వసంత కాలం వచ్చిందని జడిసి
మంచు దుప్పటి కరిగి నీరై కొండలోకి జారింది
మోడువారిన చెట్లు చిగుళ్లు వేసి
మురిపాలు వొలక బోస్తున్నాయి
మొగ్గలు తొడిగిన సుమబాలలు
ఒక్కొక్కటిగా రేకులు విడుతున్నాయి
తోటలలో షికార్లుచేసే భ్రమరాలు
పూలకన్నెలపై విరితూపులు విసురుతున్నాయి
తోటమాలి కళ్ళు కప్పి పొదలమాటున మాటు వేసాయి
లోకమెరుగని పూలబాలలు
భ్రమరాలకు ఆశ్రయం ఇచ్చాయి
పండిపోయి రాలిపోయే పూలు
హెచ్చరించాయి వాటిని నమ్మవద్దని
వయసు మైకంలో పూబాలలు
పొంచివున్న ప్రమాదాన్ని పసిగట్టలేదు
పోకిరి తుమ్మెదలను నివారించలేమా అని
నీడనిచ్చే తరువులను అడిగితే
'ఆకర్షణ ప్రకృతి ధర్మం' అని నీతులు చెప్పేయి
ఇక ఈ మనుషులు
నేలరాలి ఎండిపోయిన పూలను కూడా వదలరు
ఇంటికి అలంకరణగా గాజు సీసాలో బంధిస్తారు.
విరిసీ విరియని అందమైన పూబాలలను
గుచ్ఛాలుగా మార్చి క్షణిక ఆనందానికి బలిచేస్తారు
నాడు దేవాలయాల్లో పూజకు వాడే సుమాలను
నేడు ప్రతి వేడుకలో వాడి అపవిత్రం అయిపోతున్నాయి.
మరీ ఘోరంగా శ్రద్ధాంజలి పేరుతో వాడుకుంటారు.
ఆ కుసుమాల మనస్సు విచారంతో కంట తడి పెట్టుకున్నా కనికరించరు
దేవుని పూజకి సంతోషంగా త్యాగం చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే
కానీ చనిపోయిన వారి శరీరాలమీద వేయడం విరులకు అవమానం
బాధతో వికసించకపోతే త్వరగా, మెండుగా పూయాలని
ఔషధాలను వాడి సహజ సువాసనలకు
కృత్రిమ సొబగులు అద్ది వ్యాపారాలు చేస్తున్నారు
కనీసం మహిళామూర్తులైనా ఆ పుష్ప విలాపాన్ని గుర్తించి
ఆదరించి, రక్షణ నొసగితే
విరుల సిరులు మరలా వికసించవా?