Menu Close
Kadambam Page Title
నా మనసుకేదో జబ్బు చేసింది
-- కొడుపుగంటి సుజాత

నా మనసుకెందుకో
నాకే తెలియని గుబులు
ఏదో కోల్పోయినట్టు
ఎప్పుడూ నిరుత్సాహంగా
దీర్ఘకాల రోగిలా
మూల్గుతూనే ఉంటుంది

చైత్రంలో కోయిల పాటకు
పరవశించి
నూతన సంవత్సరాది
షడ్రుచులను చవి చూడదు

వైశాఖలో మల్లెల
పరిమళాలకు మైమరచి
ఆశల ఊయలలూగదు

జేష్టంలో వడగాలులకు
బెదిరి పోయి
తొలకరి జల్లులకు
మురిసిపోదు

ఆషాడ మేఘాలను చూసి
ఆనందంతో పరుగులు
తీయదు

శ్రావణ జడి వానలకు
పురుడు పోసుకున్న
పచ్చటి ప్రకృతిని చూసి
పరవశించదు

భాద్రపదాన దసరాకు
విజయభేరీ మోగించదు

ఆశ్వయుజ అందాలతో
ఆటలాడదు

కార్తీకనా దీపాల తోరణాలు
చూసి కళ్ళల్లో వెలుగులు
నింపుకోదు

మార్గశిరాన నులివెచ్చని
చలి గాలులతో సయ్యాటలాడదు

పుష్యమాసాన
సంక్రాంతి కాంతులతో
సరాగాలాడదు

మాఘమాసాన నీరెండలోని
హాయిని ఆస్వాదించదు

పాల్గుణంలో రంగుల రంగోలి
చూసి రవంత రమ్యంగా
పులకించదు

అన్నీ ఉన్నాయి
కానీ ఏమీ లేని దానినని
నిరుత్సాహం
అందరూ ఉన్నారు కానీ
ఒంటరి దానిని అని
గిరి గీసుకొని కుమిలి పోతుంది

తనకెవరో అన్యాయం చేశారని
మోసం చేశారని పదేపదే
కంటతడి పెడుతుంది

కారణం ఎవరు? ఊహూ తెలియదు
ఎందుకు అలా ఊహూ? ఏమో తెలియదు

మనసు పులకరించటానికి
ఊహల గుసగుసలు ఏవి
పరవశించటానికి కమ్మని
కబుర్లేవి
తన్మయత్వం పొందటానికి
తనువుకు చిరు స్పర్శేది

అందుకేనేమో మనసు
చలనం లేక
నిర్లిప్తంగా మారి స్పందన
కోల్పోయిందేమో!!!!

Posted in August 2020, కవితలు

2 Comments

  1. Keshavgopal

    Kodupuganti Sujatha gari kavitha ” Naa manasukedo
    jabbu chesindi ” chaalaa
    baagundi. Telugu nelalu,vaati prathyekathalanu aadhaaramgaa chesukuni, rachayithri oka vyakthi maanasika sthithini saralamaina padaalatho
    arthavanthamgaa varninchaaru.
    Vaariki hrudayapoorvaka
    abhinandanalu !
    — Keshavgopal

  2. అల్లాడి వేణుగోపాల్

    కొడుపుగంటి సుజాతమ్మ గారు…
    ఆధ్యాత్మిక….
    అభ్యుదయ…
    సామాజిక….
    చారిత్రాత్మక…
    భావ…. ప్రణయ
    ఇలా…. చెప్పుకుంటూ పోతే…
    విభిన్న రీతులలో….
    తనదైన ప్రత్యేక శైలిలో….
    కవితా మాలికలను….
    అలవోకగా తీర్చిదిద్ది….
    కళామతల్లిని ఎంతగానో
    ఆనదింపజేస్తూనే….
    పరోపకార మహాయజ్ఞాన్ని
    నిర్విరామంగా నిర్వహించే…
    విశాల హృదయులు….
    ఆ మహనీయులకు…..
    హృదయ పూర్వక ప్రణతులు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!