ఇది ఒక ప్రత్యేకమైన హస్తకళ. 19వ శతాబ్దములో ఇంగ్లండ్ లో ఇది ప్లైవుడ్ ను ఉపయోగించి చేసే కళగా ఉద్భవించి బ్రిటిష్ వారి పరిపాలనలో భారతదేశములో ప్రవేశించింది. అప్పటి కాలములో బ్రిటిష్ రాజరికాన్ని, సంస్కృతిని ప్రతిబింబించే రూపకల్పనలతో ఆనాటి భారతదేశవిద్యాసంస్థలు కొన్నిటిలో క్రాఫ్ట్ బోధకుల ద్వారా ఈ కళ వ్యాపించింది. కాలక్రమేణా ప్రాధాన్యము తగ్గిపోయి, కేవలము చెక్కతో చేసిన గృహోపకరణాలపై కొందఱు అలంకారప్రాయముగా విశాలమైన వంపులతో ఉపయోగించడం వరకే పరిమితమయింది.
అతిసున్నితము, సూక్ష్మము, చిక్కులమయము అయిన తీగఱంపపు కోతలతో రూపు దిద్దుకొనే ఈ కళలో ఉత్తమశ్రేణి నైపుణ్యము సాధించి ఎన్నో కళాఖండాలను సృష్టించిన మా తండ్రిగారు కీ.శే. శ్రీ అయ్యగారి సీతారామముర్తిగారి వద్ద నేను ఈ కళను అభ్యసించేను. ఆయన అడుగుజాడలలో ప్లైవుడ్ తోనే నేను నా 10వ ఏట ప్రారంభించేను. తర్వాతికాలంలో లభ్యమైన డెకోలామ్ అనే పదార్థముతో అంతకు ముందు ఉపయోగించిన ప్లైవుడ్ తో సాధ్యముకాని సూక్ష్మాతిసూక్ష్మమైన ఱంపపు కోతలతో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే కళాఖండాలను రూపొందించడంలో ఎంతో కృషిచేసి సిద్ధహస్తుడనయ్యాను. నేను స్వర్ణపతకము సాధించిన మెకానికల్ ఇంజినీరింగ్ విద్య దీనికి ఎంతో తోడ్పడింది.
ఈ కళలో ముఖ్యమైనది ఏ కళాఖండమైన ఏకాండపత్రము (సింగిల్ షీట్) లో రూపొందించుట. ఇందులో అతుకులకు తావు లేదు. డెకోలామ్ చాలా గట్టిపదార్థము. ఇది వివిధవర్ణాలలో, మందాలలో పత్రరూపములో లభిస్తుంది. నేను ముఖ్యముగా తెలుపు రంగు కలిగి ఇంచుమించు 1 మిల్లీమీటరు మందము ఉన్నది ఉపయోగిస్తాను. దీనికి కారణము తెలుపు కళాఖండము, అందులోని సూక్ష్మమైన కోతలు, నలుపు నేపథ్యము మీద చాలా స్పష్టముగా కనిపించి కనువిందు చేయడమే.
ఈ కళలో ప్రతి ఒక్క గీతను మొత్తము మందము అంతటిలోను సన్నటి తీగెఱంపముతో (చిత్రము 1 చూడండి)* కోసి, అవసరమైనచోట్ల నిర్దిష్టమైన వైఖరులుకల చిన్న చిన్న డెకోలామ్ ముక్కలను అదే ఏకాండపత్రమునుండి అతి జాగ్రత్తతో తీసివేయాలి. కొన్ని చోట్ల ఇలా ముక్కలు తీసివేయకుండ కోత వెడల్పును మార్చి తగిన గాఢతను చేకూర్చవలసి వస్తుంది. మొదట ఏది కోయాలి తరువాత ఏది అన్నది ఒక పథకము ప్రకారము చేయాలి. లేకపోతే, ఱంపపు కోత అదురుకు సున్నితమైన భాగాలు విరిగి పడిపోతాయి. అతకడానికి వీలులేదు కాబట్టి అంతవఱకు చేసినదంతా వృథా అయిపోయి మళ్ళీ మొదటి నుండి ప్రారంభించవలసి వస్తుంది. ఇది అంతా కేవలము హస్తనైపుణ్యము, బుద్ధికుశలతల మీదే ఆధారపడి ఉంటుంది.
కళాఖండము తయారీలో మొదటి మెట్టు తీగెఱంపముతో కోయడానికి వీలుగా, ఖాళీ ప్రదేశాలకు మిగతా ప్రదేశాలకు తగిన సమతుల్యతతో, బొమ్మను కాగితము మీద రూపొందించడము. ఈ సమతుల్యత సరిగా లేకపోతే తయారయిన కళాఖండము ఒక తెల్లని ముద్దలా, లేదా, నల్లని నేపథ్యము ప్రబలమై బొమ్మ చాల బలహీనమై విరిగిపోయేలా ఉంటుంది.

తరువాత, పైన చెప్పిన కాగితమును డెకోలామ్ పై అంటించి (చిత్రము 2 చూడండి), లోపల ఉన్న ప్రతి కోతకు ఒక సన్నని రంధ్రము వేసి దానిద్వారా తీగెఱంపమును బిగించి బొమ్మలో ఉన్నట్లు తు-చ తప్పకుండ కోయాలి. ఎంత చిన్న తేడా వచ్చినప్పటికి కళ్ళవంటి భాగాలలో భావవ్యక్తీకరణ చెడిపోవచ్చును లేదా చిన్న భాగము ముక్కగా ఊడిపోయి రంధ్రములుగా మిగిలి పోవచ్చును.
లోపలి కోతలన్ని పూర్తిచేసేక, బొమ్మ చుట్టు ఉన్న గీతను కోయాలి. కొన్ని బొమ్మలలో ఇది అతిక్లిష్టతను సంతరించుకొంటుంది. దీనిలో ఏ మాత్రము పొరపాటు జరిగిన, బొమ్మలో కొన్ని భాగాలు విరిగి పోవచ్చును లేదా అనుకొనిన రూపసౌందర్యము లోపించవచ్చును.

చివరకు డెకోలామ్ పై అంటించిన కాగితమును తయారైన బొమ్మ నుండి పూర్తిగా తొలగించి, తగిన ఆకారములో విడిగా తయారు చేసిన నల్లని నేపథ్యఫలకము మీద డెకోలామ్ కళాఖండాన్ని ఫెవికాల్ వంటి పదార్థముతో బిగించాలి (చిత్రము 3 చూడండి).
ఈ కళ కేవలం పైన చెప్పిన 2D కళాఖండాలు రూపొందించడానికే కాక కలాలు, పెన్సిళ్ళు పెట్టుకొనే స్టాండులు, నగలు పెట్టుకొనే నగిషీలున్న పెట్టెలు, గిఫ్ట్ ఆర్టికిల్స్, మోడల్ ఇళ్ళు, మోడల్ వాహనాలు (రైళ్ళు, కార్లు, విమానాలు, నౌకలు, ఓడలు మొదలగునవి), వృత్తి విద్యలను చూపించే బొమ్మలు, వినోదవస్తువులు, పజిల్స్, ఇంకా ఎన్నెన్నో 3D వస్తుజాలమును మన ఇంట్లోనే తయారుచేసి ప్రదర్శనలలో కూడా చూపించడానికి ఉపయోగపడుతుంది. 11 ఏళ్ల వయస్సులో నేను స్వయంగా తయారుచేసిన రైలు ఇంజన్ మరియు రైలు పెట్టెలను చిత్రములు 4a, 4b లలో చూడండి.
ఈ ధారావాహికలోని మొదటి కళాఖండము – చిత్రము 3లో ఉన్న గున్న ఏనుగుల జంట. తొండాలు మెలివేసుకొని కూర్చొని నవ్వుతూ ఆడుకొంటున్నాయి కదూ. వాటి కళ్ళల్లో ఉత్సాహము, నోళ్ళలో నవ్వు, ముఖాల్లో ఆనందం, కనిపించేలా గీతలను తీగెఱంపముతో కొయ్యాలి. కళ్ళదగ్గర ఏ మాత్రం పొరపాటుగా కోసినా, అనుకొన్న భావము పోయి ఇంకేదో వ్యక్తమౌతుంది. అలాగే మిగతా భాగాలలో అంగసౌష్ఠవము చక్కగా ప్రకటము కావాలి.
ఇంతే కాదు, నేపధ్యంలో ఉన్న నల్లని డెకొలామ్ ఆకారంలో చాలా ఇంజనీరింగ్ దాక్కొని ఉంది. ఇందులో 3 వృత్తభాగాలు ఒక సరళరేఖ ఉన్నాయి. పైనున్న వృత్తభాగాన్ని పక్కన పెడితే, మిగతా 2 రెండు వృత్త భాగాలు ఒకే వ్యాసముతో లేవు. కాబట్టి వీటిని వృత్తాలుగా వదిలేస్తే symmetry దెబ్బ తింటుంది. అందుకే అది కనబడకుండా రెండిటిని ఒకే స్పర్శరేఖతో కలపడము జరిగింది.
మరియొక విశేషము – ఈ కళాఖండాన్ని గోడమీద వ్రేలాడదీసే రంధ్రము యొక్క ఆకారము. ఇది మామూలుగా ఉండే పూర్ణవృత్తము కాదు. ఓక వేళ అయితే, కళాఖండము క్షితిజసమాంతరముగా కాక ఒక ప్రక్కకు ఒరిగి ఉండేది – ఎందుకంటే రెండు ఏనుగుల పరిమాణము ఒకేలా లేదు. దీన్ని సరిచేయడానికి, వ్రేలాడదీసే రంధ్రమును మధ్యలోకాక కొంచెము ఒక ప్రక్కకు జరిపి కొయ్యాలి. అలా చేస్తే, గోడమీద నుంచి తీసి చూపించినప్పుడు ఇది ఒక ప్రక్కకు కనిపించి బాగుండదు. దీనికి ఒక అద్భుత పరిష్కారమే మీరు చూస్తున్న వ్యాసము క్రింద నున్న అర్ధవృత్తము. దీని కేంద్రము మొత్తము కళాఖండానికి క్షితిజసమాంతరముగా సరిగ్గా మధ్యలోనే ఉంటుంది. పైన వృత్తాకారము కాకుండా క్షితిజసమాంతరమైన సరళరేఖ అవడము వలన, సహజమైన వృత్తభాగంలా అనిపించినా గోడకు తగిలించి నప్పుడు మాత్రము కొంచెము ప్రక్కకి జరిపి పెడితే కళాఖండము ఎటు ప్రక్కకీ ఒరిగే సమస్యే ఉండదు.
*చిత్రము 1

దీనిలో ఉన్నది ఫ్రెట్ వర్క్ కి ఉపయోగించే ప్రత్యేక ఱంపము. సన్నగా, నిలువుగా తీగెలా కనిపిస్తున్నది వాస్తవంగా ఱంపము. ఈ ఱంపానికి కోసే శక్తి కలగాలంటే దీని రెండు చివరలను లాగి బిగించాలి. అడ్డంగా U ఆకారంలోఉన్న స్టీల్ ఫ్రేమ్ అదే చేస్తుంది. క్రిందనున్న కొయ్య పిడిని చేతితో పట్టుకొని నిలువుగా పైకి, క్రిందకు నైపుణ్యంతో కదపడంతో ప్లైవుడ్ లేదా డెకొలామ్ షీట్ ను కావలసిన విధంగా కోయడం జరుగుతుంది. క్రిందికి దిగినప్పుడు కోయడం, పైకి వెళ్ళినప్పుడు సూక్ష్మంగా ముందుకు కదలడంతో ముందుగా అంటించిన కాగితం మీద వేసుకొన్న గీత మీద ఱంపము ముందుకు వెళ్తుంది. ఒక కోత పూర్తి అయ్యేక ఱంపము క్రింది వైపు ఉన్న నట్టును వదులు చేస్తే మరొక కోత ప్రారంభించడానికి ఱంపము బిగించి వాడడానికి వీలవుతుంది. వచ్చే మాసం మఱియొక కళాఖండాన్ని పరిశీలిద్దాము.
***సశేషం***
రచయిత పరిచయం:
అపురూపకళాస్రష్ట – అయ్యగారి సూర్యనారాయణమూర్తి
శ్రీ అయ్యగారి సూర్యనారాయణమూర్తి బహుముఖప్రజ్ఞాశాలి. వీరు కీ.శే. శ్రీ సీతారామమూర్తి, శ్రీమతి రాజ్యలక్ష్మిగార్ల కనిష్ఠపుత్రులు.
మూర్తిగారు విద్యాభ్యాసం మొదలుపెట్టి నప్పటినుండి సరస్వతీమాత కటాక్షానికి పాత్రులై, చదువులలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించి ఎన్నో పతకాలను కైవసం చేసికొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ లో ఆంధ్రవిశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల, విశాఖపట్టణము నుండి పట్టభద్రులయ్యారు. ఆ రోజుల్లో ఐదేళ్లపాటు సాగిన ఇంజనీరింగ్ విద్యాభ్యాసంలో, విశాఖపట్టణము మరియు కాకినాడ ఇంజనీరింగ్ కళాశాలల అన్ని విభాగాలలోని విద్యార్ధులందరిలో, ఐదేళ్లలో వ్రాసిన టెక్నికెల్ మరియు నాన్ టెక్నికల్ పాఠ్యాంశాల పరీక్షలన్నింటి మొత్తములో అత్యధికమైన మార్కులు సాధించి శ్రీవేపాకృష్ణమూర్తి గోల్డ్ మెడల్ ను పొందిన ఆదర్శవిద్యార్థిగా వీరు నిలిచేరు. ఆ తర్వాత, మూర్తిగారు ఇంజనీరింగ్ పరిశ్రమలలో కొన్ని సంవత్సరాలు విశేషానుభవం గడించి ఐఐఎమ్, అహ్మదాబాద్ లో మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేరు.
వృత్తిరీత్యా, మూర్తిగారు ఇంజనీరింగ్ మరియు మేనేజ్మెంట్ రంగాలలో పలుసంస్థలలో సృజనాత్మకతకు పెట్టింది పేరయి ఉన్నతపదవులలో అరుదైన మన్ననలు పొందేరు.
ప్రవృత్తిరీత్యా, వీరు చేయి తిరిగిన ఛందోబద్ధసుకవి, కళాకారులు. ‘సిరిమల్లె’ పాఠకులకు మూర్తిగారి ఉత్తమకవిత్వపటుత్వము గతపదివసంతాలుగా సుపరిచితమే. ఈ సంచికలో ముర్తిగారిలో ఉన్న విశేషకళాకారుణ్ణి పరిచయం చేయడానికి చాలా సంతోషిస్తున్నాము.
మూర్తిగారు ‘ఫ్రెట్ వర్క్’ అనే హస్తకళలో బాల్యం నుండే ఎంతో నైపుణ్యం ప్రదర్శించిన దిట్ట. వీరి కళ గురించి, అందులో వీరు సృష్టించిన కళాఖండాల గురించి గతంలో మాటీవీ, ఈటీవీ మరియు భారత్ టుడే ఛానెళ్ళలో ప్రసార మయ్యింది. మన ‘సిరిమల్లె’ పాఠకులందరికీ ఈ కళావిశేషాలు తెలియజేయడంకోసం ప్రత్యేకంగా ఒక ధారావాహికను ఈ అంగ్ల నూతన సంవత్సర సంచికతో ప్రారంభిస్తున్నాము.