పాత సంవత్సరపు తీపి చేదు అనుభావాలని
జ్ఞాపకంగా మిగిల్చి నిశి రాత్రిలో
కరిగిపోయింది నిన్నటి సంవత్సరం
చీకటి రేఖల్ని చీల్చుకుంటూ కాంతి
పుంజంలా అందరి జీవితాల్లో
కొత్త ఆశలతో, సరికొత్త ఆశయాలతో
వెలుగు నింపాలని
ఎన్నో సంబరాలు మోసుకొని
బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ
సూర్యోదయంతో పాటు ప్రతి గుమ్మం తట్టి
నూతన జీవితాలకు నాంది పలుకుతూ
ప్రతీ ఒక్కరినీ
పసిడి కిరణాలతో వెన్ను తట్టి
మేలుకొల్పు గీతం
పాడుతున్నదీ కొత్త సంవత్సరం
చీకటి జీవితాలకు చిరు వెలుగునందించి
బాలల భవితకు బంగారు రేకుల
రహదారి పరిచి అలరారబోతోంది
యువతకు నిరంతర
ఉపాధినివ్వాలని ఉవ్విళ్ళూరుతున్నది
ముదిమికి ఉల్లాసమైన
మనశ్శాంతి కలిగించాలని
ఉరుకుల పరుగులతో
వచ్చిందీ నవయుగం
నిన్నటి సంవత్సరంలోని
బాధలు, వేదనలు, వెతలు
కాలమనే రబ్బరుతో తుడిచివేసి
సంతోషాల్ని, సంబరాల్ని అమృత భాండంలా
మనకందిస్తుంది ఈ నూతన సంవత్సరం
స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని ప్రతి ఒక్కరికీ
విహంగంలా అందించి శాంతి సౌఖ్యాలను
ఇంటింటా పంచి ఇచ్చే నవశకానికి
స్వాగతం సుస్వాగతం!!!!