Menu Close
రెండో తలుపు
-- హైమవతి ఆదూరి --

అ అనే ఊర్లో అమల అనే ఒక పేద పిల్ల ఉండేది. ఆమెకు నా అన్న వారెవ్వరూ లేరు. ఎక్కడ పుట్టిందో, ఎలా పెరిగిందో కూడా ఆమెకు తెలీదు. పదేళ్ల అమల ఎవరైనా ఏదైనా పని చెప్తే చేసి, వారు పెట్టిన తిండి తిని సత్రం వరండాలో పడుకునేది.

ఆమె నిజాయితీ చూసి అంతా అమలకు ఏదో ఒకపని చెప్పి కడుపు నిండా ఇంత పెట్టేవారు. ఇల్లూ లేదు, నా అన్నవారూ లేరు అమలకు. వారూ వీరూ ఇచ్చిన బట్టలు వేసుకుని ఉన్నంతలో శుభ్రంగా ఉండే అమల అంటే అంతా ఇష్టపడేవారు.

అమల మీద అభిమానం కలవారు "అమలా! పక్క ఊర్లో కొత్తగా ఒక అనాధ బాలికల శరణాలయం పెడుతున్నారుట, వెళ్ళి అక్కడ చేరితే నీకు చదువు వస్తుంది, ఆశ్రయమూ, రక్షణా ఉంటుంది. ఇలా ఎన్నాళ్ళని సత్రం అరుగుమీద పడుకుంటావు? రాను రానూ నీకు వయస్సు వచ్చే కొద్దీ భద్రత కూడా తక్కువవుతుంది. వెళ్ళి అక్కడ ప్రయత్నించు”  అని చెప్పారు. వారి మాటలు నిజమనిపించాయి.

మరునాడు ఉదయాన్నే పక్క ఊరికి బయల్దేరింది అమల. కాలినడకన ఉత్త కడుపుతో వెళుతూ తన దీనావస్తకు బాధపడుతూ ‘ఏం దేవుడు! నన్నిలా అనాధగా పుట్టించి, తమాషా చూస్తున్నాడు” అని దేవుని మనస్సులో తిట్టుకుంటూ నడవసాగింది.

నడుస్తూ వెళుతున్న అమల ఒక అమ్మాయి సైకిల్ మీద వెళుతూ తనను దాటుకుని వెళ్లడం చూసింది. ఆమెను చూసి అమల కొద్దిగా అసూయ పడింది. కాళ్ళు నొప్పి పుడుతుండగా, తనకూ ఒక సైకిల్ ఉంటే హాయిగా కాళ్ళు నొవ్వకుండా వెళ్ళేది కదా! ఆ అదృష్టం తనకు ఇవ్వనందుకు, తనను ఇలా అనాధగా పుట్టించినందుకూ భగవంతుని పక్షపాతానికి మరోమారు ఆయన్ని తిట్టుకుంటూ నడవసాగింది అమల.

మరికొంత దూరం వెళ్ళేసరికి మరో మహిళ టూ వీలర్ లో వేగంగా వెళుతూ, అమలను దాటిపోగా ఆమె ముఖానికి మట్టి రోడ్డు దుమ్ము కొట్టింది.

ఈమారు అమలకు మరీ బాధకలిగింది. ‘తన జన్మలో తాను అలాంటి టూవీలర్ మీద ప్రయాణం చేయగలదా! తూ తనదీ ఒక బతుకేనా! కూడూ లేదు, నీడాలేదు, ఊరి వారి దయతో బతుకుతున్నది. దేవుడా! నీకెంత నిర్దయ!’ అనుకుంటూ ఈ మారు భగవంతుని పక్షపాతాన్ని మరీ మరీ తలచుకుంటూ, ఆయన్ని దూషించుకుంటూ, నడక సాగించింది.

మరికొద్ది దూరం ఉసూరని నడుచుకుంటూ వెళుతున్న అమల కాళ్ళు మరీ నొప్పులు పుట్టగా, వేగం తగ్గించి మెల్లిగా నడవసాగింది. ఈమారు ఒక మహిళ కార్లో అమలను దాటుకుంటూ వెళుతూ ఒకమారు విండో లోంచీ బయటికి ముఖం పెట్టి అమలను చూస్తూ వెళ్ళింది. అమలకు ఈ మారు మరీ బాధనిపించింది.

ఈమారు భగవంతుడ్ని మరీ మరీ దూషించుకుంటూ రోడ్డు వదిలేసి పొలం గట్లమీద నుంచి అడ్దదారిన నడక సాగించింది.

పక్క ఊరు దగ్గర పడగానే అక్కడున్న ఒక తోటలోని మంచి నీటి బావి కనిపించగానే అక్కడికి వెళ్ళి అక్కడున్న బుంగతో వంగి, నేలబావిలో నీరు తాడుతో లాక్కుని కాళ్ళూ ముఖం కడుక్కుని కడుపు నిండా నీరు తాగేసి , పక్కనున్న చెట్టుక్రింద కూర్చుంది కాస్సేపు విశ్రాంతికోసం. ఇంతలో ఇందాక తననూ దాటిన సైకిల్ మీది అమ్మాయి అక్కడికి వచ్చి, పక్కనే సైకిల్ ఆపి బుంగలో నీరు లాక్కుని త్రాగి, అమల పక్కనే కూర్చుంది.

అమల ఆమెను చూసి పలకరింపుగా “మీదేవూరూ!"అని అడిగింది.

దానికామె 'బెబ్బెబ్బే' అంటూ సైగ చేసింది. అంటే ఆమెకు మాటలు రావన్నమాట, మూగ పిల్ల అనుకుంది అమల.

'అయ్యోపాపం మాటలు రాని మూగపిల్ల! ఎలా బతుకుతుంది పాపం' అని ఆమె పట్ల సానుభూతి కలిగింది అమలకు.

ఆమె వస్తానని చెయ్యి ఊపి సైకిల్ మీద వెళ్ళిపోయింది.

మరికొద్ది సేపటికి టూ వీలర్లో తనను దాటుకుంటూ వెళ్ళిన మహిళవచ్చి బుంగతో  నీరు లాక్కుని వెనక్కు జరుగబోయింది. అక్కడో పెద్ద గుంత ఉంది. అంతా వాడి, పోసిన నీరంతా ఆ గుంతలో చేరి ఉంది.

ఆమె గుంతను గమనించక వెనుకకు పోబోగా అమల పెద్దగా అరిచింది. “గుంత, గుంత, మీవెనుక గుంత ఉంది” అని ఎంత అరచినా ఆమె పలకలేదు. ఆమె వినిపించుకోనందున గబుక్కున లేచి వెళ్ళి ఆమెను పట్టుకుని గుంతలో పడకుండా ఆపింది అమల.

అమల ఆమెకు వెనుక ఉన్న గుంతను చేయి చాపి చూపి, "మీరు గుంతలో పడేవారు, నేను అరుస్తూనే ఉన్నాను. మీరు గమనించలేదా!' అంది. దానికి ఆమె చేతులెత్తి నమస్కరించి తనకు వినపడదని సైగ చేసింది.

“బంగారు తల్లీ! నీవు పట్టుకోకపోతే నీళ్ళగుంతలో పడేదాన్ని. ఇందాక వెనుకనుంచి వస్తున్న బెదిరిన ఎద్దు పరుగెత్తుతూ వచ్చి కొట్టగా క్రింద పడ్డాను. వెనుకనుంచి 'పక్కకెళ్ళండి పక్కకెళ్ళండి!' అని మనుషులు అరిచారుట. ఆ అరిచే అరుపులు నాకు వినపడదు కదా! నేను నాపాటికి వస్తూ ఉన్నాను. ఆ ఎద్దువచ్చి నా బండిని కొట్టి వెళ్ళింది. ఇదో నా మోచేతులు దోక్కొ పోయాయి. ఇక్కడ బావి ఉండటం చూసి చేతుల రక్తం కడుక్కుందామని వచ్చాను" అంటూ ఆమె దోక్కుపోయి రక్తం గడ్డ కట్టిన తన మోచేతులు చూపింది. అమల కూడా నీరుపోసి ఆమె చేతులు కడుక్కోను సహాయం చేసింది.

ఆమె నీరు త్రాగి కాసేపు కూర్చుని చేతులూపి వెళ్ళిపోయింది.

"పాపం! వినపడకపోతే ఎంత కష్టం!" అనుకుంది అమల.

మరికొంత సేపయ్యాక, ఇక నడిచి వెళదామనుకుంటున్న అమల అక్కడ ఇందాక తనను దాటుకు వెళ్ళిన కారు వచ్చి ఆగడం చూసింది. కారు నడుపుతున్న మహిళ చాలా ఇబ్బందిగా కారు దిగను ప్రయత్నించి, అమలను చూసి "అమ్మాయీ!! కాస్త నీరు లాగి ఇస్తావా! నేను నా అవిటి కాలితో బావి దగ్గర ఒంగి నీరు లాక్కోలేను, చాలా సేపటినుంచి దాహమేసి దార్లో నీరు దొరుకుతుందేమో అని ఆగుతూ బావికోసం చూసుకుంటూ మెల్లిగా వస్తున్నాను." అంది.

అమల బాగా గమనించగా, ఆమె తన కొయ్యకాలు చూపింది.

'ఓ కొయ్య కాలు! ఒక కాలు లేదు. ఆమె పంజాబీ డ్రెస్ లో ఉన్నందున కాలు కనిపించలేదు’, అనుకుంది అమల.

అమల నీరులాగి ఇవ్వగా ఆమె తన వద్ద ఉన్న సీసాలో అమలచేతే నీరు పోయిందుకుని  త్రాగింది. అమలకు కృతజ్ఞతలు చెప్పి, “ఎక్కడిదాకా వెళ్లాలమ్మా! నీపేరేంటీ?” అని అడిగింది.

“నేనొక అనాధను. ఎవ్వరూ లేరు నాకు. పక్కనున్న ఊర్లో కొత్తగా ఒక అనాధ శరణాలయం పెడుతున్నారని తెలిసి అక్కడ చేరను అవకాశం ఉంటుందేమో అని వెళుతున్నాను." అని చెప్పింది అమల.

ఆ మహిళ “అమ్మా! బంగారు తల్లీ! నాకు దాహం వేస్తే నీరు తోడిచ్చావు. నేనూ అక్కడికే వెళుతున్నాను. రా నాతో పాటుగా" అని తన కారు ఎక్కించుకుని, తన పక్కనే కూర్చోబెట్టుకుని, కారు తోలసాగింది. ఆమె రెండు చేతులతోనే కారు చాలా జాగ్రత్తగా నడపడం గమనించింది అమల.

కార్లో కూర్చున్న అమల “భగవాన్ నాకు అన్ని అవయవాలు ఏ అవకరం లేకుండా ఇచ్చావు అదే చాలు. ఆ సైకిలూ, టూ వీలరూ, కారూ లేక పోయినా నేను హాయిగా బతగ్గలిగే ఆరోగ్యం కూడా ఇచ్చావు. ధన్యవాదాలు భగవాన్ క్షమించు. ఇందాక వరకూ నిన్నెంతో దూషించాను. మన్నించు” అనుకుంటూ తాను కేవలం కాసిని నీరు తోడిచ్చినందుకే ఈమె తనను కార్లో ఎక్కించుకుని వెళుతున్నది. అంటే మనకు చేతనైన సేవ ఎవరికి చేసినా భగవంతుడు తిరిగి సాయం చేయిస్తాడు.” అనుకుంది.

ఐతే ఆ అనాధ శరణాలయం స్థాపించే వ్యక్తితోనే తాను వెళుతున్నట్లు అమలకు తెలీదు. భగవంతుడు తనకెంత సాయం చేయను పధకం వేశాడో కూడ అమలకు తెలీదు.

ముగింపు తెలిసిపోయిందిగా! మంచి మనసున్న ఆ మహిళ అమలను తన శరణాలయంలో చేర్చుకుని మంచి జీవితం లభింపజేస్తుందని.

సేవకు ప్రతిఫలం తప్పక అందుతుంది. ఒక తలుపు మూసుకుంటే రెండో తలుపు తప్పక తెరుచుకుంటుంది.

**సమాప్తం**

Posted in March 2022, కథలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!