భోగి, సంక్రాంతి, కనుమల సమాహారం
మేటి మకర సంక్రాంతి పర్వదినం
సప్తాశ్వ రధమారూధం - సుప్త తిమిర రిపుం విభాకరం
మకర రాశి ప్రవేశం మకర సంక్రమణం
తొలినాడు మిన్నంటు భోగి మంటల ప్రజ్వలనం
ప్రభాతాన ఎగసిన భోగి మంట నెగళ్ళతో మెరిసిన అవనీతలం
ప్రదోషాన కురిసిన రేగు పళ్ళ పోతలతో మురిసిన నిశ అతిశయం
హరిదాసుల భజనల హోరులో ఊరూరా భక్తి పారవశ్యం
బాజా భజంత్రీల నడుమ గంగిరెద్దుల విన్యాసాల సందర్శనం
మరునాడు ఇంటింటా సంక్రాంతి వైభోగం
రంగ వల్లులు తీరిన తెలుగు ముంగిళ్ళలో
అంగనల ఆర్భాటపు ముద్దు ముచ్చట్లు
క్రొత్త అల్లుళ్ళ కినుకలు, కొంటె మరదళ్ల చురకలు
అంబరాన్నంటిన పతంగుల సింగారాలు
అంతకు మించి పసందైన గోదావరి కోడి పందాలు
కడగా కనుమ తెస్తుంది కర్షకులకు శుభారంభం
వరి ధాన్యపురాశులతో రైతన్నకు ప్రమోదం
వరించిన విరామంతో బసవన్నకూ పరమానందం
వసంతాగమన వేళ పులకించిన ప్రకృతి విలాసం
భూమాతకు తొలి స్వాగతం యీ పొంగళ్ళ పర్వం
అన్నింటి నవలోకించిన ఆదిత్యుడు భావించేనట
ఇకఫై తన గమనం మకర రాశి వెంటే ఉండాలని
మహితాత్ములకు ఉత్తరాయణ స్వర్గ ద్వారాలు
అనునిత్యం తెరచే ఉండాలని.
సంక్రాంతి కవిత చాల బాగుంది. చక్కనైన ప్రాసలతో, అందమైన పదములతో కూర్చిన మాల వలె గుభాళించు చున్నది. మీకు శుభాకాంక్షలు !!