మహానుభావులు, ఆదర్శమూర్తులు, వేద పండితులు, యోగులు, అనుభవజ్ఞులు ఇలా ఎందఱో పుణ్యమూర్తులు వారి పని వారు చేసుకొంటూ సమాజ శ్రేయస్సుకై తమ వంతు విధిని నిర్వర్తిస్తుంటారు. అట్టివారిని మనం అనుకరిస్తూ మనకు కూడా అంతే పరిజ్ఞానం, అనుభవం ఉన్నట్లు భావిస్తుంటాం. కానీ నిజంగా మన జీవన ప్రమాణాలను మార్చుకొని జీవించడం జరగదు. కారణం ‘నేను’ అనే చిన్న అహం మనలో జీర్ణించుకుపోయి ఉంది. అందుకు తగినట్లు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రోత్సాహం మెండుగా ఉంటుంది. కనుకనే అది మంచికైనా, ‘భరించాలి తప్పదు’ అనే సర్దుకుపోయే మనస్తత్వం మనకు కలగదు. పర్యవసానం సామాజిక సమస్యలు, రుగ్మతలు, మానసిక వత్తిడులు.
మనిషి సంఘజీవి. మనిషికి మనిషి మాత్రమే చివరి వరకు తోడుండేది. అందుకే మన పూర్వీకులు కుటుంబ వ్యవస్థను రూపొందించారు. ఆ వ్యవస్థ పటిష్టంగా, పారదర్శకంగా వుంటే మనిషి మానసిక స్థితి కూడా ఎంతో మెరుగుగా ఉండి జీవన ప్రమాణాలను పెంచుకొంటాడు. లేకుంటే వత్తిడికి లోనై ఇబ్బందులు, ఆత్మీయుల మధ్య మనస్పర్థలు ఏర్పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ యొక్క ఉనికిని కోల్పోతున్న నేటి తరుణంలో మనం వదిలేసుకుంటున్న శక్తి కణాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి మెదడు ఎదుగుదల తను బాల్యంలో పెరిగిన వాతావరణం, గమనించే పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. కనుక అన్నీ రకాల మానసిక వైవిధ్యాలను స్పృశించినప్పుడే తదనుగుణంగా కణాల అభివృద్ధి సక్రమంగా జరుగుతుంది.
మనిషికి యంత్రాలు భౌతిక అవసరాలను మాత్రమే తీర్చగలవు కానీ మానసిక ధైర్యాన్ని, ఆనందాన్ని సాటి మనిషి మాత్రమే ఇవ్వగలడు. మన చుట్టూ ఉన్న బంధుమిత్రుల సాంగత్యం ఈ ప్రక్రియకు దోహదకారులు. అందుకే అందరం కలిసి సరదాగా మంచి సంతోష కార్యక్రమాలు పెట్టుకొని పార్టీలు చేసుకొంటూ ఆనందిస్తుంటాం. అయితే అది ఎప్పుడూ శ్రుతి మించకూడదు. ఉదాహరణకు మద్యపానం నేటి పార్టీలలో ప్రధాన ఆకర్షణ. దానిని సేవించి పడిపోయే పరిస్థితి రాకూడదు. మన శరీర సామర్ధ్యాన్ని బట్టి మన చేతలు, ప్రవర్తన ఉండాలి. శరీరంలోని ఇంద్రియాలను (organs) వాటి పరిమితులకు లోబడి పనిచేసే విధంగా మనం సహకరించాలి. వాటి మీద వత్తిడి పెరిగితే అనారోగ్యానికి చేరువ అవడం ఖాయం. అప్పుడు మన రోగనిరోధక సాంద్రత ఏ విధంగానూ ఉపయోగపడదు.
‘ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు’ అని మన తెలుగు సామెత ఒకటుంది. కారణం మనం వాడే కాయగూరలన్నింటిలో బాక్టీరియా ను absorb చేసుకునే గుణం ఉల్లి కి మెండుగా ఉంది. కనుకనే ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్నపుడు ఉల్లిని కోసి రూములో ఉంచితే మంచి జరుగుతుంది. అదే కోసి ముక్కలు చేసిన ఉల్లిపాయలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదు. అది తింటే మనకు జీర్ణప్రక్రియకు సంబంధించిన ఇబ్బందులు ఏర్పడవచ్చు.
‘సర్వే జనః సుఖినోభవంతు’