Menu Close
Radhika Nori
రాధికారుచిరం
రాధిక నోరి

ఆత్మన్యూనత

ఆమధ్య మా వూళ్ళో మా India association వారి వార్షికోత్సవ కార్యక్రమం ఒకటి జరిగింది. పిల్లలు, పెద్దలు చాలామంది దానిలో ఎంతో వుత్సాహంగా పాల్గొన్నారు. దాంట్లో  పెద్దవాళ్ళచేత నేను ఒక mime item చేయించాను. దాంట్లో ఒకావిడ ఎందుకో అస్తమాను ఏమి కారణం లేకుండా మాటిమాటికి వంగుతున్నారు. నేను సరిచేయటానికి ప్రయత్నిస్తే 'నా కాళ్ళు మరీ పొడవు, అస్సలు బాగుండవు, అందుకే అలా వంగుతున్నాను' అన్నారు. అలా ఏమి కాదని, ఆవిడ చక్కగా వున్నారని, అసలు అలా ఆలోచించటం తప్పని ఆవిడకి నచ్చచెప్పడానికి నా తల ప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండి.

ఇలా చాలామంది చాలా కారణాల వలన ఏవేవో లేనిపోనివి వూహించుకొని తమని తాము చాలా తక్కువగా అంచనా వేసుకొంటారు. తమలో తగినంత సమర్ధత లేదని, అసలు తాము ఎందుకు కొరగానివారమని, అందరికంటే తాము చాలా తక్కువలో వున్నామని, ఇలా చిలవలు పలవలుగా అనవసరమైనవన్నీ వూహించుకొని అశాంతిపాలవుతూ వుంటారు. అస్తమాను ఎదుటివారితో పోల్చుకుని, వారి లాగా తాము లేమని, వారికంటే చాలా తక్కువ స్థాయిలో వున్నామని, వారి స్థాయిని తాము అందుకోలేమని చిన్నబుచ్చుకుంటారు. వారి దృష్టిలో వారికి ఇంక కొంచెం కూడా విలువ అన్నది వుండదు. దీన్నే ఆత్మన్యూనత, అంటే inferiority complex అంటారు.

Alfred Adler అనే Austria కు చెందిన ఒక వైద్యుడు, ఈయనను వ్యక్తిగత మానసిక శాస్త్రానికి తండ్రి అని అంటారు, ఈయన ఈ ఆత్మన్యూనతను గురించి ఏమన్నాడంటే, దీనిలో ప్రాధమిక ఆత్మన్యూనత, ద్వితీయ ఆత్మన్యూనత అనే రెండు రకాలు వున్నాయట. మొదటిది చాలా ప్రాధమిక దశలోనే, అంటే, చాలా చిన్నప్పుడే మొదలవుతుందిట. రెండోది పెద్దయిన తర్వాత వస్తుందిట. అంటే చిన్నపిల్లల్లో ఎప్పుడైతే మనం ఈ ఆత్మన్యూనతా భావాన్ని పసిగడతామో, వెంటనే దాన్ని రూపుమాపకపోతే ఇంక పెద్దయిన తర్వాత ఆ చిన్న విత్తు ఒక పెనువృక్షమై మనం పెకలించలేనంత గట్టిగా వేళ్ళను విస్తరించుకుంటుంది అన్నమాట. ఇంక పెద్దయిన తర్వాత అందరు నాకంటే మెరుగ్గా వున్నారు, నేనే ఇలా అందరికంటే కనాకష్టంగా వున్నాను అన్న చిన్నతనం వారి మనసులో బాగా పాతుకుపోతుంది. ఇంక రెండో రకమైన ఆత్మన్యూనతకు వస్తే జీవితంలో ఎదురయ్యే అపజయాలు, తిరస్కారాలు, అవమానాలు, అవాంతరాలు, అనుకోని విపత్తులు, ఇవన్నీ దానికి కారణాలే! వీటిని కూడా వెంటనే అరికట్టకపోతే పర్యవసానాలు చాలా బాధాకరంగా మారే అపాయం వున్నది.

ఏ రకానికి చెందినదైనా, ఈ ఆత్మన్యూనతకు చాలా కారణాలు వున్నాయి. అతి గారాబంగా, మితిమీరిన రక్షణతో, అంటే over-protective గా పెరిగిన పిల్లలు, వారి పనులు వారు చేసుకోవటం అలవాటులేక, చేతకాక, ఏ పని చెయ్యటం చేతకానివారుగా తయారయ్యే ప్రమాదం వుంది. మరి అప్పుడు వారి ఆత్మవిశ్వాసం సహజంగానే తగ్గిపోతుంది కదా! పెద్దల సహాయం అందకపోతే నీటిలోంచి బయటపడిన చేపల్లాగా వారు తల్లడిల్లిపోయే అపాయం వుంది. అందుకే మంచి తల్లితండ్రులు పిల్లల్ని ముద్దుగా చూస్తూనే క్రమశిక్షణలో పెట్టడం మర్చిపోరు. అలాగే కౄరత్వంలో పెరిగిన పిల్లలు కూడా పిరికితనాన్ని పెంచుకుని తమ ఆత్మబలాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆ బెరుకు, తిరస్కారం బాగా అలవాటైపోయి, తమలో వున్న ఆ కాస్త సమర్ధతని కూడా పూర్తిగా కోల్పోయి, పెద్దయిన తర్వాత వారు ఏపనీ తమంతతాముగా చేసుకోలేరు. అలా తమలో వున్న ఆత్మవిశ్వాసాన్ని వారు పూర్తిగా కోల్పోయి, ఆత్మన్యూనతా వలయాలలో పూర్తిగా చిక్కుకుపోతారు. ఆ సుడిగుండాలలో లోతుగా కూరుకుపోతారు.

అలాగే బాహ్యంగా కనిపించే శారీరక లోపాలు, నత్తి, లావు, మెల్లకళ్ళు లాంటి ఏవన్నా లోపాలు వున్నా కూడా మనుషులు ఆత్మన్యూనతను అనుభవించే ప్రమాదం చాలా వుంది. అలాగే ఒకొక్కసారి ఆర్ధిక, సాంఘిక పరిస్థితులు కూడా మనుషుల స్వభావాలని ప్రభావితం చేస్తాయి. ఎంత చదువు, ఎన్ని అర్హతలు, ఎన్ని గుణగణాలు వున్నా కూడా నలుగురిలోకి వెళ్ళి వారితో కలిసి మసలాల్సిన అవసరమేర్పడినప్పుడు వారితో సమానమైన దుస్తులు, ఆభరణాలు లాంటివి లేకపోతే కూడా, తమ తెలివి, నైపుణ్యాల ముందు అవి ఎంత  అప్రాధాన్యమైనవని తెలిసినా కూడా మన ఆత్మవిశ్వాసం కొంచెం చలించక మానదు. అందరిలోనూ తాము ఎక్కడ తక్కువగా కనిపిస్తామేమో అన్న భయం చోటు చేసుకుంటుంది. సరే, ఇంక ఇవన్నీ సరిగ్గా వున్నా కూడా జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే దెబ్బలు, అపజయాలు, తిరస్కారాలు, అవమానాలు కూడా ఆత్మన్యూనతకు చాలా కారణం. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత తెలివితేటలున్నా, చాలాసార్లు పరిస్థితులన్నీ మన చేతిలో వుండవు. మన నియంత్రణలో లేనిదేదో, మన తలరాతో, విధో, మన పూర్వజన్మ దుష్కృతమో, లేక ఇవేమి కాని, మన కళ్ళకు కనబడని ఇంకేదో అజ్ఞాత శక్తో, ఏదో మనకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. ఇంక అప్పుడు ఏదీ కలిసిరాదు. అలా మాటిమాటికి జరుగుతుంటే మనిషన్న ప్రతివాడికీ ఆత్మవిశ్వాసం తగ్గిపోయి, తమ శక్తిసామర్త్యాల మీద విశ్వాసం నశించి, ఆత్మన్యూనత మొదలవడం చాలా సహజం.

మరి అలాంటప్పుడు ఆ అపాయం మనకి ఎలా తెలుస్తుంది? ఏమిటి దాని చిహ్నాలు? ఈ ఆత్మన్యూనత దెయ్యాన్ని మనమెలా గుర్తించగలం? మంచి ప్రశ్న.

మనకు సరిసమానమైన స్నేహితులతో, కుటుంబ సభ్యులతో వ్యవహరించడానికి మనము అనర్హులము అనుకునే దుస్థితికి వచ్చాము అంటే మరి అది ఆత్మన్యూనత కాక ఇంకేమిటి? Depression స్థితిలోకి వెళ్ళిపోయి మన పనులు కూడా మనం సరిగ్గా చేసుకోలేని దుస్థితికి వచ్చాము అంటే మరి అది ఆత్మన్యూనత కాక ఇంకేమిటి? ఎవరైనా మనల్ని మెచ్చి ఒక మంచి పొగడ్తను, అంటే compliment ను ఇస్తే, దాన్ని కూడా నవ్వుతూ స్వీకరించలేకపోయే దౌర్భాగ్యంలో వున్నామంటే మరి అది ఆత్మన్యూనత కాక ఇంకేమిటి? పోనీ దీనికి విరుద్ధమైన పరిస్థితిలో ఎవరైనా మన అభివృద్ధి కాంక్షించి చాలా నిజాయితీగా ఏదన్నా నిర్మాణాత్మకమైన విమర్శను, అంటే constructive criticism ని ఇస్తే దాన్ని సరైన అర్థంలో తీసుకోక ఇంక వారి మీద కోపం తెచ్చుకునే బాధాకరమైన పరిస్థితిలో వుంటే మరి అది ఆత్మన్యూనత కాక ఇంకేమిటి? అంటే వీరిని ఆవహించిన ఆత్మన్యూనతలో వీరికి పొగడ్త పడదు, విమర్శ కూడా పడదు. ఇంక వీరి అభివృద్ధి ఎలా సాధ్యం? ఎవరికి ఎదురుబడితే ఏ అవమానాలు ఎదుర్కొనవలసి వస్తుందో అన్న అర్థం లేని భయంతో అసలు నలుగురితోనూ కలవడమే మానేయాలనుకునే దురదృష్టంలో వుంటే మరి అది ఆత్మన్యూనత కాక ఇంకేమిటి? ఏ పోటీలో పాల్గొంటే ఏ ఓటమిని ఎదుర్కోవలసి వస్తుందో, ఏ ఓటమిని చూసి ఎవరు నవ్వుతారో, ఎవరి ముందు మన స్థాయి తగ్గిపోతుందో అన్న సంకోచం, భయాలతో అసలు ఏ పోటీలలోను పాల్గొనడానికే ముందుకే రాకపోతే మరి అది ఆత్మన్యూనత కాక ఇంకేమిటి? అవసరమున్నా లేకపోయినా ఎదుటివారినుండి పొగడ్తలను ఆశించి, తీరా అవి అందినప్పుడు వాటిని స్వీకరించలేక, అందకపోతేనేమో నిరుత్సాహపడిపోయే అయోమయంలో ఎవరైనా వుంటే మరి అది కూడా ఆత్మన్యూనత కాక ఇంకేమిటి? మరి ఇవన్నీ ఆత్మన్యూనత ప్రవేశ చిహ్నాలే కదా!

మావూళ్ళో ఒకాయన వుండేవారు. అవసరం వున్నా, లేకపోయినా మాటిమాటికి గొప్పలు చెప్పుకుంటూ, ఎదుటివారిని చిన్నబుచ్చుతూ, వారికంటే తను చాలా ఉన్నతమైన స్థాయిలో వున్నానని వారికి అస్తమాను గుర్తుచేస్తూ, వారిమీద తన ఆధిక్యతను నిరూపించుకోవడానికి, పాపం అనుక్షణం నానా తిప్పలు పడేవాడు. అందరిలాగానే నేనుకూడా ఆయన గొప్పలు మౌనంగా విని సహించటానికి మొదట్లో చాలా కష్టపడేదాన్ని, విసుక్కునేదాన్ని, చికాకు కూడా పడేదాన్ని. కానీ ఆయన స్వభావాన్ని విశ్లేషణ చేసిన తర్వాత, పాపం, ఆయనంటే నాకు చాలా జాలి కలగటం మొదలైంది. ఎదుటివారి ముందు తన లోపాలు, లోటుబాట్లు ఎక్కడ బయటపడతాయేమో అన్న భయాన్ని దాచుకోవటానికి, అనుక్షణం తనని నీడలాగా వెన్నాడే తన ఆత్మన్యూనతను కప్పిపుచ్చుకోవడానికి ఆయన అలా అనవసరమైన ఆధిక్యతను చూపించి ఎదుటివారి నోరు మూయటానికి ప్రయత్నించేవాడన్నమాట. తన ఆధిపత్య సంక్లిష్టత, అంటే superiority complex ని ఒక కవచంలాగా వాడుకుని ఆయన ఎదుటివారిని నువ్వు నాకంటే చాలా తక్కువ సుమా అని మాటిమాటికి చిన్నబుచ్చటానికి పాపం, చాలా కృషి చేసేవాడు. ఇదంతా కూడా ఆత్మన్యూనతా చిహ్నాలే! అంటే ఆధిపత్య సంక్లిష్టత, అంటే superiority complex ఆత్మన్యూనతకు ఒక coverup అన్నమాట. అంతేగా? అంతేకాదు, మీరు వారికంటే ఆధిపత్యతలో వున్నారని కూడా ఋజువవుతోంది. అవునా? అందుకే Aimee C Teesdale అనే ఒక మానసిక శాస్త్రవేత్త, వక్త , ఎవరైనా మిమ్మల్ని అనవసరంగా చిన్నచూపు చూస్తే మీరు ఖచ్చితంగా వారికంటే వున్నతమైన స్థాయిలో వున్నారని గ్రహించండి అని అన్నారు.

ఈ ఆత్మన్యూనత ఏరకమైనా, ఎలా మనలోకి ప్రవేశించినా బాధపడేది మనమే! జీవితంలోని సుఖాలని కోల్పేయేది మనమే! మనమీద మనకే నమ్మకం లేనపుడు, మన స్వశక్తికి మనమే ఏమాత్రమైనా విలువని ఇవ్వనపుడు, మనస్నేహితులు, కుటుంబ సభ్యులతో హాయిగా సమయం గడపడానికి సంశయిస్తున్నపుడు, ఎవరైనా సరే, వారి చుట్టూ వారే ఒక ఒంటరితనం కోటని కట్టేసుకుంటారు. ఆ కోటలో పూర్తిగా బందీ అయిపోయి, మెల్లిగా depression కోరల్లో నలిగి నాశనం అయిపోతారు. దీని ప్రభావం మనం చేసే ఉద్యోగం మీద కూడా పడే అవకాశం వుంది.. ఇలా జీవితంలోని అన్ని కోణాలలోను ఈ ఆత్మన్యూనత తన కబంధహస్తాలతో మనల్ని నలిపి మసి చేసేస్తుంది. చిన్న చిన్న పనులను కూడా  చెయ్యలేని మనోదౌర్బల్యాన్ని బహుమతిగా ఇస్తుంది. ఆఖరికి ఎవరైనా మనల్ని పొగిడినా సరే, ఏదో మర్యాదకు అలా అంటున్నారేమో, లేక మనం బాధపడతామేమో అని వుత్తుత్తగా ఏదో పొగుడుతున్నారేమో అన్న అనుమానాలను మనలో రేపుతుంది. ఎందుకంటే ఆ పొగడ్తలకి తాము పూర్తిగా అనర్హులు అని వారు మనసారా నమ్ముతారు. అంతేకాకుండా ఆత్మన్యూనతతో బాధపడుతున్నవారు వారికి వారే పెద్ద స్వయంవిమర్శకులు. పోనీ అదేమన్నా నిర్మాణాత్మకమైన విమర్శా అంటే అదీ కాదు, అన్నిటినీ పూర్తిగా ధ్వంసం చేసే విధ్వంసాకరమైన విమర్శ. అంతేకాదు. ఆత్మన్యూనతతో బాధపడేవారు ఏ బంధాలనూ నిలుపుకోలేరు. ఎందుకంటే  వారికి వారిమీద ఎలా విశ్వాసం వుండదో, ఎదుటివారి మీద కూడా అలాగే విశ్వాసం వుండదు. దానితో అతి సున్నితమైన బంధాల దారాలు చిక్కుబడి, తెగిపోయే ప్రమాదం వచ్చే అవకాశం వుంది. అందుకే 'ఏ బంధంలో నైనా ఏదన్నా అభద్రత వుంటే దానికి కారణం ఖచ్చితంగా ఆత్మన్యూనతే' అని Marisha Aqui అనే ఒక గళకళాకారిణి అన్నారు. ఇంకో విషయం. ఆత్మన్యూనతలో పూర్తిగా మునిగిన మనిషికి చెడు అలవాట్లకు లోనయ్యే అపాయం చాలా ఎక్కువగా వుంది. ఎందుకంటే వారి వ్యక్తిత్వం బలహీనమై, ఎటువైపు గట్టిగా గాలి వీస్తే అటువైపు తేలికగా మొగ్గే బలహీనతలో అనుక్షణం కొట్టుమిట్టాడుతూ వుంటుంది. పరాన్నజీవిలాగా, అంటే parasite లాగా మారి, ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బతికే దుర్దశ కలిగే ప్రమాదం ఎక్కువగా వుంది. ఎందుకంటే వారు తమని ఎప్పుడూ అందరికంటే తక్కువగానే అంచనా వేసుకుంటారు. పైగా దానికి కారణం రూఢిగా తమ అసమర్థతే అని కూడా అనుకుంటారు. దానిలో భాగంగా ఇదివరకు లేని అనేక కొత్త భయాలు, బెరుకులు, అంధవిశ్వాసాలు పెంచుకుంటారు. ఏ పని చేస్తే ఏ ఓటమిని ఎదుర్కోవాలో అని అసలు ఏ పనినీ మొదలుపెట్టరు, ఒకవేళ మొదలుపెట్టినా ముగించరు. ఏవో కుంటిసాకులు వెతుకుతారు. చూసారా, ఆత్మన్యూనత మనిషి అభివృద్ధికి ఎలా ఆటంకం కల్పిస్తుందో!

సరే, మరి ఈ ఆత్మన్యూనతని ఎలా వదిలించుకోవాలి? ఇది కూడా ఇంకో మంచి ప్రశ్న.

సాధారణంగా ఆత్మన్యూనత వెనకాల ఏదో కారణం వుంటుంది. అది శారీరకమైతే దానికి నివారణకని వెదకాలి. మనందరి అభిమాన నటుడు, Hrithik Roshan కి నత్తి వుండేది. ఆయన నటుడు కావాలని నిర్ణయించుకున్నప్పుడు ముందు దానిమీద పని చేయడం  మొదలుపెట్టాడట. speech therapy లు తీసుకుని, గంటలపాటు అద్దం ముందు సినిమా సంభాషణలు అబ్యాసం చేసేవాడట. ఈనాడు ఆయన ఎంత విజయవంతమైన నటుడో మనందరికీ తెలుసు. చెప్తే తప్ప ఆయన లోపం మనం ఎవ్వరమూ పసిగట్టలేము. అంటే ఆయన తన లోపాలను తన క్రమశిక్షణ, ధృఢసంకల్పం, అభ్యాసంతో నివారించుకున్నారన్నమాట. అలాగే ఇంకొన్ని విషయాలు వుంటాయి. వీటిని మనం ఏమి మార్చలేము. కానీ వాటినే వేరే విధంగా వుపయోగించుకొని వాటి మీద విజయాన్ని సాధించగలం. Usha Uthup ఎంత పేరున్న గాయనో మనందరికీ తెలుసు. ఆవిడ గొంతు సాంప్రదాయ ప్రకారంగా తియ్యటి గొంతు అని మన పెద్దవాళ్ళు ముద్ర వేసేలాగా వుండదు. చాలా ప్రత్యేకంగా వుంటుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూ లో ఆవిడ చెప్పారు, తన గొంతు తీరుని దృష్టిలో పెట్టుకుని తను లతామంగేష్కర్, శ్రేయ ఘోషాల్ పాడేలాంటి  పాటలు పాడితే  బాగుండదు. అలా అని తాను పాడటం అసలు మానేయక్కరలేదు. తన గొంతుకి సరిపోయే పాటలు మాత్రం తాను పాడచ్చు. అలా అని నిర్ణయించుకుని ఆవిడ అప్పటినుండి అలాంటి పాటలే ఎన్నుకున్నారు. వాటి మీదే కృషి చేసారు. గొప్ప విజయవంతమైన గాయని అని పేరుప్రఖ్యాతులు సంపాయించుకున్నారు. ఆవిడ పాడే పాటలు ఆవిడ తప్ప ఇంకెవ్వరూ పాడలేరన్న గొప్ప కీర్తిని సంపాదించారు. చూసారా, మన లోటుపాట్లని, ప్రత్యేకతలని గుర్తించి, సరైన రీతిలో వాటిని ఎదుర్కొనటం వలన ఆత్మన్యూనత బదులు ఆత్మసంతృప్తి, ఆత్మబలం, బోలెడంత కీర్తి ప్రతిష్ఠలు లభించాయి. అవునా? ఎందుకంటే ఇలాంటివి అసలు లోపాలు కావు, ప్రత్యేకతలు. అందుకని మనం ఎదుటివారికి ఏమి తీసిపోము. వారందరిలో కేవలం ప్రత్యేకంగా వుంటాము. అంతేకదూ? ఈ ఆత్మన్యూనతకు నివారణోపాయంగా మనం ఇందాక చెప్పుకున్న వ్యక్తిగత మానసిక శాస్త్రవేత్త Alfred Adler ఏమన్నాడంటే, పరోపకారం, సమాజసేవ ఈ ఆత్మన్యూనతకు తగిన విరుగుడులట. ఎందుకంటే మన వలన ఒక వ్యక్తికి, లేదా కొంతమంది వ్యక్తులకు, లేదా సమాజం మొత్తానికి ఏదో లాభం జరుగుతోంది అంటే ఇంక ఎవరికైనా చాలా ఆనందంగా, తృప్తిగా, కొంచెం గర్వంగా కూడా వుంటుంది కదా! అప్పుడు మనం ఎందుకూ పనికిరాము, మన వలన ఎవ్వరికీ ఎటువంటి ప్రయోజనమూ వుండదు, మన జీవితమే వ్యర్థం, మనం వున్నా లేకపోయినా కూడా ఎవ్వరికి ఎటువంటి తేడా  వుండదు అనుకుంటూ ఎవ్వరూ ఆత్మన్యూనత వలన బాధపడనక్కరలేదు. అందుకని ఆత్మన్యూనతకు పరోపకారమే తగిన నివారణ అని ఆయన అభిప్రాయం.

అసలు ముందు ఇతరులతో ఆ అనవసర పోలికలు మానాలి. మన అంతరంగంలోకి ఒక్కసారి తొంగిచూస్తే మనమెవరమో తెలుస్తుంది. అప్పుడు ఎవరి గుర్తింపు వారిదే అన్న నిజాన్ని గ్రహించగలము. ఆతర్వాత మన ప్రత్యేకతని మనం ధైర్యంగా కొనసాగించాలి. అంటే ఇతరులతో పోల్చుకుని వారి స్థాయికి మనం కూడా ఎదగాలి అని కృషి చేస్తే అప్పుడు ఆ పోలిక మంచిదే కానీ వారి పక్కన మనం మరీ తీసికట్టుగా వున్నామని వూహించుకుని మనల్ని మనమే తృణీకరించుకుంటే అది తప్పు.  Andrena Sawyer అనే ఒక అమెరికన్ బిజినెస్ కన్సల్టెంట్ 'ఈ ఆత్మన్యూనతలు, అభద్రతలు, అపజయాలు నీకు స్నేహితులు కావు. వాటిల్ని వెనకాల వదిలేసి నువ్వు ఏమేమి విద్యలు ముందుకు తీసుకొస్తావో అని ఈ ప్రపంచం అంతా కుతూహలంగా ఎదురుచూస్తోంది' అన్నారు. ఈ మాటలలోంచి మనందరం పాఠాలు నేర్చుకోవాలి.

జీవితంలో పోలికలన్నవి ఎవ్వరికీ తప్పవు. అసలు ఈ ప్రపంచాన్ని మనం పోలికల ద్వారానే చూస్తాం. దాని గురించి పోలికల ద్వారానే నేరుస్తాం. కానీ అవి హద్దులు దాటి మనల్ని మనమే తక్కువ చేసుకునేలాగా వుండకూడదు. అలాగే మనిషన్న తర్వాత అప్పుడప్పుడు ఏ కారణంచేతైనా సరే, అభద్రతగా అనిపించటం కూడా సహజమే! కానీ ఎప్పుడైనా అలా అనిపించటానికి, తనను గురించి తాను ఎల్లప్పుడూ న్యూనతగా భావించటానికి తేడా వుంది కదా! అలాగే ప్రతి మనిషిలోను ఏవో లోపాలు వుంటాయి. ఏ లోపాలు లేనివాడు ఆ దేవుడొక్కడే! మరి అలాంటప్పుడు ఆ లోపాల గురించి న్యూనతా భావం ఎందుకు, వాటిని భర్తీ చేసుకునే ప్రయత్నం చెయ్యాలి కానీ? అవునా? అసలు ఆ మాటకొస్తే ఏవన్నా లోపాలున్నా కూడా చాలా ఆత్మవిశ్వాసంతో వుండచ్చు. ఎందుకంటే నేను ముందే చెప్పినట్లుగా లోపాలు లేనివారు ఎవరున్నారు? ఇంకో విషయం. ఎవరిలోనైనా ఒక విషయంలో ఏదన్నా లోపం వున్నా, దాన్ని భర్తీ చేయటానికి వేరే ఇంకేవో ప్రత్యేకతలు వుండనే వుంటాయి. అందుకే ఏవో లోపాలు వున్నంత మాత్రాన న్యూనతగా భావించనక్కరలేదు. 'నీ సమ్మతి లేకుండా ఎవ్వరూ నిన్ను చిన్నచూపు చూడలేరు' అని అమెరికా మాజీ రాష్ట్రపతి Roosevelt గారి భార్య Eleanor Roosevelt అన్నారు. అందుకే ఎప్పుడూ కూడా మీ శక్తిని మీరు తక్కువగా అంచనా వేయకండి. మీరు ఎవ్వరికీ ఏమి తీసిపోరు. ఎప్పుడూ చక్కగా ధైర్యంగా, తలెత్తుకుని, ఆత్మవిశ్వాసంతో, కళ్ళలో మెరుపులతో, పెదవులపై చెరగని చిరునవ్వుతో వుండండి.

ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు నచ్చాయని, మీరు నాతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను. మరి ఇంక మీ అందరి దగ్గర నుండి సెలవు తీసుకుంటూ, మళ్ళీ వచ్చే నెల ఇంకో మంచి విషయం గురించి మీతో ముచ్చటించడానికి మళ్ళీ వస్తాను. అంతదాకా సెలవు.

********

Posted in January 2026, వ్యాసాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *