ఆచారాలు-ఆచరణీయ వాస్తవ దృక్పధాలు 3
ఇన్ని వనరులు కలిగివున్ననూ మనలో ఎందుకు నిరాసక్తత ఏర్పడుతున్నది.
మానవులమైన మనకు ఆ చపల చిత్తం అనేది అత్యంత సహజ గుణం. మనందరం దీనికి అతీతులం కాదు. ఈ విధమైన ఆలోచనల చిక్కుముడులు మన మెదడంతా అల్లుకుంటాయి. మరి దీనికి పరిష్కారం?
ఈ సృష్టిలో ఏ జీవరాశి కూడా స్వార్థచింతనతో తన జీవన క్రతులను రూపొందించుకోదు కేవలం ఒక్క మనిషి తప్ప. ప్రతి చర్యకూ ఒక ఫలితాన్ని ఆశించడం ఊహతెలిసినప్పటి నుండే అలవర్చుకొంటాము. అది సిద్ధించని రోజు అనవసరమైన ఆందోళనను పొందుతాము. కారణం మన ఆలోచనలను నియంత్రిస్తూ మనలో లేని అపోహలను సృష్టించి, మానసిక వత్తిడికి గురిచేస్తున్న మన చుట్టూ ఉన్న వ్యవస్థ. ఇక్కడ మంచి, చెడు అనే ప్రస్తావన ఉండదు.
నమ్మకంతో, ఆత్మనిగ్రహం తో మన మెదడులోని ఆలోచనలను మనం నియంత్రించుకునే స్థాయికి ఎదగాలి. అది నిరంతర సాధనతో సులభంగా వస్తుంది. చిక్కుముడుల సాలె గూడును పూర్తిగా తొలగించి స్థిరంగా చిత్తశుద్ధితో ఆలోచించడం మొదలుపెడితే భాషాపరమైన ఇబ్బందులు తలెత్తిననూ వాటిని అధికమించి మన సందేహాలను మనమే నివృత్తి చేసుకోవచ్చు. ఆ విధంగా పట్టుదలతో వేదాలను పూర్తిగా అవపోసిన పట్టిన, పడుతున్న ఎంతోమంది సాధారణ వ్యక్తులను నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆ సమయంలో మనలో స్ఫూర్తిని నింపుటకు మనం చేయవలసినదల్లా మనకు జన్మనిచ్చి, అక్షర జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని మనసారా మనలోకి ఆహ్వానించడమే. ఆ జ్యోతిని మనం తల్లిదండ్రులు, తోబుట్టువులు, మన గురువులు, ఆత్మీయులు ఇలా మన జీవితంలో తారసపడిన ప్రతి జీవిలోనూ చూడవచ్చు. మన చుట్టూ ఉన్న జీవ, నిర్జీవ, ఘన ద్రవ వాయు పదార్థాలన్నింటిలోనూ ఆ బ్రహ్మ పదార్ధం ఇమిడి ఉంటుంది. అది మనం గమనించి అర్థం చేసుకొనిన నాడు అంతా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
నిత్య జీవితంలో మనం అనుసరిస్తున్న విధివిధానాలు, ఆచార వ్యవహారాలూ, సాంప్రదాయాలు అన్నీ మనకు మన పూర్వీకులు వితరణ శుద్ధితో మనకు అందించిన సంపద. వాటిని పాటించడం వలన మన జీవన క్రమంలో ఏర్పడే ఒడిదుడుకులను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగేందుకు ఎంతో మంచి అవకాశం కలుగుతుంది. అటువంటి సంప్రదాయాలను గ్రంథాల రూపంలో నిక్షిప్తం చేసి అందించిన మహర్షులు ఎందఱో ఉన్నారు. వారు ఆ గ్రంథాలను రచించేటప్పుడు నాటి సామాజిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని వారి ఆలోచనలను తదనుగుణంగా మార్చుకొని వ్రాయడం జరిగింది. కాలక్రమేణా మనిషి జీవనసరళి లో ఎన్నో మార్పులు చోటుచేసుకొన్నాయి. తద్వారా ఆ గ్రంథాల లోని సారాంశాలను ఆ తరువాతి తరం వారు వారికనుగుణంగా మార్చుకోవడం కూడా కొన్ని సందర్భాలలో జరిగింది. ఉదాహరణకు;
మనువు మహర్షి వ్రాసిన మనుధర్మ శాస్త్రంలో ఒక వర్గం వారినే ఎంతో ఉన్నతులుగా చూపించడం జరిగింది. అయితే వారిలో కూడా ఎవరైతే పూర్తిస్థాయిలో స్వచ్ఛమైన మనో నిబద్ధతను కలిగి, నిర్దేశించిన అన్ని ధర్మాలను మనసావాచా త్రికరణ శుద్ధితో ఆచరిస్తారో వారినే ఉన్నతులుగా పేర్కొనడం జరిగింది. సాత్వికతే ప్రధాన అలవాటుగా, వేదవేదాంగాలను అవపోసన పట్టి వాటిలోని అన్ని ధర్మాలను ఆచరిస్తూ ఎంతో పవిత్రమైన మనస్సును కలిగి ఉండాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. నాటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగానే మనుధర్మ శాస్త్రం రచించడం జరిగింది.
కాలక్రమేణా సామాజశైలిలో ఎన్నో మార్పులు జరిగి అన్ని వర్గాలకూ అభివృద్ధి చెందే అవకాశాలు ఏర్పడి వృత్తి ప్రధానమైన జీవితమే కాకుండా జ్ఞానమే ప్రధానంగా మేధస్సును ఉపయోగించి చేయగలిగిన ఎటువంటి వృత్తినైననూ, ఎవరైననూ స్వీకరించగలిగిన స్థాయికి మన సమాజం ఎదిగింది. కనుక మను శాస్త్రంలోని అన్ని అంశాలు అన్ని వేళలా అందరికీ వర్తించవు. కానీ అందులోని సామాజిక స్పృహతో అందించిన మంచిని గ్రహించి పరిగణిస్తే, ఆ ధర్మాల వలన ఈ కాలంలోనైనా మనిషి జీవనక్రమం ఎంత హాయిగా, సుఖంగా సాగిపోతుందో అవగతమౌతుంది.
దురదృష్టవశాత్తూ కొంతమంది తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు అత్యుత్తమమైన విలువలతో అందించిన ధర్మ సూత్రాలను కూడా వక్రీకరించి తమ స్వప్రయోజనాల కోసం సమాజంలో వ్యతిరేకతను తీసుకొని వచ్చి మన సనాతన సంప్రదాయాల సత్ సంకల్పాన్ని మరోకోణంలో చూపించారు. తద్వారా వర్గ బేధాలు, వర్ణ వివక్షలు సృష్టించి సమాజ సమతుల్య జీవన విధానాన్ని భ్రష్టు పట్టించారు. ఇది ఏ చరిత్రను చదివిననూ మనకు తెలుస్తుంది.
నేడు మనం ఆచరిస్తున్న అన్ని ఆచారాలు ధర్మ బద్ధమైనవే. కాకుంటే వాటిని కొంతమంది తమ స్వప్రయోజనాల కొరకు వాటిలో మార్పులు చేయడం జరిగి కొన్ని ఆచారాలు మనం గుడ్డిగా నమ్మే పరిస్తితి ఏర్పడింది. ప్రతి సంప్రదాయానికి ఒక శాస్త్రీయమైన కారణం ఉంటుంది. దానిని అర్థం చేసుకొని పాటించినప్పుడు ఎటువంటి సందేహాలకు తావు ఉండదు.
‘సర్వే జనః సుఖినోభవంతు’
మీరు చెప్పే ప్రతిపదం ఆందరమూ సక్రమంగా ఆలోచనలు నిగ్రహానికి ఆదానివేమి కావు ప్రశాంత చిత్తం దానికి అవసరము మీ రచనలు శ్యా శ్రీయంగా ఆలోచింప చేస్తాయి ధన్యవాదములు.