Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

శ్రీశ్రీ బాణీలో విశ్వనాథ

శ్రీరంగం శ్రీనివాసరావు, విశ్వనాధ సత్యనారాయణ గార్లు ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆణిముత్యాలే కాదు భిన్నధృవాలు కూడా. శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి దిక్సూచి, ఈ శతాబ్దం నాది అని ప్రకటించగలిగిన ఆత్మవిశ్వాసి. విశ్వనాథ ప్రాచీన మహాకవుల వారసుడు. సంప్రదాయ కవి. అట్టి శ్రీశ్రీ, విశ్వనాథల బాణీలు ఒక చోట కలిసినవి. 24 మే 1953న వెలువడిన విశాలాంధ్ర సంచికలో వీరేశలింగ స్మృతి పేరిట విశ్వనాథ రాసిన కవిత శ్రీ శ్రీ బాణీలో సాగుతుంది.

చీకటితో పడిపోతుంటే
ఆకటితో చనిపోతుంటే
దూరపు వెలుగు తెచ్చినదెవరో
తీరనియాకలి తీర్చినదెవరో! అంటూ మొదలయ్యే ఈ కవితలో

క్రొత్త క్రొత్త మార్గమ్ములు తీసి
క్రొత్త క్రొత్త దుర్గమ్ములు తెరచీ
క్రొత్త క్రొత్త సర్గమ్ములు చేసీ
చిత్తమెక్కి విహరించినదెవరో! అన్న పంక్తులు

విశాలాంధ్రలో ప్రజారాజ్యం(ఖడ్గసృష్టి) లోని,
విరోధించువారు లేరులే
నిరోధించువారు రారులే
ఆస్తి నాస్తి భేదమేలరా?
వాస్తవం వరించి సాగరా! అంటూ సాగే కవితా ఖండికలను గుర్తుకు తెచ్చాయి.

రామమోహనుడు రాచిన దారులు
కోమలాత్మకులు కొల్చిన దారులు
ప్రేమ మృదాత్ములు విల్చిన దారులు
తెరిచినదెవరో! తీసినదెవరో! అన్న పంక్తులు

మంచి ముత్యాలసరాలలోని,
ఎగురుతున్నాయ్ ఇనపకోటలు
పగులుతున్నాయ్ పాతపాటలు
రగులుతున్నాయ్ రాచబాటలు
రాజుకోవేరా! అంటూ సాగే కవితా ఖండికలను గుర్తుకు తెచ్చాయి.

నిజానికిది శ్రీశ్రీ బాణీ అనే కంటే గురజాడది అనడం సముచితం. తన కవిత్వం గురించి చెబుతూ బాట గురజాడది అడుగుజాడ నాది అని శ్రీశ్రీ అనగా, తొలినాళ్ళలో తనపై గురజాడ అప్పారావు పంతులు, రవీంద్రనాథ్ టాగోర్ ల ప్రభావాలున్నట్లు విశ్వనాథ ఒక ఇంటర్వ్యూలో అనియున్నారు.

అలానే శ్రీశ్రీ పై తొలినాళ్ళలో విశ్వనాథ గారి ప్రభావం కూడా ఉండేది. విశ్వనాథకు రాసిన నివాళిలో శ్రీశ్రీ 'నేను చిన్నతనంలో కలం పట్టిన కొత్త రోజుల్లో నన్ను బాగా ఆకర్షించిన ఇద్దరు కవులలో విశ్వనాథవారొకరు. రెండవ కవి కృష్ణశాస్త్రి గారు' అని రాశారు. శ్రీశ్రీ మిత్రుడు కొంపెల్ల జనార్దన్ రావు గారు శ్రీ శ్రీ గారి రచన ప్రభవను సమీక్షిస్తూ "ప్రభవ శైలి బాగున్నా తెలుగు వాడకం తక్కువ ఉంది. పైగా కృష్ణశాస్త్రి, విశ్వనాథల ప్రభావంతో రాసినట్టు ఉంటూ సొంత గొంతుక లేదని” విమర్శించారు.

నిజానికి శ్రీశ్రీ గారు అభ్యుదయ కవి అయినప్పటికీ వారి కవిత్వంలో సంస్కృత భూయిష్టమైన తెలుగు హెచ్చుగా ఉండేది. కానీ మరో ప్రస్థానం నాటికి వారి కవిత్వం సరళంగాను, జాన తెనుగులోకి మారింది.

సంప్రదాయ కవిగా మనం భావించే విశ్వనాథ, "సరళము గాఁగ భావములు జాన తెనుఁగున నింపు పెంపుతో" అన్న నన్నెచోడుడు (కుమారసంభవము 1:34) సూచించిన మార్గములో విశ్వనాథవారు కఠినమైన తెలుగు ప్రభంధాలకు సరళమైన తెలుగులో, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో పీఠికలు రచించారు.  అంతేకాదు అసలైన భాష పల్లె పట్టుల్లోనే లభ్యమవుతుందని, అక్కడ నుండే మనం పదాలు సేకరించుకోవాలని సూచించారు. అలా భాషలో దేసీయాల, గ్రామ్యాల ప్రాధాన్యతను గుర్తించారు.

తెలుగు సాహితీ యవనికపై శ్రీశ్రీ తమ జెండా ఎగురవేసిన తరువాత వీరిద్దరి మధ్యా కవ్యుద్ధాలు జరిగినవి కూడా.

తనంతటి మహాకవి వెయ్యేళ్ళ వరకు పుట్టడన్న విశ్వనాథ అతిశయాన్ని శ్రీశ్రీ విమర్శిస్తూ నిజానికాయన వెయ్యేళ్ళ క్రిందటే పుట్టాడని అన్నారు. విశ్వనాథ నన్నయ ఉన్నంతకాలం ఉంటారని, అయితే తిక్కన, వేమన, గురజాడ అనే కవిత్రయంలో మాత్రం చేరరని వ్యాఖ్యానించారు. దీనికి కారణం పురాణేతిహాసాలను రచనా నేపధ్యంగా తీసుకోవడం, సంస్కృత భూయిష్టమైన తెలుగు వాడడం, సంప్రదాయవాదిగా ఉండడం వంటివి కావచ్చు.  అలానే స్వాతి మాస పత్రిక 1976 డిసెంబర్ సంచికలో శ్రీశ్రీ, విశ్వనాథకు నివాళి రాస్తూ 'నిన్నటి నన్నయభట్టు, ఈనాటి కవి సమ్రాట్టు' అన్నారు. అంతకు మూడేళ్ళ క్రిందే 'గతాన్ని స్మరించి విశ్వసిస్తాడు విశ్వనాథ,ఆ గతాన్ని వరించి విశ్వసిస్తాడు శ్రీశ్రీ. గత కాలమె మేలు వచ్చు కాలము కంటెన్ అనుకుంటాడు విశ్వనాథ, మంచి గతమున కొంచెమేనోయ్ అనమంటాడు శ్రీశ్రీ' అని రాశారు.

ఈ మహాకవులిద్దరి మధ్య ఎలాంటి వాగ్యుద్ధాలు జరిగినప్పటికీ, ఎవరు ఏ మార్గంలో పయనించినప్పటికీ, వీరిద్దరూ ఆధునిక తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారనడంలో సందేహం లేదు.

- ఓం తత్ సత్ -

Posted in January 2023, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!