పచ్చి గడ్డి బండి
లాగే ఎద్దుకు
కాస్త ఎండు గడ్డే
గొప్ప రాయితీ!
సమాజంలో
కొంద రుంటారు,
దోమల్ని చంపటానికి
కత్తులు తీసుకుంటారు.
పాలవంటి పండ్లు
తీసుకో ఎన్నయినా,
చెట్టు ఆవును
కొట్టి చంపొద్దు!
పువ్వులా మారి
రాయిలా ఎదిగి
గాజులా పగిలి
మళ్ళీ మట్టిలోకే మనిషి!
చద్దామనుకున్నా
దేవతలు చావలేరు,
బతుకే వాళ్ళకు
పెద్ద చావు!
చెట్లు అమ్మాయిలు
మేఘాలు అబ్బాయిలు
అమ్మాయి లుంటేనే
అబ్బాయిల ప్రేమ వర్షం.
అబ్బాయి సముద్రం
అమ్మాయి తీరం
ప్రేమ ఉప్పెనైతే మాత్రం
దెబ్బ తినేది తీరం.
నీతి
ఒక చీమ,
అవినీతి
మహా దోమ.
అద్భుత భవనాలు,
అహో! అమరావతి,
ఉద్యోగుల దుర్గంధం
మహా అవినీతి!
నియంత్రణ లేని
పిల్లల జీవితం
గాలి కెగురుతున్న
తెల్ల కాగితం.
గడ్డి పేరు “నవరత్నాలు”
చస్తాయి తిన్న గొర్రెలు,
లంచానికి కూడా
అందమైన పేర్లు.
జర్నలిస్టుల “పవరు”
రాక్షసుల క్కూడా తెలుసు,
అందుకే వాళ్ళెప్పుడూ
నారదుణ్ణి కొట్టలేదు!
లోకోపకారి
సూర్యుడికి బిడ్డలు
యముడు
శనీశ్వరుడు.
మునిసిపల్ కొళాయి
చంద్రుడి నుంచి
ఎంత నీరు
రోడ్డుపాలవుతున్నదో!
నోటు తీసుకొని ఓటు
కాదు పెద్ద తప్పు,
ఓటు వేయనివాడే
దేశానికీ మహా ముప్పు.
పూలే కాదు
రాళ్ళూ పడతాయి,
వేదిక ఎక్కినవాడు
రాళ్ళకు భయపడకూడదు.
కింది పెదవే
ముద్దు పెట్టేది,
పేరు మాత్రం
రెండు పెదవులకూ.
అద్దంలో బొమ్మ
బాగోలేదు తిడతావు,
అది నీ బొమ్మే
మరిచిపోతుంటావు.
సిగ్గిడిచి
నువ్వుండు,
సుఖం
ఒలిచిన పండు!
మురికిని నరకటానికి
అందరూ పూనుకోవాలి,
నా కవిత్వం
సబ్బుబిళ్ళ.
కవిత్వం
ఒక పూల బాంబు,
కొందరిమీద మెత్తగా వాలాలి,
కొందరిమీద గట్టిగా పేలాలి