‘ఉక్కు మంత్రి’ కంచు విగ్రహం: –
ఆనాటి కాంగ్రెస్ నాయకులే కాకుండా చాలా మంది జనాలు సహితం సంజీవరెడ్డి గారిని ప్రకాశం గారి తరువాత అంతటి ప్రజల అనుంగు నాయకుడిగా భావించేవారు. అటువంటి సంజీవరెడ్డి గారికి విజయవాడ కాంగ్రెస్ నాయకులు నగరంలో కంచు విగ్రహం పెట్టాలనుకున్నారు. ఆ విగ్రహాన్ని ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారితో ఆవిష్కరింపజేయించాలనుకున్నారు. నవంబర్ 8 1964 వరకు విగ్రహాన్ని ప్రధానే ఆవిష్కరిస్తారని అనుకున్నారు కానీ చివరి నిమిషంలో శాస్త్రిగారు విగ్రహావిష్కరణకు ఒప్పుకోలేదు. దాంతో కామరాజ్ నాడార్ గారు నవంబర్ 9న సంజీవరెడ్డిగారి విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించారు.
తరువాత శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు సంజీవరెడ్డిగారి విగ్రహానికి కాపలా కాశారని విజయవాడ శాసనసభ్యుడు డాక్టర్ టి.వి.చలపతిరావు గారిని విమర్శించారు…విమర్శలకు సమాధానమిస్తూ టి.వి.చలపతిరావు ఈ ఆరోపణలంతా “ఎల్లో ప్రెస్” అంటూ నిందించారు. దీంతో ఫొటోలతో సహా రుజువు చేయడానికి సభ్యులు సిద్ధమవ్వడంతో స్పీకర్ శ్రీ సుబ్బారెడ్డి కలుగజేసుకుని అసలు ఏ సంబంధమూ లేని ఆ పెద్దమనిషి (సంజీవరెడ్డి గారు) మనసును బాధపెట్టడం దేనికని సర్దుబాటు చేశారు.
హిందీ వ్యతిరేక ఉద్యమం :-
1949లో రాజ్యాంగసభ హిందీని భారత రాజ్యభాషగా ఎంచుకుంది. 1950 జనవరి 26 నుండి ఇది అమలులోకి వచ్చింది. అయితే పదిహేను సంవత్సరాల పాటు కేంద్రం, రాష్ట్రాలు తమ మధ్య సమాచార మార్పిడి కోసం హిందీతో పాటు ఇంగ్లీష్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. 1965 జనవరి 26 నాటికి ఆ సమయం ముగుస్తుంది. దాంతో అన్ని రాష్ట్రాలూ కేంద్రంతో సమాచార వినిమయానికి హిందీనే వాడాలి. 1965 జనవరి 26ను ద్రావిడ మున్నేట్ర కళగం శోకదినంగా పాటిస్తుందని అన్నాదురై ప్రధానమంత్రికి లేఖ రాశారు. డి.యం.కె హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని ఉధృతం చేసింది.
జనవరి 29 నాటికి మద్రాసులో ఇద్దరు యువకులు ఆత్మాహుతికి పాల్పడ్డారు. చిదంబరంలో ఒక యువకుడు పోలీస్ కాల్పుల్లో మరణించాడు. అన్నాదురై సహా ఆరువందల మంది కళగం సభ్యులు జైలుపాలయ్యారు. జనవరి చివరి రోజున నిజలింగప్ప, అతుల్య ఘోష్, సంజీవరెడ్డి, కామరాజ్ నాడార్ బెంగళూరులో సమావేశమై హిందీ మాట్లాడని ప్రాంతాల ప్రజలపై హిందీని రుద్దే ప్రయత్నం చేయవద్దని, ఇలా హడావుడిగా హిందీని రుద్దడం దేశ సమైక్యతను దెబ్బతీస్తుందని హిందీ వాదులకు విజ్ఞప్తి చేశారు.
అసలు ఈ వివాదానికి హిందీ భాషోన్మాదులు కారణమని చెప్పక తప్పదు. దేశానికి ఒకే జాతీయ భాష ఉండాలనుకోవడం మంచిదే, కానీ ఆ భాషకు సర్వజనామోదం ఉందో లేదో చూసుకోవడం కూడా ముఖ్యం. హిందీ వాదుల మూఢత్వాన్ని ఆసరాగా చేసుకుని తమిళనాడు రాజకీయాల్లో డి.యం.కె పైకి ఎదగడానికి జనాల్లో ఆందోళనలు రేపి, వారి మనసులను విషపూరితం చేసి ఆత్మాహుతులతో, అలజడులతో అరాచకాన్ని రేపెట్టింది. ఒక ఉమ్మడి భాష లేనప్పటికీ, అనేక రాజ్యాలుగా విడివడి ఉన్నప్పటికీ వేల సంవత్సరాలుగా హిందువులు ఒక జాతిగా మనుగడ సాగించలేదా? అందుకు కారణం ఈ దేశ ప్రజల జీవనానికి పునాదైన హైందవ సంస్కృతి. హిందీ ఆర్యుల భాష దాన్ని తమిళులపై బలవంతంగా రుద్దుతున్నారని ప్రచారం చేసిన డి.యం.కె ఇంగ్లీష్ భాష కూడా పరాయిదేననే నిజాన్ని, ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన భాషే అనే సత్యాన్ని విస్మరించారు. అసలు ఏ భాషలో జీవముంటుందో, ఏ భాష బహుళ వ్యాప్తంగా ఉంటుందో, ఏ భాష జనాలకు ఉపయోగకరంగా ఉంటుందో ఆ భాష ప్రయత్నరహితంగానే జనామోదం పొందుతుంది.
తమిళనాడుకు చెందిన కేంద్ర ఆహార మంత్రి వి.సుబ్రహ్మణ్యం మరో మంత్రి ఓ.వి.అలాగేశన్ తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. క్రమంగా హిందీ వ్యతిరేక ఉద్యమం ఆంధ్రకూ ఎగబాకింది. తిరుపతి, మదనపల్లె వంటి ప్రాంతాల్లో విద్యార్థులకు,పోలీసులకు ఘర్షణ జరిగింది. సంజీవరెడ్డిగారు కూడా రాజీనామా ఇవ్వాలని హిందీ వ్యతిరేక ఉద్యమకారులు డిమాండ్ చేయసాగారు. హై కోర్ట్ అడ్వొకేట్స్ అసోసియేషన్ వారు అలాంటి తీర్మానం కూడా చేశారు. కర్నూలులో విద్యార్థులు తమ ఊరేగింపులలో “సంజీవరెడ్డి రాజీనామా ఇవ్వాలి”, “సంజీవరెడ్డి ముర్దాబాద్” అనే నినాదాలిచ్చారు, గోడలపై రాశారు. ఈ హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తొలుత రాజాజీ, అన్నాదురై మొదలుపెట్టారు. తొలుత వీరికి మద్దతు పలికిన పెరియార్ రామస్వామి నాయకర్…ఈ ఉద్యమ ఉద్దేశం కాంగ్రెస్ ను తమిళనాడులో బలహీనపరచడం అని తెలుసుకుని మద్దతు ఉపసంహరించడమే కాకుండా ఆందోళనలను ఖండించారు. స్వతంత్ర పార్టీ, డి.యం.కేలను నిషేదించాలని అన్నారు.
ఈ ఉద్యమం విషయంలో స్థూలంగా సంజీవరెడ్డి గారి వైఖరి ఏంటంటే :- చట్టబద్ధంగా హిందీయేతర ప్రాంతాలవారికి ఇంగ్లీష్ వాడుకోవడానికి అనుమతి ఇచ్చినంత మాత్రాన సరిపోదు. రాజాజీ, అన్నాదురై కోరుతున్నట్లు ఇంగ్లీష్ భాష చిరస్థాయిగా మనకు అధికారభాషగా దేశమంతా ఉండాలి…అందుకై రాజ్యాంగ సవరణ చేయాలి. అయితే అన్నాదురైలా కాకుండా సంజీవరెడ్డి గారు త్రిభాషా సూత్రాన్ని బలపరిచారు.
భాష కంటే దేశం ముఖ్యం కాబట్టి కేంద్ర ప్రభుత్వం హిందీని ప్రవేశపెట్టే విధానాన్ని పూర్తిగా విడనాడాలనే ధోరణిలో సంజీవరెడ్డిగారు ఓ పరిశ్రమను ప్రారంభిస్తూ ఉపన్యసించారు. అలాంటి ఉపన్యాసాలే అనంతపురం,కర్నూలులో ఇచ్చారు. వాటి ఫలితమే విద్యార్థుల వ్యతిరేక ప్రదర్శనలు.
“సంజీవరెడ్డి నగర్” – తన పేరు పై ఏర్పడ్డ కాలనీలో ఇంటి కోసం ధరఖాస్తు చేసుకున్న శ్రీ సంజీవ రెడ్డి: –
నీలం సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఒకసారి విలేఖరులతో మాట్లాడుతూ తమకు తమ ఊళ్ళో తప్ప ఎక్కడా స్వంత ఇల్లు లేదని, హైదరాబాద్ వచ్చినపుడు ఎవరింటికో వెళ్ళవలసి ఉంటుందన్నారు. ఇప్పుడేమో స్థలాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. హౌసింగ్ బోర్డు నిర్మిస్తున్న కాలనీల్లో ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కు చెందినది తీసుకుందామనుకుంటున్నానని చెప్పారు.
ఇలాంటి తలంపే మరికొందరు మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చేశారు. 1964 మే 29 నాటి సమావేశంలో హౌసింగ్ బోర్డు ఆరు ఇళ్లను నిర్మించాలని నిర్ణయించింది. వాటి లబ్ధిదారులు ఎవరంటే :- శ్రీమతి నీలం నాగరత్నమ్మ (సంజీవరెడ్డి గారి భార్య), శ్రీమతి కాసు రాఘవమ్మ (అప్పటి ముఖ్యమంత్రి గారి భార్య), డాక్టర్ డి.యల్.యన్. ప్రసాద్ (గృహ వసతి శాఖా మంత్రి అల్లుడు), కుమారి కె.సంధ్య రాణి (ఒక సినీ తార కూతురు), శ్రీ జలగం వెంగళ రావు, శ్రీ శీలం సిద్ధారెడ్డి (యం.యల్ .సి,ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి). మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఇళ్ల కొరకు సంవత్సర ఆదాయం ఐదు వేలకు తక్కువ కాకుండా పది వేలుకు మించకుండా ఉన్నవారే అర్హులు…అలానే గృహ నిర్మాణానికి ఒక్కొక్కదానిపై ఖర్చు పదిహేను వేలు మించకూడదు. అయితే ఈ ఆరు ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పాతిక వేలు మించిందని, వైశాల్యం కూడా ఇతర ఇండ్ల కంటే హెచ్చుగా ఉందని పత్రికల్లో విమర్శలు వచ్చాయి.
శ్రీ సంజీవరెడ్డి శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన ఫలితంగా డోన్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శ్రీ సంజీవరెడ్డి అల్లుడు శ్రీ పి.రామ్ భూపాల్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి శ్రీ పి. వెంకటప్పను పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడించారు.
బ్రహ్మానందరెడ్డి సంజీవరెడ్డి గారికి వ్యతిరేకంగా మారిన తరువాత శ్రీ రామ్ భూపాల్ రెడ్డి గారి సహకారంతో రాష్ట్రంలో సంజీవరెడ్డి గారి వర్గాన్ని నడిపించే బాధ్యతను తాను తీసుకున్నట్లు జలగం వెంగళరావు గారు తన స్వీయచరిత్రలో రాసుకున్నారు.
7 ఫిబ్రవరి 1965న నెల్లూరులో సంజీవరెడ్డిగారు ప్రభుత్వ స్త్రీల కళాశాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆనం చెంచు సుబ్బారెడ్డి గారు మాట్లాడుతూ మన మాండలీయులు చేసే ప్రతి పనికీ నీలం సంజీవరెడ్డి గారి ఆశీర్వచనం ఉంటుందని – గత సంవత్సరం ప్రభుత్వాసుపత్రికి శంకుస్థాపన చేశారని ఇప్పుడు మహిళా కళాశాలకు కూడా వారే శంకుస్థాపన చేశారని అన్నారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి గారు కళాశాల దాత ఐన దొడ్ల కౌసల్యమ్మ గారి ఛాయా చిత్రాన్ని ఆవిష్కరించి సందర్భోచితంగా ప్రసంగించారు. మన మధ్య డబ్బు ఉన్న వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. కానీ దొడ్ల సుబ్బారెడ్డి గారి ఔదార్యం ఎంతమందికి ఉంటుంది? భర్త ఉదారంగా ఉన్నా భార్య ప్రోత్సాహం లేకుంటే భర్త ఏమీ చేయలేడు. అట్లాంటి ప్రోత్సాహమిచ్చిన ఆదర్శపత్ని కౌసల్యమ్మగారు. శ్రీ దొడ్ల సుబ్బారెడ్డిగారికి ఎంత ఉందో నాకు తెలియదుగానీ కనీసం పది శాతం అందులోనుండి ఔదార్యంగా ఇస్తున్నారు”అని అన్నారు.
****సశేషం****
అవతరణి – రచయిత మనో నేత్రం
నేను వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్ ని. ప్రవృత్తి, అధ్యయనం మరియు రచన. మా ఊరు తిరుపతి జిల్లాలోని వెంకటగిరి పట్టణం. ఆంధ్ర రాష్ట్ర రాజధానైన అమరావతికి కుడి భుజమైన గుంటూరు నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాను. మాకు గురువు దైవ సమానులైన మా మాతామహులు పిచ్చుక పుల్లయ్య గారు. వీరు ఆధ్యాత్మికవేత్తగా మారిన ఒకప్పటి కమ్యూనిస్టు. మా నాయన జగదీశ్వరరావు గారు క్రియాశీల రాజకీయాలలో పాల్గొని ఉండటం వల్లనేమో నా పై రాజకీయాల ప్రభావం ఉన్నది.
నా తొలి ఇరవై తొమ్మిదేళ్ల జీవితం ఆస్తిక నాస్తికత్వాలకు నడుమ అభిప్రాయరహితంగానే సాగినది. కానీ నాలో భారతీయ భాష, సంస్కృతుల పట్ల అభిమానం సహజాతంగా ఉన్నది. నేటికీ కొనసాగుతున్నది. జీవన గమనంలో ఎదురయ్యే ఒడిదిడుకుల వల్ల మతం వైపుకి మళ్ళిన నేను, ఎనిమిదేళ్ల మేధోమథనం, సునిశిత పరిశీలన, హేతుబద్ధ ఆలోచనల ఫలితంగా వ్యక్తి తత్త్వం వద్దకు చేరాను. ఆంగ్లంలో ఈ దృక్పథాన్ని “Individualistic Philosophy” అంటాను.
నాలో రచనా ప్రవృత్తి తలెత్తింది ఆగస్టు 7, 2018 నుండి ఆగస్టు 16, 2018 మధ్య కాలంలో. పై రెండు తేదీలు కచ్చితంగా చెప్పడానికి కారణం : మొదటి తేదీన శ్రీ కరుణానిధి కాలధర్మం చెందగా, రెండవ తేదీన శ్రీ అటల్ బిహారీ వాజపేయ్ కాలధర్మం చెందారు. సాహిత్యం, రాజకీయం కలగలసిన వీరిరువురి జీవితాల గురించి తెలుసుకుంటున్నపుడు నాలో రాయాలన్న ప్రేరణ కలిగింది. నా అధ్యయనం మొదలైంది కూడా అప్పటినుండే. అప్పటి వరకు నేనొక సాదాసీదా చదువరినే.
ఐదు సంవత్సరాల పురిటి నొప్పుల తరువాత నా యొక్క రచనా దృక్పథం నిర్దిష్టంగా రూపుదిద్దుకుంది. అనుభూతులను అలంకారికంగా చెప్పడం కవిగా నా దృక్పథమైతే, మానవ జీవన కోణాలను, జీవిత పార్శ్యాలను ఆసక్తికరంగా చెప్పడం కథకుడిగా నా లక్షణం. అధ్యయన ఫలితాలను చదువరులకు అందించడం వ్యాసకర్తగా నా ఉద్దేశం. ఏలితుల ఏకరువును తెలియజెప్పడం విమర్శల వెనకున్న కారణం.
అచ్చుకు నోచుకున్న తొలి కవిత “విడివడని బాధ్యత” విశాలాక్షి మాసపత్రికలో, తొలి కథ “వై” సిరిమల్లెలో, తొలి విమర్శ “పారిశ్రామిక అభివృద్ధితోనే సీమ ప్రగతి” ఆంధ్రజ్యోతిలో, తొలి వ్యాసం “మునసబు నుండి రాష్ట్రపతి దాకా…” ఆంధ్రజ్యోతిలో. ఆంధ్రజ్యోతి దినపత్రికకు, విశాలాక్షి మాస పత్రికకు, స్వీయ ముద్రణకు అవకాశం కల్పించి నేను రాసేవి చదవదగ్గవేనన్న విశ్వాసం కల్పించిన ప్రతిలిపి పోర్టల్ కు, కథలను, వ్యాసాలను అచ్చువేయడమే కాకుండా ప్రోత్సాహకరమైన వాక్కులతో శీర్షిక రాయడానికి అవకాశం కల్పించిన సిరిమల్లె సంపాదకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. – కుమార్ బాబు