Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు

రామ కత విందామా
రామాయణం కమనీయం
భారతం రమణీయం .... అంటారు కొందరు
రామాయణం రంకు
భారతం బొంకు ..... అంటారు మరికొందరు

ఈ పురాణాలు ఆర్యుల కతలు
ద్రావిడులపై రుద్దిన వెతలు  ....  అని అన్నారు

రామాయణం ఆదికావ్యం
సీతారాముల ప్రేమ దివ్యం ... అని అన్నారు

రామాయణం విష వృక్ష రీతి
రాముడు ఆర్య సంస్కృతి వికృతి  ... అని అంటారు

ఎవ్వరేమన్నా
రామాయణం జరిగినా
జరగకపోయినా
మానవతపు వాదంతో
మానవ జీవన నాదంతో
రామ చరితను ఆస్వాదిస్తే
పునీత సీతను అనుసరిస్తే
రాముని సుగుణాలు మనకి మూలధనాలు
సీతమ్మ మనోనిగ్రహం జాతికి రత్నదీపాలు

ప్రభుభక్తి హనుమ వాక్ చాతుర్యం
లక్ష్మణ సోదర భావ లక్షణం
వానర పక్షి జాతుల త్యాగఫలం
శూర్పణఖ కామావేశం
మారీచుని రాక్షసనీతి
రావణుని పరస్త్రీ వ్యామోహగతి
తార చతురత ఘనత
సుగ్రీవుని మిత్రసంచరిత
ఇవ్వన్నీ పుక్కిటి పురాణాలైనా
పురాణంలో ఎన్నెన్ని గుణ సుగుణాలో

ఒక్కసారి మనుషులుగా
మరొక్కసారి మనసున్నవారిగా
లోతుపాతులు పరిశీలిస్తే
నీతిరీతులు పరిశోధిస్తే
ఎన్నెన్ని వ్యక్తిత్వాలు
వన్నెల చిన్నెల సుగుణాలు
రామకథలు వింటే చాలదు
శ్రీరామనవములు చేస్తే చాలదు
పట్టు వస్త్రాలు కప్పితే రాదు పుణ్యం
రామకథ లోని అంతరార్థం
సీతారాముల జీవన విధానం
తల్లిదండ్రులను గౌరవించడం
అన్నదమ్ములను సేవించడం
పరస్త్రీ కాముక వినాశనం
ప్రజల కొరకు సుపరిపాలన
అన్నీ గమనించి ఆచరించడమే రామకత
సీతారాముల గుణాలు పొందడమే రామకత
కతలోని నీతిని వదిలేస్తాం
కతలో కల్పన ఆదరిస్తాం
లక్షదీపాలు వెలిగిస్తాం
మనలో ఆత్మదీపాన్ని వెలిగించం
లక్ష పత్రాలతో పూజిస్తాం
రాముని ఒక్క లక్షణం ఆచరించం
ఆరాధన పెరిగింది
ఆచరణ తగ్గింది
కతలో పదార్థాలను పట్టుకుంటాం
కతలో పరమార్థాన్ని వదిలేస్తాం
రామయ్యను పూజిస్తాం
మన అయ్యను వదిలేస్తాం
పార్వతమ్మను పూజిస్తాం
మన అమ్మను విదిలిస్తాం
ఇదేనా నా రామకత ఫలితం
ఇదేనా నా జాతి నీతి లక్షణం
ఓం శాంతి శాంతి శాంతిః

Posted in February 2020, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!