Menu Close
SahitiSirikona_Title

సాహితీ సిరికోన లో ప్రచురించిన కొన్ని కవితలు, పద్యాలు గంగిసెట్టి గారి అనుమతితో సిరిమల్లె పాఠకుల కొరకు ఇక్కడ అందిస్తున్నాము.

మనిద్దరం -- స్వాతి శ్రీపాద

చిక్కని అమవస పొదల మధ్య
ఎదురు చూపుల చంద్రకాంతి  చల్లారిన వేళ
నెలవంక మొలకెత్తినట్టు నీ ఆగమనం
ఊ ఆ అంటూ ఆరంభమైన సంభాషణ
హద్దులను చెరిపేసుకుంటూ ఆర్తి పంచుకుంటూ
వేలికొసల లాలింపు నరనరానా పాకిపాకి
పెదవుల సంభాషణలకు తావైనప్పుడు
అది వ్యామోహమూ కాదు మోహ పారవశ్యతా కాదు
నీకు నేనున్నానన్న అద్భుత సమీకరణ

ఎద పై తలవాల్చి మూసిన కనురెప్పల పల్లకీ పై
నిశ్చింతగా శయనించినట్టు నిరామయ స్థితి
అది నిట్టూర్పుల సెగలపొగల వేడిమీ కాదు
అది తాప వ్యాకులతా కాదు ఆతప రోచిస్సూ కాదు
చంటి పిల్లలా నీ బాహువుల్లో ఒదిగి
సర్వ ప్రపంచాన్నీ మరచిపోవడం  అది భ్రమో విభ్రమో కాదు
ఎప్పుడో యుగాలక్రొతం తప్పిపోయిన
తలపును వెతుక్కున్న సంతృప్తి

పెనవేసుకున్న శరీరాల ఆనందోద్వేగం
కరిగిపోయే లిప్తపాటు మంచుకలకాదు
గాలి వీవనకే ఎగిరిపోయే ఒట్టొట్టి మబ్బుతునకా కాదు
ఎన్ని జన్మల తపస్సిద్ధికో అందిన సమాధి స్థితి కాదూ

తెలుఁగు వంటలు -- శేషగిరిరావు

ఆలూపరోట, చిప్పులు
ఆలుపకోడీలు మఱియు నాలూచక్రాల్
కాలేవు తెలుఁగు వంటలు
వీలైనను తినుము కంద వేఁపుడు శంభూ

అప్పాలు తినక, నీ యూ
తప్పాలు తినంగనేల, తప్పది కాదా
తప్పుల నెన్నితి నంటివి
తప్పులు తామే తమంత తలపడె శంభూ

వరుగులు చిప్సనగా నే
తెరఁగున, పాలక్పనీరు తెలుఁగెట్లగునో
మరి చాంద్బిస్కెట్ తెలుఁగా
అరయఁగ సాంబారు కూడ నఱవే శంభూ

దోసావకాయ యే దోసంబు సేసెనో
గుత్తి వంకాయ కే కొఱఁత గలిగె
గుమ్మడి వడియాలు, కూర వడియములు,
ముక్కల పులుసులే మూలఁబడెనొ
మజ్జిగ పులుసు యే మాటున దాగెనో
మెంతిమజ్జిగ కేమి మించి పోయె
చంద్రకాంతలు యేవి, స్వర్గాని కెక్కెనో
మృష్టాన్న మేలనో మృగ్య మయ్యె
ముద్ద పప్పుకు మజ్జిగ పులుసు తోడు
లేక పోయినఁ జవికినిఁ గాక యుండు
మెంతుల పులుసు లేకున్న గొంతు దిగునె
కంది పచ్చడి వేయేల గాక శంభు

పెక్కు లాంధ్రపాకమ్ముల విస్మరించి
పెఱల నెన్నింటినేల యేకరువు బెట్ట
అన్నపూర్ణమ్మ కరుణ నీ కందుఁ గాత
చవులు చేకూర నాంధ్రభోజనము శంభు

(ఒకానొక పాకముల పట్టిక నాకు “ఆంధ్రపాకములు” అని పంపి యీ పద్యములకు కారణభూతుఁడైన నా మిత్రుఁడు శంభుప్రసాదుకు అంకితము)

తెల్ల వారింది... -- కల్లూరి కృష్ణకుమార్

మూలం: అతల్ బిహారీ వాజపాయ్
అనువాదం: కృ.తి.

తెల్ల వారింది...
అయితే నేం?..
తూర్పు దిక్కున మబ్బులు కమ్మాయి..
దూది కంటే మెత్తగా
ఆవరించిన పొగమంచుకు
మైలు రాళ్ళన్నీ గాయపడ్డాయి...
పాదాలు మొద్దుబారాయి...
ఊరు మరుగున పడింది....
అంతా అచేతనం!
అడుగు ముందుకు పడ్డంలేదు...
నన్ను నేనే
ఇతరుల దృష్టి తో చూడగలుగుతున్నా...
మౌనంగా ఉండలేక పోతున్నా...
ఏ పాటా పాడలేక పోతున్నా...

ఊర్పుల నిప్పు రవ్వలతో
వేడెక్కుతోంది శీతాకాలం...
బారు తీరిన వృక్షాలు మాత్రమే
హిమపాతానికి విజయ కేతన మవుతున్నాయి...
గూడు చెదిరి పోయినా
చెట్టు చిరునవ్వు వీడలేదు...
కన్నీళ్ళే మిగిలినా,
నవ్వు జాడ లేకున్నా,
మంచు ప్రవాహం ఒడ్డున
నాలో నేనే ఒంటరిగా
నెమ్మదిగా గొణుక్కుంటున్నా

మౌనంగా ఉండలేక..
పాట పాడలేక...

నీ కళ్ళకొక -- ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

నీ కళ్ళకొక భయం పొరనతికించి
నిన్ను నిర్భయంగా వీక్షించమంటారు
నీ తలమీదొక కత్తిని వ్రేలాడదీసి
నిన్ను ప్రశాంతంగా కూర్చోమంటారు
నీ కాళ్ళకు సంకెళ్ళు వేసి
నిన్ను స్వేచ్ఛగా తిరగమంటారు
నీ కంచంలో పిండాలు పెట్టి
నిన్ను రుచులనాస్వాదించమంటారు
ఇచ్చీ ఇవ్వకపోవడమే
రాజ్యలక్ష్మి గడుసుతనం!
ధైర్యం చెప్పీ
అధైర్యపరచడమే ఆ విజయరహస్యం!

Posted in February 2020, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!