Menu Close
ParuguKatha

ప్రియమైన నాన్నకు,

చాలా రోజుల తర్వాత వుత్తరం రాయటానికి ప్రయత్నం చేస్తున్నాను. అసలు ఈమధ్య ఫోన్లలో మాట్లాడటం బాగా అలవాటైపోయి ఇలా వుత్తరం రాయాలంటే ఏదో కొత్తగా, తమాషాగా వుంది. కానీ నా మనసులోని భావాలన్నీ వివరంగా చెప్పాలంటే ఫోనులో కంటే ఇలా కాగితమే బాగుంటుంది అనిపించింది. అదీగాక చాలా రోజుల తర్వాత ఈమాత్రం టైము దొరికింది. అందుకే కాగితం, కలం తెచ్చుకుని ఇలా కూర్చున్నాను. మీ కోడలు ఇంకా హాస్పిటల్ లోనే వుంది. నార్మల్ డెలివరీ కాబట్టి బహుశా రేపు ఇంటికి పంపించేస్తారు. ఇప్పటిదాకా హాస్పిటల్ లో వాళ్ళ దగ్గరే వుండి ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఎలాగైనా మీకు ఈ వుత్తరం ఇవాళ రాయాలని ఇదుగో, ఇలా బలవంతంగా కూర్చున్నాను. చిన్నవాడు చాలా బాగున్నాడు. ఎంతో ముద్దొస్తున్నాడు. అందరూ నా పోలికే అంటున్నారు. సమయానికి మీరు, అమ్మ ఇండియా వెళ్ళాల్సివచ్చింది కానీ లేకపోతే మీరు కూడా ఈ సమయంలో ఇక్కడే వుండేవారు. మీ మనవడిని చూసి ఎంతో ఆనందించేవారు. వాడిని చూస్తున్నకొద్దీ నాలో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. చూడటానికి వేలెడంత లేడు. కానీ ఎన్ని పెద్ద పెద్ద బాధ్యతలు తీసుకొచ్చాడో నాకోసం! కానీ ఆ బాధ్యతలలోనే ఏదో తెలియని ఆనందం, ఎంతో తృప్తి. నాకు తెలుసు, నేను పుట్టినపుడు మీరు కూడా ఇలాగే ఆనందించివుంటారు. ఆనందంతో పాటు బాధ్యతలని కూడా మీరు చాలా బాగా నిర్వహించారు. నేను కూడా ఈ బాధ్యతల నిర్వహణకి అప్పుడే అనేక పథకాలు వేయటం మొదలెట్టేశాను. కానీ నాన్నా! పిల్లల బాధ్యతల విషయంలో మనిద్దరి గమ్యాలు ఒకటే అయివుండచ్చు. కానీ ఆ గమ్యాన్ని చేరే మార్గాలు మాత్రం మనిద్దరికీ పూర్తిగా వేరు. నాన్నా! చిన్నప్పటి నుండీ ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మీకు చెప్పాలని నేనెంతో అనుకున్నాను. కానీ పిల్లలకుండే సహజమైన భయం, సంకోచాల వలన ఆపనెప్పుడూ జరగలేదు. ఆ భావాలు, బాధలు, నా మనసు లోతుల్లో అణిచేసాను. కానీ ఇవాళ ఎందుకో అవన్నీ బయటికి చెప్పుకోవాలని అనిపిస్తోంది. అందుకే ధైర్యాన్ని కూడదీసుకుని ఇలా వుత్తరం రాయటం మొదలెట్టాను. అసలు మనసు లోని భావాలను ఏమాత్రం సంకోచం లేకుండా స్పష్టంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే ఇంకా బాగుంటుంది.

నాన్నా! తల్లిపాలు తాగిన పిల్లలు చాలా తెలివికలవారు అవుతారని, బాగా చదువుతారని, పెద్ద పేరున్న యూనివర్సిటీలలో ఎడ్మిషన్ తెచ్చుకోగలరని, అన్నిటికంటే ముఖ్యం, అందరిలోనూ ముందుగా వుంటారని, నాకు ఎక్కువ రోజులు తల్లిపాలు ఇవ్వాలని అమ్మ మందులు అవీ తీసుకుని నా చిన్నప్పుడు చాలా తిప్పలు పడిందిట. అంటే అందరిలోనూ నన్ను ముందు వుంచాలన్న తపన నేను పుట్టినప్పటినుండే మొదలయిందన్నమాట. తల్లిపాల వలన మంచి ఆరోగ్యం వస్తుందన్న విషయం కంటే పెద్ద పెద్ద పేరున్న యూనివర్సిటీలలో సీట్లు సంపాదించుకోగలరన్న ఆశలే అమ్మని ఎక్కువ ఆకర్షించాయనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఫేమిలీలో అమ్మ తోబుట్టువుల పిల్లలందరూ చాలా తెలివైనవాళ్ళుట. చదువులో ఎప్పుడూ ఫస్టున వుంటారట. పెద్దయిన తర్వాత వాళ్ళలాగే నేను కూడా పెద్ద చదువులు పెద్ద పేరున్న చోట్లలో చదవాలని మీరిద్దరూ నా చదువు విషయంలో చాలా జాగ్రత్త పడేవారు. చిన్న క్లాసుల నుండి పెద్దయి కాలేజ్ కు వెళ్ళేదాకా చదువులో ఎప్పుడూ నేను ఫస్టున వుండాలని కోరుకునేవారు. ఒక్క కోరికే కాదు, దాని కోసం మీరు హైరాన పడి నన్ను హైరాన పెట్టేవారు. ఒక్కోసారి పొరపాటున ఏ సబ్జెక్టులోనైనా కొంచెం గ్రేడు తక్కువ వస్తే ఇంక ఆరోజు ఇంట్లో అయ్యే గొడవ అంతా ఇంతా కాదు. తోటి ఇండియన్ పిల్లలందరూ బాగా చదువుతున్నారు, నువ్వు వారందరికంటే ఇంకా బాగా చదవాలి అని చిన్నప్పటినుండీ మీ స్నేహితుల పిల్లలతో వంతులు వేసేవారు. తమ పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా వృద్ధిలోకి రావాలని తల్లితండ్రులు కోరుకోవటంలో తప్పు లేకపోయినా ఆ ఒత్తిడి వారిమీద పెట్టటం, వేరేవారితో వారిని పోల్చటం, దానికోసం అస్తమానం వారి వెంట పడటం ఉచితమేనా?

చదువొక్కటే కాదు, వేరే విద్యలలో కూడా నేను అందరిలోనూ ఉన్నతంగా వుండాలని మీకు చాలా కోరికగా వుండేది. తల్లితండ్రులుగా పిల్లల గురించి అలా కోరుకోవటంలో ఏమీ తప్పు లేదు. కానీ దానికోసం ఆ పిల్లల శక్తిసామర్థ్యాలు, ఆసక్తి ఏమాత్రం చూడకుండా, వారిని ప్రతి విషయంలోనూ తొయ్యటం తప్పు. నాకు చిన్నప్పటి నుండీ స్పోర్ట్స్ లో ఏదో చిన్న ప్రవేశమే తప్ప ఎటువంటి ప్రావిణ్యతా ఏమాత్రమూ వుండేది కాదు. అసలు ఏ స్పోర్ట్స్ తోనూ ప్రమేయమేదీ లేకుండా ఒక మూల ఒంటరిగా ఏదైనా పుస్తకం చదువుకుంటూ కూర్చుంటే ఆనందంగా వుండేది నాకు. కానీ మీ స్నేహితుల పిల్లలు స్పోర్ట్స్ లో ఛాంపియనులు అయ్యారని, స్పోర్ట్స్ కోటా లో మంచి మంచి యూనివర్సిటీలలో వాళ్ళకి సీట్లు దొరికాయని నాకు లేని ప్రావీణ్యతని ఎక్కడనుండి తేగలను నేను? అక్కడికీ మీ పోరు పడలేక సాకరు, టెన్నిసు, బాస్కెట్ బాల్ లాంటి గేములన్నీ మొదలైతే పెట్టాను కానీ దేంట్లోనూ రాణించలేకపోయాను. స్పోర్ట్స్ లో వుండాల్సిన శక్తిసామర్థ్యాలు నాకు కొంచెం కూడా లేవు.

అసలే నేను అంత మాటకారిని కాదు. తమ వాగ్దాటితో ఎదుటివారిని మంత్రముగ్ధులను చేసే చాకచక్యం నాకు లేదు. అందుకే మీ పోరు పడలేక నేను డిబేట్లు వాటిల్లో పాల్గొన్నా, విపరీతమైన ఆత్మన్యూనతతో నిండివున్న నేను ఎప్పుడూ ఏ డిబేట్లలోనూ గెలవలేదు. ఆత్మవిశ్వాసంతో సరిగ్గా మాట్లాడటం కూడా రాని నాకు పోటీలలో గెలిచేంత వాగ్ధాటి ఎక్కడిది?  గెలుపు సంగతి దేవుడెరుగు, అసలు స్టేజ్ ఎక్కి నలుగురి ముందూ ధైర్యంగా మాట్లాడాలంటేనే నాకు కాళ్ళు వణికేవి. పైగా మాటిమాటికీ ఇలా రకరకాల పోటీలలో పాల్గొనటం, వాటిల్లో ఓడిపోవటంతో నాలో ఏమూలో మిగిలివున్న ఆ కాస్త ఆత్మవిశ్వాసం కూడా విరిగి వెయ్యి చెక్కలైంది. నా శక్తిసామర్థ్యాన్ని గ్రహించి నా హద్దుల్లో నేను వుంటే నాకు చేతనైన విద్యలలోనే నేను అడుగు పెట్టేవాడిని. అప్పుడు నాది ఇలా గెలుపు అన్నది తెలీని జీవితం అయ్యేది కాదు. అలా కాకపోయేసరికి అడుగు పెట్టినచోటల్లా ఓటమే ఎదురయింది నాకు. అలా మాటిమాటికీ ఎదురైన ఓటమి నన్ను ఇంకా అసమర్థుడిగా మార్చేసింది.

సంగీతమంటే చిన్నప్పటినుండీ నాకు ఇష్టమే! కానీ అది వినడం వరకే! పాడటానికి నాకు కంఠమూ లేదు, నేర్పరితనం అంతకంటే లేదు. ఈ విషయం మీరు అర్థం చేసుకునేవారు కాదు. డబ్బు దండగ, టైము వేస్టు అవటం తప్ప నేను సంగీతం నేర్చుకోవటం వల్ల ఏమీ సాధించలేకపోయాను. అలాగే డాన్సు కూడా. నాకు డాన్సు చూడటం, చూసి ఆనందించటం ఇష్టమే! కానీ డాన్సు చేయగల శక్తి నాకు లేదు. కళలన్నవి దేవుడిచ్చే వరాలు. అవి అందరికి లభించవు. సాధన చేసి ప్రావీణ్యత సంపాదించటానికయినా మొదలు పెట్టడానికి అసలు కొంచెం అయినా శక్తి వుండాలి కదా! అసలే డాన్సు చేయటం సరిగ్గా రాదు. దానికి తోడు అంత నిర్దోషంగా లేని నా శరీరాన్ని ప్రదర్శిస్తూ నలుగురిలో నాట్యం చెయ్యాలంటే నాకు తగని సిగ్గుగా వుండేది. అయినా మీరు నా మాట వినేవారు కాదు. ఎందుకంటే మీ స్నేహితులు, చుట్టాల పిల్లలందరూ మ్యూజిక్ తోపాటు డేన్సు కూడా నేర్చుకుంటున్నారు, ప్రదర్శనలు ఇస్తున్నారు, కాబట్టి నేను కూడా నేర్చుకోవాలి. అంతే తప్ప నాకిష్టం ఉందా లేదా అన్న విషయానికి మీరెప్పుడూ ప్రాముఖ్యత ఇవ్వలేదు. అందుకే ఏదో మీ తాపత్రయమే తప్ప ఈ కళలలో నేనేమాత్రమూ రాణించలేకపోయాను. అందుకే నలుగురిలోనూ నవ్వులపాలు అవటం తప్ప ఎప్పుడూ నాకేమీ మిగలలేదు.

ప్రతివారికి వారి వారి స్వంత అభిరుచులు, కోరికలు వుంటాయి. కలలు, గమ్యాలు వుంటాయి. అందరి శక్తిసామర్థ్యాలు ఒకేలాగా వుండవు. అలాంటప్పుడు నేను నాలాగానే వుంటాను కానీ వేరేవారిలాగా ఎందుకు వుంటాను? ఎందుకు వుండాలి? ఈ విషయం మీకెందుకు తోచలేదో నాకు తెలీదు. కానీ నా మీద మీరు తీసుకొచ్చే ఈ ఒత్తిడి మాత్రం నాకు భరించశక్యంగా వుండేది కాదు. ప్రతీ విషయంలోనూ ఈ పోటీ చెల్లదు. అందరు అన్ని విషయాలలోనూ నేర్పరులు ఎన్నటికీ కాలేరు. అలాగే అందరికంటే అన్ని విషయాలలోనూ అస్తమానూ మనమే ముందు వుండాలి అన్న ఆలోచన కూడా అంత ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే అప్పుడది ఒక మంచి పోటీలా కాకుండా అత్యంత అపాయకరమైన స్వార్థంలాగా మారుతుంది. అందుకే చిన్నప్పటినుండీ ఈ వంతులు, పోటీలలో పెరిగిన నేను నాకు తెలీకుండానే వీటన్నిటి మీద ద్వేషం పెంచుకున్నాను. మనం మనంలాగా నేచురల్ గా, ఫ్రీగా వుండాలి కానీ వేరేవాళ్ళతో పోల్చుకుంటూ వాళ్ళలాగా కానీ, వారికంటే ఉన్నతంగా కానీ ఉండాలన్న తాపత్రయం ఎందుకు? ఈ వంతులకి, పోటీలకి ఇంక అంతం ఎక్కడ?

చిన్నప్పుడు నాకంతగా తెలియకపోయినా పెద్దయిన కొద్దీ ఈ భావాలన్నీ ఎప్పుడూ నాలో చెలరేగుతూ వుండేవి. మిమ్మల్ని ఎదిరించాలంటే నాకు భయం. అసలు మీముందు మీకు వ్యతిరేకంగా ఏదన్నా అనటానికే నోరు తెరుచుకునేది కాదు నాకు. అలా అని మీ ఆకాంక్షలన్నీ తీర్చాలన్న ఆసక్తి, తీర్చగల శక్తి నాకు వుండేవి కావు. ఈ రెండింటి మధనంలో నేను మానసికంగా నలిగి నలిబిలి అయ్యేవాడిని. అసలే నేను అంత ఆత్మవిశ్వాసం వున్న మనిషిని కాను. దానికి తోడు నా చదువు, నడవడిక, ప్రవర్తనల మీద మీరు అనుక్షణం పెట్టే ఆంక్షలు, నామీద మీకున్న అనేక ఆకాంక్షలు, వాటన్నిటినీ తీర్చలేనేమోనన్న నా భయాలు, తీర్చకపోతే ఎలా అన్న శంకలు, వీటన్నిటి మధ్య నా వ్యక్తిత్వం నలిగి ముడుచుకుపోయింది. అందుకే మీ భయానికి కూర్చున్న చోటు నుండి కదలకుండా ఎప్పుడూ చదువుతూవుండటం వలన చదువులో ఎప్పుడూ ఫస్టున వుండే నేను ఆత్మవిశ్వాసంలో ఎక్కడో అడుగున వుండేవాడిని. ధైర్యంగా నలుగురిలో నిలబడాలంటే  కూడా నాకు ఆత్మస్ఠైర్యం వుండేది కాదు. పెద్దయిన తర్వాత ఈ భయాన్ని, అభద్రత ని మనసు అడుగుల్లో దాచేసి బైటికి నిబ్బరంగా వున్నట్లు నటించటాన్ని అలవాటు చేసుకున్నాను. కానీ మనసు లోతుల్లో తొంగి చూస్తే నేను చాలా పిరికివాడిని. అసమర్థుడిని. చదువు తప్ప ఇంకా వేరే ఏదీ తెలియని నూతిలోని కప్పని.

ఇంత ఊగిసలాడే వ్యక్తిత్వం తో వున్న నేను అసలు ఇవాళ ఈమాత్రంగా కూడా ఉంటానని ఏమాత్రం అనుకోలేదు. నాకు తెలుసు, నన్ను డాక్టర్ని చేయాలని మీరు చిన్నప్పటినుండీ చాలా కోరుకున్నారు. ఎందుకంటే మీ చుట్టాలు, స్నేహితుల పిల్లలందరూ మెడిసన్ చదివి డాక్టర్లయ్యారు. అందుకని మీ అబ్బాయి కూడా డాక్టరే అవ్వాలి. నలుగురిలో మీ స్టేటసు ఇంకొక మెట్టు పైకెక్కాలి. పైగా మీ దృష్టిలో డాక్టర్ల సంపాదనే వేరు. సంఘంలో వారి పరపతే వేరు. కానీ చిన్నప్పటి నుండీ నాకు సైంటిష్టుని అవ్వాలని వుండేది. బయటి ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా, బయటివారితో ఏ ప్రమేయం లేకుండా, చక్కగా నా లేబ్ లో నేను ప్రయోగాలు చేసుకుంటూ వీలైతే సమాజానికి ఉపయోగపడేదేదైనా కనిపెట్టచ్చు అని చాలా కలలు కనేవాడిని. కానీ నా కోరిక తీరలేదు. ఎందుకంటే మళ్ళి మీ ఉద్దేశాలు, కోరికలు నామీద రుద్దబడ్డాయి. ఇలా మన కోరికలని, ఆసక్తులని చంపుకుని ఎంతకాలం ఎదుటివారి కోసం బతుకుతాం? ఇలాగే జీవితం కొనసాగిస్తే కొన్నాళ్ళకి అసలు మనకేం ఇష్టమో మనమే మర్చిపోతాం. నేను కూడా అలాగే నా సైంటిష్టు కోరికను మనసు లోపల ఎక్కడో నొక్కేసి, దాని సంగతి పూర్తిగా మర్చిపోయి మెడిసన్ లో జాయిన్ అయ్యాను. కానీ ఒక్క చదువులో తప్ప ఇంకా వేరే దేంట్లోనూ కేవలం ఏదో కొంచెం ప్రవేశమే తప్ప ఎటువంటి ప్రావీణ్యతా లేని నాకు పెద్ద పెద్ద పేరున్న యూనివర్సిటీలలో ఎడ్మిషన్ రాలేదు. ఏదో ఒక మారుమూల వూళ్ళో ఏ పేరూ లేని, ఎవరికీ తెలియని ఒక మెడికల్ కాలేజ్ లో ఎడ్మిషను దొరికింది. నాకు తెలుసు, మీరు చాలా ఆశాభంగం చెందారు. అయినా ఇంక చేసేదేమీ లేదు కాబట్టి మీ కోరికలో కనీసం సగం అన్నా తీరిందని సరిపెట్టుకున్నారు. సరే,  మంచో, చెడో, మెడిసన్ లో చేరిన తర్వాత ఇంక చేరేసాను కాబట్టి శ్రద్ధగా చదివాను. అయినా మానవ సేవ చేయటానికి సైంటిష్టయితేనేం, డాక్టరయితేనేం? మెడిసన్ అయిన తర్వాత రోగులతో డైరెక్టు ఇంటరాక్షన్  లేని రేడియాలజీ లో రెసిడెన్సీ చేసాను. ప్రాణం వున్న మనుషుల తో కాకుండా ప్రాణం లేని వారి ఇమేజ్ లతో అనుక్షణం కుస్తీలు పట్టే ఉద్యోగాన్ని ఎన్నుకున్నాను. అమ్మయ్య, ఎవ్వరితోనూ డైరెక్టుగా మాట్లాడక్కరలేదు, ఈ ఎక్సరేలతో తప్ప, అసలు రోగుల ముఖమే చూడక్కరలేదు అనుకుని ఎప్పుడూ హాయిగా ఫీల్ అయ్యేవాడిని. నా మనసులోని ఈ అలజడి మీకేమాత్రము తెలియదు. మీరు కోరుకున్నట్లుగా ఆదాయం, సంఘంలో గౌరవం పుష్కలంగా వున్నాయి కాబట్టి మీరిద్దరూ కూడా సంతృప్తిగానే వున్నారు.

డాక్టరుగా, ఫరవాలేదు, మంచి పేరే తెచ్చుకున్నాను. దీనికి కారణం డబ్బుతో సంబంధం లేకుండా ఇతరులకు సేవ చేసి వారి జబ్బులను నయం చేయగల శక్తి నాకు వుండటమే! కానీ దీనికంటే కూడా ముఖ్య కారణం నేను రోగుల తో ఎప్పుడూ ముఖాముఖీ కలిసే అవసరం లేకపోవటమే అని చాలామందికి తెలీదు. ఒక డాక్టరుగా కావలిసిన పరిజ్ఞానమైతే వుంది కానీ రోగుల తో చక్కగా మాట్లాడగలగటం, అవసరమైతే వారితో అరుచికరమైన విషయాలని కూడా  వారి మనసుని నొప్పించకుండా చెప్పగల మాటల చాతుర్యం నాకు లేదు.   ఇలాగే నా భయాలని, బలహీనతలని  మౌనమనే దుప్పటితో కప్పి దాచుకునేవాడిని. నా మౌనాన్ని అందరూ గంభీరమనుకునేవారు. నా పిరికితనాన్ని, తటపటాయింపుని చూసి అందరూ చాలా నెమ్మదస్తుడు, దేంట్లోనూ గభాల్న దూకడు, ఆలోచన ఎక్కువ అనుకునేవారు. ఈ పైన పటారం లోన లొటారం సంగతి ఎవరికీ తెలిసేది కాదు.

కానీ నామీద మీ ఆశల ప్రవాహం అంతటితో ఆగలేదు. ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చినపుడు కూడా డాక్టరునే పెళ్లి చేసుకోవాలని మీరు పట్టుపట్టారు. అసలు మీకు ఈ డాక్టర్ల పిచ్చి ఇంతగా ఎందుకుందో నాకు తెలీదు.  గౌరవప్రదమైనవి, ఆదాయం ఎక్కువగా వున్న వృత్తులు ఇంకా చాలా వున్నాయి. అయినా ఈ డాక్టర్ల గ్లామరు అమెరికాలో మన ఇండియన్సుకే ఎక్కువగా ఉందేమో! మీకు తెలిసిన వాళ్ళ డాక్టర్ల పిల్లలందరూ డాక్టర్లనే చేసుకున్నారు, అప్పుడే కుటుంబ గౌరవం ఇంకో మెట్టు పెరుగుతుంది అని మీ అభిప్రాయం. సరే, మీరు చూపించిన అమ్మాయిలో డాక్టరు అని తప్ప నాకు నచ్చని విషయాలేమీ లేవు. అందుకే ఈ పెళ్లి వలన నేను కూడా సంతోషంగానే వున్నాను. కాకపోతే రాత్రి పగలు తేడాలు లేకుండా డ్యూటీలు చేసి అలసి సొలసి ఇంటికి వస్తే భార్య కూడా డ్యూటీకి వెళ్ళటం వలన ఖాళీ ఇల్లు స్వాగతం చెప్పే బదులు కనీసం ఒక కప్పు కాఫీ ఇవ్వటానికయినా ఇంట్లో ఎవరన్నా వుంటే బాగుండేది అని ఎన్నోసార్లు అనుకున్న మాట మాత్రం నిజం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్ప నా వైవాహిక జీవితం బాగానే గడిచింది.

నాన్నా! ఇలా మిమ్మల్ని, అమ్మని విమర్శిస్తున్నానని అనుకోకండి. మీరిద్దరూ ఎంతో శ్రమ పడి, క్రమశిక్షణతో నన్ను పెంచటం వలనే ఈనాడిలా డాక్టరునవ్వగలిగాను. మంచి వృత్తిలో వున్నాను. సంఘంలో గౌరవనీయమైన స్థానంలో వున్నాను. ఈ విషయం నేనెప్పుడూ మర్చిపోలేను. కానీ క్రమశిక్షణ వేరు, ఎదుటివారి ఇష్టాయిష్టాల్ని పట్టించుకోకుండా అస్తమానూ వారు తమ అధీనంలోనే వుండాలని ఆంక్షలు పెట్టడం, వారి మీద తమ కోరికలు రుద్దటం వేరు. ఈ రెండింటిలోనూ  మీరెప్పుడూ తేడా చూపించలేదు. అయినా అనుక్షణమూ ఎవరితోనో పోల్చుకుంటూ, వారిలాగా వుండాలి, లేక వారికంటే ఇంకా ఎక్కువగా వుండాలి అని మన స్వంత అభిరుచులను అణచుకొని ఎవరికోసమో అబద్ధపు బతుకు బతకటం నాకు నచ్చదు. వారితోనూ, వీరితోనూ పోల్చుకుంటూ పోతే ఇంక ఆ పోటీకి అంతే వుండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకరిని మించినవారు ఇంకొకరు ఎప్పుడూ వుంటూనే వుంటారు. అయితే మరి మనం మనంగా ఇంక ఎప్పుడు బతుకుతాం? మన పిల్లలు మంచి చదువులు చదవాలి, అందరికంటే వున్నత స్థానంలో వుండాలి, వృద్ధిలోకి రావాలి అని కోరుకోవటంలో ఏమీ తప్పు లేదు. కానీ దానికోసం అస్తమానూ వారి వెంట పడి, వారి శక్తిని గుర్తించకుండా వారిని న్యూనత పరుస్తూ, ఎప్పుడూ అన్యులతో పోలుస్తూ, అందరికంటే నువ్వే ముందున వుండాలి అన్న అర్థం పర్థం లేని పోటీలకి వాళ్ళని ప్రోద్బలం చేయటం మాత్రం సరియైన పధ్ధతి కాదు. కనీసం నాకు అలా అనిపించేది. పిల్లలకి సరైన దారి చూపిస్తూ, వారి ఆసక్తులను గమనిస్తూ వారికి గైడెన్సు ఇవ్వటం వేరు, తమ ఆలోచనలని వారిపై రుద్దుతూ, వేరేవారితో వారిని పోలుస్తూ వారి ఆలోచనలని, చలనాన్ని డిక్టేట్ చెయ్యటం వేరు. క్రమశిక్షణ మనిషి పురోగమనానికి దోహదం చేయాలి కానీ వారి స్వేచ్చని ఆటంకపరుస్తూ, వారి వ్యక్తిత్వాన్ని ముడుచుకునేలా చేయకూడదు. అందుకే మీరు పెట్టే ఆంక్షలు, నామీద తీసుకొస్తున్న వత్తిడుల వెనక నామీద మీరు పెట్టుకున్న ఆశలు, నా ఉన్నతిని కాంక్షిస్తున్న మీ కోరికలు నాకు తెలిసినా, నా కోరికలను చంపుకుని అస్తమానూ ఎవరో ఒకరితో పోటీబడటం, ఎవరో ఒకరితో పోల్చుకోబడటం నాకు నచ్చేవి కావు. అనుక్షణం నా మనసులో రగిలే ఈ ఆంతరంగిక మధనంలో నా ఆత్మవిశ్వాసం పూర్తిగా నలిగి  చిన్నాభిన్నమైపోయింది. నా ఆత్మబలం ముక్కలుముక్కలైపోయింది. అందుకే మా అబ్బాయిని నేను అలా పెంచకూడదని నిర్ణయించుకున్నాను. వాడి పట్ల నాకున్న కోరికలను వ్యక్తపరిచేముందు వాడి అభిరుచులేమిటో అని ఆలోచిస్తాను. ఏ విషయంలోనైనా సరే, నాకు కాదు, వాడికి ఆసక్తి ఉందా లేదా అని ముందు ఆలోచిస్తాను. వాడికి అన్ని విషయాలలోనూ పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. అందుకే అన్నాను నాన్నా, పిల్లల పెంపకం విషయంలో మనిద్దరి గమ్యాలు ఒకటైనా వాటి దారులు వేరని. నా ఈ ప్రయత్నంలో నాకు విజయం లభించాలని దీవించండి నాన్నా! మీకు, అమ్మకి నా నమస్కారములు. మీరిద్దరూ ఇక్కడికి ఎప్పుడు తిరిగి వస్తారని మేం ఇద్దరం ఎంతో ఆతురతతో ఎదురుచూస్తున్నాము. ఆడుకోవటానికి మీకు ఇప్పుడు ఒక అందమైన బొమ్మ కూడా వుంది ఇక్కడ. నేను వ్యక్తపరచిన అభిప్రాయాలని తప్పుగా అర్థం చేసుకోరన్న నమ్మకంతో,

మీ అబ్బాయి,

రాంబాబు

వుత్తరం చదివి ఒక్కసారి గట్టిగా వూపిరి పీల్చుకున్నాడు శ్రవణ్. తను చదివినదంతా పూర్తిగా ఆకళింపు చేసుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది.

"నాన్నా! దేనికోసమో స్టడీ రూం లో వెతుకుతుంటే  పుస్తకాల మధ్య ఈ వుత్తరం కనిపించింది" అన్నాడు ఉత్తరాన్ని వాళ్ళ నాన్నకిస్తూ.

రాంబాబు ఉత్తరాన్ని ఒక్కసారి గబగబా చదివేసాడు. ఒక్కసారి ఏవేవో జ్ఞాపకాల వెల్లువలో మునిగి ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. చెమర్చిన కళ్ళని మెల్లిగా తుడుచుకున్నాడు.

"ఇది తాత దగ్గర వుండాలి కానీ మన స్టడీ రూం లో ఉందేమిటి నాన్నా?" అని అడిగాడు శ్రవణ్.

రాంబాబు ఒక్కసారి తలెత్తి కొడుకు వైపు చూసాడు. గట్టిగా వూపిరి పీల్చుకున్నాడు. "రాయటమైతే రాసాను కానీ నాన్నకి ఇది పంపలేదు నేను" అన్నాడు మెల్లిగా. "మనసు లోని బాధ కాగితం మీద పెట్టగానే కాస్త తగ్గింది. నాకోసం ఎంతో కష్టపడి, నన్ను పెంచి పెద్ద చేయటానికి ఎన్నో తాపత్రయాలు పడిన అమ్మ, నాన్నల మనసును నొప్పించకూడదని ఈ ఉత్తరాన్ని అసలు మెయిలే చెయ్యలేదు. మంచో, చెడో వారికి తోచిన రీతిలో వారు పెంచారు. నేను బాగానే వున్నాను కదా! ఇవన్నీ చెప్పటం వలన లాభం ఏమిటి? తమ భావాలని దిద్దుకుని సరిగ్గా పెంచటానికి నా తర్వాత వేరే ఎవరూ లేరు కూడా కదా! వారి పధ్ధతి నాకు నచ్చకపోతే దానిని నేను పాటించక్కరలేదు, అంతేకాని మాటలతో వారి మనసు నొప్పించటం ఎందుకు? అందుకే ఇది నాదగ్గరే వుంచేసుకున్నాను" అన్నాడు రాంబాబు మెల్లిగా.

"నాన్నా! చిన్నప్పటి నుండీ నాకు మీరు అన్ని విషయాలలోనూ పూర్తి స్వాతంత్యాన్ని ఎందుకు ఇచ్చారో ఇప్పుడు తెలిసింది. బాల్యం నుండీ మీరు పడిన మానసిక మధనం లోనుండి పుట్టిన వెన్నని నాన్నా నేను! అందుకే నాకు కలినరీ ఆర్ట్స్ లో ఆసక్తి వుందని చెప్పినపుడు నేనే ఆశ్చర్యం పొందేలాగా వెంటనే నన్ను కలినరీ స్కూలు లో చేర్పించారు. తోటి ఇండియన్సు అంటూ వారితోనూ, వీరితోనూ, ఎవరితోనూ నన్ను పోల్చలేదు. ఏవిధమైన సాంఘిక ఒత్తిడులు కానీ, సాంఘిక స్టిగ్మాలు కానీ మిమ్మల్ని ఏమాత్రం బాధించలేదు. నాకు ఇష్టమైన చదువు చదివి ఇంత చిన్న వయసులోనే  ఇవాళ మన సిటీలోకల్లా పెద్దయిన రెస్టారెంట్ లో ఛీఫ్ కుక్  ని అయ్యాను. నాన్నా! యు ఆర్ గ్రేట్! నేను కూడా నా పిల్లలని మీలాగే పెంచుతాను. వాళ్ళకి మార్గాన్ని చూపిస్తానే కానీ అదే మార్గంలో వెళ్ళమని కట్టడి చేయను. వారికి పూర్తి స్వాతంత్ర్యాన్ని ఇస్తాను. మీరే నాకు ఆదర్శం" అన్నాడు శ్రవణ్ కళ్ళ నిండా వాళ్ళ నాన్నంటే  ప్రేమని, ఆరాధనని నింపుకుంటూ.

రాంబాబు ఎంతో తృప్తిగా కొడుకు వైపు చూసాడు. తన మనసులోని తపనలకి, ఇన్నేళ్ల తన తాపత్రయాలకి సరైన గుర్తింపు లభించింది అనుకుంటూ గట్టిగా నవ్వేసాడు. శ్రవణ్ ఆ నవ్వులో తన గొంతు కలిపాడు.

***** ***** *****

Posted in February 2020, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!