Menu Close
balyam_main

సామెతలతో చక్కని కధలు

- ఆదూరి హైమావతి

ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు

వ్యాపార రహస్యం

కమలాపురంలో కామేశం ఒక వ్యాపారి. అంచెలంచెలుగ ఎదిగి తండ్రికాలం నాటి చిన్న కొట్టును ఊరికంతా పెద్ద షాపుగా పెంచాడు. 'సత్య కామేశ సరుకుల కొట్టు' అని అంగడి పేరు పెద్దక్షరాలతో బోర్డు వ్రాయించి పెట్టాడు. దాని మీద సత్యనారాయణ స్వామి ఫోటో కూడా వేయించాడు. మాటల చాకచక్యంతో అందరినీ ఆకట్టుకుంటూ, వ్యాపారం పెంచుకుంటూ, బాగా ధనం సంపాదించసాగాడు.

అతడు షాపులో ఉన్నంత సేపూ పనివారిని ఎవ్వరినీ ఊపిరి తిప్పుకోనిచ్చేవాడే కాదు. ఏదో ఒక పని చెప్తూ ఉండేవాడు. నలుగురు పనివాళ్ళున్నా తాను మాత్రమే వస్తువుల తూకం వద్దా, గల్లా పెట్టె వద్దా ఉండేవాడు. చదివింది తక్కువేకానీ బుధ్ధి మహాచురుకు. సరుకులు కొనను వచ్చినవారిని బట్టి, పనివాళ్ళకు కొన్ని చిట్కాలు చెప్పేవాడు. తనకు సరుకులు, వస్తువులు అందించను ఒకే ఒక్క పనివాడిని నియమించుకున్నాడు. ఎవరైనా సరుకుల మేలురకం గురించీ అడిగితే "బయటి పేరు చూడండి, బయటున్న బొమ్మచూడండి. అంతా పేరులాగానే ఉంటాయి బాబయ్యా!" అనేవాడు.

ఒకమారు ఆ ఊరి ఉపాధ్యాయుడు ఉమేశం సరుకుల కోసం వచ్చాడు. ఉమేశం బాగా తెలివైనవాడు. ఇంట్లో శుభ కార్యం ఉన్నందున చాలా వస్తువులు కొనుగోలుచేయాలని, ఒక పట్టిక వ్రాసుకుని వచ్చాడు.

ఆ పట్టిక చూసి కామేశం "ఓరే పెద్దోడా! వచ్చి ఈ పట్టీ తీసుకెళ్ళి దీనిప్రకారం వస్తువులన్నీ జాగ్రత్తగా కట్టుకురా! మంచి మేలైన సరుకు కట్టు, పెద్దోరు అయ్యగారు, జాగ్రత్త!" అని హెచ్చరించి పట్టీ ఇచ్చిపంపాడు.

ఏవేవో లోకాభిరామాయణం మాట్లాడుతూ కూర్చున్నాడు.

ఉమేశం "ఏం కామేశం గారూ! వ్యాపారం ఎలాసాగుతున్నది?" అని అడిగిందానికి "ఏదో సారూ! సాగుతున్నది, వ్యాపరమైనా వ్యవహారమైనా న్యాయంగా ధర్మంగా ఉంటేనే, సాగుద్ది, అరుగుద్ది, అందుకే నాకు లాభాలు అంతంత మాత్రమే! ఐతేనేం, ఎన్నడూ న్యాయం తప్పను. వచ్చింది చాలు అనుకుంటాను. బయటి బోర్డు చూశారుగా అంతా సత్యమే బాబూ!" అంటూ ఏదేదో చెప్పసాగాడు.

పట్టీ తీసుకువెళ్ళిన పెద్దోడు ఒక తట్టలో సరుకులు పెట్టి తీసుకువచ్చాడు. లోపలే అన్నీ తూకమేసి పొట్లాలుకట్టి తెచ్చేలాగా ఏర్పాటు చేశాడు కామేశం. ఆపెద్దోడు సరుకుల తట్ట తెచ్చి టేబులు మీద పెట్టగానే కామేశం, వరుస గా ఒక్కోపొట్లాం తీసి, తనదగ్గరున్నతక్కెడలో ఉంచి ఉమేశానికి తూకం చూసుకోమని చూపుతూ పట్టిక అతడికి ఇచ్చి టిక్ చేసుకోమంటూ తాను టేబులు మీద వేరే కాయితంలో వెలలు తూకమూ వేయసాగాడు. పట్టీ పూర్తి అయ్యాక కూడిక వేస్తున్న సమయంలో మరొక రైతువచ్చాడు. బియ్యం, పప్పూ, నూనే లాంటి వస్తువులు కొన్ని కావాలని.

కామేశం "ఒరే చిన్నోడా! ఈ రైతన్నకు కావాల్సిన సరుకులన్నీ తెచ్చీయరా! కూర్చోన్నా!" అంటూ మర్యాద చేశాడు. ఇందాక వచ్చిన పనివాడేవచ్చి ఏమేమి కావాలో రైతును అడిగి వెళ్ళి సరుకులు కట్టుకునివచ్చి ఇచ్చాడు. అవన్నీ తిరిగి తూకం చూపకుండానే రైతుకు ఇచ్చి సొమ్ము తీసుకుని పంపేశాడు.

ఉమేశానికి పెద్ద అనుమానం వచ్చింది. ఐనా పట్టీ లోని వస్తువుల లెక్క చూసుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో ఒక వృధ్ధ మహిళ "అయ్యా! అర్జంటుగా ఐదు కిలోల బియ్యం ఇప్పించండి" అంటూ వచ్చింది.

కామేశం "ఒరే చిన్నోడా ఐదుకిలోల బియ్యం పట్టుకురారా! అర్జంటు" అని కేకేశాడు. ఇందాకటి పనివాడే పదికిలోల బియ్యం ఒక గుడ్డ సంచీలో తెచ్చి ఆమెకిచ్చాడు. కామేశం సొమ్ముతీసుకుని ఆమెను పంపాడు.

ఒక ఉద్యోగి వచ్చి "కామేశంగారూ! కందిపప్పు నాలుగు కిలోలు ఈ సంచీలో పోయించండి, అమితర్జంటు" అని కేకేయగానే, కామేశం "ఒరే పెద్దోడా! అర్జంటుగా నాలుక్కిలోల మేలురకం కందిపప్పు తూకమేసుకురా" అని అరిచాడు. ఇందాకటి పనివాడే ఒక బుట్టలో కందిపప్పు తెచ్చి తక్కెట్లో పెట్టగా "తూకం చూసుకో అన్నా!" అని అరిచి కందిపప్పు అతడి సంచీలోకి పోసి సొమ్ముతీసుకున్నాడు.

అంతా గమనిస్తున్న ఉమేశం "కామేశం గారూ! నాదొక అనుమానం, ఏమీ అనుకోకండి. ఒకే పనివాడిని మీరు ఒకమారు చిన్నోడా అనీ, ఒకమారు పెద్దోడా అనీ పిలిచారెందుకూ? ఒకే వ్యక్తి పెద్దోడా అన్నా, చిన్నోడా అన్నా వచ్చాడు." అని అడిగాడు.

దానికి కామేశం "అయ్యా! మీలాంటి తెలివైనోళ్ళకి ఎక్కువ సరుకులు కావాల్సినపుడు పెద్దోడ్ని పిలుస్తాను. తక్కువ సరుకులు కావాల్సిన వాళ్ళకు చిన్నోడా అని పిలుస్తాను. అంతే" అన్నాడు.

ఐనా ఉమేశానికి అది యదార్ధం కాదనే అనుమానం వచ్చింది. "నిజం చెప్పండి కామేశం గారూ! నాకేదో అనుమానంగా ఉంది, మీ వ్యాపార రహస్యం ఎవ్వరికీ చెప్పనుగాక చెప్పను" అన్నమీదట, "అయ్యా! ఉమేశంగారూ! చిన్నోడా అని పిలిస్తే తూకం కాస్త తక్కువగా ఉన్న రాళ్లతో తూచి తెస్తాడు. పెద్దోడా అని పిలిస్తే తూకం సరిగ్గా ఉన్న రాళ్ళతో తూచి తెస్తాడు. ఇది వ్యాపార రహస్యంబాబూ! బయటేయకండి" అన్నాడు. ఉమేశానికి అతడి వ్యాపార రహస్యం అర్ధమైంది.

కాస్తంత బాగా చదువుకున్నవారూ ఎప్పుడూ తన దగ్గరే కొనేవారూ వస్తే ఒకలాగా, అమాయకులూ అప్పుడప్పుడూ వచ్చే వారికోసం ఒకలాగా వ్యాపారం చేసేవాడు. అది ఎవ్వరికీ అంతుపట్టని నిజం.

"ఉమేశం గారూ బయట బోర్డూ, చిత్రమూ సత్యమైనవి. మీరుచేసే వ్యాపారం మాత్రం సత్యవిరుధ్ధం. అందుకే అన్నారండీ ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు. అని మీ వ్యాపారం అలా ఉంది. వస్తా"అని సొమ్ము చెల్లించి బైక్ మీద ఇంటికి బయల్దేరాడు.

Posted in February 2020, బాల్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!