Menu Close
మంత్ర పుష్పంలో అంతరిక్షం - 1
-- ఆర్. శర్మ దంతుర్తి

మనిషి మనుగడకి కావాల్సిందేమిటి అని ఓ సారి చూసుకుంటే అందరూ ఒప్పుకునేది నిప్పూ, నీరు. ఈ మనుగడలో, పుట్టడం, పెరగడం, పిల్లల్ని కనడం, ముసలితనం, చావడం ఇదంతా చూస్తూంటే ఇందులో ఉన్న సంతోషం కాకి బంగారం వంటిదని తెలిసినా అదే చేస్తున్నాం. ఇందులో కష్టాలు చూసి, దీని బదులు మరోదారి ఏదైనా ఉందా, ఉంటే దాన్ని తెలుసుకోవడం ఎలా అనే సందేహం వచ్చి అసలు ఈ సంసారమే వద్దు శాంతి అంటే ఏమిటో తెలిసేదాకా అని దాన్ని త్యజించి కృషి చేసినవాళ్లని సన్యాసులనీ, ఆ సన్యాసం లో తపస్సు చేసి అగ్రగామిగా ఎదిగినవాళ్లని మునులనీ, చివరికి ఏదైతే తెల్సుకుంటే శాంతి లభిస్తుందో, ఏది తెల్సుకుంటే ఇంకేదీ తెలుసుకోనక్కర్లేదో, అది తెలుసుకున్నవాళ్లని బ్రహ్మర్షులనీ అంటున్నాం. ఈ బ్రహ్మర్షులు తెలుసుకున్నదే బ్రహ్మం. దీన్నే కొంతమంది భగవంతుడంటే మరికొందరు శక్తి అనీ, నిర్వాణం అనీ అన్నా మొత్తానికి అందరూ ఒప్పుకునేది ఒకటే. ఈ ప్రపంచానికి అతీతంగా, శాసించే శక్తి ఒకటేదో ఉంది. కొత్తగా కనుక్కున్న శాస్త్రాల నిర్వచనం ప్రకారం కూడా ఈ శక్తి నశింపచేయలేనిది. ఆ శక్తిని ఒక రూపంలోంచి మరోరూపంలోకి మార్చవచ్చు, మారుతుంది కూడా. అయితే శక్తి తెలుసుకోవడానికెన్నేళ్ళు పడుతుంది? ప్రపంచంలో ఎవరు ఎంతకాలం బతుకుతారో అనేది ఎవరూ ఖచ్చితంగా సమాథానం చెప్పలేని ప్రశ్న కనక ఆ శక్తిని – బ్రహ్మాన్ని- తెలుసుకునే లోపుల మనిషి ప్రాణం పోతే ఏమవుతుంది అనే ఇతర ప్రశ్నలు ఉద్భవించడం మొదలైంది.

బ్రహ్మం అనేది ఉంది అని ఒప్పుకుంటే దాన్ని శోథించడానికి, నిజంగా కనుక్కోవడానికి ఎన్నేళ్ళు పడుతుందనేది ఎవరూ చెప్పలేని చిదంబర రహస్యం. అది అసలంటూ ఉంటే, దాన్ని కనుక్కునేలోపల మన ప్రాణం పోవచ్చు. అయితే మనం బతికే ఈ కొన్నేళ్లలో మనకి బ్రహ్మ జ్ఞానం కలగకపోతే ఎలా? దీనికోసమే పునర్జన్మ అనే అంశం పుట్టుకొచ్చినట్టూ కనిపిస్తుంది. ఈ సిధ్ధాంతం ప్రకారం బ్రహ్మానుభవం కలిగేలోపుల ప్రాణంపోతే, చేసిన కర్మ వల్ల మరో జన్మ వచ్చి క్రితం జన్మలో ఎక్కడ వదిలామో అక్కడ మొదలుపెట్టి మళ్ళీ ప్రయత్నం. ఇలా ఎన్ని జన్మలు ఎత్తితే బ్రహ్మానుభవం కలుగుతుందనేది ఎవరూ చెప్పలేని మరో చిదంబర రహస్యం కనక మనం అలా ప్రయత్నం చేస్తూ ఉండవల్సిందే.

అయితే ఈ పునరపి జననం, పునరపి మరణం అనే సిధ్ధాంతం ప్రకారం, ఈ జన్మలో చేసిన ఏ కొంచెం మంచి పనైనా వచ్చే జన్మలో తోడ్పడుతుంది కనక అంచెలంచెలుగా ఎదుగుతూ ఎప్పుడో ఒకప్పుడు బ్రహ్మ జ్ఞానం సంపాదించుకోవచ్చు. అయితే ఈ శక్తి ఎక్కడో అందనంత దూరంలో ఉంటే దాన్ని తెలుసుకోవడం ఎలా అనేదానికి బ్రహ్మర్షులు ఇచ్చిన సమాథానం ఏమిటంటే, ఈ శక్తి ఎక్కడో ఉన్నా, ఆ శక్తిలో శత సహస్రాంశం మనలో కూడా ఉంది. ఆ శక్తి వల్లే మనం ఆలోచించ గలుగుతున్నాం. చరాచర వస్తువుల్లో ఈ శక్తి లేకుండా నిలుచోగలదేదీ లేదు. అంటే ఈ శక్తి తెలుసుకోవడానికి ఎక్కడికో పోవక్కర్లేదు. ఇక్కడే, మనలోనే లోపలకి చూసుకుంటే చాలు. దీన్నే అంతర్దృష్టి అనడం మొదలుపెట్టాం.

మొత్తానికి మనకి అర్థం అయ్యేది ఏమిటంటే, మానవ జీవిత ఆయుర్దాయం తక్కువ. బ్రహ్మం తెలుసుకోవాలనే గమ్యం ఉంది కానీ వెళ్ళే ప్రయాణం అతి కష్టం. ఆ గమ్యం చేరితే ఈ బ్రహ్మర్షులు చెప్పడం ప్రకారం ఇంక జననం మరణం అనేవి లేవు. పూర్తి శాంతి లభిస్తుంది. అయితే ఈ బ్రహ్మం ఎక్కడో దూరంగా లేదు, మనలోనే దాని అంశ ఉంది కనక చూడాల్సిన ప్రదేశం మనకి – మన ముక్కుకన్నా దగ్గిరలో – అతి చేరువలో ఉంది. అంత దగ్గిరగా ఉన్నా మనం చూడలేకపోవడానిక్కారణం మన మనసుకున్న బహిర్దృష్టి. మనం చేయవల్సిందల్లా దాన్ని లోపలకి తిప్పి చూడడమే. అప్పుడు కనిపించే ఆ శక్తి వివరించడానికి, దాన్ని స్వతహాగా తెలుసుకున్న బ్రహ్మర్షుల ప్రకారం సూత్రాలు పుట్టుకొచ్చాయి. వీటినే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ అనే పంచమహా వాక్యాలుగా చెప్పడం గమనించవచ్చు. ఈ బ్రహ్మాన్ని తెలుసున్నాక తెలిసేదేమిటంటే – బ్రహ్మం/శక్తి అనేది వేరుగా ఎక్కడో లేదు. ఇక్కడే మనలో ఉన్న చైతన్యమే ఆ బ్రహ్మం. అంటే మన ప్రయాణం చేసేది మన లోపలికే, దూరం ఒక్క అడుగుకన్నా తక్కువ కానీ మనసుని లోపలకి తిప్పే ప్రయత్నమో? అతి కష్టాతి కష్టం.

భూమ్మీద ఇప్పుడిలా పుట్టి, ఇలా బతుకుతున్నాం, మనం చేసే వనరులన్నీ పాడయ్యే పనులకి ముందు ముందు ఈ భూమి మీద మనుగడ కుదరకపోవచ్చు. మరో చోటకి వెళ్లాల్సి రావచ్చు. మరి మరో చోటకి వెళ్ళడానికి, నిప్పూ నీరూ ఉన్న మరో ప్రదేశం ఉందా? దాని కోసం మనం అంతరిక్షం లోకి చూడ్డం మొదలుపెట్టాం. మళ్ళీ ఓ సారి అవలోకించుకుంటే బ్రహ్మం అనేది తెలుసుకోవడానికి ఆలోచన, అలా ఆలోచన చేయడానికి మానవజన్మ తప్పనిసరి అనుకుంటే మనం బతకడానికి నిప్పూ నీరూ కదా కావాల్సినది? ఇందులో నీరుకి మరో పేరే నారము. ఈ నారము అనే పదంలోంచి వచ్చినదే, నారాయణుడు (నీటికి ఆథారమైనవాడు) అనే శబ్దం. ఈ నారాయణుడిని తెలుసుకోవడమే మరో రకంగా చెప్పాలంటే మనం తెలుసుకుందామనుకునే శక్తిని తెలుసుకోవడం.

ఈ తెలుసుకోవడానికి చేసే ప్రయత్నంలో – అంతర్దృష్టి పూర్తిగా అనుభవించగల్గినప్పుడు అనేకానేక శబ్దాలు, మంత్రాలు, సంగీతం వినిపిస్తాయనీ, వాటిని అనుభవించడం తప్ప వివరించడం పూర్తిగా అసాథ్యమనీ ఈ బ్రహ్మర్షులు అనడం గమనించవచ్చు. అయితే కొంతలో కొంత వివరించడానికి మనకి మహర్షులిచ్చిన కొన్నింటిలో మంత్రపుష్పం ఒకటి.

మంత్రపుష్పంలో - పైన చెప్పుకున్న మనం తెలుసుకోగలిగే ఆ శక్తి ఎక్కడుంది, దాన్ని సాథించడం ఎలా - అనేది ఎలా చెప్పారో చూద్దాం. స్తోత్రం మొదలుపెడుతూ ముందు చెప్పేది

ఓం ధాతా పురస్తాద్యముదాజహార  శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్త్రః
తమేవం విద్వానమృత ఇహ భవతి  నాన్యః పంథా అయనాయ విద్యతే

మొదటగా ఈ శక్తి, నీటికి ఆథారమైన ఆ నారాయణుడు ఎటువంటివాడో చెప్పే ఈ మొదటి మంత్రం మొదలయ్యేది “ఓం” అనే ప్రణవాక్షరంతో. అంతరిక్షంలోకి వెళ్ళేకొద్దీ మొత్తం విశ్వం అంతా వేగంగా తిరుగుతూ దూరంగా కదులులోంది, భూమి కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టే. ఇది ప్రతీవారూ ఒప్పుకున్న సత్యం కొత్త పరిశోథనల ద్వారా కూడా. ఈ కదలడంలో, భ్రమణంలో కలిగే శబ్దమే ఓంకారం.  బ్రహ్మా, ఇంద్రాది దేవతలూ కనుక్కునదేమంటే, సర్వరక్షకుడిగా ఉన్న ఈ శక్తి, నీటికి ఆథారమైన నారాయణుడే, అతణ్ణి తెలుసుకోవడం చేతనే అమృతత్వం సిథ్థిస్తోంది. అంటే ఏ శక్తినైతే తెలుసుకోవడంతో ఇంకేమీ తెలుసుకోనక్కర్లేదో, అటువంటి శక్తి, అమృతత్వం – నిజమైన పూర్ణ సంతోషం - కలగాలంటే దాన్ని తెలుసుకునే మార్గం తప్ప వేరు దారి లేదు.

సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువమ్,  విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదమ్
విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణగ్ం హరిమ్, విశ్వమేవ ఇదం పురుషః తద్విశ్వముపజీవతి

శక్తి అనేది ఉందని చెప్పారు కనక ఇప్పుడా శక్తి ఎటువంటిదో వివరణ ఇవ్వాలి. ఈ శక్తి స్వరూపం అయిన భగవంతుడు అనేక శిరస్సులున్నవాడు, అనేక నేత్రాలున్నవాడు సమస్త జగత్తుకీ కారణమైనవాడు, మోక్షపదానికి ఆథారమైనవాడు.  ఈ అనేక శిరస్సులనేది ముందు చూద్దాం.

నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణమ్  నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణః పరః
నారాయణ పరం బ్రహ్మ తత్త్వం నారాయణః పరః  నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణః పరః

ఈ శక్తి, నీటికి ఆథారమైన నారాయణుడు కనక, దాన్ని తెలుసుకునే ముందు అది ఎక్కడ ఎలా ఉందో చెప్పబడుతోంది. ఈ విశ్వంలో తెలుసుకోదగినది ఏదైనా ఉందంటే (ఏది తెలుసుకుంటే మరొకటి ఏదీ తెలుసుకోనక్కర్లేదో) అది నారాయణుడే. తెలుసుకోవలసింది, విశ్వం అంతా వ్యాపించి ఉన్నదీ నారాయణుడే. ఆ నారాయణుడే బ్రహ్మర్షులు దర్శించిన పరబ్రహ్మం. మరి అది విశ్వమంతా వ్యాపించి ఉంది కనక, ఆ నారాయణుడి గురించి ఆలోచించే థ్యాతా, ఎవరి గురించి ఆలోచిస్తున్నామో ఆ థ్యానం చేయబడే పదార్థం కూడా ఆ శక్తే; రెండుగా అంటూ వేరుగా ఏమీ లేవు.

యచ్చ కించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పి వా
అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్థితః

భగవంతుణ్ణి నుంచి వేరుగా ఏదీ లేదు కనక, మనకి ప్రపంచంలో కనబడే, వినిపించే జగత్తులో బయటా లోపలా ఉన్న సర్వం కూడా ఆ శక్తి తప్ప మరొకటి కాదు. అంటే మనం తెలుసుకోవాలనుకుంటున్న శక్తి మనలోపలా, మన బయటా ఉన్నట్టే, ఏ ఆలోచన వల్ల ఈ శక్తిని తెలుసుకోవాలని అనుకుంటున్నామో ఆ ఆలోచన రావడానిక్కారణం కూడా ఆ శక్తి తప్ప మరొకటి కాదు. అంటే ఏ శక్తిని తెలుసుకోవాలని మనం అనుకుంటున్నామో ఆ శక్తి మనలోనే అంతర్గతంగా దాగి ఉంది.  అయితే ఇప్పుడు మనకొచ్చే ప్రశ్న - మనలోనే ఉన్న శక్తి – దేనివల్ల అయితే మనం అనుక్షణం బతుకుతున్నామో – అది మనలో నిజంగా ఎక్కడుంది?

అనంతమవ్యయం కవిగ్ం సముద్రేంతం విశ్వశంభువమ్
పద్మ కోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖమ్
అధో నిష్ఠ్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి
జ్వాలమాలాకులం భాతీ విశ్వస్యాయతనం మహత్

అనంతం, అవ్యయం, సర్వజ్ఞతతో ఉండేదీ (కవిం), సంసారమనే సముద్రానికి ఆవలితీరాన ఉన్నది, విశ్వం సంభవించడానికి కారణమైన ఈ శక్తి, మన శరీరంలోనే హృదయానికి అధోముఖంగా, నాభికి పైన కాడ పైకి, పువ్వు కిందకీ ఉన్నట్టు తామరపూవులాగా ఉన్నదాంట్లో ఉంది. ఇదే హృదయకమలం.

సంతతగ్ం శిలాభిస్తు లంబత్యా కోశసన్నిభమ్
తస్యాంతే సుషిరగ్ం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితమ్
తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః
సోగ్రభుగ్విభజంతిష్ఠన్నాహారమజరః కవిః
తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయః తస్య సంతతా |

జ్వలజ్వలాయమానమైన నాడీసమూహంతో ఉండే ఈ హృదయకమలం మీద సూక్ష్మమైన రంధ్రం ఒకటి ఉంది. అందులో ఉన్న మహాగ్ని అనంతమైన జ్వాలలతో ప్రజ్వరిల్లుతోంది. ఇదే వైశ్వానరుడుగా భగవద్గీతలోని - అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణాపానసమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం – అనే శ్లోకం తో ఉదహరించబడినది. ఈ మహాగ్ని వల్లే మనం తినేవి జీర్ణం అవుతున్నాయి. ఈమహాగ్నిజ్వాలలు పైకి కిందకి వెలుగులు చిమ్ముతున్నాయి. అయితే ఈ మహాగ్ని అలా నిరంతరం ప్రజ్వరిల్లడానిక్కారణమేమిటి?

సంతాపయతి స్వం దేహమాపాదతలమాస్తకః తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితాః
నీలతోయదమధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవారశూకవత్తన్వీ పీతా భాస్వత్యణూపమా

ఇలా దేహంలో ఉన్న ప్రతీ దాన్నీజీర్ణించుకునే శక్తిగల మహాగ్నికి కారణం అందులోనే ఉన్న ఊర్ధ్వంగా వెలుగుతున్న మరో విశిష్టాగ్ని. నీలిరంగు మేఘాలలో విద్యుల్లతలా ప్రకాశించే ఈ అగ్ని ధాన్యం ములుకు అంత చిన్న రూపంలో బంగారు రంగులో వెలుగుతోంది.

తస్యాః శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివః స హరిః స ఇంద్రః సోక్షరః పరమః స్వరాట్

ఆ ధాన్యపు గింజ అగ్రభాగంలో పరమాత్మ ప్రతిష్టతమై ఉన్నాడు. ఇదే అంతర్దృష్టితో మనం తెలుసుకోదగ్గ భగవంతుడు. మనం కొలిచే బ్రహ్మ, శివ, హరి, ఇంద్రాదులుగా కొలిచే ఏ దేవుడైనాసరే.

ఇప్పటికి మనం తెలుసుకున్నదేమంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ఎక్కడకీ పోవక్కర్లేదు. ఇప్పుడే ఇక్కడే మన హృదయంలో ఉన్న చైతన్యమే ఆ భగవంతుడు. మన కనురెప్పలు ఆడడానికీ, మనసు చలించడానికీ, మనం ఆలోచన చేయడానికీ ఆఖరికి ఇలా భగవంతుడనేవాడు ఉన్నాడు వాణ్ణి ఇక్కడే ఇప్పుడే తెలుసుకోవచ్చు అనే ఆలోచన రావడానికీ కారణం ఆయనే. ముందు చెప్పిన సహస్రశీర్షం దేవం అనేది మరోసారి చూస్తే ఎవరికి వేల తలలూ అవయవాలు, శరీరాలు ఉన్నది? మనందరమూ, మనలో ఉన్న భగవదంశలతోపాటు ప్రకృతిలో చైతన్యం ఉన్న, లేని వేలకొలదీ అన్ని ప్రాణులతో సహా చరాచర విశ్వం అంతా కూడా బ్రహ్మమే కనక ఈ బ్రహ్మమే ఈ సహస్రశీర్షం అనే శ్లోకంలో ఉదహరించబడుతూ ఉన్నది. అది భగవంతుడు తప్ప మరొకటి కాదు. దీనర్ధం ఏమిటంటే ప్రతీ ఒక్కరూ కూడా బ్రహ్మస్వరూపురులే. ప్రపంచంలో ప్రతీఒక్కరూ కూడా బ్రహ్మాన్ని తెలుసుకోగలిగే ఆత్మస్వరూపుడు.

ఒకటే చిక్కు ఇక్కడ. పంచేంద్రియాలతో మనం ఎల్లకాలం బహిర్దృష్టితో లోపలకి చూడలేకపోతున్నాం కనక ఆ అంతర్దృష్టి వచ్చేలోపు, మనకి అది అలవాటయ్యేలోపున జీవితం గడిచిపోతోంది. చేసుకున్న కర్మకి మరో జన్మ ఎత్తవలసి వస్తోంది. అప్పుడు చేసేకర్మకి మరికొంత కర్మ కలుపుకుని మరో జన్మ, ఆ జన్మలో చేసుకున్న కర్మతో మరో జన్మ అలా జనన మరణ చట్రం అనే చక్రంలో వేగంగా తిరుగుతున్నాం. ఈ చక్రం వేగంగా తిరగడానిక్కారణం మనం చేసే కర్మ కనక అది చేయడం మానాలి. మరి కర్మ చేయకుండా బతికే జీవి ఒక్కటీ లేదు. మరెలా? కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నట్టు ఫలాపేక్ష లేకుండా చేసిన కర్మ మనకి అంటుకోదు. సరే ఈ ఫలాపేక్ష లేకుండా కర్మ చేయడం కూడా అంత సులభం కాదు కనక అది కూడా నేర్చుకోవలసిందే. మరి దానికెంతకాలం పడుతుందో? ఎన్ని జన్మలు పడతాయో. ప్రతీమనిషి ఋషి అయిపోయి ఆత్మ జ్ఞానం బుద్దుడు సంపాదించినంత త్వరగా సంపాదించలేడు కనక కర్మణ్యే వ్యాధికారస్తే మా ఫలేషు కదాచన అనేదే మనం నేర్చుకోవాలి అది ఎన్ని జన్మలు పట్టినా. మనం అన్ని జన్మలు ఎత్తేటప్పటికి ఈ భూమి ఉంటుందా? మరి ఈ భూమిమీద నాశనం అయితే ఏం చేయాలి? మనకి మనుగడ మరోచోట ఎక్కడ కుదురుతుందో చూడాలి అనేది మిగతా మంత్రాలలో చెప్పబడుతోంది.

***సశేషం***

Posted in February 2020, సాహిత్యం

2 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!