Menu Close
GSS-Kalyani
వేదవాక్కు (కథ)
G.S.S. కళ్యాణి

ఆదివారం మధ్యాహ్నం భోజనం ముగించి తన భార్య సుశీల ఇచ్చిన కాఫీని ఆస్వాదిస్తూ వాలుకుర్చీలో కూర్చుని, తను కష్టపడి పెంచిన మొక్కలవంక మురిపెంగా చూస్తున్నాడు డెబ్భైయేళ్ళ నీలకంఠం.

అంతలో, "నాన్నా! నాన్నా!", అంటూ వచ్చాడు అనంత.

అనుకోకుండా వచ్చిన అనంతని చూసి ఆశ్చర్యపోయిన నీలకంఠం, "ఏరా అనంతా! ఏంటి విశేషం? ఎప్పుడొచ్చావ్? పిల్లలు కూడా వచ్చారా?", అంటూ అనంత మీద ప్రశ్నల వర్షం కురిపించాడు.

"పిల్లలనీ, కమలని కూడా నా వెంట తెచ్చాను నాన్నా. పిల్లలకు వాళ్ళ స్కూల్ వాళ్ళు వారం రోజులు సెలవలిచ్చారు. అమ్మ చేసే పిండివంటలంటే వాళ్ళకి మహా ఇష్టం కదా! ఈ వారం మీ దగ్గర గడుపుతామన్నారు. నేను కూడా ఆఫీసుకి రెండు రోజులు సెలవు పెట్టాను. ఇంతకీ నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్నా. చిన్నప్పటినుంచీ ఏదైనా సినిమా తీయాలని నాకు పిచ్చి కోరిక కదా! ఆ కోరిక తీరే సమయం వచ్చింది. నా ఫ్రెండ్స్ తో కలిసి ఒక సినిమా తియ్యాలని అనుకుంటున్నాను. మంచి కథ కోసం చూస్తున్నాం", చెప్పాడు అనంత.

ఆ మాట విన్న సుశీల, "అది మంచి ఆలోచనరా అనంతా! సమాజానికి చక్కటి సందేశం ఇచ్చే చిత్రమో లేక భక్తిరస చిత్రమో తియ్యండి. బాగుంటుంది", అంది.

ఆ మాటలకు అనంత కాస్త చిరాగ్గా, "అమ్మా! నీతి కథలెంచుకుంటే పిల్లల సినిమా అవుతుంది. అలాంటి సినిమాలు పెద్దవాళ్ళు థియేటర్లకు వచ్చి చూడటానికి ఇష్టపడకపోవచ్చు. భక్తిరస చిత్రాలేమో ఒక వర్గం వాళ్ళకే నచ్చుతాయ్. ఇప్పటి ప్రేక్షకులకు నచ్చేవిధంగా తీస్తే సినిమా బాగా ఆడుతుంది. ఈరోజుల్లో మన చుట్టూ చాలా అరాచకాలు జరుగుతున్నాయి. వాటిలో ఒక ఘోరమైన సంఘటనను తీసుకుని దానికి ఆధునిక టెక్నాలజీని జోడించి, ప్రేక్షకుల గుండెల్లో దడ పుట్టేలా సినిమా తీస్తే ఆ సినిమా సూపర్ హిట్ అవుతుంది. నేను ఒకే ఒక్క సినిమాతో పెద్ద పేరునూ, బోలెడు డబ్బునూ సంపాదించచ్చు!", చెప్పాడు అనంత.

అనంత ఆశను చూసి నివ్వెరపోయింది సుశీల.

"ఏమోరా! నీ సినిమా నీ ఇష్టం!", అంటూ వంటగదివైపు వెళ్ళిపోయింది సుశీల.

"నాన్నా! నా ఐడియాలు అమ్మకి నచ్చినట్లు లేవు. నువ్వేమంటావ్?", నీలకంఠాన్ని అడిగాడు అనంత.

"నాకు కాస్త సమయం ఇవ్వు. ఇంతకీ పిల్లలేం చేస్తున్నారూ?", అడిగాడు నీలకంఠం.

"ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటారు", అంటూ పధ్నాలుగేళ్ళ వయసున్న కవలపిల్లలు నాగేంద్ర, ఫణీంద్రలను పిలిచాడు అనంత.

నీలకంఠం నాగేంద్ర, ఫణీంద్రలను దగ్గరకు పిలిచి, "ఏరా పిల్లలూ! మీకు సినిమాలంటే ఇష్టమేనా?", అని అడిగాడు.

"ఓ! ఇష్టమే తాతా!", ముక్తకంఠంతో సమాధానం చెప్పారు పిల్లలు.

"అయితే మీ ఇద్దరికీ ఇప్పుడు నేను చెరొక సినిమా చూపిస్తా. ఈ సినిమాలు పెద్ద హిట్ సినిమాలు. సినిమాలు చూడటం పూర్తయ్యాక నా దగ్గరకు మళ్ళీ రండి", అన్నాడు.

సరేనని పిల్లలిద్దరూ నీలకంఠం చూపించిన సినిమాలు చూసి మళ్ళీ నీలకంఠం దగ్గరకు వచ్చారు.

"సినిమాలు బాగున్నాయా?", పిల్లల్ని అడిగాడు నీలకంఠం.

"నేను చూసిన సినిమా చాలా బాగుంది తాతా", ఠక్కున సమాధానం ఇచ్చాడు ఫణీంద్ర.

"మరి నీ సినిమా ఎలా ఉందీ?", నాగేంద్రను అడిగాడు నీలకంఠం.

"బానే ఉంది తాతా. ఎంతైనా పెద్ద హీరో వేసిన సూపర్ హిట్ సినిమా కదా! చాలా రక్తం చూపించారు. కొట్టుకోవడాలూ, చంపుకోవడాలూ కూడా చాలానే ఉన్నాయి. హీరోకి లేని దురలవాటు లేదు! కొన్ని సినిమాల్లో విలన్లా ఉంది హీరో ప్రవర్తన. అదొక్కటే అంతగా నచ్చలేదు", అన్నాడు నాగేంద్ర.

"సరే పిల్లలూ! నాకొక చిన్న సమస్య వచ్చిందిరా. మీరే పరిష్కారం చెప్పాలి. పక్కింటివాళ్ళు మన నిచ్చెన తీసుకెళ్ళి వారం రోజులైంది. ఇంకా తిరిగివ్వలేదు. ఆ నిచ్చెన నేను ఈ ఇల్లు కట్టేటప్పుడు వడ్రంగి చేత మంచి చెక్కతో చేయించుకున్నాను. మళ్ళీ కొనాలంటే చాలా ఖర్చవుతుంది. ఏం చేద్దాం?", అడిగాడు నీలకంఠం.

"ఏముంది తాతా! మనం వెళ్ళి మా నిచ్చెన మాకివ్వండని గట్టిగా గొడవపడి వాళ్ళతో దెబ్బలాడితే సరి. వెంటనే ఇచ్చేస్తారు! మళ్ళీ ఇంకెప్పుడూ నిచ్చెనివ్వమని అడగరు కూడా", సమస్యను తేలిగ్గా పరిష్కరించానన్న ఆనందంతో నవ్వుతూ అన్నాడు నాగేంద్ర.

నీలకంఠం చిరునవ్వు నవ్వి ఫణీంద్రతో, "ఏం ఫణీంద్రా? నువ్వేమంటావ్? నీ సమాధానం కూడా అదేనా?", అని అడిగాడు.

ఫణీంద్ర ఒక్క క్షణం ఆలోచించి, "తాతా! వాళ్ళను ముందుగా నిచ్చెన ఎప్పుడిస్తారో అడిగి చూద్దాం. ఎందుకంటే వాళ్ళు తిరిగివ్వడం మర్చిపోయి ఉండచ్చు కదా?! మన పక్కింటివాళ్ళతో చిన్న విషయానికి అనవసరంగా గొడవపడి తగాదాలు తెచ్చుకుంటే రేపటినుంచీ మనకే ఇబ్బంది కావచ్చు", అన్నాడు సౌమ్యంగా.

"చక్కటి పరిష్కారం!", అని ఫణీంద్రను మెచ్చుకుని అనంతవంక చిరునవ్వుతో చూశాడు నీలకంఠం.

అంతలో వంటింట్లోంచీ ఘుమఘుమల వాసనలు వచ్చేసరికి, "బామ్మ మాకోసమేదో పిండివంట చేసినట్లుంది", అంటూ పిల్లలిద్దరూ వంటింటివైపుకి పరిగెత్తారు.

అనంతకు నీలకంఠం ఉద్దేశమేమిటో అర్థంకాక, "ఏమిటి నాన్నా? పిల్లలకు ఏ సినిమాలు చూపించావూ? పొరుగింటివాళ్లతో వచ్చిన ఆ సమస్యేమిటీ? కొంచెం వివరంగా చెప్తావా?", అని అడిగాడు.

అందుకు నీలకంఠం, "చెప్తానురా విను! నేను పిల్లలకు చూపించినవి రెండూ మంచి హిట్ సినిమాలే. వాటిని నిర్మించిన వాళ్ళకు మంచి పేరు, బోలెడు లాభాలూ వచ్చాయి. ఫణీంద్రకు మంచితనంతో విజయాన్ని సాధించే హీరో సినిమాను చూపించాను. నాగేంద్రకు నీ ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమా చూపించాను. పొరుగింటివాళ్ళతో నిజానికి నాకు ఏ సమస్యా లేదు. అయినా పిల్లలను పరీక్షించేందుకు ఒక సమస్య సృష్టించానంతే! వాళ్ల సమాధానాలు విన్నావు కదా! వాళ్ళు చూసిన సినిమాల ప్రభావం వారు చూపించిన పరిష్కారాలపైన పడింది. కాదంటావా?", అన్నాడు.

"నాన్నా! అది కాకతాళీయం కావచ్చు. అందరూ సినిమాని సినిమాలాగే చూస్తారు. వాస్తవానికి దాన్ని ముడిపెట్టరు. సినిమావల్ల సమాజంలో మార్పు వస్తుందంటే నేను నమ్మను", అన్నాడు అనంత.

"అనంతా! మనం చూసే ఏ చిన్న విషయమైనా మన మనసులో చిన్నగా ఆలోచన రేకెత్తిస్తుంది. ఆ ఆలోచనను కొనసాగించాలా వద్దా అనేది మనం అప్పటికప్పుడు నిర్ణయించుకుంటాం. మూడు గంటలపాటూ చూసే ఒక సినిమా ప్రభావం మనసుపై ఉండదంటావా? పూర్వం ఒక పిల్లవాడు సినిమాను చూసి మహాయోగిగా మారాడట! మరోచోట మరొకడు హీరోలాగా నిజజీవితంలో విన్యాసం చెయ్యబోయి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడట! సినిమాలు చూసి ప్రేరణపొంది సంగీతం, నాట్యంవంటి కళలు నేర్చుకున్నవాళ్ళు మన మధ్య ఎంతోమంది ఉన్నారు. ఆ వార్తలన్నీ వాస్తవాలే కదా?! మన మనసు సినిమా చూశాక కాసేపు దాని గురించి ఆలోచిస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనసు ఎప్పుడూ దేనిగురించి ఆలోచిస్తుందో అదే కావాలని అనుకుంటుంది. నువ్వు సినిమా తియ్యడం మంచి ఆలోచన. కానీ నువ్వు చెప్పదల్చుకున్నది ప్రజలలో దడ పుట్టించకూడదు. వారిని ఆలోచింపజేయాలి. శాంతియుతమైన పరిష్కారమార్గాన్ని వాళ్ళు ఎంచుకునేలా వాళ్ళను ప్రేరేపించాలి. అప్పుడు లోకంలో శాంతి పెరుగుతుంది. శాంతి ఉన్నచోట సుఖసంతోషాలు ఉంటాయి", అన్నాడు నీలకంఠం.

నీలకంఠం మాటలు అనంతను ఆలోచనలో పడేసాయి.

పళ్ళెంలో ఫలహారం పట్టుకొచ్చిన సుశీల, "ఇందాకటినుంచీ మీ నాన్న చెప్తున్న మాటలు వింటూనే ఉన్నాను. ఇదిగో అబ్బాయ్! నీకో మాట నేను కూడా చెప్తాను విను. నీతి కథలన్నవి కేవలం పిల్లలకే కాదు. పెద్దలకు కూడా అవసరమే. మనచుట్టూ ఉన్న ప్రపంచంలో నీతి తప్పిన పెద్దలే మనకు ఎక్కువగా కనపడతారు. అటువంటివాళ్ళకి నీతిని గుర్తుచెయ్యడానికి సినిమా అనేది ఒక మంచి సాధనం. ఎటూ సినిమాకోసం చాలా ఖర్చు చెయ్యదల్చుకున్నావు. బోలెడు సమయం పెట్టదల్చుకున్నావు. ఎంతో కష్టపడాలి కూడా! అటువంటప్పుడు అవన్నీ ఒక మంచి సందేశమున్న సినిమాకోసం వినియోగిస్తే చూసినవాళ్ళలో కొంతమందైనా బాగుపడతారు. దానివల్ల సమాజం బాగుపడుతుంది. హింసాత్మకమైన సినిమా తీసి నువ్వొక్కడివే బాగుపడతావో లేక నువ్వు కాస్త నష్టం భరించాల్సి వచ్చినా అందరి మంచికోసం సినిమా తీస్తావో నిర్ణయించుకోరా అనంతా", అంది.

"అమ్మా! నువ్వూ, నాన్నా చెప్పిన విషయాలన్నీ అక్షరాలా నిజం. ధనాన్నీ, కీర్తినీ సంపాదించాలన్న స్వార్థంతో కాకుండా అందరికీ ఉపయోగపడే మంచి కథను నా సినిమాకు ఎంపిక చేసుకుంటాను. ‘లోకాసమస్తా సుఖినోభవంతు!’ అన్న వేదవాక్కును ఎన్నటికీ మరువను. నాకు విజయం కలగాలని నన్నాశీర్వదించండి", అంటూ సుశీల, నీలకంఠం పాదాలను తాకాడు అనంత.

********

Posted in January 2026, కథలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *