సన్నకారురైతు జీవితం
ఔతున్నదో దీనజీవి ప్రయాణం..
పెరిగిన విత్తనాల ధరలు,
తరగని పురుగుమందు వెలలు..
వర్ష ఋతువులో సందడి చేసే మేఘం,
ఒక్కసారి కూడా వచ్చి చూడ లేదతని పొలం..
నీటిచుక్క లేక -
నెర్రలు పారిన నేల!
మొలకెత్తని విత్తనం!
ఎండిపోయిన పైరు!
తెగులు సోకిన సస్యం!
తన పొలంనిండా దురదృష్టపు ఆనవాళ్లే!!
తన కళ్ళనిండా ఇంకిపోయిన కన్నీళ్ళే..!
తన జీవితంలో సంక్రాంతి కోసం వేచి చూసి,
కాయలు కాసి మసకబారిపోయిన కలలు..
చేశాడెన్నో తపస్సులు,
కానీ!!
కనికరించ లేదు కాలం,
కరుణించ లేదు దైవం..!
ఎన్నో ఆశలతో, బాధ్యతలతో,
మొదలు పెట్టిన వ్యవసాయం,
చీత్కారాలు, ఓదార్పులు,
కన్నీళ్ళనే తప్ప మిగల్చలేదతని
గూటిలో ఏ సంతోషం..
ఇన్నాళ్ళూ కష్టాలను భరించినా,
కాలం తీరిన అతని మౌనం
కోరుకుంది ఉరికొయ్య సాయం..
ఓడిందా రైతు ధైర్యం! ఆత్మ స్థైర్యం!!
మళ్ళీ గెలిచింది వ్యవస్థల దౌర్జన్యం..
అన్నంపెట్టే రైతు కెందుకు
అడుగడుగనా అవమానం..
ఆదుకోవడం మానేసి,
చోద్యం చూస్తోందెందుకీ సమాజం..