Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

రోజాపువ్వు

Rose

రోజా పువ్వు పేరు వినగానే గుర్తువచ్చే సినిమాపాట 'రోజ్ రోజ్ రోజాపువా! పువ్వా!' ఔనా? కాదా? దీన్ని ‘సీమ పన్నీరు పువ్వు‘ అంటారు కూడా.

ఈ పువ్వును ప్రేమాభిమానాలకు చిహ్నంగా గుర్తిస్తారు. ఈ పూలు చాలా రంగుల్లో మనస్సును దోచే సువాసనతో ఎంతో అందంగా ఉంటాయి. ఏ రంగు ప్రత్యేకత దానికే! ప్రతి రంగుకు ఒక విశిష్టత ఉన్నా మన మనస్సును మాత్రం స్వాంతపరుస్తాయి. గులాబీని చూచి, వాసన పీల్చగానే మనస్సు తేలికై మంచి భావనలు, ఉత్సాహమూ కలుగుతాయి.

Roseదీన్ని రోజా అనేకంటే గుబాళింపుల గులాబీ అంటే ఇంకా బావుంటుందేమో!

పన్నీరుపువ్వు అని కమ్మని వాసన కలిగి ఉండటాన - ఇలాకూడా పిలుస్తారు.

పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది అన్నట్లుగా మనం గులాబీని ఏ పేరుతో పిలిచినా అంతే తియ్యగా ఉంటుంది.

అనేకమంది కవులు గులాబీల గురించి ఉటంకించిన మాటలు చూద్దాం.

  • That which we call a rose/By any other name would smell as sweet. — William Shakespeare, Romeo and Juliet act II, sc. Ii.
  • Gather ye rosebuds while ye may,/Old Time is still a-flying — Robert Herrick, To the Virgins, to Make Much of Time.
  • నా ప్రేమ జూన్ లో అప్పుడే వికసించిన ఎర్ర గులాబీ వంటిది — రాబర్ట్ బర్న్స్.
  • శరీరాల వలె మనసులు కూడా ఆకలి గొంటాయి, మాకు రొట్టెతో పాటు గులాబీలు కూడా ఇవ్వండి. — జేమ్స్ ఒప్పెన్ హీం, "బ్రెడ్ అండ్ రొసేస్".
  • Rose is a rose is a rose is a rose — Gertrude Stein, Sacred Emily (1913), a poem included in Geography and Plays.
  • ఆశావాది గులాబీలను చూస్తాడు కానీ ముళ్ళను కాదు; కానీ నిరాశావాది గులాబీలను మరచి ముళ్ళనే చూస్తాడు - ఖలీల్ గిబ్రన్.

వంద రకాలకు పైనున్న ఈ గులాబీలు అనేక రంగుల్లో ఉండి, అటు వ్యాపారులనూ, ఇటు చూపరులనూ ఆకర్షిస్తుంటాయి.

Roseఅన్ని కాలాలలో పూచే ఈ పూపొద లేక తీగ రోసాసీ జాతికి చెందినది. కాండంపై పదునైన ముళ్ళను భగవంతుడు వీటి రక్షణకోసం కవచంలా ఇచ్చాడేమో!. పూవెంత కమ్మనో ముళ్ళంత కఠినం. గుచ్చుకున్నాయంటే చర్మం గీక్కుని రక్తం కారడం తధ్యం. పొదలుగానూ తీగలుగానూ ఈ మొక్కలు ఉంటాయి.

ఆసియాకు చెందినవీ, యూరోప్, ఉత్తర అమెరికా, వాయవ్య ఆఫ్రికాలకు చెందిన రోజాలు కూడా ఉన్నాయి. పూలన్నీ కూడా సౌందర్యానికి, సువాసనకు, ఆకర్షణకూ, అందానికీ పెట్టింది పేరుగా ఉంటాయి.

గులాబీ పూల నుండి ఆవిరి ద్వారా నూనె తీసి, గులాబీ అత్తరుగా పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా వాడుతున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్, ఆసియా ఇతర దేశాల వంటలలో విరివిగా వాడుతారు. గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్పుకు ఫ్రాన్స్ ప్రసిద్ధి. గులాబీ నూనెను, చర్మ మరియు సౌందర్య  ఉత్పత్తులలో వాడతారు.

గులాబీలను అంటు కట్టడం లేక కొమ్మలను నాటడం ద్వారా వృద్ధి చేస్తాం. గులాబీలు, ఆకర్షించేలా పెంచే తోట మొక్కలుగా, పూల అలంకరణకోసమూ, పూలమాలలు పూగుత్తులు గా ప్రసిద్ధి చెందాయి. అలంకరణలో వీటికి ప్రాధాన్యత మొదటిస్థానంలో ఉంటుంది. ఐతే కోశాక ఒకటి రెండు రోజుల్లో పూరేకులు రాలిపోతాయి. పూలమాలలు రేకులు రాలి ఉత్త తాడు మాత్రమే మిగులుతుంది. అందుకే ‘గులాబీలా గుబాళీస్తూ కొద్దికాలం బ్రతికితేనేం!’ అని అంటారు.

Roseపురాతన గ్రీకులు ,రోమన్లు గులాబీలను వారి ప్రేమ దేవతలైన ఆఫ్రొడైట్, వీనస్ లకు గుర్తుగా భావించేవారు. సబ్ రోసా, లేక "అండర్ ది రోజ్", అనే మాటలకు 'రహస్యంగా ఉంచడం' అనే అర్ధం రోమన్ల వలన ఏర్పడింది.

క్రిస్టియన్లు గులాబీ ఐదు రేకలను క్రీస్తు యొక్క ఐదు గాయాలుగా గుర్తించే వారు. క్రైస్తవ అమర వీరుల రక్తానికి చిహ్నంగా ఎర్ర గులాబీని గుర్తిస్తారు. కన్య మేరీకి గుర్తుగా కూడా గులాబీలు స్వీకరించ బడ్డాయి.

Roseపువ్వు ఆకారం, పరిమాణం, వాసన మరియు ముళ్ళు లేకుండా ఉండటం అనే లక్షణాల కొరకు అనేక వేల రకాల గులాబీల మీద ప్రయోగాలు చేయబడ్డాయి. గులాబీ, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్ దేశాల జాతీయ పుష్పం. కెనడాలో, ఇస్లామాబాద్ కాపిటల్ టెర్రిటరీకి (పాకిస్తాన్లో) ఇవి రాజ్య పుష్పాలు. యునైటెడ్ స్టేట్స్ లోని – ఐయోవా, ఉత్తర డకోటా, జార్జియా, న్యూయార్క్ రాష్ట్రాలకు రాష్ట్ర పుష్పంగా ఉంది ఈ గులాబీ.

చేతిలో పట్టుకున్న ఎర్ర గులాబీ  సామ్యవాదం లేక సాంఘిక ప్రజాస్వామ్యాలకు గుర్తు. అనేక ప్రజాస్వామ్య పార్టీ ల గుర్తుగా కూడా ఉంది. 1968 మే లో పారిసీ వీధులలో నిరసనకారులు ఎర్ర గులాబీని బాడ్జ్ గా ధరించడంతో ఇది ప్రారంభమైంది. తెల్ల గులాబీని రెండవ ప్రపంచ యుద్ధంలో అహింసా వ్యతిరేకులు జర్మనీలో ఉపయోగించారు. ఎర్ర గులాబీ పూల గుత్తి ప్రేమను తెలియ చేస్తుంది. చాలా దేశాలలో ‘వెలంటైన్స్ డే’ బహుమతిగా ఎర్ర గులాబీని ఇస్తారు.

Posted in February 2020, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!