తిరువణ్ణామలైలో మొదటి రోజు యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంకి వెళ్ళాము. ఇది అందమైన, చాలా పెద్ద ఆశ్రమం. ఈయన గుజరాతు నించి వచ్చి, కొన్నాళ్ళు రమణ మహర్షి వద్ద శుశ్రూష చేసి, ఆ తరువాత కొన్నేళ్లు దేశమంతా తిరిగి, మళ్ళీ వచ్చి ఈ ఆశ్రమం స్థాపించాడుట. దీనిని ప్రస్తుతం " మా - (అంటే తల్లి) దేవకి " అనే ఆవిడ నడుపుతున్నారు. ఆవిడ సన్యాసిని. ఆవిడ కోసం చాలాసేపు ఎదురుచూసి, కలిసాము. ఆవిడ ద్వారా తెలిసిన ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే, ఆవిడ 40 ఏళ్లగా అక్కడే ఉంటున్నారు. రమణ మహర్షిని కొన్నేళ్లు సేవించుకున్న తరువాత ఈ రామ్ సూరత్ బాబా దగ్గిర చేరి, ప్రస్తుతం ఆశ్రమ నిర్వహణ చేస్తున్నారు. అక్కడ చాలా పెద్ద హాలు ఉన్నది.
దేవిక గారి కథనం ప్రకారం అరుణాచలం కొండ పైన మనకి కనిపించని సిద్ధులు చాలా మంది ఉన్నారనీ, తపస్సులో ఉంటారని, తాను చాలా సార్లు రాత్రిపూట కొండ పైన ఏవో అర్థం కాని వెలుగులు అటూ ఇటూ కదులుతుండగా చూశానని చెప్పారు. ఈ సిద్ధులనండి, మునులనండి, మహర్షులనండి, ఈ కొండ పైన ఈ నాటికీ ఉండడం నిజం అని అన్నారు. తాను కొంతమందిని చూశానని కూడా అన్నారు. వాళ్ళు అందరికీ కనబడడం ఇష్టపడరని, మనం కొండ పైన వెతికినా దొరకరని, వారు అనుగ్రహిస్తే మనకి కనబడి మంచి చేస్తారనీ చెప్పారు. ఈవిడ పెద్దావిడ. అక్కడ ఉన్న వారందరి మెప్పూ చూరగొన్నవారు. వారిని శంకించడానికి ఆధారమేమీ లేదు. చక్కటి ఇంగిలీషులోను, తమిళంలోనూ మాట్లాడారు. నేను చాలా సేపు అక్కడఉండి అందరూ ఆవిడని ఎలా గౌరవిస్తున్నారో చూసాను. కాబట్టి కొండ మీద మనకి కనబడని సిద్ధ జీవులున్నారని నాకు నమ్మకం కలిగింది. కనబడేవి మాత్రమే నిజమని నమ్మే మూర్ఖుణ్ణి కాను కాబట్టి సులభంగానే అర్థం చేసుకున్నాను. కొండ పైన కొన్ని ప్రాంతాలకి మాత్రమే జనులు వెళ్ళడానికి అర్హులన్నారు.
మర్నాడు గిరి ప్రదక్షిణ అయినతరువాత సాయంత్రం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాము. ఎంతో ప్రశాంతంగా ఉన్నదో!. చాలామందే అక్కడ ఉన్నా, వారెవరూ మాట్లాడటంలేదు గట్టిగా. అందుకని ఒక గౌరవ భావం మనలో వెంటనే ఏర్పడుతుంది. నేను ఆ ఆశ్రమాన్ని ప్రస్తుతం నడుపుతున్న విజయన్ అనే ప్రెసిడెంటు గారిని కలిసాను. పెద్దగా మాట్లాడలేదు కానీ, ఇంకొకరిని పిలిచి నాతో మాట్లాడమన్నారు. ఆ ఆశ్రమ చరిత్ర, వాటిగురించి కొద్దీ సేపు మాట్లాడి, అక్కడనించి రమణ మహర్షి ఉండిన గది - ఆయన నిర్యాణ స్థలం కూడా అదే - దాన్ని చూసాము. కింద ఫోటో చూడవచ్చు. దాని ఎదురుకుండానే రమణ మహర్షి తల్లిగారిసన్నిధానం, పక్కనే రమణ మహర్షి సన్నిధానం ఉన్నాయి.
సన్యాసులని ఖననం చెయ్యరు, పాతి పెడతారు. ఆ చోట పైన లింగం పెడితే సన్నిధానం అంటారు; తులసి కోట పెడితే బృందావనం అంటారు. ఈ రెండూ కూడాసన్నిధానాలే. తల్లి గారి సన్నిధానం మన గుడి లాగానే ఉన్నది. గర్భాలయం ముందు అంతరాలయం, ఆ ముందు ప్రజలు కూర్చోవడానికి సదుపాయం ఉన్నాయి. అక్కడ రమణ మహర్షి కూర్చుని ఉన్న శిల్పం ఉన్నది. చాలా కళగా ఉన్నది. అక్కడ ఒక ఫలకంపైన రమణులవారు తన 16వ ఏట సన్యసించి, ఎలా సిద్ధి పొందిందీ కథనం రాసి ఉన్నది. వచ్చిన వాళ్లంతా శ్రద్ధగా ఈ ఫలకం చదవడం నేను గమనించాను. ఆవిడ సన్నిధానంలో చక్కగా పూజలు జరుగుతున్నాయి. ఎంతో శుభ్రంగా ఉన్నది ఆ ప్రదేశమంతా.
ఇక్కడ నించి రమణ మహర్షి సన్నిధానానికి ఒక ద్వారం ఉన్నది. అంటే రెండు సన్నిధానాలు పక్క పక్కనే ఉన్నాయన్నమాట. అయితే రమణ మహర్షి సన్నిధానం వేరే విధంగా ఉంటుంది. మామూలుగా మన గుళ్ళలాగా ఉండదు. పెద్ద హాలు. ముందరఅంతా ఖాళీగా ఉంటుంది. వచ్చిన వాళ్లంతా అక్కడ కూర్చోవడానికి వీలుగా. హాలుకి వెనక పక్క ఒక పెద్ద - అంటే 25 అడుగుల చతురస్రమైన వేదిక రెండడుగుల ఎత్తుతో ఉన్నది. ఆ వేదిక మధ్యన ఒక లింగం ప్రతిష్టించబడి ఉన్నది. దాని వెనకాల రమణ మహర్షి తలా, భుజాలు మాత్రమే ఉన్న విగ్రహం ఉన్నది. దాని వెనకాల ఆయన పెద్ద చిత్తరువు, ఆశ్రమం చిత్రం వగయిరాలున్నాయి. ఈ లింగం పెద్దది కాదు, కానీ చాలా అందంగా ఉన్నది. వెనక ఒక తోరణం లాగా ఉన్నది. ఇది మకర తోరణంలాగా లేదు కానీ, మొత్తానికి వెండితో చేసిన తోరణం అనిపించింది. అక్కడ సాయంత్ర సేవకి నిర్మాల్యం తీసేసారు. ఆ తరువాత లింగానికి అభిషేకం మొదలు పెట్టారు. మొదట పురుష సూక్తం, తరువాత నారాయణ సూక్తం, దుర్గా సూక్తం, శ్రీసూక్తం, సన్యాసం యోగం, ఆఖరికి మంత్ర పుష్పంతో అభిషేకం పూర్తి చేసి, మాముందే అలంకారం అద్భుతంగా చేసారు. అన్నీ పుష్పాలతో ఎంత బాగా చేశారో! అసలు ఆ వేద పారాయణ అంత బాగా చెప్పడం నేను ఇంతకు ముందు వినలేదు. అందరూ ఒకే వరవడిలో ఒకే గతిలో ఎంతో స్పష్టంగా, ఏక కంఠంతో చెపుతున్నారు. వారంతా చిన్న వాళ్ళే. అందరూ చక్కగా సాంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించి, ఎంతో భక్తిగా చేస్తున్నారు. అలాంటి దృశ్యం చూసి మనం ప్రభావితులం కాకపొతే మనలో ఎదో లోపం ఉన్నదన్న మాటే. అక్కడ ఎంతోమంది పాశ్చాత్త్యులు కూడా ఉన్నారు. ఈ ప్రక్రియ ఐందాకా, ఆ తరువాత కూడా వచ్చిన వాళ్లంతా ఆ వేదికకి ప్రదక్షిణం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు తిరుగుతున్నారు. కొందరు ఆ అభిషేక జలాన్ని వేదిక నించి కింద పడే టప్పుడు తీసుకుని భక్తిగా పుచ్చు కుంటున్నారు. వచ్చిన వాళ్లలో 15 ఏళ్ల నించి 90 ఏళ్ళ దాకా మగా, ఆడా ఉన్నారు. వీరందరిపైనా రమణుల ప్రభావం ఎంత ఉన్నదో తెలిసి పోతూనే ఉన్నది. ప్రసిద్ధ గాయకులట, వారెవరో నాకు తెలియదు. ఏమీ ఆర్భాటం లేకుండా వచ్చి అక్కడ నిలుచుని రెండు కీర్తనలు పాడి వెళ్లిపోయారు. కొంత మంది భజన మొదలు పెట్టారు, అందరూ అందుకున్నారు. ఏది చేసినా ప్రశాంతంగా చేస్తున్నారు. వాతావరణం ఎంతో శాంతంగా ఉన్నది. రమణులు ముముక్షువు. జీవన్ముక్తులు. వారి ప్రభావానికి వారి ఉపాధితో పనిలేదు కదా?
రమణుల ఆశ్రమంలో నాకు ఒక అద్భుతం కనబడింది. అది మండు వేసవని చెప్పాను కదా? చాలా చెట్లు ఉన్నాయి. అది మధ్యాన్నం 12.30 ప్రాంతాల సమయం. అసలు ఎవరూ ఎండలో నిలుచునే అవకాశం లేనంత వేడిగా ఉన్నది. అక్కడ చెట్ల కింద కొన్ని నెమళ్ళు ఆడుకుంటుంటే చూసాము. ఇంతలో కోలాహలం విని తలెత్తి చూద్దును కదా, మేడ మీద ఒక నెమలి పురి విప్పి అందంగా నాట్యం చేస్తోంది! కింద రమణ మహర్షి సన్నిధానంలోంచి భజన వినిపిస్తోంది! ఆ విపరీతమైన ఎండలో, ఆకాశంలో మబ్బు కాదు కదా, గాలిలో తేమ కూడా లేని పరిస్థితి! ఆ భజనకి ఎండలోకూడా నాట్యం చేస్తున్న ఆ నెమలి రమణ మహర్షినెంత నమ్మిందో కదా?
ఆశ్రమం వెనక్కి వెళితే మహర్షి దగ్గిర చనువుగా ఉండే ఆవు, చిలక, కుక్క, జింకలని పాతి పెట్టిన స్థలాలు, వాటిపైన కట్టిన చిన్న కట్టడాలు కూడా కనిపిస్తాయి. ఆశ్రమం కొండ కిందే ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద చెట్లు, వెనకాల ,మరికొందరి సమాధులు ఉన్నాయి. అక్కడ నించి కొండ పైకి ఒక దారి కనబడింది. ఎవరో పొద్దున్నే 7.30 కి గేటు తెరుస్తారు, మీరు పైకి ఎక్కచ్చు అని చెప్పారు. అక్కడ ఉండే ఒక గైడుని కుదుర్చుకుని పొద్దున్నే వస్తామని చెప్పి వచ్చేసాము.
కిందకి వచ్చి, అసలు కొండ పైకి ఎక్కచ్చా, మరి కొండే శివుడు కదా? మరి ఆ అగ్ని లింగం మీద కాలు మోపచ్చా? ఇలాంటి ప్రశ్నలు అడిగాము. భక్తిగా చెప్పులు లేకుండా ఎక్కి, రమణులు ఎక్కడెక్కడైతే తిరిగారో అక్కడకి వెళ్లి చూడచ్చని, స్కందాశ్రమం చూడచ్చని చెప్పారు. అందువల్ల నేను కూడా చెప్పులు లేకుండానే కొండ ఎక్కాలని నిశ్చయించుకున్నాను. ఇది చాలా విశేషమైన ప్రయాణం. అందుకని తరువాయి భాగంలో వివరాలు తెలియజేస్తాను.