వినమని రిక్వెస్ట్ ఉంది ఆ మొహం లో.
"సరే. కానీ ఇప్పుడు ఈ కాకరకాయ కూర నువ్వు తినేసి నాకు బంగాళదుంప భౌ భౌ చెయ్యి!" అంది.
"సరే నేను చెప్పేదీ విను మరి!” అన్నాడు భరద్వాజ.
"ఇప్పుడు స్పీచ్ ఇస్తావా?"
"లేదు. రెండు ముక్కల్లో చెప్తా. కానీ శ్రద్దగ వినాలి!”
"సరే!” మాటంటే మాటే తమ ఇంట్లో.
"ఏం చేసినా తిరిగిరానిది సమయం ఒక్కటే. సమయం ఎప్పుడూ ముందుకే ప్రవహిస్తుంది. సమయాన్ని మనం ఎప్పటికి తిరిగి తీసుకురాలేము. కాబట్టి అనవసరమైన పనులు కట్టిపెట్టి అవసరమైనవే చేయాలి. నువ్వెందుకు ప్రతి పాఠం శ్రద్ధగా చదువుతావు?"
"టైం కి అప్పజెప్పకపోతే టీచర్ పనిష్ చేస్తారు గనుక!”
"ఆలస్యంగా ఎందుకు స్కూల్ కి వెళ్ళకూడదు?"
"పాఠాలు మొదలయిపోతే సరిగా ఇంటికొచ్చి చదివినా అర్ధం కాదు గనుక!”
"నీకెందుకు లాస్ట్ మంత్ మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయి!”
"నాన్నా!” బాధగా అంది.
"చెప్పు మరి?"
"ఎప్పటి పాఠం అప్పుడు చదవకుండా అన్నీ మూలపడేసి ఆడుకుని వచ్చాక బోల్డు పాఠాలు అయిపోయి, అన్నీ చదవడానికి టైమ్ సరిపోలేదు గనుక!”
"ఇప్పుడు చెప్పు. సమయపాలన పాటించాలి కదా? నీకో ఉదాహరణ చెప్తా విను!”
"త్వరగా చెప్పు నాన్న, ఆకలి స్టార్ట్ అయింది!”
"నేను రాత్రి అక్కర్లేని సినిమాలు చూసి, పొద్దున్న లేవలేక, లేచాక నిద్ర సరిపోక బద్ధకించి వంట చెయ్యకుండా ఆఫీస్ కి వెళ్ళి ఏదో తినేసి అది అరగక పోతే నా ఆరోగ్యం ఏమవుతుంది?"
"పాడవుతుంది!” అంది తను.
"ఆరోగ్యం పాడయితే నేను నీరసంగా అయిపోతాను. అప్పుడు ఆఫీస్ పని సరిగా చేయలేను. బాస్ తిడతారు. నువ్వు సరి అయిన ఫుడ్ లేక ఇంట్లో ఉన్న దేదో తిని బాక్స్ పట్టుకుపోతే నీకూ నీరసం వస్తుంది. పాఠం వినాలని ఉండదు. దానివల్ల నీకూ నాకూ కూడా తిట్లు, పనిష్మెంట్లు. నువ్వు చదువులో వెనక పడతావు.
"నాన్నా!” అరిచింది తను.
"అందుకని ఆరోగ్యం కాపాడుకోవాలి. ఏదో ఒకటి తినేస్తే అన్ని పోషకాలతో ఉన్న తిండి లభించదు. చదువుకి, ఇంటి పనులకు, బజారు పనులకి, ఆఫీస్ కి ఇలా టైం ని అడ్జస్ట్ చేయకపోతే మన ఆరోగ్యం మన చేతిలో ఉండదు. ఆరోగ్యం బాగుంటే అన్నింటా విజయమే. నేను నీకు నచ్చేవి వండుతూ ఉంటే టైం కి ఆఫీస్ కి వెళ్ళలేను. ఎక్కువ వండి పారబోస్తే కాలంతో పాటు కష్టపడి సంపాదించుకున్న మనీ వృధాగా పోతుంది. సరైన పోషక విలువలు లేక అనారోగ్యం!” చెప్పడం ఆపాడు భరద్వాజ.
"నాన్నా! కంచం లో కాకరకాయ కూర వేసేయ్!” అంది వేగంగా, దీనంగా.
"నవ్వుతూ తింటే తప్ప తిండి ఒంట బట్టదు!” అన్నాడు భరద్వాజ.
"ఇహిహిహి!” అంది తను
"ఇప్పుడేమర్ధమైంది నీకు?" అన్నాడు సరదాగా నవ్విస్తూ.
"టైం ని సరిగా వాడుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యం బాగుంటే చదువు వస్తుంది. అందుకని సమయాన్ని టైం ప్రకారం వాడుకోవాలి!” అంది గబగబా.
నాన్న ఏం నవ్వాడని?
అప్పటి నుంచి గొప్ప నమ్మకం, విశ్వాసం. నాన్న దేనికైనా పరిష్కారం చెప్పగలడని.
ముందుకి నడిపించగలడని!!!
★★★
సౌమిత్, జాజిల గేమ్స్ గదిలో వసంత్ మూలకి ఉన్న కేరం బోర్డు తీసాడు.
అది చూసిన జాజి ముగ్గురే ఉన్నారు గనుక ఒక పార్టనర్ కోసం పరిగెత్తి భామ ని తీసుకొచ్చింది.
భామ మోహమాటపడుతూ వసంత్ ని చూసి నవ్వబోయి తను పారిపోయిన విషయం వసంత్ కి కూడా తెలుసు గనక అతడిని చూసి తలవంచేసుకుంది.
ఆ తలఒంపు ని పోగొట్టి బలాన్ని ఇవ్వడం కోసం "ఎవరెవర్రా పార్టనర్స్?" అని హుషారుగా సౌమిత్ ని అడిగాడు వసంత్.
"నేను, భామ వదిన, నువ్వు, జాజి" అన్నాడు సౌమిత్.
ఆడడం మొదలు పెట్టాక కాయిన్ వేస్తునప్పుడు, ఎదుటి వారి కాయిన్ పడినప్పుడు అమితోత్సాహంతో కేరింతలు కొడుతూ ఆట సాగింది.
భామ అన్నీ మరిచి నవ్వులతో ఆడుతోంది.
ఆ నవ్వులు వినపడి అనసూయ ఆ గదిలోకి తొంగి చూసి వెళ్ళింది.
పది నిముషాల తరువాత అనులేఖ వచ్చి చూసి టక్కున వెనుతిరిగింది.
ఆ ఆట ముగిశాక ఆపేశాడు వసంత్.
భామ వెళ్ళిపోయింది.
★★★
గంట తరువాత ధృతి వసంత్ తో కబుర్లు చెప్తోంది.
పిల్లలు స్టడీ రూమ్ లో చదువుకుంటున్నారు.
త్రిలోక్, గిరిధారి కూడా ఇప్పుడు స్టడీ రూమ్ లోకి టైం ప్రకారం వెళ్తున్నారు.
ధాత్రి, వసంత్ ఏ మాత్రం డిస్టర్బ్ కలగకుండా తమ అభిరుచులకు అనుగుణంగా ముందు బాల్కనీలో చదువుకుంటున్నారు.
తోటలో అత్యవసర రహస్య సమావేశం మొదలైందని చెవులు రిక్కించాడు వసంత్.
రెండు ఆడ గొంతులు.
"నేను ఎప్పుడో కనిపెట్టా. వాళ్ళ నాన్న కి ఆ ఇల్లొక్కటే ఉంది. వెనకా, ముందూ ఏమి లేదు. రిటైర్ అయిపోయాడు. పెన్షన్‌తో బతుకు జట్కాబండి లాగిస్తున్నాడు. ఇప్పుడేమో మన ఇంటికి అక్క కొడుకుట వసంత్. పట్టుకొచ్చింది. వాళ్ళూ ఏమంత ఉన్నవాళ్లు కారు.
మన పిల్లకి లైన్ వేస్తే డబ్బుకు డబ్బు, అందం చందం!”
అది అనసూయ గొంతు. వసంత్ టక్కున గుర్తు పట్టి ధాత్రి వైపు చూసాడు.
ఆమె పుస్తకం లో లీనమై ఉంది.
"ఇప్పుడు ఇరవై ఒక్క ఏడు వస్తే గానీ పెళ్ళి చేసుకోడానికి లేదని రూల్ వచ్చిందిగా?"
"పిచ్చి మొహం. ఇప్పుడు లవ్వు. ఆనక ఫోన్లు,ఆ తరువాత కలవడాలు, ఇన్ని ఉంటాయి!"
"పో అక్కా! నువ్ మరీనూ... భామ నిన్న లేచిపోయాక వాడేం పప్పు సుద్దా పెళ్ళాడెయ్యడానికి? మంచి ఉద్యోగం వచ్చిందట. పొంగిపోతోంది ధాత్రి వదిన కానీ మరీ మధ్యతరగతి. మనలా అప్పర్ మిడిల్ క్లాస్ కాదు!" అంది అనులేఖ.
"డబ్బుంటే అన్ని తప్పులూ ముసుగేసుకుంటాయి అనుకుంటాం గానీ ఈ విషయం తెలిసాక ఎవడో డబ్బున్న కుటుంబం చేసుకోడానికి ముందుకి వచ్చినా, ఆ తరువాత అత్తవారూ, మొగుడు పెట్టే ఆరళ్ళు ఊహించే సావిత్రి చూసి చూడనట్టు పోతూ పిల్లని అంటగట్టే ప్రయత్నం చేస్తోంది!" అంది అనసూయ.
"ఏడవనీ. అయినా ధృతి వదినకి తను బాగా చదువుకున్నానని మిడిసిపాటు. సురేఖ వదిన బాగా డీలా పడింది గానీ లేపోతే ఆవిడా తక్కువది కాదు. అపర్ణ వదిన మహా ముంగి. మాట్లాడదు గానీ మొత్తం ఆస్తి తన మొగుడి గుప్పెట్లో ఉందని ధీమా! ధాత్రి వదిన, అపర్ణ వదిన్ని మంచి చేసుకుంటూ ఉంటుంది. లోపాయకారి.
పెద్దన్న ఇంతకింతా పెంచుకుంటూ పోతున్నాడని గానీ లేపోతే ఆస్తి పంపకాలు ఏనాడో అయిపోవూ?" అంది అనులేఖ.
"ఇంతకీ డాక్టర్ కి చూపించుకుంటున్నావా? సరిగా నెల వస్తే పిల్లలు పుడతారు. బెంగ పడకు!" మాట మార్చింది అనసూయ.
"నాకేం బెంగ లేదు. పెళ్లయి ఆరేళ్ళేగా?" అంది ధీమాగా.
"అనసూయా!" శ్రీధర్ రావు పిలుపు.
అనసూయ వెళ్ళిపోయిన శబ్దం.
"ఇక్కడున్నావా?" సావిత్రి గొంతు.
"రా రా చిన్నక్కా! ఇప్పుడే పెద్దక్క బావ పిలిస్తే వెళ్ళింది. తోచక కూర్చున్నాం. చిన్న బావ ఎప్పుడొస్తాడు? మొత్తానికి గిరిధారి దారిలో పడ్డాడు. భామ గురించి నువ్వేం వర్రీ అవకు. మన ధృతి వదిన మనసు నవనీతం. వసంత్ కి మంచి ఉద్యోగం వచ్చిందట. మంచిగా ఉంటే అన్నీ సద్దుకుంటాయి!" అంది అనులేఖ.
నోరు తెరిచి ఆశ్చర్య పోతూ తుళ్ళి పడ్డాడు వసంత్.
ధృతి పుస్తకం లోకి చూస్తూ నవ్వుకుంటోంది.
ఏమి వినడం లేదన్నమాట. విన్నావిననట్టు ఉందా?
"ఏమోనే లేఖా! మధ్యదాన్ని. నన్ను లెక్కచేసేవరు? ఎప్పుడు చూడు అనసూయ మాటకారితనం తో పెద్దది కావడం వల్ల అన్నింటా ముందు ఉంటుంది. దానికా ఆడపిల్ల లేదు. కొడుకుని హాస్టల్లో పెట్టింది. హాయిగా స్వేచ్ఛగా ఉంటుంది. నాకే ఈ భామతో నే ఈ చిక్కు.
త్రిలోక్ శ్రద్ధగా చదువుతున్నాడు.
"అవునే... బావ కానీ ఇల్లరకం వచ్చేసాడా ఏంటి?" రహస్యంగా అడిగింది సావిత్రి అనులేఖ ని.
"మరే! చిన్న బావలా ఇలా వచ్చి అలా పోడు. అయ్యో! అత్తవారిల్లు. మనం ఇన్ని రోజులుంటే ఎలా? అని కూడా అనుకోడు. అస్సలు మొహమాటం లేదు. మీ మరిది ని చూడు. పొద్దున్న వాళ్ళింటికి పోయి రాత్రి అక్కడే భోజనం చేసి నన్ను చూసుకోడానికి వస్తారు!" అంది.
నవ్వు ఆపుకోలేకపోయాడు వసంత్.
"ధృతి ఒప్పుకుటుందంటావా? వసంత్ తో భామ పెళ్ళికి? "
ధృతి మంచిదక్కా! మంచి మనసు. ఒకరికి సాయం చేస్తే గానీ తోచదు!"
"సావిత్రీ!" కరుణాకరం పిలిచాడీసారి.
సావిత్రి వెళ్ళగానే అనసూయ వచ్చింది.
"ఏమంటుందే ఇది?"
"ధృతి వదిన కాళ్ళు పట్టుకుంటా అంటోంది. అనసూయక్కా! మనం ఆడపడుచులం కదా? ఏమైనా బాగుంటుందా? అలుసు అయిపోమూ?" అంది లేఖ.
"లేఖా!" మనోహర్ పిలుపు.
"య...డియర్!" అంటూ లేఖ వెళ్ళీ వెళ్ళగానే సావిత్రి వచ్చింది.
"అనులేఖ వెళ్ళిపోయిందా అక్కా?" అడిగింది.
"ఊ! కాస్త ఎక్కువ చదువుకుందిగా... టింగు రంగా అంటూ డియర్, గియర్ అనుకుంటూ వెళ్ళింది మనోహర్ పిలిస్తే!" అంది సావిత్రి
"ఇదీ, దీని ఫోజులూను. గురివింద గింజ అనుకో!" అంది అనసూయ.
"ధృతి ఇచ్చిన నగలు భద్రంగా దాచావా? బాంక్ లాకర్ లో పడేయ్. డైమండ్ నెక్లెస్ చేయించావా? పోన్లే పిల్ల సుఖపడుతుంది. అన్నీ లెక్క చూసుకున్నావా?" అడిగింది.
అసలు విషయానికి వచ్చింది అనసూయ.
'ఉ!' అంది ముక్తసరిగా సావిత్రి.
వసంత్ లేచి నిలబడి ఒళ్ళు విరుచున్నాడు.
ధృతి తను చదువుతున్న పుస్తకం పూర్తి చేస్తే గానీ కదిలేట్లు లేదు.
పిల్లలు ఆ రోజు చదవాల్సినవి అయిపోయాయేమో అరుచుకుంటూ గదిలో నుంచి బయటికి వచ్చి వసంత్ ని లాక్కుని ఇంట్లో ఉన్న ప్లే గ్రౌండ్లోకి లాక్కుపోయారు.
త్రిలోక్, గిరిధారి కూడా వాళ్ళతో చేరి పోయారు. అందరూ అక్కడున్న ఉయ్యాలల్లో కూర్చున్నారు.
అనసూయ, సావిత్రి లు ఆ కేరింతల వైపే చూస్తుంటే అనులేఖ తమ కిటికీ దగ్గరికి వచ్చి చూస్తోంది.
వసంత్ పిల్లలకి కధలు చెప్పడం మొదలెట్టాడు.
"కధ ఒద్దు. బయటికి వెళ్దాం!” మారాం చేసింది జాజి.
బయట వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. ఏం చేసి మరిపించాలా?' అని ఆలోచించాడు వసంత్.
జేబులోనుంచి ఒక కాయిన్ తీసాడు.
జాజి కి ఇచ్చి -
"ఈ కాయిన్ గుప్పెట్లో బాగా గిలకరించి కింద వేయి. బొమ్మ పడితే తీసుకెళ్తా !" అన్నాడు.
అలాగే వేసింది జాజి.
బొరుసు పడింది.
జాజి బిక్క మొహం వేస్తే త్రిలోక్ ఒక ట్రిక్ చెప్పాడు.
"ఒక్కసారే వెయ్యమని చెప్పలేదుగా వసంత్ బావ. నువ్వు బొమ్మ పడే వరకు వేస్తూ ఉండు!" అన్నాడు.
అందరూ నవ్వేశారు.
"ఇప్పుడో చిన్న కథ!" అనగానే అందరూ చెవులు రిక్కించారు. వసంత్ కబుర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇంకా ఇంకా వినాలని ఉంటుంది.
రెండు దోమలు.
ఒకటి తల్లి దోమ.
ఒక బుజ్జి పిల్ల దోమ.
బుజ్జిదానికి ఇంకా రెక్కలు పూర్తిగా రాలేదు.అందుకని
తల్లి దోమ రోజూ పిల్లకి ఆహారం తీసుకొచ్చి బుజ్జి దోమ నోట్లో పెడుతుంటే కొన్ని రోజులకి ఏపుగా ఆరోగ్యంగా పెరిగి...
ఒకరోజు జాజి లాగే బయటికి వెళ్ళాలని అల్లరి చేసింది.
తల్లి దోమ అందీ...
"చిట్టితల్లీ! నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? ఇదుగో ... చెట్లంటా, పుట్టాలంటా పొ. బురదల పైనుంచి, చెత్తా చెదారం నుంచి కూడా ఎగురుకుంటూ పొ. కానీ ప్రమాదకరమైనవాళ్ళు ఒక్కరే.
"మనుషులు"!!!
"వాళ్ళ వైపుకి పొరపాటున కూడా పోకు!" అని విద్యా బుద్ధులు చెప్పి అతి జాగ్రత్తలు చెప్తూ పంపించింది.
చిట్టి దోమ ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఆలోచిస్తోంది.
అమ్మ చెప్పిన చోట తిరిగితే ఎక్కడా థ్రిల్ లేదు, ఎక్కడా కిక్కు లేదు. కాబట్టి ఒకసారి మనుషుల మధ్య నుంచి పోదాం... అనుకుంటూ మనుషులున్న వైపు ఎగిరి ఎగిరి అలిసిపోయాక ఇల్లు చేరుకుంది.
బాగా అలిసిపోయినట్టు ఉన్న పిల్లని చూసి తల్లి దోమ" ఒకే రోజు అన్ని చదివేసినా, తిరిగేసినా అన్ని కలగాపులగం అయిపోయి ఏది బాగుండదు. కొంచెం కొంచెం తినాలి. కొంచెం కొంచెం చదివితే బుర్రలోకి బాగా ఎక్కి కుదురుగా పడి ఉంటాయి. ఇంతకీ మనుషుల మధ్య లోకి పోలేదు కదా? మహా ప్రమాదం సుమా!" అంది.
చిట్టి దోమ తన ఎక్స్ పీరియన్స్ హుషారుగా చెప్పింది.
"అమ్మా! నేను నువ్ చెప్పినట్టు వినకుండా మనుషుల మధ్య నుంచే ఈల వేసుకుంటూ తిరిగా! నన్ను చూసి అందరూ చప్పట్లు కొట్టడమే. అదీ నా అందం, చందం, నా పాట మధురం!” అంది.
ఇప్పుడు నా ప్రశ్నకి సమాధానం చెప్పాలి.
"చిట్టి దోమ ఈలేసుకుంటూ తిరుగుతూ ఉంటె మనుషులు చప్పట్లు ఎందుకు కొట్టారు?" అడిగాడు కధ విన్న భామని ఓరకంటితో చూస్తూ.
"ఎందుకు?" టక్కున అడిగింది జాజి.
"మనం దోమ మన చుట్టూ జుయ్ మంటూ తిరుగుతుంటే ఏం చేస్తాం. కుట్టి పారేస్తుందని చంపేయ్యడానికి చప్పట్లు కొడతాం కదా? అందుకు!" అన్నాడు.
అందరూ నవ్వారు.
"ఇంకో కధ ఇంకో కధ" అరిచాడు సౌమిత్.
"సరే కానీ ఇంకొక్క కథే. ఆ తరువాత సాయంత్రం చీకటి పడే వేళ అవుతోంది గనుక ...దోమలు మూకుమ్మడిగా వస్తాయి కనక అపర్ణ అక్కా, ధృతి అక్కా తలుపులన్నీ టైం కి వెయ్యలేరు గనుక ఎవరి గదుల్లో తలుపులు వాళ్ళు గంటసేపు వేసుకోవాలి. అప్పుడు దోమలు పరార్! హాయిగా నిద్ర పడుతుంది.
అప్పుడేమవుతుందీ?"
"పొద్దున్నే త్వరగా లేచి చదువుకుంటాం!" కోరస్ గా అరిచారు పిల్లలు, పెద్దలు అందరూ సరదాగా.
అప్పుడో కథ మొదలెట్టాడు వసంత్.
"ఒక అత్తగారు రథసప్తమి నాడు సూర్యభగవానుడికి రెండు కొబ్బరికాయలు కొడతానని నూటొక్క ప్రదక్షిణాలు చేసే భాగ్యం ఇమ్మని మొక్కుకుంది.
పుట్టింటి కొచ్చిన తన ఆడపిల్లలు ఇద్దరు మహాలక్ష్మిలని, కోడల్ని తీసుకుని గుడికి పోయింది.
రెండు కొబ్బరికాయలూ కొని ఆడపిల్లలిద్దరికి చెరొకటి ఇచ్చి కొట్టమంది.
ఆడపిల్లలు మురిసిపోయారు.
తమకి పుట్టింట జరిగే మర్యాదలకి పొంగిపోయారు.
ఆ ఉత్సాహం తో అమ్మ చెప్పిన నూటొక్క ప్రదక్షిణాలు చేస్తున్నారు. అత్తగారు మౌనంగా ఉన్న కోడల్ని గట్టు మీద కూర్చోబెట్టి ఆడపిల్లల రౌండ్లు పూర్తయ్యాక ఇద్దరు కూతుళ్ళనీ కొబ్బరికాయ చెరో చెక్క ప్రసాదం కోడలికి ఇమ్మంది.
"ఇప్పుడు ఎవరికి ఎంత దక్కినట్టు?" అడిగాడు.
"కూతుళ్ళకి ఒక్కొక్కటి, కోడలికి రెండు!"లెక్క కి ఆన్సర్ చెప్పినట్టు అరిచాడు గిరిధారి.
అంతే!
అపర్ణ మొదటిసారిగా గట్టిగా నవ్వింది.
ధృతి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టేసింది.
అనులేఖ పళ్ళు నూరింది.
సావిత్రి మౌనంగా ఉంది.
అనసూయ అందీ-
"వీడూ, వీడి కథలు చూసావా? సెటైర్లు వేస్తున్నాడు.
వీడికా మన బంగారం లాంటి భామ ని ఇచ్చేది?" అంది.
"తెలివైన వాడు అక్కా!" అంది సావిత్రి.
విస విసా వెళ్ళిపోయింది అనసూయ.
అందరి కంటే నవ్వు ఆపుకోలేకపోయిన వాడు కధలు మొదలెట్టక ముందు వచ్చి స్నానం చేసి గాలి కోసం బాల్కనీ లో నించున్న సుందరమూర్తి.
****సశేషం****
రచయిత్రి పరిచయం ..
|