Menu Close
Goda-Katha-title

గోడ గొడవ రెండు పార్టీలమధ్య మరో గోడ దించేసింది. మంచిదయ్యింది ఎయిర్ పోర్ట్ కు ముందే రావడం. చికాగో ఒహేర్ విమానాశ్రయం, అందులోను టెర్మినల్ 2 మరీ మనుష్యులతో కిక్కిరిసి పోయి ఉంటుంది. TSA పని వారికి, జీతాలు అందకపోవడంతో, కొందరు పనికి రాకపోవడంతో, సెక్యూరిటీ కని వేచి ఉన్న జనాల లైను రెండింతలు పెరిగి అందరికి ఓ ఉద్రిక్త వాతావరణం పంచేసింది. యునైటెడ్ లో తరచూ ప్రయాణం చేస్తుండడం వల్ల, నాకు గ్లోబల్ ఎంట్రీ పాస్ ఉండడం వల్ల, పక్కన్నే TSA ప్రీ-చెక్ లైన్లో నిలబడ్డా, మామూలుగా 10 నిమిషాలలో అవ్వాల్సిన చెక్, అరగంట పైనే పట్టింది. గేటుకు పోతూ, స్టార్ బక్స్ లో ఓ కాఫీ, ఓ మఫిన్ కేకు కొనుకున్నా. అవి తిని తాగి ఫ్లయిట్ ఫస్ట్ క్లాసులో నే కూలబడ్డ. రన్వే మీదెళ్లడానికి మరో అరగంట పట్టింది. నేను ప్రయాణం చేస్తున్న విమానం ముందో ఓ పది విమానాలు సైనికుల లాగ నిలబడడం చూశాను. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కూడా తక్కువయ్యారేమో. ప్లేన్ టేకాఫ్ అయ్యి, ప్రయాణానికి సర్దుకున్న తరువాత, నా ఆలోచనలు బాహ్య ప్రపంచలోనుంచి నిష్క్రమించి, అంతర్ముఖం పట్టాయి.

విశ్వం ను కలిసి వెంటనే ఈరోజే తిరిగి వచ్చేయాలి. నేనూ బిజీనే - బహుశ విశ్వం తప్పితే మరెవరి కోసం నేను ఈ ప్రయాణం చేసి ఉండేవాణ్ణి, కాదేమో. విశ్వం కోసం ఇండియానుంచి తెప్పించిన ప్యాకెట్ గుర్తుకొచ్చింది. ఇంతకూ విశ్వం నన్ను ఇప్పుడు పిలిపించడానికి కారణం ఆ ప్యాకెట్టా లేక నాకు ఏదో చెప్పాలని ఉద్దేశ్యమా?

విశ్వం నా గురువు, మెంటర్. నేను ఎంబీఏ చేస్తుండగా, కాంపస్ ఇంటర్వ్యూలు చాలానే జరిగాయి. పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడి మా కాలేజీకి రావడానికి కారణం, మా కాలేజీకి ఉన్న పేరు - హార్వర్డ్ . అన్ని కంపెనీలలో, నా గురి అంతా ఓ కన్సల్టింగ్ కంపెనీ మీదే ఉండడానికి కారణం విశ్వం. తను 40 ఏండ్ల కల్లా ప్రపంచంలోనే నెంబర్ 1 కన్సల్టింగ్ కంపెనీ అధినేత కావడం ఆశ్చర్యమే. అతని గురించి, ఆయన కన్సల్టింగ్ ప్రపంచంలో తెచ్చిన మార్పుల గురించి తరచూ ఏదో ఒక  పేరున్న మ్యాగజైన్ లో ఆర్టికల్స్ రావడం, నేను చదవడం జరిగింది. తాను కూడా నాలాగానే ఇండియా లో IIT తరువాత, ఇక్కడికి వచ్చి MIT లో MS, హార్వర్డులో MBA చేయడం కూడా మరో కారణం కావచ్చు. కంపెనీలో చేరడం అయితే జరిగింది కానీ, విశ్వం కు నాకు చాలా దూరం ఉందని పనిలో చేరిన మొదటి రోజే తెలిసిపోయింది.

ఆ సంవత్సరమే మెంటర్ ప్రోగ్రామ్ మొదలెట్టారు. కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరూ, ఎవరినైనా మెంటర్ గా ఎన్నుకొని, ఆ మెంటర్ ఒప్పుకుంటే, పని మెళకువలు, అవీ నేర్చుకోవచ్చు. అలా మెంటర్ తో పనిచేయడం, ప్రమోషన్లు తొందరగా రావడానికి ఉపయోగ పడతాయి అని కూడా విని ఉండడం వల్ల వెంటనే సరైన మెంటర్ కోసం వెదక సాగాను. మెంటర్ లేకుండా పని చేస్తే, ఏమి అనరు. ఉద్యోగం లోనుంచి తీసేయరు. కానీ, నాకు, నా ఉద్యోగం పై గొప్ప కోరికలు, యాంబిషన్లు ఉన్నాయి. విశ్వం లాగ నా కెరీర్ కూడా ఎందుకు మలుపులు తీసుకోకూడదు. అలా తీసుకొని, నేను పిన్న వయస్సులోనే ఓ మల్టి నేషనల్ కంపెనీకి అధినేత ఎందుకు కాకూడదు. అలా ఆలోచనలు రావడంతో, పోయేదేముంది, కొడితే ఏనుగు కుంభస్థలంనే కొట్టాలి అని విశ్వం కు, నా మెంటర్ గా సహాయపడండి అని నా కెరీర్ ప్రొఫైల్ తో బాటు ఆహ్వానం పంపించాను. విశ్వం తెగ బిజీ. ఆయన క్యాలెండర్ చూసుకోవడo, ఓ సెక్రటరీ ఫుల్ టైం పని. అందుకోసమే విశ్వం నా మెంటర్ అవుతాడని పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఆశ్చర్యం, ఓ వారం రోజుల తరువాత, విశ్వం నా ఆహ్వానం చూడడం, నన్ను తనతో కలవమని చెప్పడం జరిగిపోయింది.

విశ్వం తో వెంటనే కనెక్ట్ అయిపోయాను. విశ్వం కూడా ఆప్యాయంగా నన్ను తన మనిషిగా చూసేవాడు. దానికి, విశ్వం నాలో 20 సంవత్సరాల ముందు తనని చూసుకోవడం ఓ కారణం కావచ్చు. ఆ విషయం విశ్వం కొంత పరిచయం పెరిగాక చెప్పాడు. విశ్వం నాకు వచ్చిన ప్రశ్నలకు సమాధానాలూ చెప్పే విధానం, తనకు తెలిసిన మెళుకువలు పంచుకోవడం కూడా తెగ నచ్చింది. చెప్పిన విషయం చాలా రోజులు గుర్తుండిపోయేటట్లు కథలు కథలుగా తన అనుభవాలని పేర్లు మార్చి చెప్పేవాడు. హార్వర్డ్ బిజినెస్ కేసుల ప్రభావం అనుకుంటా. జరిగిన అనుభవాలను ఉన్నది ఉన్నట్లు చెప్పడం, కొన్ని సమస్యలు వర్ణించడం, వాటిని పరిష్కరించడానికి చర్చలు చేయడం. విశ్వం మంచి గురువు, మెంటర్. తనతో మాట్లాడం వల్ల, ఎలా సమస్యలను చూడాలో, ఎలా వాటిని పరిష్కరించడానికి ఆలోచించాలో, ఎలా కొన్ని సంశయాలు పరిష్కరించనవసరం లేదో.. అన్ని తొందరలోనే పట్టేయగలిగాను. మెంటర్ ప్రోగ్రాం ఓ సంవత్సరమే. ఆ తరువాత విశ్వం మరో కంపెనీకి మారడం, కొన్ని రోజులు గవర్నమెంట్ కు పనిచేయయడంతో ఫోన్ ఈమెయిలు ద్వారానే మాట్లాడుతూ ఉండడం జరిగింది. మాట్లాడిన ప్రతీసారి విశ్వం నా కెరీర్ గురించి ప్రశ్నలు వేసి, తనకు తోచిన సలహాలు ఇచ్చేవాడు. అవి నా ప్రగతికి బాగా దోహదపడ్డాయి కూడా. కొన్ని సార్లు విశ్వంను, ఆయనున్న ఊళ్ళో పనికి వెళ్ళినప్పుడు కలిసాను. అప్పాయింట్మెంట్, ఆయన పనిచేసే బిల్డింగులలో సెక్యూరిటీ చెక్ లు...బయట వాళ్లకు ఆయన్ని కలవడం అంత సులభం కాదు. బాగానే సమయం తీసుకుంటుంది. ఇప్పుడు కూడా అంతే కదా. ముందే కలవటానికి, పర్మిషన్, అప్పాయింట్మెంట్ తీసుకొని బయలు దేరా.

రెండు గంటల తరువాత విమానం దిగింది. విమాన ప్రయాణాలు రొటీన్ కి అలవాటు పడ్డ కాళ్ళు నేరుగా కార్ రెంటల్ వైపు అడుగులు వేయసాగాయి. నా పేరు చూసి, మీరు క్లబ్ మెంబెర్ కదా..అటు పార్కింగ్ లో ఏ కార్ అయినా తీసుకోండి. కార్ కీస్ కూడా కారులోనే ఉన్నాయి అని చెప్పి, నవ్వి అప్పగింతలు తీసుకున్నాడు. పార్కింగ్ లోనే రక రకాల కార్లు ఉన్నాయి. ఈ వాతావరణానికి 4 వీల్ డ్రైవ్ మంచిదని, SUV తలుపు తీసి చేతిలో ఉన్న చిన్న సంచి పాసెంజర్ సీట్ మీద వేసి డ్రైవర్ కంట్రోల్స్ అన్నీ ఒకసారి చూసుకొని కార్ స్టార్ట్ చేశాను. GPS లో అడ్రస్ నా ఫోన్లో నుంచి సింక్ అయ్యి, ఓ గంట ప్రయాణం అని చెప్తోంది. విశ్వం ఉన్న చోటు ఊరికి దూరంగానే ఓ పెద్ద కాంప్లెక్స్ లో ఉంది.

కారు పార్క్ చేసి బిల్డింగ్ లోకి విశ్వం ను వెదుక్కుంటూ వెళ్లాను. పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదు. సెక్యూరిటీ లైన్ లో పోవాలసిందే. నేను తీసుకున్న అప్పాయింట్మెంట్  కంప్యూటర్లలో చూసి నా బాగ్ చెక్ చేశారు. విశ్వం కోసం నేను తెచ్చిన పాకెట్ కూడా తీసుకొని, తరువాత అందచేస్తామని, నన్ను మాత్రం తీసుకెళ్లి విశ్వం దగ్గర వదిలారు.

నన్ను చూస్తూనే విశ్వం ఆనందంగా నవ్వాడు, "రా మోహన్ నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి"

"అవును విశ్వం గారు, మళ్ళీ ఇన్ని రోజుల తరువాత మిమ్మల్ని చూడడం, నాకూ చాలా సంతోషంగా ఉంది" అన్నాను.

విశ్వంలో బాగా మార్పులు వచ్చాయి. ఎప్పుడూ కస్టం ఫిట్ సూట్ లో ఉండే వాడు. డిజైనర్ షూస్ ఉండేవి. అవేవి లేకున్నా ముఖంలో ఏదో ప్రశాంతత ఉంది. వెంట్రుకలు బాగా నెరిసిపోయాయి. డై వేస్తున్నట్లు లేదు. గడ్డం మీసాలు షేవ్ చేయడం వల్ల, ముఖం ఇంకా ముందు లాగే మెరిసిపోతున్నది.

ఇంతకూ విశ్వం పిలిపించింది, ఏదైనా చెప్పాలనా లేక నన్ను తెమ్మన్న ప్యాకెట్ కోసమా? తొందరలోనే తెలిసి పోతుంది.

విశ్వం నా కుటుంబం గురించి, అటు తరువాత  కెరీర్ గురించి ప్రశ్నలు వేసి, బాగుందని తానూ ఆనంద పడ్డాడు. నా మెంటర్ గా నా ప్రగతిలో తనకీ ఓ పాత్ర ఉందన్న విషయం వల్ల  కావచ్చు. అది నిజం కూడా. సమయాభావం గుర్తొచ్చినట్లుంది విశ్వం కు.

"మోహన్, నీవు వచ్చింది చాలా సంతోషం, నీకు పెద్ద సమయం లేదు అని తెలుసు. నీవు వెంటనే తిరిగి  వెళ్లాలనుకుంటాను. నాకూ సమయం లేదు. ఈ మధ్య ఆలోచనలలో మనమిద్దరం, నీ మెంటర్షిప్ ప్రోగ్రాం మీద పని చేయడం గుర్తొచ్చింది. అన్ని విషయాలు చెప్పాను, కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఓ పాఠం నీకు చెప్పడం మరిచాను, అన్న విషయం నన్ను తొలిచేస్తున్నది. అదీ నాకు ఈ మధ్యే తోచింది. నీతో పంచుకోవాలి అనిపించింది. అందుకే నిన్ను రమ్మని కబురంపాను,"

విశ్వం ఏదో చెప్పాలనే పిలిపించాడు. అదే ఈ మెంటర్ షిప్ ప్రోగ్రాం నాకు బాగా నచ్చడానికి కారణం. ఈ కార్పొరేట్ ఎలుకల పరుగులలో, మనసు విప్పి, మన శ్రేయస్సు కోరుతూ, మనకోసం సమయం కేటాయించి మనతో ఆ సమయం గడిపే వారే చాలా తక్కువ. అందు కోసమే, విశ్వం లాంటి వారు దొరికారు అంటే అదో గొప్ప వరం. అలాంటి వారిని వదిలి పెట్టగూడదు.

"తప్పకుండా విశ్వం గారు. మీరు సలహాలు, కిటుకులు చెప్పటం, నేను వినకపోవడమా? కాని పని. మీ వల్లే నేను ఈ రోజు, ఈ స్థానంలో ఉన్నాను, ఉద్యోగరీత్యా, సంఘంలోనూ ఓ మాత్రం పేరు సంపాదించుకోగలిగాను. చెప్పండి. ఐ ఆమ్ అల్ ఇయర్స్", అన్నాను నేను.

"మానవావసరాల పైన మాస్లౌ రాసిన హైరార్కీ గురించి వినే ఉంటావు కదా. మనిషికి మొదట భౌతిక, రక్షణ అవసరాలు తీరడం అతి ముఖ్యం. అవి తీరిన తరువాతే, సంఘంలో గుర్తింపు లాంటి సాంఘిక అవసరాల పై దృష్టి మరలిస్తాడు. అటు తరువాత స్వాభిమానం. పెద్ద ఉద్యోగం, కావలసినంత డబ్బు, ఆస్తి, పేరు, సంపాదించావు. నువ్వుకూడా ఈ స్టేజిలోనే ఉన్నావు. దానికి పైనున్న సెల్ఫ్ ఆక్చువలై జేషన్ మాత్రం అందుకోకపోవడానికి కారణం తెలుసా?", అని అడిగాడు విశ్వం.

"ఏదైనా బారియర్, గోడా, మీ ఉద్దేశ్యంలో ఉందా విశ్వం గారు?", అని అడిగాను నేను.

"నీ అభిప్రాయం అడుగుతున్నాను. నా ఉద్దేశ్యం కాదు. పోనీలే మరో విధంగా అడుగుతా ఈ ప్రశ్న? వర్ణాశ్రమాలు నాలుగు కదా. బ్రహ్మచర్య, యవ్వన, గృహస్థ ఆశ్రమాలు అంచెలంచెలు ఏ మాత్రం ఆటవిడుపు లేకుండా దాటినా వారు, సన్యాశ్రమ రాగానే అడుగు పెట్టడానికి జంకు తారెందుకు?", మళ్ళీ అడిగాడు విశ్వం.

"అలాగ అందరూ సన్యాశ్రమం స్వీకరించాలని ఆశించడం, సరి కాదేమో", అన్నాను నేను.

విశ్వం చెప్పాలనుకున్నదానికి, ఇదో ఉపోద్ఘాతమే అని నాకు అనుభవం వల్ల  తెలుసు. నా ఉద్దేశ్యంలో సృజనాత్మకత ఉన్నవారి కంతా ఎంతో కొంత ADHD డిజార్డర్ ఉండే ఉంటుంది. చెప్పాల్సిన విషయం సూటిగా చెప్పకుండా, విష్ణు శర్మ కాలం నుంచి పిట్ట కథలతో ఆసక్తికరంగా అల్లడం, ఈ నాటి హార్వర్డ్ బిజినెస్ కేసుల వరకు నడుస్తూనే ఉంది. విశ్వం నుంచి మరో కధ వినడానికి సిద్దమైపోయా. విశ్వం జరిగిన విషయాన్నే, మనుష్యుల పేర్లు మార్చి తన మెసేజికి అనుగుణంగా మార్చి చెప్తాడని నా అనుమానం. అనుమానం ఏమి కర్మ. నిజమే. ఇంతకు ముందు ఎన్ని కథలు మెంటర్ గా ఆయన దగ్గరి నుండి వినలేదు. తరువాత అది జరిగిన కథే అని పోల్చుకోలేదు?

"గోడ ఉందా? ఉండచ్చు? ఉంటే అది మానసికంగా తనకు తానే నిర్మించుకున్నదే. ఆస్తులను ఇంకా పెంచాలను కోవడం, జీవితంలో ఇంకా ఎన్నో కామార్ధాలను అనుభవించాలనుకోవడం చాలా సహజం. ఇప్పుడున్న స్టేజి, గృహస్థ ఆశ్రమల ఆకర్షణ నుంచి తప్పించుకోలేక మానసికంగా సంతృప్తి పరుచుకోవడానికి నిర్మించుకున్న కృత్రిమ గోడలే. ఇది అర్ధం అవ్వాలంటే నీవు సెల్వరాజు, కామేష్ ల కధ వినాల్సిందే." విశ్వం మరో బిజినెస్ కేసు కధ చెప్పడం మొదలెట్టాడు.

"సెల్వరాజ్, కామేష్ ఐవీ లీగ్ కాలేజీలో క్లాసుమేట్లు. సెల్వరాజ్ కు కామేష్ తెల్సు కానీ, కామేష్ కు సెల్వరాజ్ గురించి పెద్దగా తెలియదు. దానికి కారణం కామేష్ క్లాసులో టాపర్, స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కావడం. కామేష్ ను ఓ పెద్ద కంపెనీ అందరికంటే ఎక్కువ జీతం ఇచ్చి రిక్రూట్ చేయడం ఏ మాత్రం ఆశ్చర్యం కలగలేదు. కామేష్ అంచెలంచలుగా ఎదగడం ప్రపంచం పేపర్లలో చదువుతూనే తెలుసుకుంది. అలా ఓ 15 ఏండ్లకే ఓ టాప్ మల్టి నేషనల్ ఎగ్జిక్యూటివ్ గా కామేష్ చాలామందికి, పరిచయం అయిపోయాడు.

సెల్వరాజ్ కెరీర్ అంత సున్నితంగాను, సరళంగానూ, ప్రెడిక్టబుల్ గాను జరుగలేదు. మొదట్లో ఉద్యోగాలు కాపాడుకోవడం కష్టమైంది. చాలా కంపెనీలు మారాడు. తరువాత చాలా బిజినెస్ లు మొదలుపెట్టాడు. ఈ మార్గంలో ఓ 10 ఏండ్లు అవ్వగానే ఓ నిలకడ ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీని స్థాపించగలిగాడు. ఆ కంపెనీ చూస్తుండగానే 5 ఏండ్లకంతా మంచి పేరు సంపాదించుకోగలిగింది. మిగతా కంపెనీలు నష్టాలలో ఉన్నప్పుడు ఈ కంపెనీ లాభాలలో నడవడం, అందరికి ఒక్కింత ఆశ్చర్యం కలిగించిన విషయం వాస్తవమే. ఎలా సెల్వరాజ్  లాభాలలో నడిపిస్తున్నాడు అన్నది మిగిలిన వారికి కొంత మిస్టరీ గానే ఉండిపోయింది. సెల్వరాజ్ కంపెనీలో పని చేసేది ఓ 5 మంది లోపే. వారికి బిజినెస్ గురించి పూర్తిగా తెలియదు. వాళ్ళు తమ పనిని మాత్రం చూసుకొని, మరే  విషయాలలో తలా దూర్చకుండా ఉండేటందుకు, సెల్వరాజ్ వారికి చాలా బాగా జీతాలు, బోనస్లు ఇచ్చేవాడు. కంపెనీ పనిలో భాగంగా, సెల్వరాజ్ చాలా పార్టీలు ఏర్పాట్లు చేసేవాడు. పెద్ద పెద్ద రిసార్టులలో, ఏ మాత్రం ఖర్చులకు వెనుకంజ వేయకుండా సెల్వరాజు పెట్టిన ఈ పార్టీలకు హాజరు కావడానికి జనాలు ఎదురుచూసేవారు. ఈ పార్టీ ఫోటోలు ఫ్యాషన్ మాగజైన్లో ప్రచురింపబడటం తో పార్టీలకు మరింత డిమాండ్ పెరిగింది. సెల్వరాజ్, గెస్ట్ లిస్ట్ ఒకటికి పది సార్లు చెక్ చేసి ఫైనలైజ్ చేసేవాడు. ఎక్కువ మంది తనలాంటి బ్యాక్ గ్రౌండ్ వారే. ఇతర దేశాల నుంచి తనలాగా వలస వచ్చిన వారే. ఎక్కువమంది కాలేజీ  క్లాసుమెట్లే.

ఈ పార్టీలలో మాట్లాడటానికి పోటీ పడే జనాలు చాలా మంది ఉంటే, కొంతమంది మాత్రమే వినేవాళ్ళు. ఆ వినేవాళ్లు సెల్వరాజుకు కమీషన్ మీద పనిచేస్తున్న వారు. వారిని వేళ్ళమీద లెక్కపెట్టచ్చు. తన బిజినెస్ మాడల్ లో అంతకంటే ఎక్కువ ఉండటం మంచిది కాదు. సెల్వరాజ్ పార్టీకి టార్గెట్ చేసి పిలిపించడం వల్ల, వచ్చిన వాళ్లు పెద్ద పెద్ద కంపెనీలలో ఏదో ఓ పెద్ద ఉద్యోగంలోనే ఉండే వారు. సెల్వరాజు కు పనిచేసే మనుష్యులు మెల్లిగా, మాటలు వారు చేస్తున్న కంపెనీ బిజినెస్ వైపు మళ్లించే వారు. మనిషి మనిషికి ఉన్న గోడలు బద్దలు కొట్టడానికి, మంచి తిండి, తాగుడు కంటే పెద్ద సుత్తులు లేవేమో. అంతమంది లో కొందరైనా నోరు జారి కంపెనీ అనుకోకుండా నష్టం వచ్చిందనో, లేక ఆఫ్రికాలో కొత్త  గనులు కొనుగోలు చేసి లాభాలలో రానున్నదనో విషయాలు నోరు జారుతారు. ఆ మరునాడే, ఆ విషయం తెలిసిన సెల్వరాజ్, తన ఫండ్ కంపెనీ ద్వారా, అతిధి అంతకు ముంది నోరు జారిన కంపెనీ షేర్లు షార్ట్ చేసి కొనడమో, లేక కొనడమో చేస్తాడు. ఆ పని చేసిన కొద్దీ గంటలలోనే ఆ కంపెనీ గురించి తనకు ముందు రోజు తెలిసిన విషయం అందరికి తెలియడంతో, కంపెనీ షేర్ ధరలు పడిపోవడంమో, ఎక్కువవ్వడమో జరుగుతుంది, ఏది అయ్యినా, సెల్వరాజ్ కు పెద్ద లాభమే. ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఇలాంటి పనులు చేస్తూ పట్టుబడితే, పెద్ద ఫైన్లు, జైలు శిక్ష తప్పని సరి అయినా, తాను కనుగొన్న ఈ మోడల్ వల్ల తను పట్టుబడడని సెల్వరాజ్ గట్టి నమ్మకం. దానికి తోడు, ఈ పార్టీలకు వచ్చే జనం కూడా, సెల్వరాజ్ స్నేహితులవ్వడం, ఎక్కువమంది తాము చేస్తున్న పని బహుశా తప్పేమో అని అనుకున్నా, సెల్వరాజ్ పార్టీల మీద అతనిచ్చే ఖరీదైన బహుమతుల మోజుతో, పార్టీలకని ఫ్లైట్ టికెట్స్ అందుకోవడానికి అలవాటు పడిపోయారు.

ఇలా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న బిజినెస్ గురించి కామేష్ చెవిలోను పడింది. అదీ తన క్లాస్మేట్, పెద్దగా పేరులేని వాడు నడుపుతున్నాడు అంటే ఒక్కింత, ఆశ్చర్యం కూడా కలిగింది. సెల్వరాజ్ కు కూడా, కామేష్ ను కలిసి తన సక్సెస్ గురించి చెప్పాలని చాలా ఆశ. సెల్వరాజ్ కామేష్ ను కూడా తనకు పనికి వచ్చే వారి లిస్టులో కలుపుకొన్నాడు. కలవాలని ప్రయత్నిస్తే, వీలు పడలేదు. సెల్వరాజ్ దావోస్ లో మీటింగుకు స్పాన్సర్ చేస్తాను అని ఆహ్వానం పంపిస్తే, కామేష్ ధన్యవాదాలు, తనని దావోస్ కమిటీ వారే పిలిచారు స్పాన్సర్షిప్ అవసరం లేదని త్రోసి పుచ్చాడు. కామేష్ ను కలవాలనే, దావోస్ కి సెల్వరాజ్ వెళ్ళాడు. కాన్ఫరెన్స్ తరువాత ఆఫ్టర్ అవర్స్ పార్టీలలో ఓ పార్టీకి సెల్వరాజ్ పోతున్నాడంటే, ఆ పార్టీకి తానూ వెళ్ళాడు. మొత్తం మీద ఓ పది నిమిషాలు సెల్వరాజ్, కామేష్ తో మాట్లాడ గలిగాడు. క్లాస్మేటని ఆప్యాయంగా మాట్లాడిన, తరువాత కలుద్దామన్న, సెల్వరాజ్ ప్రతిపాదనకు, కామేష్ ఏమాత్రం స్పందించలేదు. దావోస్ నుండి తిరిగి వచ్చిన తరువాత పంపిన ఆహ్వానాలకి కూడా కామేష్ నుండి సమాధానం రాలేదు.

సెల్వరాజ్ తన పార్టీలకి అడిక్ట్ అయిన వారిలో ఎవరైనా సహాయపడతారేమోనని చూశాడు. దీపక్ తనతో పాటు ఇండియాలో కాలేజీలో చదివాడు, ప్రస్తుతం ఓ లాబీ కంపెనీకి పనిచేస్తున్నాడు. వీరు వాషింగ్టన్ డి.సి. లో పనిచేస్తూ, ప్రభుత్యోగులతో, కాంగ్రెస్, సెనేట్ మెంబర్లతో భుజాలు రాసుకుంటూ, తమ కంపెనీకి సరిపోయే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. దీపక్ ను మాత్రం డిన్నర్ కు ఓ ఫాన్సీ రెస్టారెంట్ కు పిలిచాడు. తను ఎప్పుడు డి.సి. వచ్చినా, ఆ రెస్టారెంట్ లోనే మిగిలిన వారిని కలుస్తుంటాడు సెల్వరాజ్. అక్కడ రిజర్వేషన్ దొరకడం అంత సులువు కాదు. సెల్వరాజ్ పిలిచిన వెంటనే జనాలు ఒప్పుకోవడానికి కారణం ఆ రెస్టారెంట్ కు ఉన్న పేరు కూడా ఒకటి. డిన్నర్ మాట్లాడుతున్నంతసేపు దీపక్ తాను చేస్తున్న పని గురించి చెప్తూనే ఉన్నాడు. డిన్నరు తరువాత డెజర్ట్ మరో కాక్టైల్ ఆర్డర్ చేసి, సెల్వరాజ్ తన మనసులో ఉన్న ప్రశ్న బయట పెట్టాడు. ఎలా మనుష్యులని ఒప్పించడం. దీపక్ నవ్వుతూ, నువ్వు చేస్తున్న పనికి, ఏదో మొస్సాద్, రా లేక ఐఎస్ఐ వారు చేసే రిక్రూటింగ్ పనికి తేడా లేదు. అవతలి మనిషి ఇంట్రెస్ట్ లు కనుక్కో. అవి నీవు తీర్చగలిగితే ఎవరినైనా నీ బుట్టలో వేసుకోవడం సులభమే. ఇక కామేష్ అంటావా, నాకతను ఫేస్బుక్ ఫ్రెండ్. అతనో ఫూడీ. ఎప్పుడూ తాను చేసిన వంటలు అందంగా ఫోటోలు తీసి పేస్ బుక్ లో వేస్తుంటాడు. అలానే ప్రకృతి అంటే విపరీతమైన ప్రేమ. తనకు నచ్చే పార్టీ, ఓ పేరున్న చెఫ్ ను పిలిపించి, బీచిలోనో, ఓ మంచి ప్రకృతి బ్యాక్ గ్రౌండ్ లోనో చేయి. రావచ్చు. అన్నాడు.

ఓ నెల తరువాత, సెల్వరాజ్ కోస్టారికా రిసార్ట్లోలో ఓ పార్టీ ఏర్పాటు చేశాడు. సౌత్ సెంట్రల్ అమెరికా వంటలకి పేరొందిన చెఫ్ లను ఓ ఇద్దరినీ పిలిపించాడు. కామేష్ కు ఫోన్ చేసి, ఈ సారి పార్టీ డిఫరెంట్ అనీ, కోస్టారికా లో వీకెండ్ పార్టీ అనీ, ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేస్తున్నానని, పేరొందిన ఇద్దరు చెఫ్ లు వండడంతో పాటు డెమో లు కూడా ఇస్తారని చెప్పాడు. చెఫ్ పేర్లు చెప్పగానే కామేష్ ఒప్పేసుకున్నాడు.

టోర్ట్యూగెరా కోస్టారికాలో కెరీబీన్ వైపు ఉంది. చేరాలంటే ప్లేన్ లోను లేక పడవమీదే ప్రయాణం. చుట్టూ దట్టమైన అడవులు, రకరకాల పక్షులు, సముద్రం, నది, కాలువలమధ్య ద్వీపాలు, ఒక వంద ఏళ్ల క్రితం ఉన్న భూమికి వెళ్లినట్లనిపిస్తుంది. రిసార్ట్ చేరిన తరువాత కూడా పల్లె వాసనలు పోకుండా ప్రకృతి మధ్యే నివాసాలు, రెస్టారెంట్లు కట్టడం వల్ల మరో ప్రపంచంలో నివసిస్తున్నట్లు, ఓ ప్రశాంతత ఆవహిస్తుంది. ప్లేన్ లో రిజర్వడ్ గానే ఉన్న కామేష్, చెఫ్ లను కలిసిన తరువాత బాగా మార్పు వచ్చింది. వారు వంట చేయడం దగ్గరుండి చూసి, వారితో పాటూ వారు చెప్పినట్లు తానూ కొన్ని వంటలు వండి, చిన్న పిల్ల వాడిలా ప్రశ్నలు వేసి తెగ ఎంజాయ్ చేశాడు. ఆ రోజు డిన్నర్ తరువాత, పక్షులు చూడాలని రాత్రి చిన్న తెప్పల మీద బయలుదేరారు. అంతా చిమ్మ చీకటి. ఎలెక్ట్రిక్ దీపాలు లేవు. ఆ చీకటిలోను పక్షులను చూడగలిగిన గైడ్ లు. అప్పుడప్పుడు టార్చిలైట్ వేసి రకరకాల రంగులున్న పక్షులను చూపెట్టారు. నిద్రపోతున్న ఆ పక్షులు కాంతికి కళ్ళు మిటకరిస్తూ, ఫోటోలకు ఒకటి రెండు ఫోజు లిచ్చి తిరిగి నిద్రకు జారుకుంటున్నాయి. నది మధ్యకు తీసుకెళ్లి బోటు మధ్యనున్న చిన్న దీపాన్ని ఆర్పేశాడు గైడ్. మొత్తం చిమ్మ చీకటి. ఆకాశం వైపు చూడ మన్నాడు. అంత కాంతివంతమైన నక్షత్రాలు జీవితంలో ఎవరూ చూసి ఉండరు. కామేష్ కి ఈ పార్టీ తెగ నచ్చింది. తిరుగు ప్రయాణంలో సెల్వ రాజ్, బిజినెస్ పైన ప్రశ్నలు వేస్తే ఓపెన్ గానే జవాబులిచ్చాడు. అలానే మరో ఒకటి రెండు పార్టీలు వేరే వేరే చెఫ్ లతో పెట్టడంతో కామేష్ సెల్వరాజ్ కు బాగా క్లోజ్ అయ్యాడు. సెల్వ రాజ్ ఈ విధంగా సొంతంగా బిజినెస్ చేయడం తనకు గర్వ కారణం, ఒకింత జెలస్ కూడా అని అన్నాడు. అదే వింత, ఈ మన జీవితాలలో, ఎంత గడించినా, ఎంత పేరు తెచుకొన్నా, ఏదో అసంతృప్తి. అందుకే ఇంకా ఏదో సాధించాలని, ఇంకా ఏదో గొప్ప పని చేయాలని, ఇంకా ఏదో గొప్ప పేరు సంపాదించాలని పరుగులు తీస్తుంటారు. మరో మెట్టు ఎక్కడానికి లేదా తరువాతి ఆశ్రమానికి పోకపోవడానికి అడ్డు గోడ, కాదు కారణం. అంతకు ముందు జీవిస్తున్న జీవనం మీద మోహం తగ్గక పోవడం. ఆ ఆకర్షణే మరో అడుగు వేయకుండా బందీ చేస్తుంది" అని ముగించబోయాడు విశ్వం.

కధ అసంతృప్తిగా అనిపించింది. విశ్వం కూడా ఆ విషయం గమనించినట్లున్నాడు. ఓ రెండు నిమిషాలు నా ముఖం రెప్పార్పకుండా చూసి నిశ్శబ్దంగా ఆలోచించాడు. ముసుగులో గుద్దులాటలెందుకు? 'గదిలో ఉన్న ఈ ఏనుగును (elephant in the room) గురించి కూడా మాట్లాడాడని.. కథ పొడిగించి చెప్పసాగాడు విశ్వం.

సెల్వరాజ్ తాను తెలివైన వాడనుకున్నా, సెల్వరాజ్ కంపెనీ అంత తొందరలో లాభాలు చేసుకోవడం మార్కెట్ రెగ్యులెటర్లలో ఓ అనుమానం రేకెత్తింది. కానీ చేతిలో ఏ ఆధారాలు లేనందున FBI కి కేసు అప్పగించారు. వాళ్ళు సెల్వరాజ్ ను వదిలి..సెల్వరాజ్ కింద వారి మీద నిఘా వేశారు. వారిలో ఒక్కడు దురాశతో సెల్వరాజ్ కంపెనీ తో పాటు తానూ తన సొంత అకౌంట్లో షేర్లు కొనసాగాడు. వాడిని పట్టి నీకు సెల్వరాజ్ కు ఈ కొనుగోళ్లతో ఏమి సంబంధం అంటే మెల్లిగా సెల్వరాజ్ పార్టీలు ఇవ్వడం, ఆ పార్టీలో కంపెనీల గురించి ఇన్సైడర్ ఇన్ఫో లాగడం లాభాలు చేసుకోవడం గురించి చెప్పేసాడు. ఇక అప్పటినుంచి సెల్వరాజ్ ఫోన్ లు టాప్ చేసి, వారికి కావలసిన ఆధారాలు సేకరించసాగారు FBI వాళ్ళు. కామేష్ కున్న పేరు వల్ల, FBI అనుమానితుల జాబితాలో కామేష్ లేడు. కానీ, సెల్వ రాజు ఫోన్ టాప్ చేసి ఉండటం వల్ల, కోస్టారికా ట్రిప్ తరువాత కామేష్ కూడా ఓ టిప్ సెల్వ రాజ్ కు ఇవ్వడం తో తనూ ట్రాప్ అయ్యి పోయాడు. సెల్వరాజ్, కామేష్, దీపక్, ఇంకా మరి కొందరూ అందరూ జైలు పాలైయ్యారు.

కానీ అది వేరే విషయం. చివరి మెట్టు దగ్గర సంకోచించడం గురించే ఈ పాఠం. ఈ కధలో చిక్కినట్లు, అందరూ చిక్కిపోతారా? చాలా మంది అన్ని వున్నా ఇంకా ఏదో లేదనే వెంపర్లాడుతుంటారు. ఆ ఆకర్షణ, వ్యామోహం, గ్రీడ్ నుంచి తప్పుకొని, తనను తానూ తెలుసుకోవడం, జీవిత పరమార్ధం తెలుసుకోవడం చాలా మందికి అసాధ్యమే. కొందరే ఆ అడ్డుదాటి చివరి మజిలీ చేరుకోగలరు."

విశ్వం ముఖంలో ప్రశాంతత కనిపించింది. చివరికి తాను ఇప్పుడు ఆ గోడ దాటి చివరి మెట్టు చేరగలిగాడా? అప్పాయింట్మెంట్ సమయం అయ్యి పోయిందని తెలిపారు.

వీడ్కోలు తీసుకోవడానికి లేచి నిలబడ్డాను.

"అన్నట్టు తిరునెల్వేలి హల్వా తెమ్మన్నాను తెచ్చావా అన్నాడు విశ్వం "ఆ తెచ్చానండి. బయట సెక్యూరిటీకి అందజేశాను. మీకు పాకెట్ అందజేస్తామన్నారు" అన్నాను.

అస్సలు తిరునెల్వేలి హల్వా ఎలా చేస్తారో  తెలుసా?..చిన్నప్పుడు తిరునెల్వేలి లోనే పెరిగాను. హల్వా వండుతుండగా పక్కనుండీ చూశాను. మరోసారి దాని రెసిపీ, ఎలా వండాలో చెప్తానులే" విశ్వం తో కలిసిన ప్రతీ సారి ఓ వంటకం గురించి వినక తప్పదు. అదో వీక్నెస్ ఆయనకి.

విశ్వం దగ్గరకి వచ్చిన పని, తనకు నాకూ అయిపోయింది. విశ్వం నన్ను ఎందుకు పిలిపించాడు? విశ్వం తన విషయంలో, తాను చెప్పిన ఆ 'గోడ ' దాట గలిగాడా? మళ్ళీ విశ్వం హల్వా గురించి మాట్లాడంతో నా సంశయం మొదలైయ్యింది. విశ్వం దగ్గర వీడ్కోలు తీసుకొని, పార్కింగ్ లాట్ వైపు దారి తీశాను. రెంటల్ కార్ స్టార్ట్ చేస్తూ ..టైము చూసా. ఇంకో రెండు గంటలలో ఫ్లైట్.

రెండు వైపులా బీడు భూములు తప్ప ఏ జన సంచారం కనపడటం లేదు. రోడ్డు మీద పెద్ద ట్రాఫిక్ కూడా లేదు. రియర్ వ్యూ అద్దంలో - ఇటువైపు నిరపరాధులుగా పరిగణింపబడుతున్న కొందరు అపరాదులను, అటువైపు అపరాధులుగా ముద్ర పడిన కొందరు నిరపరాధులను, ఒకే వైపు చేర్చలేని నిస్సహాయతతో గోడ పారిపోతూ కనిపించింది. సూర్య కాంతికి మెరుస్తున్న, గోడ పైనున్న ఎలక్ట్రిక్, రేజర్ ముక్కల కంచె, మధ్య, మధ్యలో ఉన్న వాచ్ టవర్లు, ఆ గోడ వెలవెల  పోవడానికి మరింత దోహద పడుతున్నాయి.

********

Posted in February 2020, కథలు

1 Comment

  1. అబ్బరాజు నాగరాజు

    మనిషి పరిణామ క్రమంలోని దశలను నర్మ గర్భం గా వర్ణించిన తీరు బావుంది మరియు సందేహాత్మకంగా ఉంది. ఎంతో స్పష్టత/ నిర్దిష్టంగా వర్ణించ వలసిన ఇలాంటి తాత్విక విషయాలను పరోక్షంగా చెప్పడం వల్ల ఏమి ప్రయోజనం?!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!