ప్రతిరోజూ ప్రపంచాన్ని పరికిస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలు, భావ తరంగాలు నాలో ఉదయిస్తుంటాయి. వాటన్నింటికీ సరైన అక్షర రూపాన్ని, పొందికైన పదబంధం తో తయారుచేసి అందరికీ నా అంతరంగ భావం ప్రస్ఫుటంగా అర్థం అయ్యేటట్లు చెయ్యాలనే తపనతో ప్రయత్నిస్తున్నాను. ఈ సంచికలో రుగ్మత అనే అంశం ప్రధాన వస్తువుగా ఎంచుకొన్నాను.
శారీరక రుగ్మత, మానసిక రుగ్మత, సామాజిక రుగ్మత
శారీరక లేక భౌతిక రుగ్మత అనేది ఎక్కువ పనివత్తిడి వలన శరీరం అలిసిపోయి, శక్తి తగ్గినపుడు మన శరీరంలో కలిగే చిన్న ప్రతిస్పందన చర్య. అలాగే మన శరీరంలోకి వేరే కణ సముదాయము గానీ లేక సూక్ష్మజీవులు ప్రవేశించినపుడు మన శరీరం తదనుగుణంగా స్పందించినందున మనకు కొంచెం అలసట లేక రుగ్మత కలుగుతుంది. అయితే ఇది కేవలం తాత్కాలికమే. ఆ విధంగా మన శరీరం కొంచెం విశ్రాంతి తీసుకోమని చెప్పకనే చెబుతున్నది.
అయితే, ఈ రుగ్మత మరింత బలపడి, మనలో వ్యాధినిరోధక సాంద్రత క్షీణించి మనం తరచుగా శారీరక ఇబ్బందులకు లోనవడం జరిగితే అప్పుడు దానిని వ్యాధి అనవచ్చు. అలాగే, ఈ రోగము ఒకరి నుండి మఱొకరికి సంక్రమించడం జరిగితే దానిని అంటురోగం అని నిర్ధారించవచ్చు. అంటువ్యాధి అనేది ఒకవిధంగా చాలా వేగవంతంగా జరిగే ప్రక్రియ. ఈ చిన్న వివరణ మనందరికీ తెలిసినదే కానీ ఆ సందర్భంలో మరిచిపోయి కేవలం తాత్కాలికమైన జలుబు, దగ్గు, శరీరం అలిసిపోతే ఏదో అయిపోయిందని మందులు వాడటం మొదలుపెడతాము. కొంతమందైతే జలుబు దగ్గు వస్తుందని ముందుగానే మందులు వాడుతున్నారు. ఆ విషయం తెలిసినరోజు నాకు నిజంగా మనం ఎంత అభద్రతా భావంతో బతుకుతున్నామో అర్థమైంది.
మానసిక రుగ్మత అంటే మనలో కలిగే అనవసరమైన ఆందోళనలు. ఎప్పుడూ ఏదో కీడు జరుగుతుందనే అభద్రతా భావం, అశాంతికి గురై మన సొంత ఆలోచనలను ప్రక్కన పెట్టి సులువుగా వేరే వాళ్ళు చెప్పే మాటలను వింటూ తెలియని ఇబ్బందులను కొనితెచ్చుకోవడం, మన మెదడు ఎంత స్థిరమైన ఆలోచనలతో మనలను సరైన దారిలో నడిపిస్తుందనే విషయాన్ని మరిచి, సులువుగా వేరే వారి మాటలను నమ్మి లేనిపోని ఆందోళనకు గురౌతాము. కొంతమంది వారు పాటిస్తున్న పద్ధతులే సరైన జీవన విధానానికి ప్రామాణికం అని అనుకొని అందరూ ఆ పద్ధతులే పాటించాలని సూచిస్తారు. వారి పిల్లల విషయంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించాలని ఆసక్తి కనపరచడం అత్యంత సహజం. అయితే పిల్లలలో స్వతంత్రంగా ఆలోచించే విధానాన్ని ముందుగా నేర్పించాలి. తరాలు మారుతున్న కొద్దీ సమాజంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వాటికి అనుగుణంగా ఆ తరం ఉండాలి. అందుకు స్వతంత్రంగా ఆలోచించే పధ్ధతి ఎంతో ఉపయోగకరం అవుతుంది. అయితే పిల్లలను నియంత్రించి మనం ప్రామాణికం అనుకొన్న విధానాలను అనుకరించమని ప్రోత్సహించి ఆ ప్రక్రియలో దొర్లుతున్న అపశృతుల కారణంగా తల్లిదండ్రులు అనవసరమైన మానసిక వత్తిడులకు లోనవడం జరుగుతున్నది. అదే ఒక విధమైన రుగ్మతకు కారణమౌతున్నది. వచ్చిన చిక్కల్లా మనం సరైన ప్రామాణికం అనుకొన్నది ఎదుటివారికి కాకపోవచ్చు అన్న విషయాన్ని గ్రహించకపోవడం. ఎవరి జీవితం వారిది.
కొంతమంది తమ స్వీయ అనుభవంతో లేక జీవితానుభవంతో కొన్ని సలహాలు ఇస్తుంటారు. ఆ సలహాలు మనం ఉన్న సామాజిక పరిస్థితులు, మన శరీర తత్వంతో పోల్చుకొని తగినవిధంగా ఆ సలహాలను పాటించడం చేయాలి. మానసిక రుగ్మత, ఆందోళన ఎక్కువైనప్పుడు మన శరీరం కూడా భౌతికంగా అలసటకు లోనౌతుంది. అంటే శారీరక, మానసిక రుగ్మతలు రెండూ ఒకదానికొకటి ముడివేసుకొని ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉన్ననాడు శారీరక రుగ్మత యొక్క బలం సన్నగిల్లే అవకాశం లేకపోలేదు.
శారీరక రుగ్మత అనేది రోగనిరోధక శక్తి సాంద్రత పుష్కలంగా ఉన్ననూ వస్తుంది. అయితే మానసిక రుగ్మత మన మనసు బలహీనమైతే వస్తుంది. కాకుంటే మనసు ఆందోళనలతో అతలాకుతలం అవుతుంటే రోగనిరోధక సాంద్రత తగ్గి భౌతికంగా కూడా అలసిపోయే అవకాశం ఉంది.
మన శరీరం స్పందించే విధానం మనకు అవగతమైన సందర్భంలో మనలను మనం ఎలా భౌతికంగా, మానసికంగా స్థిరంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో తెలుస్తుంది. అది మన ఆలోచనా విధానంలో పరిపక్వత కలిగిన నాడు, మన గురించి మనం తెలుసుకొన్న రోజు, మనలోని జీవి పడుతున్న ఇబ్బందులను గమనించి అందుకు తగిన జాగ్రత్తలు తీసుకొనిన నాడు, తప్పక సిద్ధిస్తుంది.
ఇక సామాజిక రుగ్మత అనేది మనిషిలోని స్వార్థం వలన ఏర్పడే అవకాశం ఉంది. మానవత్వం లేకుండా మనం కేవలం మన ఎదుగుదలను మాత్రమె కోరుకుంటూ తద్వారా సమాజంలో ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేస్తే ఆ సామాజిక అసమానతలు మనిషిలోని చెడు గుణాలను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా అది సమాజానికి ఒక అంటువ్యాధి అవుతుంది.
ప్రకృతి తన పని తాను చేసుకుంటూ మనకు ఎన్నో సహజవనరులను అందిస్తున్నది. వాటిని మన అవసరాలకు అనుగుణంగా వాడుకుంటూ ఆ ప్రకృతితో మమేకమై మనం జీవితాన్ని కొనసాగించాలి. అలాగే ప్రకృతి సమతుల్యాన్ని కూడా కాపాడాలి. ఈ ఆలోచన మనలో ఎల్లప్పుడూ ఉండాలి. అంతేకాదు ప్రతి కార్యాన్ని వ్యాపార దృష్టితో చూడకూడదు. మనతో పాటు మరో పదిమంది కూడా మనలాగే ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలి.
‘సర్వే జనః సుఖినోభవంతు’
నిజాన్ని చక్కగా విడమర్చి చెప్పారు !!