అందాల ఓ చిలకా
ఈ మధ్యనే ఎవరో ఒక చర్చావేదికలో ఎందుకు నేటి సాంఘీక పరిస్థితులు హింసాత్మక ధోరణిలో సాగుతున్నాయి అని అంటూ ఒక విధంగా చిత్రరంగం కూడా అందుకు కారణమేమో అనే సందేహాన్ని వెలిబుచ్చారు. అప్పుడే మరొకరు సమాజ స్థితిగతుల నుండే చిత్రాలు పుడుతున్నాయి అలాగే చిత్రాల ప్రభావం కూడా సమాజం మీద ఉంది అని చెబుతూ అప్పుడు ఆత్మబంధం, లేతమనసులు, మూగ మనసులు, ఇలా ఎన్నో కుటుంబకథా అంశాలతో చిత్రాలు వస్తుండేవి మరి ఇప్పుడు జులాయి, పోకిరి, ఇడియట్, మృగం, ఇలాంటి పేర్లతో సినిమాలు వస్తున్నాయి అని అన్నారు. ఏది ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాలేమో. ఇటువంటి చర్చలకు ముగింపు ఉండదు. ఎవరికి నచ్చినట్లు వారు అన్వయించుకోవచ్చు.
అయితే ఒక్కటి మాత్రం వాస్తవం. సాహిత్యానికి ముఖ్యంగా తెలుగు భాషకు పెద్ద పీటను వేస్తూ నాటి సినిమాలు, అందులోని పాటలు వున్నాయని మాత్రం ఖచ్చింతంగా చెప్పుకోవచ్చు. అలాగే మాధుర్య ప్రధానమైన పాటలు మెండుగా ఉండేవి, అవి కలకాలం గుర్తుండేవి కూడా. అటువంటి మరో మధురమైన పాటను మీకు అందిస్తున్నాను.
చిత్రం: లేత మనసులు; సంగీతం: M.S.విశ్వనాథన్; రచన: దాశరథి; గానం:పి.బి. శ్రీనివాస్, పి.సుశీల
పల్లవి :
అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా
అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాశాను ఈ మదిలోన దాచాను
చరణం 1 :
మిసమిసలాడేవెందుకని
తళతళలాడేవేమిటని ||2||
కురులు మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో ||అందాల ఓ చిలకా||
చరణం 2 :
మిసమిసలాడే వయసోయి
తళతళలాడే కనులోయి ||2||
కురులు మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడె సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో ||అందాల చెలికాడా||
చరణం 3 :
నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే
నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడిచిపోవుగా ||అందాల ఓ చిలకా||