మంచె మీద ఈ రైతు అనగా ఒక నేను
- గవిడి శ్రీనివాస్
చలి పొద్దు మీద సూర్యోదయాన్ని ఎత్తుకుని
వడి వడి గా నడకను పక్షుల కూతలపై ఆరేస్తాను
ఇన్నాళ్ల కష్టం పంటై కళ్ళల్లో మెరుస్తుంటే
నాలో ఆశల గోరువంకలు ఎగురుతున్నాయి.
వేరుశెనగ పంట గదా ఏ పిట్ట ఎక్కడ కొరుకుతుందో
అల్లరి పక్షుల మూకలకి నేను నలుమూలలా పరుగెత్తాల్సిందే
కాసేపు మంచె మీద వాయిద్యమై
డబ్బా డప్పుతో దుముకుతుంటాను.
శబ్ద మెంత కఠోరమైన గాని
పక్షులకి పంట చిక్కకుంటే చాలు
అడవి పందులకి దక్కకుంటే చాలు
కొన్ని నెలల చెమట ధార
ఆనంద ప్రవాహమై తిరిగొస్తుంది.
ఎండ ముంచుతున్నపుడూ
మబ్బులు చీకట్లను దులుపుతున్నపుడూ
నా కళ్ళు ఆకాశంలో సంచరిస్తున్నపుడూ
ఆకాశం నా పంట పై వాలుతున్నపుడూ
ఈ ఒంటరి సమయంలో కూడా
మంచె మీద ఈ రైతు అనగా అనగా ఒక నేను
ఆకాశాన్ని మోస్తూ
సూర్యోదయాల్ని సూర్యాస్తమయాల్ని
నాలో నింపుకుంటూ నిలుపుకుంటూ
అరిచే కీచురాళ్ళ మధ్య
రేపటి బతుకు భరోసాగా ప్రకాశిస్తాను.