Menu Close
వీక్షణం సాహితీ గవాక్షం - 89
- రూపారాణి బుస్సా
vikshanam-89

కాలిఫోర్నియాలోని ఫ్రీమౌంట్ లో శ్రీ వెంకటరమణ, శ్రీమతి సుభద్ర గారింట్లో జనవరి 12, 2020 న జరిగిన 89వ వీక్షణ సమావేశానికి శ్రీ వేణు ఆసూరి గారు అధ్యక్షత వహించారు.

కార్యక్రమంలో మొట్టమొదటగా వెంకటరమణ గారు కథలు వ్రాసే విధానం లో చారిత్రకంగా వచ్చిన మార్పులను గురించి వివరంగా మాట్లాడారు.

దాదాపు 1910 నుండి మొదలైన కథా రచన పరిస్థితులను బట్టి, కాలానికి తగినట్టు ఎలా మార్పు చెందిందన్నది చాల చక్కగా తెలియజెప్పారు. కథ యొక్క ప్రయోజనమేవిటి, కథావస్తువు ఎలా ఎంచుకోవాలి, కథా శిల్పమేమిటి వంటి అనేక విషయాల గురించి క్షుణ్ణంగా తెలియపరిచారు.

విరామం తరువాత సభను డా|| కె. గీతగారు ప్రారంభించారు. తమ తల్లి శ్రీమతి కె. వరలక్ష్మి గారికి ఇటీవలే లభించిన అజో-విభోకందాళం ఫౌండేషన్ వారి జీవన సాఫల్య పురస్కారం గురించి చెబుతూ కె.వరలక్ష్మి గారి కథా ప్రస్థానాన్ని, జీవన విశేషాల్ని వివరించారు.

కె. వరలక్ష్మి గారి జన్మస్థలం, నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి.

కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం, రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.న అవార్డులు కథలకు, శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి అవార్డులు కవితలకు అందుకున్నారు.

ఈ సందర్భంగా గీతగారు "నాకు తెలిసిన మా అమ్మ" అనే వ్యాసాన్ని తమ తల్లికి అంకితమిస్తూ చదివి వినిపించి, వరలక్ష్మి గారి కథలలో తనకు ఇష్టమైన కథ అంటూ "శివంగి" కథా పఠనం చేశారు. శివంగి కథలోఇంట్లో భర్తవల్ల అనేక ఇబ్బందులు పడుతున్న ఆడదానికి అడుగడుగున కష్టాలే అయినప్పటికీ మనసు మాత్రం అత్యంత సున్నితమైనదని, వెన్నలానే కరిగిపోతుందని  చక్కగా చూపించారు.

ఆ పై కిరణ్ ప్రభగారు మనోరంజకమైన సాహితీ క్విజ్ తో పాల్గొన్న వారందరికీ అనేక విషయాలపై జ్ఞానాన్ని పంచారు.

తరువాత సభ్యులు తాము రచించిన కవితలను సభకు చదివి వినిపించారు.

మొదట రూపారాణి గారు మణిపూసలు ప్రక్రియలో వరకట్నం అంశంపై రచించిన కవితను చదివి, తదుపరి కూనలమ్మ పద్యాలు ఆరుద్రగారి మకుటంతో ప్రక్రియలో తాము రచించిన వాటిని చదివారు. తరువాత గీత గారు "నువ్వు లేని ఇల్లు" అంటూ ఆర్ద్రమైన కవితను చదివారు. తరువాత లెనిన్ గారు అహల్య పాత్రను జీవన తత్వానికి సరిపోలుస్తూ చిరు ప్రసంగాన్ని చేశారు.

ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఈ సమావేశంలో స్థానిక ప్రముఖులు, సాహిత్యాభిలాషులు విశేషంగా పాల్గొన్నారు. చివరగా సుభద్ర గారు, గీత గారు పాడిన పాటలతో సంతోషంగా సభ ముగించబడింది.

Posted in February 2020, వీక్షణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *