పంచతంత్రం కథలు
- దినవహి సత్యవతి
మాట్లాడే గుహ (Talking Cave)
అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు ఒక సింహం. అన్ని జంతువులకీ రాజైన సింహానికి ఆ అడవిలో ఎదురులేక పోవడాన తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించేది.
ఒకనాడు ఆకలితో నకనకలాడుతూ అడివంతా తిరిగిన సింహానికి వేటాడడానికి ఒక్క జంతువూ దొరకలేదు.
అలాగే ఆకలితో బాధపడుతూ, ఏం చేయాలో తోచక అడవిలో తిరుగుతున్న సింహానికి ఒక గుహ కనిపించింది.
గుహలోకి తొంగిచూసింది. గుహ ఖాళీగా ఉంది.
‘ఈ గుహలో తప్పక ఏదో జంతువు నివసిస్తూనే ఉండి ఉండాలి. ఇక్కడే గుహలో దాక్కుని దాని కోసం ఎదురుచూస్తాను. ఆ జంతువు రాగానే దానిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను’ అనుకుని గుహ లోపల దూరింది.
కొంతసేపటికి అటుగా ఒక నక్క వచ్చింది. ఆ గుహ నక్క నివాసం. గుహ లోపలికి వెళ్ళబోతున్న నక్కకు వెలుపల ఏవో అడుగుజాడలు కనిపించాయి.
‘ఈ అడుగుజాడలు చూస్తుంటే గుహలో ఏదో జంతువు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. కానీ, ఆ జంతువు మళ్ళీ బయటకు వచ్చినట్లుగా ఆనవాళ్ళు లేవు!! అంటే ఆ జంతువు ఇంకా గుహలోనే ఉందన్నమాట!. ఇంతకీ ఆ జంతువు ఎవరో?’ అని అనుకుంది.
ఆ అడుగుజాడలని దగ్గరగా వెళ్ళి పరికించి చూసి ’అమ్మో! ఈ అడుగుజాడలు అడవి రాజు సింహానివి. అంటే సింహం గుహలో నక్కి ఉండి నేను లోపలికి వెళ్ళగానే నన్ను చంపి తినాలని ఎదురు చూస్తోందన్న మాట! ఇపుడేం చేయాలి? అయినా అసలు నా అనుమానం నిజమో కాదో ఇప్పుడే తేల్చుకుంటాను’ అనుకుంది.
గుహ బయట నిలబడి ‘గుహా ! ఓ నా నివాసమైన గుహా’ అని బిగ్గరగా పిలిచి నిశ్శబ్దంగా ఎదురు చూసింది కాసేపు.
లోపలనుంచి ఎటువంటి సమాధానమూ రాలేదు.
‘ఓ గుహా! నేను మొదట ఇందులో నివసించడానికి వచ్చినప్పుడు మన మధ్య ఒక ఒప్పందం జరిగింది గుర్తుందా మర్చిపోయావా?’
అయినా లోపలనుంచి ఎటువంటి సమాధానమూ రాకపోయేటప్పటికి మరలా తానే ‘ఓహో అయితే మర్చిపోయావన్న మాట! ఊ! సరే మరి ఏం చేస్తాం..నేనే గుర్తుచేస్తాను......ఆ ఒప్పందం ఏమిటంటే నేను గుహ దగ్గరికి రాగానే చప్పుడు చేస్తాను. ఆ చప్పుడుకి నువ్వు సమాధానం చెప్తేగానీ నేను గుహలోకి అడుగుపెట్టను అని... అవునా? ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పట్లేదు కాబట్టీ నేను ఇంకో గుహకి వెళ్ళిపోతున్నాను’ అని అరిచి చెప్పింది నక్క.
ఆ మాటలన్నీ లోపల దాక్కుని విన్న సింహం ఆలోచనలోపడింది ‘అయితే ఈ గుహ నిజంగానే నక్క మాటలకి సమాధానం చెప్తుంది కాబోలు! నేను లోపల ఉన్నానని భయపడి సమాధానం చెప్పడం లేదేమో? ఒక్కొక్కసారి భయంతో నోటమాటరాదు. అయితే ఏం? గుహకి బదులుగా నేనే నక్కని లోపలికి ఆహ్వానిస్తాను’ అనుకుని ‘రావయ్యా నక్క మిత్రమా. భయపడకుండా లోపలికి రా’ అని గర్జించి పిలిచింది.
నక్క లోపలికిరాగానే దాన్ని చంపి తిని తన ఆకలి తీర్చుకుందామని ఆశపడింది ఆ తెలివితక్కువ సింహం.
సింహం గర్జన గుహలో ప్రతిధ్వనించి గుహంతా దద్దరిల్లడంతో నక్క భయపడి మరి వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పారిపోయింది.