శ్రీయుతులు వెంకట్ నాగం గారు వృత్తి రీత్యా సాంకేతిక నిపుణుడిగా అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకొన్నారు. నాకు చిరకాల మిత్రుడు. మాతృభాష, మాతృభూమి, మన సంస్కృతీ, సంప్రదాయాలు అనే మాటలకు నిజమైన అర్థాలను గుర్తెరిగి గత రెండు దశాబ్దాలుగా విదేశాలలో మన తెలుగు భాష మాధుర్యాన్ని వివరిస్తూ ప్రముఖ తెలుగు పత్రికలకు ఎన్నో విశ్లేషణాత్మక వ్యాసాలను వ్రాస్తూ, వందలకొలది సందర్భానుసార ప్రచురణలతో ఒక పాత్రికేయుడిగా, సంపాదకుడిగా, స్థానిక శాక్రమెంటో తెలుగు సంఘం కు 2014-2016 మధ్య రెండు సంవత్సరాలు అధ్యక్షుడిగా, సాంస్కృతిక విభాగ సలహాదారుగా ఇలా ఒకటేమిటి ఎన్నో రూపాలతో ‘మన తెలుగు మధురానుభూతుల వెలుగు’ అంటూ మన సంప్రదాయ మూలాలను అనుభవ పూర్వకంగా ఆచరిస్తూ, తన వంతు బాధ్యతగా భావి తరాలకు అందిస్తూ నిరంతరం అలుపెరుగక కృషి సల్పుతున్న వెంకట్ గారు మన సిరిమల్లె కొరకు ఇప్పుడు “మన ఊరి రచ్చబండ” శీర్షికతో మన ముందుకు వచ్చారు. ఈ శీర్షిక యొక్క ముఖ్యోద్దేశం ఆయన మాటలలో గత సంచికలో విన్నాము. వెంకట్ గారికి కృతజ్ఞతలు – మధు బుడమగుంట
మనకు తెలుగులో ఒక సామెత ఉంది. "ఇద్దరే సత్పురుషులు, ఒకడు పుట్టనివాడు, ఇంకొకడు గిట్టినవాడు", అంటే ఈ మధ్యలో జీవించి ఉన్నవారందరూ సత్పురుషులు కాదన్నట్లు చెప్పకనే చెప్పారు, ఈ సామెతను పుట్టించిన వారు ఎవరో మహానుభావులు. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. ఇక్కడ "ఆమెత" అంటే విందు భోజనం. సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి, అందుకే తెలుగు సామెత తో ఈ నెల రచ్చబండ చర్చను మొదలు పెట్టాను. అసలు మొదలు పెట్టిన సామెత విషయానికి వద్దాం. సత్పురుషులు అంటే స్వార్థాన్ని వీడి, పరోపకారమే పరమార్థంగా పనిచేసేవారు. కలికాలంలో వీరిని పట్టుకోవడం అంటే సముద్ర తీరాన పోగొట్టుకున్న సూదిని ఇసుకలో వెతకడంతో దాదాపుగా సమానం. ఎవర్నీ కూడా నిందించే ప్రయత్నం కాదు ఇది, కానీ “కలికాలం" ఏంచేస్తాం? అయితే ప్రయత్నిస్తే, మన మధ్య నిన్న మొన్నటివరకు రక్తమాంసాలతో జీవించిన సత్పురుషులను కొంతమందిని మనం గుర్తించవచ్చు. అందులో ప్రముఖంగా పేర్కొనవలసినది స్వామి వివేకానంద. ఈ నెల రచ్చబండ చర్చ ఆయన గురించే. అయితే పాత చింతకాయ పచ్చడిలా ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎవరికి, ఎక్కడ పుట్టాడు వంటి విషయాలు చర్చిస్తే ఉన్నకాలం కాస్తా అయిపోతుంది, కాబట్టి ఆయన రచ్చ గెలిచిన విధానం కొంత చర్చిద్దాం. ఇంట గెలిచి, రచ్చ గెలవాలి అంటారు కదా, ఇక్కడ రచ్చ అంటే పాశ్చాత్య దేశాలు అని అనుకోవాలి. ముఖ్యంగా 1893-1897 మరియు 1899-1902 మధ్య కాలంలో, స్వామి వివేకానంద అమెరికాలో విస్తృతంగా పర్యటించి అనేక విషయాలపై ఉపన్యాసాలు ఇచ్చాడు, మరియు పలు వేదాంత కేంద్రాలను కూడా స్థాపించాడు. 1899లో, న్యూయార్క్‌లో ఉపన్యాసాలు అందించిన తర్వాత, ఆయన అమెరికా యొక్క పశ్చిమ భాగానికి ప్రయాణించి చికాగో మీదుగా కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిల్స్ నగరం చేరుకున్నాడు. ఆయన కాలిఫోర్నియాలో ఓక్లాండ్, శాన్ ఫ్రాన్సిస్కో మరియు అల్మెడ నగరాలలో పలు ఉపన్యాసాలు ఇచ్చాడు.
స్వామి వివేకానంద సందర్శించి ప్రసంగించిన వేదికల్లో కాలిఫోర్నియా లోని ఓక్లాండ్ నగరంలో ఉన్న "ఫస్ట్ యూనిటేరియన్ చర్చ్ ఆఫ్ ఓక్లాండ్" ఒకటి. 1891లో తెరవబడిన ఫస్ట్ యూనిటేరియన్ చర్చ్ ఆఫ్ ఓక్లాండ్, డౌన్‌టౌన్ ఓక్లాండ్‌లోని 14వ వీధి మరియు కాస్ట్రో స్ట్రీట్స్ వద్ద నెలకొని ఉంది. ఒక శతాబ్దానికి పైగా ఈ చర్చ్ ఉదారవాద మతపరమైన భావనలు, సహనం మరియు సామాజిక సేవకు అంకితమైంది. స్వామి వివేకానంద గూర్చి ఈ చర్చ్ వెబ్ సైటు లో ఇలా ప్రస్తావించారు "భారతదేశ ఆధునిక సాధువుగా పరిగణించబడే స్వామి వివేకానంద ఫిబ్రవరి 25, 1900న ఉత్తర కాలిఫోర్నియా పర్యటనలో ఉన్నప్పుడు ఈ చర్చిలో ప్రసంగించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు, వేదాంత సొసైటీ సభ్యులు ఈ చర్చిలో ఆయన ప్రసంగించిన హామిల్టన్ హాల్ వేదికను ఒక పుణ్యక్షేత్రంగా భావిస్తారు". 1900 సంవత్సరంలో ఆయన ఈ చర్చి వేదికగా స్వామి వివేకానంద చేసిన ప్రసంగం బర్కిలీలోని చాలా మందిని ఆకట్టుకుంది, తదనంతరం బర్కిలీలో వేదాంత సొసైటీ స్థాపనకు ఈ ప్రసంగం దారితీసింది.
2013లో నాకు ఈ చర్చి ని దర్శించే భాగ్యం దక్కింది. "స్వామి వివేకానంద హిందూమతం మరియు భారతదేశం యొక్క అమెరికాకు చెందిన ప్రముఖ సాంస్కృతిక రాయబారిలలో ఒకరు, ఆయన సందేశం సహజంగా యువతతో అనుసంధానం అవుతుంది" అని అక్కడ పనిచేస్తున్న ఒక ఫాదర్ వ్యాఖ్యానించారు. సదరు చర్చిలో స్వామి వివేకానంద తన ప్రసంగం కోసం వేచి ఉండగా కూర్చున్న చెక్క కుర్చీ మరియు ఆయన ప్రసంగించిన పోడియం నాకు చూపించారు.
2013 సంవత్సరంలో స్వామి వివేకానంద 150వ జన్మదినం సందర్భంగా కాలిఫోర్నియాలోని ఔత్సాహిక యువకుల బృందం, దాదాపు 100 మంది, స్వామి వివేకానంద ప్రసంగించిన ఓక్లాండ్‌లోని ఫస్ట్ యూనిటేరియన్ చర్చిని సందర్శించింది. "ఆలస్యంగానైనా, మేము స్వామి వివేకానంద గురించి చాలా ఎక్కువ చదువుతున్నాము, కానీ ఆయన మాట్లాడిన ప్రదేశాన్ని సందర్శించడం, కూర్చొని తిరగడం నిజంగా ఒక ప్రత్యేక అనుభూతి" అని కుపర్టినోలోని ఉన్నత పాఠశాల విద్యార్థి అన్నారు. "స్వామీజీ మాట్లాడటానికి లేచి నిలబడిన క్షణం నేను అనుభవిస్తున్నట్లుగా ఉంది" అని అతను చెప్పాడు. నిజంగా చెప్పాలంటే ఆ ప్రాంతాన్ని సందర్శించిన వ్యక్తిగా నాకు కూడా అ మాట నిజమే అనిపించింది.
1939లో ఆంగ్ల రచయిత, తత్వవేత్త జెరాల్డ్ హెర్డ్, జీవితానికి సంబంధించిన ఆలోచనాత్మక అధ్యయనానికి, అభ్యాసానికి అంకితమైన ఒక మతపరమైన సంస్థను స్థాపించాలనే ఆలోచనను రూపొందించాడు. వేదాంత సొసైటీకి ఒక మఠం అవసరమని తెలుసుకున్న హెర్డ్ మహాశయుడు 300 ఎకరాల భూమిని సేకరించి వేదాంత సొసైటీకి ఆయన ఇచ్చాడు. 1949, సెప్టెంబరు 7న స్వామి ప్రభవానంద చేతులమీదుగా 40 ఎకరాల స్థలంలో ప్రతిష్ఠించబడింది. ఈ మఠం వేదాంత సొసైటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో భాగంగా, రామకృష్ణ ఆర్డర్ ఆఫ్ ఇండియాకు పశ్చిమ శాఖగా ఉంది. రామకృష్ణ పరమహంస పేరుమీదుగా ఈ రామకృష్ణ మఠం ఏర్పాటుచేయబడింది. ఉదయం 6 గంటలకు మార్నింగ్ బెల్ మోగించడంతో ఇక్కడి దినచర్య ప్రారంభమవుతుంది. ఉదయం 6:30 నుండి 7:30 వరకు ధ్యానం ఉంటుంది. అల్పాహారం, మధ్యాహ్నం ఆరాధన, మధ్యాహ్న భోజనం ఉంటాయి. కాసేపు విశ్రాంతి తరువాత సాయంత్రం 5:30లకు మరల పని దినచర్య కొనసాగుతుంది. సాయంత్రం లైబ్రరీలో శ్రీ రామకృష్ణ బోధనల పఠనం ఉంటుంది. ప్రతి ఏడాది జూలై నాల్గవ తేదీన స్వామి వివేకానంద గౌరవార్థం ఒక ప్రత్యేక వేడుకను ఈ మఠంలో నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఈ వేడుకకు అనేక వందల మంది సందర్శకులు వస్తారు. కాలిఫోర్నియా నివాసిగా, తీరిక చేసుకొని ఈ మఠం ను సందర్శించాలనే కోరికతే నాకు ఉంది. ఈ లోపు ఈ మఠం వెబ్ సైటును సందర్శించి అసలు అక్కడి బోధకులు ఎవరో తెలుసుకుందామని, వీలయితే వారిని కలుసుకుందామని ప్రయత్నించాను. ఆ మఠం వెబ్ సైటు లో బోధకులుగా ముగ్గురి పేర్లు వారు వ్రాసారు, వారెవరోకాదు - రామకృష్ణ, ఆయన భార్య శారదా దేవి, ఆయన శిష్యుడు వివేకానంద. వీరిని కలుసుకోవాలంటే మనకు "ఆదిత్య 369" సినిమాలో వలె ఒక టైము మిషను కావాలి, లేదా వీరి బోధనలు అధ్యయనం చేయాలి. అంతేకదా?
1900 సంవత్సరంలో స్వామి వివేకానంద పర్యటనలో భాగంగా కాలిఫోర్నియాలో స్వామీజీ ఇచ్చిన ఉపన్యాస సారాంశం "మానసిక శక్తులు" అనే పుస్తకం గా వెలువడింది (ISBN 9789388439893). దివ్యశక్తుల గురించి స్వామి వివేకానంద అనుభవాలు, ఆయన జోడించిన ఉదాహరణలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఆసక్తి కలవారు 2018లో రామకృష్ణ మఠం ప్రచురించిన ఈ పుస్తకంను పుస్తకాల షాపులో కొని లేదా అంతర్జాలంలో ఈ-కాపీ దొరికితే చదువగలరు.
వివేకానంద తన ఉపన్యాసాలు ఇచ్చే ముందు భోజనం చేయని అలవాటు గురించి ఒక ఉదంతం ప్రస్తావిస్తాను. ఖాళీ కడుపుతో తాను చేసిన ఉపన్యాసం తన ప్రదర్శన యొక్క స్పష్టతను మెరుగుపరిచిందని ఆయన గుర్తించాడు. కడుపు నిండినవానికి గారెలు చేదు అంటారు మన పెద్దవారు, ఆధునిక సమాజంలో భోజనప్రియులు కొంతమంది గారెలు చేదు ఎక్కేంత వరకు తినడం మనకు అక్కడక్కడ కనిపిస్తుంది. మినప గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. వడ్డిస్తే కాదనకుండా గారెలు లాగించని తెలుగువాడు ఎవడైనా ఉంటాడా? ఉపన్యాసకులు ఈ లెక్కన "లెక్కపెట్టుకోకుండా" గారెలు తింటే ఇంకేం ఉపన్యాసం? "ఉపన్యాసం దారి ఉపన్యాసంది, నాదారి నాది" అని హాయిగా కాళ్ళు చాపుకొని ఒక కునుకు వేస్తారు కదా? గారెల సంగతి అటుంచి, తాను ఖాళీ కడుపుతో ఆకలిగా ఉండి, సభలో ఉన్న ఆహుతులకు తన ప్రసంగంతో "జిజ్ఞాస అనే ఆకలిని" తీర్చిన స్వామి వివేకానంద ధన్యుడు కదా?
స్వామి వివేకానంద 1902 లో తన భౌతికశరీరాన్ని త్యజించి ఉండవచ్చుగాక, కానీ చివరిగా ఆయన ఎరిక్ హామ్మండ్ తో లండన్ లో చెప్పిన మాటలు స్వామీజీ తన బోధనల ద్వారా మన ఊహలలొ అమరుడన్న ఊరటను మనకందరికి కలిగిస్తాయి. "నా శరీరాన్ని ఒక చింకిపాతలాగా విసిరేసి బయటికిపోవడమే మంచిదని నాకు అనిపిస్తూ ఉండవచ్చు గాక! కానీ నేను నా పనిచెయ్యడం మానను! తానే దైవాన్ని అన్న విషయం ఈ ప్రపంచం తెలుసుకునేంతవరకూ ప్రతి ఒక్కరికీ నేను ప్రేరణ కలిగిస్తూనే ఉంటాను" అని ఆయన ఎరిక్ హామ్మండ్ తో లండన్ లోచెప్పారు. స్వామి వివేకానంద బోధనలో ఆది శంకరాచార్యులు బోధించిన తత్వం "అద్వైతం" మనకు స్ఫురణకు వస్తుంది కదా? అద్వైతం అనగా రెండు కానిది. ఆత్మ, బ్రహ్మము అంటే పరమాత్మ ఒకటే అనేది అద్వైతం మూల సూత్రం. “స్వామి వివేకానంద బోధన - అద్వైతం" అనుసంధానం మీకు అర్థం అయిందనే అనుకుంటాను. జనవరి 12వ తేదీ ఆ సత్పురుషుడు స్వామి వివేకానంద జయంతి. పవిత్రమైన ఆరోజుని నేషనల్ యూత్ దినంగా మన జరుపుకుంటాము. ఈ సందర్భంగా సిరిమల్లె పాఠకులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వచ్చే నెల రచ్చబండలో మరో అంశం పైన చర్చింద్దాం, ఈలోపు మీ స్పందను కింది కామెంట్ బాక్స్ లో రాయడం మరచిపోవద్దు సుమా !
-- నమస్కారములతో, మీ వెంకట్ నాగం
Oh Excellent
I am very much Happy for your enthusism to give life to Telugu literature among our Telugu people in US..
Hearty Congratulations.
Live Long, with the the same zeal.
Wish you all the best.
Regards
Dr Ramadas K