర్వులూ ఈ రోజుల్లో సెల్ ఫోనులు వాడుతున్నారు కదా. నాసి రకం, చవక రకం (బుద్ధి లేని) ఫోనులు అయితే మరొకరితో మాట్లాడడానికే పరిమితం. కాని వాటిల్లో కాసింత “బుద్ధి” ని జొప్పిస్తే అదే పనిముట్టుతో మరెన్నో పనులు చేసుకుని ప్రయాస తగ్గించుకోవచ్చు, అనుకోని దిశలనుండి లబ్ది పొందవచ్చు. ఉదాహరణకి సెల్ ఫోనుని అంతర్జాలానికి తగిలించేమంటే అంతర్జాలంలో లభ్యం అయే సమాచారం అంతా అరచేతిలోకి వస్తుంది. ఇప్పుడు ఈ పరికరాన్ని రైతు చేతిలో పెడితే వానలు ఎప్పుడు పడతాయో, తుఫానులు ఎప్పుడు వస్తున్నాయో తెలుసుకుని నారుమడులు ఎప్పుడు పోయాలో, కోతలు ఎప్పుడు కొయ్యాలో, వగైరా నిర్ణయాలు ముందుచూపుతో చేసుకోవచ్చు. “గాలిలో దీపం పెట్టి అంతా నీదే భారం” అని నిస్పృహ పడనక్కర లేదు.

“జి.పి.ఎస్” (GPS) సౌకర్యం వచ్చిన తరువాత సెల్ ఫోనుల శక్తి ఇంకా పెరిగిపోయింది. ఈ రోజుల్లో మనం ఎక్కడున్నామో మనకి తెలియకపోయినా మన సెల్ ఫోను పసికట్టకలదు. ఇప్పుడు నేను మన రాష్ట్రం దాటి బయటకి వెళితే భాష అర్థం కాదు. ఇంగ్లీషు అందరికీ రాదు. కాని అందరి దగ్గరా సెల్ ఫోను ఉంటోంది. నేను అహమ్మదాబాద్‌లో విమానం దిగి నా సెల్‌ఫోనులో తెలుగులో మాట్లాడితే అది నా మాటని గుజరాతీలోకి తర్జుమా చేస్తే ఎంత సదుపాయంగా ఉంటుంది! నేను లక్నోలో దిగితే అదే ఫోను హిందీలోకి తర్జుమా చెయ్యాలి. ఈ రకం పరిచర్యలు అన్నీ అందుబాటులో ఉండాలంటే ఆ నగరంలో అంతర్జాలం 24 గంటలూ అందుబాటులో ఉండాలి. విద్యుత్ సరఫరా ప్రతిరోజూ, 24 గంటలూ ఆగిపోకుండా ఉండాలి. బుద్ధ నగరాలు అని కోలాహలం చేస్తే సరిపోదు. ఈ కనీస అవసరాలు ముందు సమకూర్చాలి.

మౌలికమైన సౌకర్యాలు సమకూరిన తరువాత బుద్ధ నగరాలని ఎవరి అవసరాలకి తగినట్టు వారు తీర్చిదిద్దుకోవచ్చు. ఉదాహరణకి ఈ రకం సాంకేతిక పరిజ్ఞానంతో వీధులలో కార్ల రద్దీని అదుపులో పెట్టవచ్చు. కార్లని నిలిపే స్థలాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయో చోదకులకి తెలియపరచవచ్చు. జనసంచారం లేని చోట్ల విద్యుత్ దీపాలని ఆర్పి ఆదా చెయ్యవచ్చు. మారుతూన్న వాతావరణ పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని ఏయే మొక్కలకి ఎప్పుడు నీళ్లు పొయ్యాలో నిర్ణయించి నీటి ఖర్చు తగ్గించుకోవచ్చు.

ఈ సదుపాయాలు ఉన్న నగరం ఎలా ఉంటుంది? మూడొంతులు ఈ నాటి సింగపూర్‌లా ఉంటుంది. అంతా సింగపూర్‌లా ఉంటే మనకి నచ్చకపోవచ్చు. సింగపూర్‌లో ప్రభుత్వం వారి ఆధిపత్యం, నియంత్రణ, పర్యవేక్షణ అడుగడుగునా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి పౌరుడి చర్యలని ప్రభుత్వం ఒక కంటితో చూస్తూనే ఉంటుంది. స్వేచ్ఛకి అలవాటు పడ్డ ప్రాణాలకి ఇన్ని కట్టుబాట్లు ఉంటే బతకడం కష్టం. కాని అలా ఉండవలసిన అవసరం లేదు. అదే అంక సాంకేతికం (digital technology) లో ఉన్న సౌకర్యం. మన వైయక్తిక స్వతంత్రాలకి తిలోదకాలు ఇవ్వనక్కర లేకుండా ప్రభుత్వం యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడపడానికి అవకాశాలు ఉన్నాయి.

సానుభూతితో ప్రజలు ప్రభుత్వంతో సహకరించకపోయినా, ప్రభుత్వోద్యోగులు “మేము లంచాలు తినకుండా పని చెయ్యలేము” అని భీష్మించుకుని కూర్చున్నా ఎన్ని బుద్ధ నగరాలు నిర్మించినా ప్రయోజనం ఉండదు. సాంకేతిక విద్య ప్రజలలో మార్పుని తీసుకుని రాలేదు, అది మన బుర్రలో పుట్టాలి!

Posted in February 2020, Science

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!