మన్మథా... నవ మన్మథా...
- డా. రావి రంగారావు
ప్రకృతి వణికింది
నా మనవణ్ణి
బ్రహ్మదేవుడు సృజిస్తున్నప్పుడు
ప్రకృతి కంగారుపడింది...
బంగారం భయపడింది
తన నంతా ముద్ద చేసి
నా మనవణ్ణి తయారుచేస్తున్నాడని...
చెట్లు కంపించాయి
వాటి నంతా కలిపేసి
నరాలూ నాడులు అల్లుతున్నాడని...
తేనెకు ఒళ్ళు జలదరించింది
తన నంతా పట్టుకెళ్ళి
రక్తంగా మారుస్తున్నాడని...
నక్షత్రాలు
గజగజ వణికాయి
మేని మెరుపులుగా తీర్చిదిద్దుతున్నాడని...
హిమాలయాలకు
దిగు లెక్కువైపోయింది
గుండెకాయగా రూపొందిస్తున్నాడని...
సూర్య చంద్రులు
కంగారు పడ్డారు
కన్నులుగా మారుస్తున్నాడని...
బృహస్పతికి
భలే భయమేసింది
తన మేధ భూలోకానికి వెళుతుందని...
మా మనవడు పుట్టాడు
బ్రహ్మదేవుడితో పాటు మౌనంగా
ప్రకృతికి కూడా నమస్కరించాడు మనసుతో,
భయాలన్నీ వదిలేసి ప్రకృతి మొత్తం
భవిష్య స్నేహమూర్తి అని తెలిసి
నా మనవడిని
ఆశీర్వదించింది నిండు గుండెతో...