Menu Close
prabharavi

ఉదయం మొదటి  అట్ట
అస్తమయం చివరి అట్ట,
మధ్యలో పుస్తకం చదవకుంటే
బతుకంతా చీకటి.

తప్పు చేసిందని
డబ్బును కొడుతుంటా,
అదేంటో కాని
దెబ్బ నాకే తగిలేది!

ఏ కొండ గుద్దుకొని
ఎదురుదెబ్బ తగిలిందో
గాలి గాయానికి
పరిమళం పూస్తున్న పువ్వు.

మందు రాద్దా మనుకుంటే
దూసుకుపోతోంది కాలం,
నేను రాసుకుందా మనుకున్నా
నన్నూ నిలవనీయటం లేదు.

కాలం కన్నా వేగంగా
ముందు కెళ్ళే కవి
కాలానికి అద్భుత బహుమతి
తెచ్చివ్వ గలుగుతాడు.

బ్యాంకుల కన్నా
దొంగ మొగుడే నయం
ఎవరికి దోచి పెడుతున్నాడో
ఇట్టే తెలిసిపోతుంది!

చీకటి పురుషుడి
పురస్కారం కన్న
వెలుతురు దేవుడి
తిరస్కారం మిన్న.

మగాడు
తలెత్తుకు తిరుగుతాడు,
మంచి దారి చూపటానికి
ఆడది తల దించుకునే!

ఆడది లేకుంటే
ఇంట్లోనే కాదు,
ఒంట్లో కూడా
మగాడికి “కరెంట్” ఉండదు.

ముఖం చూస్తే
చంద్ర బింబం,
పొట్ట చూస్తే
మహా కుంభం.

పంచదార, ఉప్పు
మనకు మంచి మిత్రులే,
అయినా ఇద్దరితోనూ
జాగ్రత్తగా ఉండాలి.

యజమాని సంతోషం కోసం
లైటు వెలగొచ్చు కాని
నేనే గొప్పని
ఇల్లు మండకూడదు!

మంచి వైద్యం
అడిగేవాడు లేడు,
ప్రభుత్వం ప్రకటించింది
మరో “పెయిన్ కిల్లర్”

కవుల మీద నాయకులు
కోపగిస్తే ఎలా!
పూల మీద పులి
పగబట్టట మేంటి!

మీ జీవితాలు
మీ కోసం తమలపాకులు,
మమ్మల్ని కాపాడటానికి
నిద్ర లేని తుపాకులు.

ఒకోసారి వెలుతురూ చీకటీ
తీపో చేదో చెప్పలేం,
ద్రాక్షలో చీకటి,
జిల్లేడులో వెలుతురు.

పదవులు
ఆభరణాలు కాదు,
పని చేయటానికి
ఉపకరణాలు.

వస్త్ర అలంకరణ మీద
విపరీత దృష్టి,
చర్మాన్ని మించిన
వస్త్రం ఏముంటుంది!

పుస్తకాలు కొనటానికి
నోట్లు లేవు,
ఓట్లు కొనటానికి
కోట్లు సిద్ధం చేస్తున్నాం!

శాంత మూర్తి కైనా
అసూయ వద్దు,
చంద్రుడిలో
మచ్చలు!

Posted in February 2020, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!