నేను-నీవు
నేను ఆకాశాన్ని!
నా విశాలత్వాన్ని నీవు అనంతంగా
అనుభవిస్తూనే ఉన్నావు.
నేను భూదేవిని!
నా సహనంతో నీవు సదా
సాహచర్యం చేస్తూనే ఉన్నావు.
నేను జాబిల్లిని!
నా వెన్నెలలో నీవు ఆదమరిచి
ఆనందడోలికలతో ఊగుతూనే ఉన్నావు.
నేను మరుమల్లెని!
నా సుగంధసౌరభాలలో నీవు
సొమ్మసిల్లిపోతూనే ఉన్నావు.
నేను సాగరాన్ని!
నా మమతల లోతులలో మాణిక్యాలను
ఏరుకుంటూనే ఉన్నావు.
నేను ప్రేమని!
నా పరిష్వంగంలో నీవు ఎన్నో పరితాపాల్ని
పోగొట్టుకుంటూనే ఉన్నావు.
నేను నీ సగభాగాన్ని!
నాలో నీ జగాన్ని, జీవితాన్ని
సృష్టించుకుంటూనే ఉన్నావు.
నేను నీ తీయని భావాన్ని!
నా దూరపు దుఃఖాన్నినీ ఊహల పరిష్వంగంతో
రూపుమాపుకుంటూనే ఉన్నావు.
నేను నీ ప్రియ తీరాన్ని!
నా దరి చేరి నీజీవితాన్ని
ధన్యం చేసుకుంటూనే ఉన్నావు.