దక్షిణ ఆఫ్రికా
డర్బన్-ప్రిటోరియా రైలు ప్రయాణం
1893 మే నెల మూడవ వారంలో డర్బన్ చేరిన మోహన్ దాస్ కొద్ది రోజులలోనే క్రైస్తవ భారతీయులు, ఇతర భారతీయులతో పరిచయం ఏర్పడింది. వీరిలో ముఖ్యులు ప్రొటెస్టెంట్ మిషన్ (Protestant Mission) ఉపాధ్యాయుడు సుభాన్ గాడ్‌ఫ్రె (Subhan Godfrey), పార్సీ ప్రముఖుడు Rustomji, ఆడంజీ మియాఖాన్ (Adamji Miyakhan). ఇలా పరిచయాలు పెంచుకునే దశలో ‘ప్రిటోరియా’ (Pretoria) నుంచి ‘అబ్దుల్లా సేథ్’ కంపెనీ న్యాయవాదులనుంచి వచ్చిన ఉత్తరంలో ‘అబ్దుల్లా’ గాని, ఆయన ప్రతినిధి (Represe -ntative) గాని అచ్చటకు రావాలని ఉంది.
మోహన్ దాస్ ను ప్రిటోరియా వెళ్ళమని అబ్దుల్లా సేథ్ సూచించగా ఈతను “ఈ కేసు గురించిన వివరాలు మీ ద్వారానే తెలుసు. కాని దీని పూర్వాపరాలు తెలియకుండా వెళ్ళటం బాగుండదు” అని సమాధానమిచ్చాడు. వెంటనే అబ్దుల్లా సేథ్ తన గుమాస్తాలను పిలిపించి ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు విపులంగా తెలియజేయమని ఆదేశించాడు. వారు వెంటనే వాటిని మోహన్ దాస్ కు విశదీకరించారు. ఒకటి, రెండు రోజుల తరువాత ప్రిటోరియా వెళ్ళటానికి సంసిద్ధుడయ్యాడు మోహన్ దాస్.
ఈ వ్యాజ్యంలో అబ్దుల్లా సేథ్, ప్రతివాది ‘సేథ్ త్యేబ్ హాజీ ఖాన్ ముహమ్మద్’ (Sheth Tyeb Haji Khan Muhammad) దగ్గర బంధువులే. వీరి మధ్య వివాదం 40,000 పౌండ్లు. ఈ మొత్తం అబ్దుల్లా సేథ్ కు రావాలి.
డర్బన్ నుంచి ప్రిటోరియా నేరుగా వెళ్లే రైలు లేదు. మొదట డర్బన్ నుంచి ‘చార్లెస్టన్’ (Charleston) వరకు రైలులో వెళ్లి, అక్కడనుంచి జొహాన్నెస్బెర్గ్ (Johannesburg) వరకు ‘స్టేజి కోచ్’ (Stage-coach), తరువాత ప్రిటోరియా కు రైలులో ప్రయాణించాలి. మొత్తం దూరం 620 కి.మీ. (385 మైళ్ళు).
మోహన్ దాస్ కు జరిగిన ఘోరావమానం: జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన
ఈ విషయాలను గాంధీజీ మాటల్లోనే తెలుసుకుందాము
“డర్బన్ నుంచి చార్లెస్టన్ (Charlestown) నా రైలు ప్రయాణానికి మొదటి తరగతిలో ఏర్పాటు చేయటం జరిగింది. టిక్కట్ ఖరీదు గాక ప్రత్యేక బెడ్డింగ్' (bedding) ఖరీదు 5 షిల్లింగులు. అనవసరంగా డబ్బు వృధా చేయటం ఇష్టం లేక నేను నా దగ్గర ఉన్న చిన్నపాటి బెడ్డింగ్ తో బయలుదేరాను. రైలు డర్బన్‌లో సాయంత్రం బయలుదేరి 31 మే (1893) రాత్రి 9 గంటలకు నాటాల్ రాష్ట్ర రాజధాని ‘మారిట్జ్ బెర్గ్’ (Maritzburg; దీనిని ఇప్పుడు Pietermaritzburg అంటారు) చేరింది.
ఒక సేవకుడు వచ్చి ‘ప్రత్యేక బెడ్డింగ్ కావాలా’ అని నన్ను అడిగాడు. ‘నాకు వద్దు, నా దగ్గర ఒకటి ఉంది అని చెప్పాను’. అతను నన్ను ఎగా దిగా చూసి బయటకు వెళ్లి ఇద్దరు శ్వేతజాతి అధికారులను తీసుకువచ్చాడు. వారిలో ఒకరు నా వద్దకు వచ్చి ‘నీవు నా వెంట రా. నీవు ‘Van Compartment’ (సామాన్యులు ప్రయాణించే క్రింది తరగతి కంపార్ట్మెంట్) లోకి మారాలి. దానిని నీకు నేను చూపిస్తాను’ అని ఆదేశించాడు.
నేను వెంటనే ‘నా వద్ద మొదటి తరగతి టిక్కట్టు ఉంది’ అని సమాధానం ఇచ్చాను. అతను ‘అది లెఖ్ఖ లేదు. నీవు తప్పని సరిగా Van Compartment లోకి మారాలి’ అని నిఖచ్చిగా చెప్పాడు.
‘నేను మళ్ళీ చెప్పుతున్నా. నాది మొదటి తరగతి టిక్కట్టు కాబట్టి ఇందులోనే ప్రయాణించటానికి అనుమతి ఉంది. అందువల్ల నేను ఈ మొదటి తరగతిలోనే నేను ప్రయాణం చేస్తాను’ అని ఘంటా పధంగా చెప్పాను.
అతను ‘నీవు ఇందులో ప్రయాణించవు. నీవు ఇక్కడ నుంచి విధిగా వెళ్ళాలి. నీవు వెళ్లకపోతే నేను పోలీస్ కానిస్టేబుల్ (Police Constable) పిలిచి ఈ Compartment నుంచి బయటకు తోయిస్తాను’ అని గట్టిగా అన్నాడు.
నేను ‘అలాగే చేయి. నేను మాత్రం స్వచ్చందంగా వెళ్లను’ అని భీష్మించుకుని కూర్చున్నాను.
వెంటనే రైలు అధికారి ఒక కానిస్టేబుల్ ను పిలిచాడు. అతను వచ్చి నా చేయి పట్టుకుని రైలు పెట్టెలోనుంచి ప్లాట్ ఫారం మీదకు తోసివేశాడు. నా పెట్టె, పరుపు బయటకు గిరాటు వేశాడు. నేను ఇంకో తరగతి కంపార్ట్మెంట్ కు మారలేదు. వెంటనే రైలు బయలుదేరి వెళ్లిపోయింది. నేను నా చేతిబాగ్ ను తీసుకుని ప్రయాణికుల గదిలోకి (waiting room) వెళ్లి కూర్చున్నాను. నా పెట్టె, పరుపుప్లాట్ ఫారం మీదనే ఉన్నాయి. రైలు ఉద్యోగులు దానిని స్వాధీనం చేసుకున్నారు.
అది మే నెల 29 రాత్రి. అచ్చట చలికాలం. భరించలేనంత చలి. మారిట్జ్ బెర్గ్ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్నందువల్ల చలి చాలా ఎక్కువగా ఉంటుంది. నా పైకోటు (Over-coat) పెట్టెలో ఉంది.
రైలు ఉద్యోగుల దగ్గరకు వెళ్లి దానిని అడిగే ధైర్యం లేదు. అడిగి వారి నుంచి ఇంకా అవమానం పడదలచు కోలేదు. అందువల్ల రాత్రంతా వణుకుతూ కూర్చున్నాను. గదిలో దీపం కూడా లేదు.
అలా కూర్చున్నప్పుడు, ఇప్పుడు నేను ఏంచేయాలో ఆలోచించాను. దీని మీద నా హక్కుల గురించి పోరాడాలా, లేక ఈ అవమానాన్ని దిగమింగి ప్రిటోరియా వెళ్లాలా, లేదా ఈ వ్యాజ్యం ముగిసిన తరువాత అసలు భారత్ కు వెళ్ళాలా అని ఆలోచిస్తూ కూర్చున్నాను చీకట్లో. భారత్ కు తిరిగి వెళ్తే అది పిరికితనం అవుతుంది. నాకు జరిగిన ఈ అవమానం నామనస్సుకు సూటిగా తగిలింది. దీనివల్ల ఈ దేశంలో వర్ణ వివక్ష జాడ్యం ఎంతగా పాతుకుపోయిందో అర్ధమయింది. దీనిని సమూలంగా పెకిలించటం కష్టతరమయినా నేను ప్రయత్నించాలి అని నిర్ణయించుకున్నాను. అలా ఆలోచిస్తూ నా మనస్సు శ్రీకృష్ణ గీతోపదేశంలోని ముఖ్య సందేశాన్ని నెమరువేసుకుంటూ నిశీధి రాత్రిని గడిపాను. ఈ విధంగా ధైర్యాన్ని కూడ గట్టుకుని మార్గనిర్ధేశనం వెతుక్కున్నాను.
మరుసటి రోజు ప్రిటోరియా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. ఉదయం డర్బన్ లోని రైలు ‘General Manager’ కు, అబ్దుల్లా సేథ్ కు టెలిగ్రాములు పంపించాను. అబ్దుల్లా సేథ్ General Manager నన్ను కలిస్తే అతను అధికారులను సమర్ధిస్తూ మారిట్జ్ బెర్గ్ లోని Station Master కు నేను చేరవలసిన గమ్యానికి ఏ అడ్డంకులు లేకుండా చేర్చమని సందేశం పంపించాడు. అబ్దుల్లా కూడా మారిట్జ్ బెర్గ్ లో ఉన్న తన అనుయాయులు, స్నేహితులను రైలు స్టేషన్ కు పంపించాడు. వారు నన్ను కలిసి ఈ దేశంలో వర్గ, జాతి వివక్షత సామాన్యమనీ నచ్చజెప్ప చూశారు. చివరకు రాత్రి వచ్చిన రైలులో మొదటి తరగతి టిక్కట్టు, బెడ్డింగ్ కొని ప్రయాణం చేశాను. మరుసటి రోజు ఉదయానికి రైలు Charlestown చేరింది.”
మరికొన్ని కష్టాలు
Charlestown నుంచి 'జొహాన్నెస్బెర్గ్ (Johannesburg) వెళ్ళటానికి రైలు లేదు. Stage Coach లో ప్రయాణించాలి. గాంధీజీకి ఇందులో వెళ్ళటానికి టిక్కట్టు ఉంది. కాని కోచ్ ఏజెంట్ “నీ టిక్కట్ రద్దు అయింది” అని చెప్పాడు. గాంధీజీ తన టిక్కట్ చూపించాడు. శ్వేత జాతీయుడయిన ఏజెంట్ కు ‘కూలీ’ అయిన గాంధీజీని శ్వేత వర్ణ ప్రయాణికుల మధ్య కూర్చోబెట్టటం ఇష్టం లేదు. కాని టిక్కట్టు ఉన్న వారందరినీ ‘కోచ్’ లో సర్దుబాటు చేయాలి. అందువల్ల ‘కోచ్ బాక్స్’ (coach box) కు ఇరువైపులా ఉన్న సీట్లలో లోపల దాంట్లో తాను కూర్చుని, వెలుపల సీట్లో గాంధీజీని కూర్చోమని ఆదేశించాడు. దీనిని తిరస్కరిస్తే గాంధీజీ లేకుండా కోచ్ వెళ్ళిపోతుంది. ఫలితంగా మరో రోజు వృధా అవుతుంది. గత్యంతరం లేక కోపాన్ని అణచుకుని, కోపాన్ని దిగమ్రింగి అతను చూపించిన సీటులోనే కూర్చున్నాడు మన భావి జాతిపిత.
మిగతా విషయాలు గాంధీజీ ఇలా వివరించారు.
“మధ్యాహ్నం 3 గంటలకు దారిలో ‘Pardekoph` అనే ఊరిలో కోచ్ ఆగింది. వెంటనే ఏజెంట్ ‘నేను సిగరెట్టు కాల్చుకోవాలి. నీవు కూర్చున్న సీట్ లో నేను కూర్చుంటాను’ అని డ్రైవర్ నుంచి ఒక గోనెసంచి తీసుకుని, దానిని కోచ్ ద్వారం మెట్ల దగ్గర వేసి ‘నువ్వు ఇక్కడ కూర్చో’ అని నన్ను ఆదేశించాడు. జరిగిన అవమానాన్ని దిగమ్రింగిన నేను ఇక భరించలేక కోపంతో ఊగిపోతూ ‘ముందు నన్ను లోపల కూర్చోబెట్టటానికి నిరాకరించి, బయట సీటులో కూర్చోబెట్టావు. ఆ అవమానం భరించాను. ఇప్పుడు నీ కాళ్ళ దగ్గర కూర్చో అంటున్నావు. నేను అలా కూర్చోను. లోపలే కూర్చుంటాను’ అని భీష్మించాను.
వెంటనే ఏజెంట్ నా మీదకు లంఘించి నాముఖం, చెవులు పొట్టమీద పిడిగుద్దులు వేశాడు. నా చేతిని పట్టుకుని కోచ్ నేలమీద పడవేసి లాగసాగాడు. నేను సీటు కమ్మీలు పట్టుకుని అతనిని ప్రతిఘటించటానికి ప్రయత్నించాను. ఇది ఇంకా కొంతసేపు జరిగి ఉంటే నా మణికట్టు (wrist) ఊడి వచ్చే ది. బలీయమైన ఈ శ్వేత జాతీయుడు నన్ను కొట్టటం, బలవంతంగా ఈడ్చుకు వెళ్ళటానికి ప్రయత్నించటం, నేను బలహీనంగా ప్రతిఘటించటం కొంత మంది ప్రయాణీకులు చూసి భరించలేక ‘ఏయ్ పెద్ద మనిషీ, ఇతనిని కొట్టకు, ఇక బాధించకు; అతని తప్పు ఏమీ లేదు. అచ్చట కూర్చోవటం నీకు ఇష్టం లేక పోతే ఇతనిని మా మధ్య వచ్చి కూర్చోనివ్వు’ అని గట్టిగా అరిచారు.
ఈ ఏజెంట్ ముఖం వెంటనే చిన్నబోయి నన్ను కొట్టటం ఆపి, నా చేతిని వదలి, నన్ను బూతులు తిడుతూ ఒక పనివాడిని మెట్ల మీద కూర్చోమని, నేను ఖాళీ చేసిన సీటులో అతను కూర్చున్నాడు. నేను వెళ్లి తోటి ప్రయాణికుల మధ్య కూర్చున్నాను. కాని నా గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది. ఇంత కష్టంతో కూడిన ఈ ప్రయాణం నన్ను గమ్యాన్ని (Pretoria) చేర్చగలదా అనే అనుమానం నాలో బయలు దేరింది. ఏజెంట్ నా వంక కోపంగా చూస్తూ ‘జాగ్రత్త, Sanderton చేరిన తరువాత నిన్ను ఏంచేస్తానో నీకు చూపిస్తాను’ అని బెదిరించాడు. నేను మాట్లాడలేక దేవుడిని ప్రార్ధిస్తూ కూర్చున్నాను.
చివరకు సంధ్యా సమయంలో Sanderton చేరిన తరువాత భారతీయుల ముఖాలు చూసేటప్పటికి నాకు ప్రాణం లేచి వచ్చింది. వారు ‘అబ్దుల్లా సేథ్ నుంచి మాకు టెలిగ్రామ్ వచ్చింది. మిమ్ములను ఇసా సేథ్ (Isa Seth) వద్దకు తీసుకువెళ్తున్నాం’ అని చెప్పారు. వారికి నాకు జరిగిన అవమానం గురించి చెప్పాను. వారు తమకు ఇదివరకు జరిగిన అవమానాలను ఏకరువుపెట్టారు.
నేను వెంటనే ఈ శ్వేత దురహంకారి ఏజెంట్ గురించి కోచ్ కంపెనీ అధికారికి జరిగిన విషయం గురించి విపులంగా ఒక ఉత్తరం వ్రాసి ఇచ్చాను. ఆయన ‘రేపు వేరొక వ్యక్తి ఏజెంట్ గా వస్తాడు. మీరు ఇతర ప్రయాణికులతో కూర్చుంటారు’ అని నాకు నచ్చ చెప్పాడు. ఇది నాకు కొంత ఉపశమనం కలిగించింది.”
తరువాత ప్రయాణం
“మరుసటి రోజు ‘ఇసా సేథ్’ గాంధీజీ ని కోచ్ వద్దకు తీసుకువెళ్లి మంచి సీటులో కూర్చోబెట్టాడు. సాయంత్రానికి అది Johannesberg చేరింది. ‘అబ్దుల్లా సేథ్’ ఆదేశం ప్రకారం ఒక వ్యక్తి కోచ్ వద్దకు వచ్చాడు. పరస్పరం గుర్తుపట్టనందువల్ల గాంధీజీ ఆ రోజు రాత్రికి ఒక హోటల్ లో ఉండాలనుకుని ఒక టాక్సీలో ‘Grand National Hotel’ చేరాడు. హోటల్ మేనేజర్ గాంధీజీ ని ఎగాదిగా చూసి ‘మా హోటల్ నిండిపోయింది. ఖాళీ లేదు’ అన్నాడు.
ఈయన వెంటనే ఆ టాక్సీలోనే ‘మహమ్మద్ కసం కమ్రుద్దీన్’ (Muhammad Kasam Kamruddin) కంపెనీకి వెళ్లారు. అచ్చట గాంధీజీ కోసం ఎదురు చూసే ‘అబ్దుల్ గని సేథ్’ (Abdul Gani Seth) ఆయనను ఎంతో మర్యాదతో ఆతిధ్యమిచ్చి జరిగిన అవమానం విని, ఎంతగానో నవ్వి “ఇంత జరిగిన తరువాత నీకు హోటల్ వాళ్ళు మీకు ప్రవేశం ఇస్తారని ఎలా అనుకున్నారు” అని ప్రశ్నించారు.
గాంధీజీ “ఎందుకు ఇవ్వరు” అని ప్రశ్నించారు.
దీనికి అబ్దుల్ గని సేథ్ స్పందిస్తూ “మనం కేవలం సంపాదనకోసమే ఇటువంటి చోట నివసిస్తున్నాం. అందువల్ల ఇటువంటి అవమానాలు భరిస్తుంటాం. అది తప్పదు” అని చెప్పి దక్షిణ ఆఫ్రికాలో భారతీయులు పడే కష్టాలు ఏకరవు పెడుతూ, “ఈ దేశం మనలాంటి వారి కోసం కాదు. రేపు మీరు ప్రిటోరియా తప్పని సరిగా వెళ్ళాలి. అందులో రైలులో మూడవ తరగతిలో ప్రయాణం చేయాలి. ట్రాన్సవాల్ (Transvaal) రాష్ట్రంలో పరిస్థితులు నాటాల్ రాష్ట్రంలో కంటే దుర్భరంగా ఉంటాయి. భారతీయులకు మొదటి, రెండవ తరగతి టిక్కట్లు ఇవ్వరు” అని సూచన ఇచ్చారు.
ఇక్కడ నుంచి ప్రిటోరియా ప్రయాణం వివరాలు గాంధీజీ మాటల్లోనే తెలుసుకుందాం.
“నేను వెంటనే రైలు ప్రయాణానికి సంబంధించిన నిబంధన, నియమాలను క్షుణ్ణంగా చదివాను. అందులో ఒక లొసుగు (loophole) కనిపించింది. అది స్టేషన్ మాస్టర్ అంగీకరిస్తే మొదటి తరగతి టిక్కట్టు తప్పని సరిగా ఇవ్వాలి. అబ్దుల్ గని సేథ్ తో ‘నేను ప్రిటోరియా మొదటి తరగతిలో ప్రయాణం చేస్తాను. అందులో టిక్కట్టు ఇవ్వకపోతే నేను ఈ 37 మైళ్ళ దూరం టాక్సీ లో వెళ్తాను’ అని చెప్పాను.
ఆయన మొదట అభ్యంతరం పెట్టినా చివరకు అంగీకరించాడు. నేను ఒక కాగితం మీద ‘నేను బారిష్టర్ ను కాబట్టి ఎల్లప్పుడూ మొదటి తరగతిలోనే ప్రయాణం చేస్తాను. నేను అతి త్వరగా ప్రిటోరియా వెళ్ళాలి. మీ జవాబు నాకు చేరటానికి తగిన వ్యవధి లేదు. నేను రేపు మీ వద్దకు వచ్చినప్పుడు మొదటి టిక్కట్టు ఏర్పాటు చేయండి’ ఆని స్టేషన్ మాస్టర్ కు పంపించాను.
మరుసటి రోజున ఒక బారిష్టర్ కు తగిన ఇంగ్లీషు వారి ఆహార్యం (dress: frock-coat, neck-tie, hat) ధరించి స్టేషన్ మాస్టర్ దగ్గరకు వెళ్లి మొదటి తరగతి టిక్కట్టు ఇవ్వమని అడిగాను. ఆయన నన్ను చూసి ‘మీరేనా ఉత్తరం పంపించారు’ అని అడిగాడు. ‘అవును, నేనే. దయచేసి నాకు టిక్కట్టు ఇవ్వండి. నేను ఈ రోజే ప్రిటోరియా వెళ్ళాలి’ అని సమాధానం ఇచ్చాను.
ఆయన నవ్వి ‘నేను ట్రాన్సవాల్ కు చెందిన వ్యక్తిని కాను. హాలెండ్ కు చెందిన వాడిని. మీపై నాకు సానుభూతి ఉంది. మీకు మొదటి తరగతి టిక్కట్టు ఇస్తాను. కాని ఒక షరతు మీద. అది రైలు గా ర్డ్ వచ్చి మిమ్ములను మూడవ తరగతిలోకి మారమని ఆదేశిస్తే నా పేరు చెప్పకూడదు, ‘Transvaal Rail-way Company మీద కేసు పెట్టకూడదు. మీరు ఒక పెద్దమనిషిలాగా కనబడుతున్నారు. మీకు శుభం కలుగుగాక’ అని చెప్పి టిక్కట్టు ఇచ్చాడు.
రైలు బయలుదేరేటప్పుడు అబ్దుల్ గని సేథ్ ఇలా అన్నాడు. ‘ఏ కష్టమూ లేకుండా మీరు ప్రిటోరియా చేరాలని ఆశిస్తున్నాను. కాని గార్డ్ మిమ్ములను మొదటి తరగతిలో ఉంచడు. ఒకవేళ ఉంచినా తోటి ప్రయాణీకులు సహకరించరు. జాగ్రత్త’ అని రైలు ఎక్కించాడు.
మా కంపార్ట్ మెంట్ లో ఒకే ఒక ఇంగ్లీష్ ప్రయాణికుడున్నాడు. గార్డ్ నా వద్దకు వచ్చి మూడవ తరగతిలోకి వెళ్ళమన్నాడు. ఆ ఇంగ్లీష్ పెద్దమనిషి గార్డ్ వంక తీక్షణంగా చూసి ‘నీవు ఈ పెద్దమనిషిని ఎందుకు కష్టపెడతావు? ఈతనికి మొదటి తరగతి టిక్కట్టు ఉందని నీకు కనపడటం లేదా? ఇతను నాతో ప్రయాణం చేస్తే నాకేమి అభ్యంతరంలేదు’ అని నా వైపు చూస్తూ ‘మీరు ఇక్కడే సౌఖ్యంగా కూర్చోండి’ అని సలహా ఇచ్చాడు. గార్డ్ గొణుగుతూ ‘మీకు కూలీ’ తో ప్రయాణించాలనుకుంటే నాకేం పోయింది’ అని వెళ్ళిపోయాడు. రాత్రి 8 గంటలకు ప్రిటోరియా చేరాను నేను.”
మూడు రోజులపాటు సాగిన గాంధీజీ డర్బన్-ప్రిటోరియా ప్రయాణం, భవిష్యత్తుకు పునాది వేసిన ఈ తొలి అనుభవం, ఇలా ముగిసింది.
So many facts seem to be coming out now in social media about overall detrimental role of MKG. Anand Ranganathan and Sai Deepak are among many exposing MKG, who apparently was more interested in being recognized as ‘an apostle of peace’ than in the well being the nation, gaining independence or anything else.