Menu Close
Bulusu Sarojini Devi
గోపురం(ధారావాహిక)
-- బులుసు సరోజినిదేవి --

ఆ సాయంత్రం శంకరం భార్య దగ్గర నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నాడు. అనులేఖ హడావిడిగా వచ్చింది.

సురేఖ ఆత్మహత్య కి ప్రయత్నించిందని తెలియని అనులేఖ-

"ఏంటి చిన్నొదినా! గోరంతలు కొండంతలు చేస్తున్నావ్ ట. కావేరి ఇప్పుడే కలిసింది. నువ్వు మన కాలనీని ఆనుకుని ఉన్న లేబర్ కాలనీలో 'గౌరిమొగుడికి' జబ్బు చేస్తే కాలనీ ఫండ్ నుంచి లక్ష రూపాయలు ఇవ్వనన్నావుట. మన కాలనీ కాదు అన్నావుట. మన కాలనీ ఇళ్ళల్లో పనిమనుషులు అక్కడినుంచి వస్తున్నప్పుడు ఆ కాలనీ కూడా మనదని అనుకోవొద్దూ? రాజుగాడు మీ క్లబ్బు గొడవలు చెప్పాడు. పది రోజులుగా ఆ సమస్యని పరిష్కరించడానికే నేను పొద్దున్నే పోతున్నది. నీ వాదన తప్పు వదినా... అందుకే నేను వాళ్ళ పక్షాన నిలబడ్డాను.

కాలనీ వాళ్ళు ఏకగ్రీవంగా నిన్ను తీసేస్తామని, నీకు ఏ విషయం మీద అవగాహన లేదని అంటే నేనూ ఒప్పుకున్న. కనకవల్లి ప్రెసిడెంట్ అయితే మనకి బోల్డు లాభం. మనం సపోర్ట్ చేద్దాం.

గిరిధారి కూడా పెద్దవాడయ్యాడు. నువ్వు వాడిని చూసుకో... ఈ రాజకీయాలు నేను చూసుకుంటా!" అంది.

"ఓహో! ఇదంతా నడిపింది నువ్వా?" అంది సురేఖ ఆయాసపడుతూ. ఆ స్వరంలో తేడా అప్పుడు గమనించింది అనులేఖ.

చిన్న అన్నయ్య వైపు చూస్తూ... "ఏమయింది చిన్నన్నా?" అంది.

శంకరం బయటికి పొమ్మని సైగ చేసాడు. అయోమయంగా బయటికి వచ్చిన అనులేఖ కి అప్పటికే జరిగింది తెలుసుకున్న రాజు పూస గుచ్చినట్టు చెప్పాడు. గతుక్కుమంది అనులేఖ.

ఏదో బాగా లేదు అనులేఖకి. రాజు వైపు చూసింది. చిన్న పిల్లవాడు. వాడికి ఎందుకు ఇవన్నీ? అనిపించింది.

ఆ రోజు రాజు తో చెప్పింది.

"నువ్వు బాగా చదువుకోరా! రమ్మన్నప్పుడే రా!" అంది. వాడు బుద్దిగా వెళ్ళిపోయాడు.

★★★

అర్ధరాత్రి! అమావాస్య చీకటి. దానికి తోడు ఉధృతంగా వీస్తున్న గాలులు.

ఒక తలుపు సరిగా వెయ్యక మాటి మాటికి కొట్టుకుంటున్న చప్పుడు.

అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ధృతి నిద్ర, మెలకువల మధ్య ఉంది.

మళ్ళీ ఏదో చప్పుడయ్యింది. నిద్ర మత్తులోనే చెవుల్ని అప్రమత్తం చేసి ఎలర్ట్ గా విందామనుకుంటే ఆగిపోయింది. ధృతి పూర్తిగా మేల్కొంది.

మళ్ళీ చప్పుడు.

"దొంగలు పడ్డారా?” అనుకుంటే గుండె వేగం ఎక్కువయింది.

తమ ఇంటి పేరు "గోపురం!"

గట్టి బందోబస్తు. ఇంటి చుట్టూ లోపలికి ఎవ్వరూ రాలేని రక్షణ.

రాత్రి పూట వచ్చే కాపలాదారు శత్రువుల్ని కనిపెట్టి ఎదుర్కోగల ధీరుడు. ఆ ఆలోచనకి కాస్త నెమ్మదించింది మనసు.

మళ్ళీ ఏదో చప్పుడు. తలుపు ఈ సారి ఇంకా బలంగా కొట్టుకుంది. ధృతి లేచి వెళ్ళి ఆ తలుపు అనులేఖ నిర్లక్ష్యంగా వదిలేసిందని అర్ధమయి గట్టిగా వేసి వచ్చి పడుకుంది. అనులేఖ ఆ రోజు అత్తవారింటికి వెళ్ళింది.

ధాత్రి ఆలోచనలు ఆమె నిద్రని డామినేట్ చేస్తున్నాయి. కరంటు పోయి ఇన్వెర్టర్ రన్ అవుతున్నట్టు ఉంది.

కిటికి దగ్గరికి వెళ్ళి బయటికి చూసింది. అంతా చిమ్మ చీకటి. ఒకే ఒక్క చాలా చిన్నది, సన్నని వెలుగు.

స్పష్టత లేక ఏమి కనిపించడం లేదు.

ఒక చిన్న అనుమానం వచ్చి టక్కున లేచి వెళ్ళి ఇల్లంతా కలయ తిరిగింది. చేతిలో ఉన్న ఫోన్ బ్యాటరీ సాయంతో అంతా చెక్ చేసింది. అన్నీ చూసింది. తన అపోహ.

పాలలో పసుపు వేసుకుని వేడి చేసుకుని తాగితే అలజడి పోయి నిద్ర రావచ్చు. తను అనవసరంగా ఆందోళన పడుతోంది అనుకుంది.

ప్రాంజల్ గుర్తు వచ్చాడు. అతడి వైఖరి హఠాత్తుగా ఎందుకు మారింది? ఒక రోజైనా భర్తకి వ్యతిరేకంగా ఉందా తను? అనుకుంటూ కిచెన్ దగ్గరికి వచ్చింది.

ఆలోచన కొనసాగి-

'ఇలా ఎందుకు జరిగింది?' అనుకుంటూ ఫ్రిడ్జ్ తీసింది పాలు తీద్దామని.

సౌమిత్ మిక్కీ మౌస్ బొమ్మలు ఫ్రిజ్ పైన అతికించి పారేస్తాడు. నవ్వుతూ వాటిని చూస్తుంటే మధ్య మధ్యలో స్కూల్ టైం టేబుల్ కూడ అతికించి ఉంది.

'బంగాళా దుంపలు తేవలెను.' అని  సావిత్రి రాత తో ఓ కాగితం.

ఆపక్కన ఇంకొకటి. ఆ కాగితం మీద చిన్న అక్షరాలు. దాన్ని తీసుకుంది.

తమ గది మేడమీద ఉన్న మూడు గదుల్లో చివరిది. మెట్లు ఎక్కుతుంటే పడబోయి రాలింగ్ పట్టుకుని నిలదొక్కుకుంది. తను ధైర్యంగా ఉండాలి. ఊరికే బెంబేలు పడకూడదు. ఆందోళన పడితే అడుగులు తడబడతాయి.

తన గది లోపలికి వచ్చి ఫోన్ బ్యాటరీతోనే చదివింది.

ధృతి అనుమానం నిజం అయింది. గుండెలు గడబిడగా కొట్టుకుంటున్నాయి. ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు.

'సమయం తక్కువ ఉన్నప్పుడు చేయాల్సిన పనిని త్వరిత గతిని పూర్తి చేయాలి. ఒక్కసారి ఆలస్యం అమృతం విషం!' అనుకుంది.

సరాసరి తోటలోకి పోయి సింహాద్రి ఇంటి తలుపు తట్టింది. వాడు తలుపు తీసాక-

తను కారు గెరేజ్ లో ఉంటానని ఒక దగ్గరికి అత్యవసరంగా వెళ్ళాలని చెప్పింది. ఆ రాత్రి తొమ్మిదిగంటలకి  'వసంత్' వచ్చి పిల్లలతో వాళ్ళ గదిలో నిద్రపోయాడు. కాబట్టి పిల్లల్ని ఒంటరిగా వదిలానన్న బెంగలేదు.

సింహాద్రి రెండు నిముషాల్లో బట్టలు మార్చుకుని వచ్చి కారులో వెనక సీటులో కూర్చున్నాడు.

అప్పటికే సంపంగి ఉంది ముందు సీట్లో.

కారు దూసుకుపోతోంది. గాలి ఉధృతం కూడ హెచ్చింది. ఆమె భయపడకుండా మాట్లాడకుండా 'మేప్ ని ఆన్' చేసుకుని ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తోంది. కారు సింహాచలంవైపు పోతుంటే అంది.

"సింహాద్రి! మనం కాస్సేపటిలో సింహాచలం పోతున్నాం. అక్కడ ఎక్కడెక్కడ ఈ రోజు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయో నువ్వు అక్కడున్న వాళ్ళని ఎంక్వైరీ ఫాస్ట్ గా చేయాలి!" అంది.

కారు సింహాచలం చేరగానే కొండమీదికి వెళ్ళే దారిలో ఒకే ఒక్క బడ్డీ కొట్టు తెరిచి ఉంది.

ఆ బడ్డీ కొట్టు అతను కింద ఒకే ఒక్కపెళ్ళి, పైన కొండమీద రెండు జరుగుతున్నాయని వివరాలు చెప్పాడు.

ముందు కింద జరుగుతున్న దగ్గరికివెళ్ళాలి. వెతుక్కుని వెళ్ళాలి అంటే టైం పడుతుంది.

బడ్డీ అతన్ని పిలిచి ఒత్తైన కొన్నినోట్ల దొంతర వాడి చేతిలో పెట్టి తమతో రమ్మంది.

అతడికి ఆ నోట్లు చూడగానే దిమ్మ తిరిగిపోయింది. వెంటనే బడ్డీకి తాళం పెట్టి కారెక్కి పెళ్ళిజరుగుతున్న చోటికి తీసుకెళ్తుండగా మధ్యలోనే ఆడ బోయిన తీర్థం ఎదురొచ్చింది. గట్టిగా గుండెల నిండా ఊపిరి పీల్చింది.

"బాబూ నీపేరెంటి?" అడిగింది కారు స్లో చేస్తూ.

"వీరాజీ!" అన్నాడు అతను.

“శభాష్! వీరా! ఇప్పుడే నీ ప్రతాపం చూపించాలి.

అదిగో పసుపు చొక్కా వేసుకున్నాడే ..వాడు మా ఇంటి అమ్మాయిని లేపుకు వచ్చి పెళ్ళి చేసుకోబోతున్నాడు. అందుకే ఆ బ్యాండుమేళం. పెళ్ళి మంటపానికి బయలుదేరినట్టున్నాడు. అన్ని విషయాలు పనయ్యాక డబ్బుతో సహా చెప్తాను గానీ నువ్వు వాడిని ఉడుం పట్టు పట్టేసి కారులో పడేయ్యాలి. సరేనా? అంది.

వెంటనే-

"సింహాద్రి... నువ్వు ఒక్క జంప్ చేసి అదిగో... పెళ్ళి జరిగే షామియానా! లోపలికి పరిగెత్తి భామ ని లాక్కు రావాలి. ఫాస్ట్!" అని అరిచింది.

ఇద్దరూ రాకెట్లలా పరుగులు పెట్టారు. సంపంగి ముందు డోర్ తెరిచి పట్టుకుంది. ఆ పిల్లకి అంతా అయోమయంగా ఉంది. ధృతి ఏమి చెప్పకుండా 'నాతో రా!' అని నిద్రలేపి తీసుకు వస్తుంటే ఏదో ఉందని అనుకుంది తప్ప ధృతి ఇంత సాహసం చేయడం చూస్తుంటే ఆశ్చర్యంతో నోట మాట రాకపోవడం అటుంచి లోపల గొప్ప బలం మాత్రం పుంజుకుని వస్తోంది.

బడ్డీ కొట్టు వీరా ఒక పిల్లవాడిని ఎత్తుకున్నట్టు ఎత్తుకుని గొప్ప లాఘవంగా ఎత్తుకొచ్చేసాడు రంగాని. రంగా అరుస్తుంటే నోటి మీద ఒక్కటిచ్చాడు. అటువంటి ఒక్క దెబ్బ చాలు నోరు మూసేయ్యడానికి.

కళ్ళు బైర్లు కమ్మి నోరుమూసుకు కూర్చున్నాడు.

వాడి వెనుక పెళ్ళి జరిపించడానికి వచ్చిన వాడి స్నేహితులు అంతా క్షణాల్లో పరుగులు పెట్టి మాయం అయ్యారు. బ్యాండుమేళం వాళ్ళు నోరు తెరుచుకుని చూస్తున్నారు.

సింహాద్రి ఒంటినిండా నగలతో పెళ్ళి కూతురి వేషం లో ఉన్న భామని బరబరా లాకొచ్చాడు. వెనక పదిమంది ఆడవాళ్ళు నోటికొచ్చినట్టు పెళ్ళిపీటల మీద పిల్లని లాక్కుపోతావా?" అని తిడుతున్నారు.

భామ ధృతిని చూసి సింహాద్రి చేతుల్లోనుంచి గింజుకున్నట్టు గింజుకోకుండా సైలెంట్ అయిపోయి ముందు సీట్లో కూర్చుంది. వీరాజీ రంగాని వెనక సీట్లో కుదేశాడు.

ధృతి అతడికి భారీగా మరింత డబ్బు ముట్టజెప్పి కృతజ్ఞతలు చెప్తూ, సింహాద్రి తో రంగా కాళ్ళని, చేతుల్ని కట్టెయ్యమని కారు స్టార్ట్ చేసింది.

అప్పుడో సంగతి అనుకోకుండా జరిగింది. సింహాద్రి తన ఫోన్ లో ఉన్న సమాచారాన్ని ఒక ఆడియో రికార్డ్ ఆన్ చేసాడు. అది రంగా గొంతు.

“ఒసా! దాని షోకు చూసి దాని వెంట పడ్డ మాట నిజంరా శేఖరా!

ఆరి నీ యబ్బా! ఓ సారి పార్కు కు పోదాం రమ్మంటే రాదు. నాకేమో దాని సగం బట్టలు, ఒంపులు చూస్తే సరదా. ఒక్కసారి దాన్ని ముద్దులాడాలని ఉండదేట్రా? ఉత్తినే తిరిగే బాపతు కాదులే సరదా తీర్చుకుందామనుకుంటే. ఎన్ని సార్లో మెసేజు లిచ్చినా లొంగలేదు. పోన్లే. ఎవత్తినో ఒకదాన్ని పెళ్ళాడాలి కదరా? దీన్నిచేసుకుంటే డబ్బు కి డబ్బు. డబ్బున్న ఇంట్లో రాచ మర్యాదలు.

పెళ్ళాడాక చెప్తా దీని పని. రమ్మంటే రాదా?

పిల్ల పిటపిట లాడిపోతుంటే లొట్టలేసుకుని చూడమంటుందా? తాట తీసేయ్యనా పెళ్ళాం అయ్యాక?”

ఇలా సాగింది ఆ రికార్డ్.

రంగా గాభరా పడిపోతూ -

“అది నా గొంతు కాదు భామా! నమ్మొద్దు!" అని అరిచాడు.

ఒక్కటిచ్చాడు సింహాద్రి.

“రేపు పోలీస్ స్టేషన్ లో తేలుతుందిరా నీ గొంతో, కాదో?" అన్నాడు.

భామ అది విని నిలువెల్లా ఒణికిపోయింది.

“సంపంగీ! భామ ఒంటిమీది నగలన్నీ తీసి ఈ బాగ్ లో వెయ్యి. అక్కడ వెట్ వైప్స్ ఉన్నాయి. శుభ్రంగా మొహం తుడిచేసి చిన్న బొట్టు పెట్టు. మనం ఇల్లు చేరబోతున్నాం!" అంది.

“ఎక్కడ రికార్డ్ చేసావు సింహాద్రి?” అడిగింది ధృతి సంతోషంగా.

“వీడి వేషాలన్నీ సంపంగి చెప్పిందమ్మా! అందుకే స్నేహం చేసి నవ్వుతూ వీడి దోస్తులతో తిరిగి రోజూ రికార్డ్ చేసా. రేపో మాపో పెద్దయ్యకి ఇద్దామని అనుకున్న. వీడింత పని చేస్తాడనుకోలేదు!" అన్నాడు.

“అన్నా! నన్ను వదిలేయ్. ఇంకెప్పుడూ మీ కంటికి కనిపించను" అని బతిమాలుతున్నాడు రంగా.

వాడు బతిమాలుతున్న విధానం చూసి భామ వదిలేయమని అంది ధృతితో.

"అమ్మా! మనం ఇదంతా బయటికి తెలియకుండా వదిలేయడం మంచిదేమో? పరువు ముఖ్యం కదా?" అన్నాడు సింహాద్రి.

ధృతి తల గట్టిగా విదిల్చింది.

"పరువు సంగతి పక్కన పెడదాం. ఇప్పుడు పెళ్ళి జరిగిపోయి ఉన్నా పెళ్ళి వయసు రాలేదు కనుక మనం ఒక కేసు వెయ్యొచ్చు. గెలవొచ్చు. వీడికి శిక్ష కూడా పడవచ్చు.

కానీ మానసికంగా అయినా, శారీరకంగా అయినా బాధ పడేది లోకంపోకడ అర్ధం చేసుకోలేని ఒక అమాయక మైన ఆడపిల్ల. వీడికి వయసూ ఎక్కువ, మోసం చేద్దాం అనే పాడు ఆలోచనా ఎక్కువే.

భామ హృదయంతో ఆడుకున్న ఈ ఆటగాడి కి చట్టబద్ధమైన శిక్ష విధించేటట్లు చేయడం సమాజ శ్రేయస్సుకి చాలా అవసరం. ఇప్పుడు నేను సమయానికి భామ ఫ్రీడ్జ్ కి అంటించిన నోట్ చూసాను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పిల్ల జీవితం ఏమయ్యేది?" అంది గాద్గదిక స్వరంతో.

అంతా నిశ్శబ్దం ఆవరించింది.

పావుగంట తరువాత కారు 'గోపురం' చేరింది.

★★★

ధృతి భామ, సంపంగిలతో ఇంట్లో అడుగుపెట్టింది.

ఇంటి సభ్యులంతా హాల్లోనే ఉన్నారు. ఎప్పుడూ ఎటువంటి చిక్కు వచ్చినా శాంతంగా ఉండే సుందరమూర్తి గంభీరంగా కనిపిస్తున్నాడు. అపర్ణ భర్త పక్కన భామ మీద కోపాన్ని అదిమి పెట్టి నిలుచుని ఉంది.

ఆమె చేతిలో నిన్న రాత్రి తను ఇంట్లో నుంచి రంగాతో పారిపోతున్నానని రాసిన భామ రాసిన ఉత్తరం ఉంది.

ధృతిని రాత్రికి నిలువనియ్యకుండా ఊపిరి సలపనివ్వకుండా సింహాచలం పరుగులెత్తించిన కాగితం అది.

భామ వైపు ఛీ కొట్టినట్టు చూసింది సావిత్రి. తల్లి చూపులు సూదుల్లా ఒంటినిండా గుచ్చుకుంటున్నాయి భామకి. అనసూయ తమాషా చూస్తోంది.

అప్పుడు అనులేఖ ఇంట్లో అడుగుపెట్టింది.

అందర్నీ అక్కడ చూడగానే  ఏదో జరిగిందని అర్ధం అయి సోఫా చివర్న కూలబడింది.

ధృతి నెమ్మదిగా సుందరమూర్తిని సమీపించి ఒక్కసారి జరిగింది వినమని జరిగింది అంతా నెమ్మదిగా చెప్పింది.

అంతా విని ధృతికి చేతులు జోడించి నమస్కరించాడు సుందరమూర్తి. ఆ తరువాత అందర్నీ లోపలికి ఎవరి పనులమీద వారిని వెళ్ళమని సౌంజ్ఞ చేసాడు.

అందరూ వెళ్ళిపోతున్నా సావిత్రి మాత్రం కదలలేదు.

"జరిగిందంతా సరే. నగల మూట ఏదీ?" అంది బాంబు పేల్చినట్టు.

ఆ మాటతో ఎక్కడివారక్కడే నిల్చున్నారు. అందరిలో కుతూహలం. ఒక చెప్పలేని ఉత్కంఠ. ఏదో తెలుసుకోవాలని ఆత్రుత.

'ఏడు వారాల నగలవి మరి' అనుకుంది అనసూయ.

విభ్రాంతి తో చూస్తోంది ధృతి. అపర్ణ, సుందరమూర్తి , తుళ్ళిపడ్డారు.

ఆ కన్న తల్లికి భామని జాగ్రత్తగా ఇల్లు చేర్చిందనే ఆనందం క్షణం కూడా లేదు.

మాతృత్వం మీదే సరైన అవగాహన లేక తన అజ్ఞానాన్ని బయట పెట్టింది. డబ్బులు, నగలూ చటుక్కున వచ్చి అవసరం లేకపోయినా మా కంటే ఏవీ ముఖ్యం కావంటూ వయ్యారంగా నిలబడ్డాయి.

సంపంగి గట్టిగా ఏడ్చింది.

అనులేఖ లేచి నిలబడి చప్పట్లు కొట్టింది.

"ఏ ఆశా లేకపోతే ఎవ్వరికి మాట మాత్రం చెప్పకుండా ఇంత సాహసం ఎందుకు చేసినట్టో? ఉట్టి పేరు కోసం ఇదంతా ఎవ్వరూ చేయరు ఇదో ప్లాన్! " గురిచూసి గుండె మీద కొట్టినట్టు అంది.

పంచ ప్రాణాలమీద ఒక్కవేటు వేసినట్టు కుప్పకూలిపోయింది ధృతి. ఇంటిని అపఖ్యాతి పాలు చేయకుండా కాపాడిన ఆమె కూడా బెంబేలు పడిపోయింది. ఆమె చేతిలో నగల మూట ఉన్న బాగ్ అప్రయత్నంగా జారవిడిచింది.

సంపంగి ధాత్రి పక్కనే కూర్చుని ఆమెని లేవనెత్తింది.

అపర్ణ తన ఒడిలో ధృతి ని దాచుకుంది. సుందరమూర్తి ఖిన్నుడై చూస్తున్నాడు.

ఉన్నట్టుండి దిగ్గున లేచి ఒక్కరోజు పుట్టింటికి వెళ్ళి తండ్రిని చూసి వస్తానని అపర్ణని ఒక్కరోజు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని సరాసరి ఊళ్ళో ఉన్న తన పుట్టింట్లో అడుగుపెట్టింది ధృతి.

వసంత్ పిన్నిని జాగ్రత్తగా దిగబెట్టి పిల్లల్ని చూసుకునేందుకు వెనక్కి వెళ్ళాడు.

అప్పుడు సమయం పొద్దున్న ఎనిమిదిన్నర.

తండ్రి భరద్వాజ కూతుర్ని అపురూపంగా చూసాడు. కూతురి వెనుక కూనలు లేరంటే విషయం కొంత సీరియస్సే అని తల పంకించాడు.

వెంటనే ఏమి అడగలేదు.

ఇల్లంతా కలియతిరిగి తల్లి ఫోటో కి దండం పెట్టుకుని వచ్చి హాల్లో కూర్చున్న కూతురి దగ్గరే కూర్చుని ఆప్యాయంగా నవ్వాడు. ఆ నవ్వు మహత్యం అపురూపం.

"నాన్న! నేను ఈ కష్టాలు పడలేను. నాకు జీవితం అంటేనే విసుగేస్తుంది. నాకే ఇన్ని కష్టాలు రావాలా?" అంటూ తన బాధలు చెప్పుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది.

అన్నీ మౌనంగా విన్నాడు. ఏమి మాట్లాడలేదు.

చిన్నగా నవ్వుకుంటూ వంటింట్లో కి నడిచాడు. ధృతి కూడా వెనకే వెళ్ళింది.

గ్యాస్ పొయ్యి మీదున్న మూడు బర్నర్ల మీదా మూడు గిన్నెలు పెట్టాడు.

వాటిలో నీళ్ళు పోసి ఒక దానిలో బంగాళాదుంపలు, మరొకదానిలో కోడిగుడ్లు, ఇంకో గిన్నెలో కాఫీ గింజలు వేసాడు.

తండ్రి తనతో అలా నిర్లక్ష్యంగా ఉండి ఏమి మాట్లాడకుండా చేస్తున్న పని మీద కోపం వస్తున్నా అలాగే చూస్తోంది.

అలా ఇరవై నిముషాలు మరిగించాక స్టవ్ ని కట్టేసి ఆ గిన్నెలని దింపి వాటిని కూతురు ముందు పెట్టి ఏమి జరిగిందో పరిశీలించి చెప్పమన్నాడు.

నాన్న ఎందుకు ఇలా చేశాడా అని అయోమయంగా ఉన్న ధృతి వాటిని పరిశీలించాక అంది.

"ఏముంది నాన్నా? బంగాళా దుంపలు మెత్తబడ్డాయి. కోడిగుడ్లు గట్టిబడ్డాయి. కాఫీ గింజలకి డికాషన్ వచ్చింది. అయినా ఇదంతా నన్ను ఎందుకు అడుగుతున్నావు నాన్నా?" అంది.

భరద్వాజ చక్కనైన నవ్వు నవ్వాడు.

"ఈ మూడింటికీ ఒకే రకమైన ప్రతికూలత ఎదురయ్యింది. అంటే ఒకే లా-

ఒకే రకమైన గిన్నెల్లో అదే గ్యాస్ వేడినీ, వేడి నీటిని చవి చూశాయి. కానీ, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా స్పందించాయి అని గమనించావా?

  1. మాములుగా గట్టిగా ఉండే దుంపలు మెత్తబడ్డాయి.
  2. చితికిపోయే గుడ్లు గట్టి పడ్డాయి.
  3. గట్టిగా ఉండే కాఫీగింజలు మెత్తపడి వాటిలో రసాన్ని ఊరించి నీటి రంగునీ మార్చింది. అవునా?

వీటిలో నువ్వు ఎలా ఉండాలి? అనుకుంటున్నావు?

మెత్తబడిపోతావా? ఇప్పుడు నువ్వున్న స్థితి అదే!

గట్టి పడిపోతావా? పరిస్థితులని మారుస్తావా?

ఇక్కడ ఎంపిక నీదే!!!

దాని మీదే ఇందాక నువ్వడిగిన ప్రశ్నకి సమాధానం ఉంది.

ధృతి మొహం లో ఏదో తెలియని వెలుగు. కన్నీళ్ళు ఆగిపోయాయి. బాధ లేదు. దాని బదులుగా కళ్ళల్లో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపించింది. మెరుస్తున్న కళ్ళతో తండ్రిని చూసింది.

"నాన్న! యు ఆర్ మై రియల్ హీరో. మెంటర్. ఎవర్ ఎండ్ ఫరెవర్!” కృతజ్ఞతా భావంతో అంది.

చక్కని తేనీరు అందించాడు భరద్వాజ. చంటి పిల్లలా అయిపోయింది ధాత్రి.

ఒక్క పనీ చెయ్యనివ్వని తండ్రి వైపు చూస్తోంది. సిస్టమేటిక్ గా చేసుకుపోతున్నాడు. పుట్టింటికి వచ్చిన కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ ఆనంద పడుతున్నాడు భరద్వాజ.

ధృతి ని నవ్వుతూ హుషారుగా ఉంచేందుకు మరింత ప్రయత్నం చేస్తున్నాడు భరద్వాజ.

"అసలు మన డైలీ లైఫ్ లో లెక్కల కున్న ప్రాముఖ్యత గమనించావా?"

ఎప్పుడైనా ఒక మేథమేటిక్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే వాళ్ళు ఇచ్చిన సైన్ ని వరుస పద్దతిలో చేస్తే కరక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. పాయింట్ వైస్ గా చెప్తా ...విను.

జీవితం లెక్కలతోనే ఉంటుంది.

  1. ప్లస్ అంటే పెరుగుదల.
  2. మైనస్ అంటే - పాత ఆస్తి నుంచి కొత్త ఆస్తిని తీసేస్తే డెవలప్మెంట్.
  3. ఇంటూ అంటే గుణకారం అంటే ఎక్కువరెట్లు పెరగడం. అంటే పరిపక్వత చెందడం.
  4. డివైడెడ్ బై. అంటే సంపాదించింది అంతా అందరికీ పంచడం. అంటే బోధించడం.

నవ్వాడు.

"నాన్నా! నువ్వు ఇదంతా అచ్చ తెలుగు లో చెప్పొచ్చుగా? అన్నీ ఇంగ్లీష్ పదాలే!" అంది.

"ఇంగ్లీష్ వాళ్ళు మనకి అంటించి పోయిన ఇంగ్లీష్ మనం వాడి పారేస్తున్నాం అంటే తెలుగు దేశం లోకి వచ్చిన ఇంగ్లీష్ ఎప్పుడో తెలుగయిపోయింది అని అర్ధం! అన్నాడు తమాషాగా నవ్వుతూ.

"హహహ!” నవ్వింది ధృతి.

"పోన్లే! నీమాటే కానిద్దాం.

  1. పెరుగుదల అంటే కూడిక.
  2. వికాసం అంటే తీసివేత అనుకో.
  3. పరిపక్వత. అంటే గుణకారం.
  4. బోధించడం అంటే భాగాహారం...

సరేనా?" అన్నాడు. నాలుగు ముక్కల్లో చెప్పేసాడు. నాన్న ఎప్పుడూ అంతే.

నాన్న, అమ్మ ఒక్కరేగా! తన చిన్నతనంలోని ఒక అరుదైన జ్ఞాపకం మెదిలింది ధృతి లో. ఆ రోజు-

"కాకరకాయ కూరా ఈ రోజు? నేను తినను!” అంది ధృతి.

"అందుకే చింతపండుతో ఉప్పేసి ఉడికించి, ఆ చేదంతా వార్చేసి, బెల్లం పొడి వేసి, వేయించిన నువ్వుల పప్పు పొడి వేసి బాగా పోపు దట్టించిన కూర. ఏమి రుచి అనుకున్నావ్?" అన్నాడు భరద్వాజ.

"నువ్వెన్ని చెప్పినా ఆ చేదు కూర తినను నాన్నా!” బల్ల గుద్దినట్టు చెప్పింది.

"అయితే నాకు ఇష్టమైన కూర తినలేనన్నమాట!” అన్నాడు.

"అదేంటీ? నువ్వు నీకిష్టమైనవి వండుకో నాన్నా! నాకోసం నువ్ మానేయడం ఏమిటి?"

"టైం అంత ఉండదు కదా మనకి?" అన్నాడు.

"ఏంటి నాన్నా ... నువ్ మరీనూ...!” అంది.

"నిజం. టైం మేనేజ్మెంట్ అని...తెలుగులో చెప్పాలి కదూ...సమయ పాలన అనేది ఒకటుంది. అది పాటించి తీరాలి. లేకపోతే ప్రతి దానిలో వెనక పడిపోతాం. దాన్ని గురించి చెప్తా. వింటావా?" అడిగాడు.

ధాత్రి భరద్వాజ మొహంలోకి చూసింది.

****సశేషం****

రచయిత్రి పరిచయం ..

Bulusu Sarojini Devi పేరు: బులుసు సరోజినిదేవి

ప్రకాశం జిల్లా, దరిశిలో...జూన్ 29, 1956 లో జన్మించిన పట్టిసపు సరోజినీ దేవి, వివాహానంతరం బులుసు సరోజినీ దేవి అనే పేరుతో రచనలు మొదలుపెట్టారు. వీరి తల్లిదండ్రులు పట్టిసపు ఉమామహేశ్వరరావు గారు జోగులాంబ గారు . ఈమె 2010లో తన మొదటి కవితతోనే జాతీయస్థాయి రంజని కుందుర్తి అవార్డు సొంతం చేసుకొని రచనలను మొదలుపెట్టారు. 2011లో మరో జాతీయస్థాయి ఎక్స్ రే అవార్డును పొందారు. వీరి మొదటి కథ రంజని వారు సాధారణ ప్రచురణకి తీసుకున్నారు. తర్వాత నాలుగు కథలకు ప్రైజులని రంజని వారిచే పొందారు.  వీరు రాసిన "శ్రీముఖి" అనే నాటిక జాతీయస్థాయి రెండవ బహుమతి పొందింది. సంగీత స్రష్ఠ శ్రీశ్రీ శ్రీ  మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి ఎంతో అదృష్టాన్ని కూడగట్టుకున్నారు. నాలుగు గురజాడ పురస్కారాలను అందుకున్నారు. వీరు 'కళామిత్ర' అనే బిరుదును పొందారు. ఉన్నత ప్రమాణాలు విలువలు కలిగిన రచనలు చేయడం వీరికి ఇష్టం. నాలుగు నవలలు, నాలుగు నాటికలు, దాదాపు 500 కథలు, 300 కవితలు, కొన్ని వ్యాసాలు రాశారు. వీరికి రచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం.

ప్రముఖుల ప్రశంసలు: తెలుగు సాహిత్య ప్రపంచంలో బులుసు సరోజినీ దేవి గారి పేరు వినని వారు ఉండరు. ఆమె రాసిన ఈ మూడు కథలు వైవిధ్యవంతమైన జీవితాన్ని పరిచయం చేస్తున్నాయి. 'రెండో పెళ్లి', 'బొంకుల దిబ్బ' అనే కథలు స్త్రీల వైపు నుంచి జీవితాన్ని చూడడానికి... పారాహుషార్ అనే కథ నన్ను నివ్వెరపరిచింది. ఒకప్పుడు టిప్పు సుల్తాన్ దాడికి గురైన ఆ కథ ఇప్పుడు చెప్పటంలో మరొక కొత్త సత్యం ఆవిష్కరణ ఆవిష్కారమవుతోంది. చరిత్రల్ని సాధారణంగా మనం స్థూలంగా దేశానికో,  ప్రాంతానికో, రాష్ట్రానికో సంబంధించినవిగా చెప్పుకుంటాము.విభేదనలకు గురికాబడ్డ కారణంగా మనం ఒక జాతిగా, రాష్ట్రంగా, ప్రాంతంగా రూపొందే క్రమంలో చరిత్రను స్థూలంగా చెప్పుకునే క్రమంలో, చాలాసార్లు సూక్ష్మ చరిత్రల్ని మనకు తెలియకుండానే తుడిచేస్తుంటాము. అలా తుడిచి పెట్టబడటానికి ఇష్టపడని ఒక సూక్ష్మ చరిత్ర స్థూల చరిత్రకు ఎదురు తిరిగిన ఈ కథ  చదివితే పాఠకుడికి ఆ వివేకం తప్పనిసరిగా కలిగి తీరుతుంది. -వాడ్రేవు చినవీరభద్రుడు

Posted in December 2025, కథలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *